top of page

నడిపేది ధర్మకాటా..ఆ భవనం ఆక్రమణేనట!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 11
  • 2 min read
  • పంట కాలువ ఆక్రమించి అడ్డగోలు నిర్మాణం

  • దాన్ని కూల్చివేస్తామంటున్న అధికారులు

  • ఆలోగా దాని డబ్బులు రాబట్టుకునే ఎత్తుగడ

  • రబ్బరు పౌడరు నిల్వ చేసేందుకు అద్దెకు

  • పరిహారం కొట్టేసేందుకు.. అగ్నిప్రమాదం సృష్టి

ree

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

కాటాలో మర్మం ఉందో లేదు తెలీదు గానీ.. బైరి జంక్షన్‌ సమీపంలో సర్వేనెంబర్‌ 31/12లో నడుస్తున్న సూర్యతేజ ధర్మకాటా యాజమాన్యం మాత్రం ధర్మవిరుద్ధంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట కాలువ (ప్రభుత్వ) భూమిలో ఏడు అడుగుల మేరకు ఆక్రమించి మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీంతో కాలువ కుచించుకుపోయి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణ వాస్తవమేనని అధికారుల పరిశీలనలోనూ తేలింది. కాలువ ఆక్రమణపై ఆ ప్రాంతానికి చెందిన నక్క సింహాచలం అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్‌ 2024న గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట కాలువను ఆక్రమించి భవనం నిర్మించినట్టు నిర్ధారించారు. స్థానికుల స్టేట్‌మెంట్లు రికార్డు చేసి ధర్మకాటా నిర్వాహకులైన బైరి స్యూనారాయణ, వెంకటరమణలకు ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం`1994 సెక్షన్‌ 98, 99, 100, 121, అలాగే 2002 ఫిబ్రవరి 26న జీవో 67 నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు.

నోటీసులు బేఖాతరు

కాలువను ఆక్రమించి శాశ్వత భవనం నిర్మించినందుకు వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టునున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. ఆ స్థలంపై ఆక్రమణదారులకు హక్కు ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు, గ్రామ పంచాయతీ నుంచి పొందిన ఇంటి ప్లాన్లు, స్థలం డాక్యుమెంట్స్‌తో సహా పంచాయతీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో సూచించారు. పత్రాలతో హాజరుకాకపోతే ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించిన పంట కాలువను దురుద్దేశ పూర్వకంగా ఆక్రమించారని భావించి నిర్మాణాన్ని తొలగిస్తామని ఈ ఏడాది జనవరి 9న జారీ చేసిన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అక్రమ కట్టడాన్ని తొలగించి, అందుకు అయిన ఖర్చులను యాజమాన్యం నుంచే వసూలు చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే సూర్యనారాయణ, వెంకటరమణ ఈ నోటీసులకు ఇప్పటికీ స్పందించకపోవడంతో పంచాయతీ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.

ఖర్చులు రాబట్టుకునే కుట్ర

అక్రమ కట్టడంగా అధికారులు గుర్తించిన సూర్యతేజ ధర్మకాటా భవనం నుంచి ఆరేళ్లుగా ఇసుక అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని స్థానికులే చెబుతున్నారు. ఇప్పటికీ ధర్మకాటా ప్రాంగణం నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతోంది. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ వచ్చారు. ధర్మకాటా భవనం అక్రమ నిర్మాణమని వెలుగులోకి రావడంతో దాన్ని కూలదోసే లోపే నిర్మాణ వ్యయం రాబట్టేసుకునేందుకు సూర్యనారాయణ, వెంకటరమణలు మరో ఎత్తుగడ వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న గొడౌన్‌ను టైర్ల తయారీకి వాడే రబ్బర్‌ పౌడర్‌ నిల్వ చేసే వ్యక్తులకు అద్దెకిచ్చారు. ఇటీవల ఆ గొడౌన్‌కు నిప్పంటుకుంది. అందులో ఉన్నది రబ్బరు పౌడరు కావడంతో మొత్తం కాలి బూడిదైపోయింది. ఫైర్‌ సిబ్బంది వచ్చేలోగా సూర్యనారాయణ, వెంకటరమణలకు చెందిన మనుషులే మంటలను ఆర్పేశారు. ఆతర్వాత వచ్చిన ఫైర్‌ సిబ్బందికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు వ్యాపించి మెటీరియల్‌ దగ్ధమైనట్టు చెప్పారు. కానీ ఎక్కడో తేడా కొడుతోందని స్థానికులు చెప్పుకొంటున్నారు.

అక్రమాలు కొత్త కాదు

కొద్ది రోజుల్లో ఈ భవనాన్ని అధికారులు కూల్చేస్తారన్న నేపథ్యంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గొడౌన్‌గా నమోదైన భవనానికి సూర్యనారాయణ ఇన్సూరెన్స్‌ చేయించారు. ఇప్పుడు ఫైర్‌ యాక్సిడెంట్‌ వల్ల తన భవనం పాడైపోయిందంటూ క్లెయిమ్‌ చేసుకుంటున్నారు. వాస్తవానికి రబ్బరు పౌడర్‌ను స్టాక్‌ చేసుకున్న వ్యాపారికి ఎటువంటి ఇన్సూరెన్సూ లేదు. కానీ అనధికారికంగా కట్టిన ఈ భవనానికి మాత్రం ఇన్సూరెన్స్‌ ఉండటంతో కూల్చేసే ముందు ఖర్చులు రాబట్టుకునేందుకే ఈ పన్నాగం పన్నారా? అందులో భాగంగానే రబ్బర్‌ పౌడరు నిల్వకు అద్దెకు ఇవ్వడం, అంతలోనే ఫైర్‌ యాక్సిడెంట్‌ వంటివి జరిగాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పన్నాగంలో భాగంగానే ఫైర్‌ సిబ్బందిని మేనేజ్‌ చేసి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిన ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు నివేదిక రాయించి ఇన్సూరెన్స్‌ అధికారులకు సమర్పించినట్టు ప్రచారం జరుగుతోంది. సూర్యతేజ ధర్మకాటా యాజమాన్యం ఇలాంటి అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు గతంలోనూ ఉన్నాయి. బైరి జంక్షన్‌లోనే ఉన్న సూర్యతేజ ఫిల్లింగ్‌ స్టేషన్‌ భూమిపైనా ఇప్పటికీ వివాదం నడుస్తోంది. శ్రీకాకుళం నగరంలో నివాసముంటున్న రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగులు మెట్ట బాలకృష్ణ, విశాలాక్షి కుటుంబానికి చెందిన భూమిలో ఉమ్మడిగా పెట్రోల్‌ బంకు నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నా.. ఆతర్వాత వారిని మోసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి భూమితో పాటు రూ.లక్షల్లో నగదు తీసుకొని పెట్రోల్‌ బంకులో వాటాదారులుగా చూపించారు. కానీ ఆ తర్వాత వారిని గెంటేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page