
ఈ ఫొటోలో కనిపిస్తున్న రోడ్డు సాక్షాత్తు నగర పాలక కార్పొరేషన్ పరిధిలోనిదే అనేకంటే జిల్లా ప్రధాన కేంద్రంలోనిదే అని చెప్పాలి. ఇంకా గుండె పగిలే వాస్తవమేమిటంటే.. నగరంలో ఏ మూలో ఉన్న కాలనీలోనిది కాదు. జీటీ రోడ్డు నడిబొడ్డులో సూర్యమహల్, చంద్రమహల్ పేర్లు చెబితే గుర్తుపడతారు కదా..! సాక్ష్యాత్తూ వాటి ముంగిట ఉన్న రోడ్లే ఇవి. 2014`19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉడా నిధులతో ఫుట్‌పాత్‌లు నిర్మించారు. శ్రీకాకుళమేంటి? ఫుట్‌పాత్‌ల మీద నడిచే జనాలెవరు? అనే ఆలోచనే లేకుండా రోడ్డుకు అటూ ఇటూ వీటిని నిర్మించడం వల్ల రోడ్డు మీద నీరు కాలువలోకి వెళ్లక, కాలువలో ఉన్న షిల్ట్ ఎత్తలేక స్వయంగా చంద్రమహల్ ప్రధాన గేటు వద్దే కాలువ, రోడ్డు కలిసి ఉన్న దృశ్యమిది. కాలాలతో సంబంధం లేకుండా దోమలకు స్వర్గధామమైన శ్రీకాకుళం నడిబొడ్డు జీటీ రోడ్డు లోనే మురుగు నీరు రోడ్డు మీద నిల్వ ఉంటే ఏమనుకోవాలి?! థియేటర్‌లోకి వెళ్లడానికి కాలువలు, ఫుట్‌పాత్‌ల మీదుగా ర్యాంపులు నిర్మించడంతో వీటిని తొలగించి షిల్టులు తీసే యంత్రాంగం కార్పొరేషన్‌లో లేదు. రోడ్డు వాటం ఎటుంది? కాలువ ఎత్తు ఎంతుంది? అనే ఇంజినీరింగ్ అంచనాలు లేకుండానే శ్రీకాకుళంలో రోడ్లు, కాలువలు నిర్మిస్తుంటారు. ఇక్కడ కాంట్రాక్టరే కింగ్. అది ఏ పార్టీ అయినా అనవసరం. ఇందుకు ఒక ఉదాహరణ చూద్దాం.
కళింగ రోడ్డు వెడల్పు చేసినప్పుడు కాలువలు నిర్మించే కాంట్రాక్ట్‌ను ఒకరు దక్కించుకున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అతి పెద్ద రాయిని ఈ కాలువ నిర్మాణానికి వాడారు. రోడ్డు మీద కుప్పలుగా వేసిన బండల్లాండి రాళ్లు చూసిన అప్పటి కలెక్టర్ విష్ణు ఇలా చేస్తే బిల్లులు చెల్లించమని, బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించినా అదే రాళ్లతో, అదే కాంట్రాక్టర్ కాలువలు నిర్మించారు. విచిత్రమేమిటంటే.. అందరి కంటే ముందు బిల్లులు తెచ్చుకున్నారు.
స్థానిక ఉమెన్స్ కాలేజీ రోడ్డు మెయింటినెన్స్ వర్క్ జరిగిందని, అది నాశిరకంగా ఉందని తెలుసుకున్న కింజరాపు ఎర్రన్నాయుడు ఆ రోడ్డు పరిశీలనకు వెళ్లి రోడ్డు పక్కన పడివున్న ఎండుపుల్లను పట్టుకొని రోడ్డును గుచ్చితే పెచ్చులు రావడం మీడియా ప్రముఖంగా ప్రచురించింది కూడా. ఇక్కడా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. శ్రీకాకుళంలో ఏ కాలువా సునాయాసంగా ప్రవహించడానికి వీలుగా వాటంతో ఉండదు. ఏ రోడ్డూ కాలువతో అనుసంధానమై ఉండదు. అటువంటి చోట ఫుట్‌పాత్‌లు నిర్మిస్తే అసలు రోడ్డు మీద నీరు కాలువలోకి పోదు. దాని ఫలితమే కాలువల్లో చెత్త పేరుకుపోవడం, రోడ్డు మీద నీరు నిల్వ ఉండటం.
ఈ ఫొటో స్వయంగా రైతుబజార్ జంక్షన్ వద్దది. సీసీ రోడ్డు ముక్కలైపోయి ఇక్కడ ప్రయాణిస్తున్నవారి వెన్ను విరగ్గొడుతుంది. కాలువ మీద ఉన్న పలకలకు, రోడ్డుకు మధ్య కనెక్షన్ తెగిపోవడంతో ఈ రోడ్డు నుంచి అవతలివైపు వెళ్లడానికి వాహనదారులు నానా యాతన పడుతున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో అయితే ఫర్వాలేదు. స్వయంగా నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు 40 ముక్కలైపోయినా ఎక్కడా కొత్త రోడ్డుకు ప్రతిపాదించిన నాధుడే లేడు. ఎందుకంటే.. ఇప్పటి జనరేషన్‌కు ఊహవచ్చిన దగ్గర్నుంచి కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎవరు ఏ పార్టీ ఇన్‌ఛార్జో వారికే తెలియదు. ఇక మున్సిపల్ యంత్రాంగం కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
टिप्पणियां