top of page

నరసన్నపేట ఎస్‌బీఐలో రూ.3కోట్ల కుంభకోణం

  • Writer: ADMIN
    ADMIN
  • Apr 2, 2024
  • 2 min read
  • నకిలీ పేర్లతో, అకౌంట్లతో లోన్ల మంజూరు

  • బీఎంను బలి చేయడానికి సన్నాహాలు

  • ఆత్మహత్యకు ప్రయత్నించిన బ్రాంచి మేనేజర్‌

  • ఆర్‌ఎం పాత్రపై అనుమానాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శ్రీకాకుళం రీజనల్‌ మేనేజర్‌ పరిధిలో ఉన్న బ్రాంచిల్లో ఎక్కువ టర్నోవర్‌ చేసే శాఖలు కుంభకోణాలకు నిలయాలుగా మారుతున్నాయి. గార ఎస్‌బీఐలో తాకట్టు పెట్టిన బంగారం కేసును కస్టమర్లు పూర్తిగా మర్చిపోకముందే నరసన్నపేట బజారు బ్రాంచ్‌లో రూ.3కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. గత కొద్ది రోజులుగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఈ బ్యాంకు పరిధిలో బినామీ పేర్లతో కొంతమంది సిబ్బంది పర్సనల్‌ లోన్లు తీసుకొని రూ.3కోట్లు బ్యాంకుకు టోకరా వేశారు. పర్సనల్‌ లోన్లంటే ఉద్యోగులకు కదా ఇచ్చేది, అందులో కుంభకోణం ఎలా జరుగుతుందని ఆశ్చర్యం కలిగితే ఈ కథనం చదవాల్సిందే. సాధారణంగా 60 పైసలు నుంచి 80 పైసలు వడ్డీపై వచ్చే వ్యక్తిగత రుణాల కోసం ఉద్యోగులు బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంటారు. వీటిని పరిశీలించిన తర్వాత రీజనల్‌ కార్యాలయానికి పంపించి, అక్కడ ఓకే అంటే రుణం ఇస్తారు. ఈ విధంగా ఈ బ్రాంచికి వచ్చిన అనేక రుణాల అప్లికేషన్లకు అర్హత లేదంటూ వెనక్కు పంపించేశారు. కానీ సదరు ఉద్యోగులు నింపిన అప్లికేషను, వారు సమర్పించిన శాలరీ సర్టిఫికెట్లు, మిగిలిన డాక్యుమెంట్లు అలాగే బ్యాంకు వద్ద ఉండిపోతాయి. ఎవరో కొందరు మాత్రమే బ్యాంకు చుట్టూ తిరిగిన తర్వాత లోన్‌ రాలేదని తెలుసుకుని తమ అప్లికేషన్లు వెనక్కు తీసుకుంటారు. ఈలోగానే వారు సమర్పించిన డాక్యుమెంట్లను జిరాక్స్‌లు తీయించి, దాని మీద బ్యాంకు సిబ్బందే లోన్‌ను తీసేసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కరెంట్‌ అకౌంట్లు ఓపెన్‌ చేసి, అందులో రుణం మొత్తం పడినట్లు చూసుకున్నారు. ఇలా ఏడాదిన్నరగా ఉద్యోగుల పేరుతో లోన్లు తీసుకోవడం, దాని ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించడం చేసుకుంటూవచ్చారు. కానీ ఓ రూ.3 కోట్ల లావాదేవీలకు సంబంధించి చెల్లింపులు జరగలేదని తేలడంతో సంబంధిత ఉద్యోగుల నుంచి విచారణ మొదలైంది. దీంతో తాము లోనే తీసుకోలేదని, తమ పేరుతో అధికారులు చెబుతున్న అకౌంట్‌ సంబంధిత బ్రాంచిలో లేదని తేలడంతో ఈ రూ.3 కోట్లు సిబ్బందే వాడుకున్నట్లు తేలింది. ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటపడిరదో వెంటనే ఎస్‌బీఐ విజిలెన్స్‌ విభాగం అప్రమత్తమైంది. అందులో భాగంగానే ఆమదాలవలస చీఫ్‌ మేనేజర్‌ బీఏఎన్‌ మూర్తిని పూర్తిస్థాయిలో విచారించి నివేదిక పంపమని కోరింది. ఈలోగానే రీజనల్‌ మేనేజర్‌ సంబంధిత బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ శ్రీకర్‌ మీద రూ.3కోట్లు చెల్లించేస్తే ఎటువంటి కేసులు ఉండవని, లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భయపెడుతున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి రుణాల మంజూరనేది రీజనల్‌ మేనేజర్‌ సంతకం లేకుండా కుదరదు. సంబంధిత ఫీల్డ్‌ ఆఫీసర్‌ వీటిని పరిశీలించి రుణం ఇవ్వొచ్చని నిర్ధారించిన తర్వాత రీజనల్‌ ఆఫీస్‌కు ఫార్వర్డ్‌ చేయడమే బీఎం పని. అక్కడ ఓకే చెప్పిన తర్వాత ఇక్కడ రుణం సంబంధిత అకౌంట్‌లో జమైపోతుంది. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని శ్రీకర్‌ మీదకు రుద్ది ఆయన ద్వారా సొమ్ములు కట్టించేయాలని ఆర్‌ఎం ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గార ఎస్‌బీఐలో తాకట్టులో ఉన్న బంగారం మాయం కేసులో కూడా మొత్తం స్వప్నప్రియ ఖాతాలో వేసి చెల్లించాలని కోరడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఇంకా పెళ్లికాని కుర్రాడు శ్రీకర్‌ను కూడా ఈ విధంగానే భయపెట్టి సొమ్ములు మొత్తం కట్టించేద్దామని ప్లాన్‌ చేస్తున్నట్టు బ్యాంకు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వాస్తవానికి ఫేక్‌ అకౌంట్లు తెరిచిందెవరు? ఇన్‌స్టాల్‌మెంట్లు కడుతున్నదెవరు? అన్న విషయం ఎస్‌బీఐ సర్కిల్‌లో అందరికీ తెలుసు. బీఎంగా ఉన్న పాపానికి శ్రీకర్‌ను బలి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో తన వద్ద సొమ్ములు లేవని, స్వప్నప్రియ లాగే ఆత్మహత్య చేసుకోవడం మినహా తనకు మరో దారి లేదని శ్రీకర్‌ మానసిక వ్యధకు గురైనట్టు తెలుస్తుంది. గార ఎస్‌బీఐ కుంభకోణంలో తాకట్టు పెట్టిన బంగారం డబ్బులు ఎవరి అకౌంట్‌లోకి వెళ్లిందని నిందితుల్లో ఒకరు స్టేట్‌మెంట్‌ ఇచ్చారో, ఇప్పుడు అదే ఫీల్డ్‌ ఆఫీసర్‌ నరసన్నపేట బజారు బ్రాంచ్‌లో పని చేస్తున్నారు. దీంతో ఆర్‌ఎం, ఫీల్డ్‌ ఆఫీసర్లు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారన్న ప్రశ్న ఎస్‌బీఐ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. ఈ పర్సనల్‌ లోన్లు తీసుకున్న ఎస్‌బీఐ ఉద్యోగులు తక్కువ వడ్డీని బ్యాంకుకు చెల్లిస్తూ బయట రూ.3 వడ్డీకి సొమ్ములు తిప్పుతుంటారు. మరికొందరు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, దాని ధర పెరిగిన తర్వాత అమ్మేసి కోట్లకు పడగలెత్తేశారు. నకిలీ లోన్లలో కొందరి పేర్లతో డబుల్‌ లోన్‌ కూడా మంజూరు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రూ.3 కోట్లు సంబంధిత బ్రాంచిలో నిరర్ధక ఆస్తిగా మిగిలిపోవడంతో ఈ వ్యవహారం ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వరకు వెళ్లింది. అయితే గార వ్యవహారం లాగే సొమ్ములు శ్రీకర్‌తో కట్టించేసి, ఈ అంశం బయటకు రాకుండా చూద్దామని ఆర్‌ఎం ప్రయత్నించారు. అయితే ఆర్‌ఎం చేతివాటానికి బలైపోయిన స్వప్నప్రియతో పాటు మరికొందరి గాధలతో మళ్లీ కలుద్దాం.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page