
మన ఇంట్లోకి వచ్చిన టీవీలు పొద్దు ప్రారంభమైన దగ్గర నుంచి నిరంతరం భక్తి. సంప్రదాయ వ్యాపకాలను ప్రవచిస్తున్నాయి. ఏ క్షణాన ఎలా మసలుకుంటే ఏయే లాభాలు వచ్చి వాలతాయో ఎలా వ్యవహరించకపోతే ఏయే కష్టాలు చుట్టుముడతాయో కచ్చితంగా హెచ్చరిస్తున్నాయి. చాలా మంది గృహస్థులు వాటిని ఆచరించే పనిని నెత్తిన వేసుకుంటున్నారు. తాము చూస్తున్న సీరియళ్ల లోనూ అతీతశక్తులూ, వాటి ప్రభావాలూ, వాటికి నివారణోపాయాలూ ఇబ్బడిముబ్బడిగా దర్శనమి స్తున్నాయి. బయట చదువులూ, ర్యాంకులూ, ఉద్యోగాలూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ తదితర సామాజిక విషయాల్లో పోటాపోటీ పెరిగిపోయింది. బయట వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలు టీవీల్లో, అవి ప్రకటించే చిట్కాల్లో దొరుకుతాయని చాలామంది భావిస్తున్నారు. కొంతమందికి ఇలాంటి సమస్య లూ, నమ్మకాలూ లేకపోయినా తమ హోదా ప్రదర్శనకు కోటిదీపాలూ, వెయ్యొక్క కొబ్బరికాయలూ, నూటొక్క బిందెలూ వంటి కార్యకలాపాలు దోహదపడుతున్నట్టుగా భావిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇసుక దందాలు చేసే సులభ ధన లబ్ధిదారులూ కొన్ని కొన్ని బృందాలకు ఉదారంగా విరాళాలు వెదజల్లడం కూడా భక్తి ప్రదర్శనలకు కారణ మవుతోంది. వీటన్నింటిలో అదనపు సేవ చేయటం మహిళలకు ఓ వ్యాపకంగా మారిపోయింది. భర్త లేదా కొడుకు అయ్యప్ప మాల వేసుకుంటే ఇంటిపని, పొలంపని చేసే మహిళలు స్వాముల కోసం మరింత అదనపు శ్రమ చేయాల్సి వస్తోంది. ప్రత్యేక వంటకాలు, పూజకు దినుసులు సమకూర్చటం వారి కొత్త విధులుగా ముందుకు వస్తున్నాయి. కొద్దిపాటి సంపాదన ఉన్న సాధారణ కుటుంబాల్లో ఈ భక్తి బడ్జెట్ భారీ స్థానాన్నే ఆక్రమిస్తోంది. ఈ సందర్భంగా అయ్యే అల్లుడి గారి మొత్తం ఖర్చును అత్తింటివారే భరించాలన్న కొత్త సంప్రదాయం ఒకటి పల్లెటూళ్లలో పరవళ్లు తొక్కుతోంది. శాంతిపూజలు, సర్పదోష నివారణ పూజలు, రకరకాల వ్రతాలూ ఈ మధ్య మరింత పెరిగాయి. కష్ట నివారణ కోసం అని చెప్పి లక్షలు వెచ్చింపజేస్తున్న దృశ్యాలు చాలాచోట్ల కనిపి స్తున్నాయి. వీటన్నింటిలో మహిళలే ప్రధాన పాత్రధారులు. వందేళ్ల క్రితం గురజాడ, కందుకూరి, ఫూలే వంటి మహానుభావులు ఆశించిన వెలుగుల దారికి ఇది భిన్నమైన పంథా. దీనిని ముందుకు నడిపించటంలో ప్రపంచీకరణ, మార్కెట్టీకరణ కీలకపాత్ర పోషిస్తున్నాయి. వ్యాపారం.. వ్యవహారం! ఒకపక్క మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతూనే మరోపక్క మహిళను సరుకుగా దిగుజార్చు తోంది ప్రపంచీకరణ. మార్కెట్లో సరుకుల చలామణికి మహిళలను ప్రచార సాధనంగా వాడుకుం టోంది. సౌందర్య సాధనాలను అమ్ముకోవటానికి మనిషి వ్యక్తిత్వాన్ని తగ్గించి, రంగుకీ రూపుకీ ప్రాధాన్యాన్ని హెచ్చించింది. ‘ఈ క్రీము వాడితేనే మీ ముఖం నిగారిస్తుంది. తద్వారా రాకుమారుడు వంటి మొగుడొస్తాడు లేదా ఉద్యోగం వస్తుంది లేదా అబ్బాయిలు మిమ్మల్ని గుర్తిస్తారు..’ వంటి అర్థా లతో ప్రకటనలు గుప్పిస్తోంది. అదేదో స్ప్రే దట్టించుకుంటే స్త్రీలు వెంటబడిపోతారన్నట్టు చౌకబారు ఉద్దేశాలను ప్రచారం చేస్తోంది. బైకులను అమ్మటానికి, అబ్బాయిలకు షేవింగు కిట్లు, అండర్‌వేర్లూ అమ్ముకోవటానికి అమ్మాయిల శరీరాలతో పోలికలను ఊరిస్తోంది. చెమట, తెల్లజుట్టు, బట్టతల, నల్ల రంగు, పొడవు లేకపోవడం, లావుగా ఉండడంవంటి సహజ స్వభావాలను ఎగతాళి చేస్తోంది. వాటి నుంచి బయట పడాలంటే ఫలానా బాండ్ల సరుకులు వాడండి అని బాహాటంగానే నీతిమాలిన నిర్వా కానికి ఒడిగడుతోంది. మద్యం అమ్మకాలను పెంచుకోవటానికి స్త్రీ శరీరాలను ప్రకటనలుగా ఎర వేస్తోంది. ఇలాంటి ప్రకటనల్లో అమ్మాయిలు ఇష్టపూర్వకంగా కనపడేలా అందాల పోటీలు నిర్వహి స్తోంది. శరీర ప్రదర్శన అనేది ఒక ఆత్మగౌరవ పతాక అన్నట్టుగా తప్పుడు అర్థాలను సృష్టిస్తోంది. స్త్రీ అంగాంగ ప్రదర్శనలతో డబ్బు దండుకోవాలని బరితెగించే మార్కెట్టు, స్త్రీల వ్యక్తిత్వాన్ని, ఆలోచన లనూ గౌరవించని మతమూ చెరోపక్క మహిళల సొంత ముఖాన్ని, వాస్తవ మనసునూ గుర్తించటా నికి నిరాకరిస్తున్నాయి. తాము చేస్తున్నదంతా మహిళల ఉద్ధరణ కోసమేనని ఇవి రెండూ ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం, ప్రవచనం ఏదైనా సరే, స్త్రీల అణచివేత, అంగడీకరణ ` మతం, మార్కెట్‌ల అసలు ఉద్దేశం. దానిని మహిళాలోకం గుర్తించాలి. స్వేచ్ఛాసమానత్వాల కోసం గొంతెత్తి నినదించాలి.
Comments