చోరీ బంగారం రికవరీ
జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాబరీ, చైన్‌స్నాచింగ్, సోంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్‌స్నాచింగ్ కేసులకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసకున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టంచేశారు. ఈమేరకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి రెండు కేసుల్లో సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్టు తెలిపారు. సోంపేట పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి కేసులో నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఒడిశాలోని బరంపూర్ మణప్పరం ఫైనాన్స్ లిమిటెడ్‌లో తాకట్టులో ఉన్న కేసు సొత్తు రికవరీ నిమిత్తం వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. నిందితులు సింగిల్‌గా ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దోపిడీ చేస్తున్నారని తెలిపారు. గత నెల 16న శివాజీనగర్‌లో బసవరాజు గోపాల్ ముందుగా రెక్కీ నిర్వహించి కిరణ్‌కుమార్ ఒంటరిగా ఇంట్లో ఉన్న ఒక మహిళను రూమ్ అద్దెకు కావాలని, ఆ తర్వాత తాగడానికి నీరు కావాలని అడిగి మాస్క్ వేసుకొని ఇంట్లోకి వెళ్లి బెదిరించి రెండున్నర తులాలు బంగారు పుస్తెలతాడు, తులం లాకెట్‌తో ఉన్న చైన్‌ను మెడలో నుంచి తీసి, కొంత దూరంలో ఉన్న బండూరు ఉమామహేశ్వరావు, బసవ రాజగోపాల్‌లతో కలిసి మోటార్ సైకిల్‌పై పారిపోయారని, దొంగిలించిన బంగారు ఆభరణాలను ఆ తర్వాత రోజు మర్రివలస సంధ్య ఈనే మహిళతో కలిసి విశాఖ ఎంవీపీ కాలనీలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.2.10 లక్షలు తీసుకున్నారని, ఇందులో రూ.10వేలు సంధ్య తన వద్ద ఉంచుకొని మిగతా రూ.2లక్షలను ఉమామహేశ్వరరావుకు ఇచ్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ నెల 5న పలాసలోని కొత్తవీధిలో రెక్కీ చేసి ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళను, తిరుమల అనే పేరు గల వ్యక్తి ఉన్నారా అని అడిగి, తలుపు తీసిన వెంటనే ఆమెపై దాడి చేసి, కత్తితో బెదిరించారు. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరు కుర్చీతో దాడిచేశారు. ఇంతలో పక్కనే ఉన్న మహిళ మెడలో ఉన్న 2 పేటల 5 తులాల పుస్తెలతాడు, 4 తులాల నల్లపూసలు, తులము చైన్‌ను తెంపుకుని పోయారు. అక్కడ మోటార్ సైకిల్‌తో సిద్ధంగా ఉన్న మరో నిందితుడితో కలిసి ముగ్గురు పారిపోయారు. దొంగిలించిన బంగారం విశాఖపట్నం తీసుకువెళ్లి అక్కడ వీరికి సహకరిస్తున్న మహిళకు అప్పగించడానికి వెళ్తుండగా గురువారం కాశీబుగ్గ పోలీసులకు ముగ్గురూ చిక్కారు. సోంపేటలో మహదేవుపురంలో గత నెల 25న ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళకు నీరు కావాలని అడిగి, ముఖానికి మాస్క్ వేసుకొని, ఆమెతో పాటు ఇంట్లోకి ప్రవేశించి, బెదిరించి ఆమె మెడలోని మూడు తులాల పుస్తెలతాడు, నల్లపూసలు తెంపి తర్వాత పారిపోయారు. ఈ బంగారాన్ని అదే రోజు బరంపురంలోని మణప్పురంలో రూ.1.24 లక్షలకు తనఖా పెట్టి ఆ డబ్బులను పంచుకున్నారని తెలిపారు. క్రైం అడిషనల్ ఎస్పీ శీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కేసులను ఛేదించి నిందితులను పట్టుకోవడం, సొత్తు రికవరీలో క్రియాశీలకంగా వ్యవహరించిన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సీఐ డి.మోహనరావు, సోంపేట సర్కిల్ సీఐ బి.మంగరాజు, సబ్ ఇన్‌స్పెక్టర్ బి.హైమావతి, హెడ్ కానిస్టేబుల్ గవరయ్య, పోలీస్ షణ్ముఖరావు, కూర్మారావు, ప్రసాద్, ఉషాకిరణ్, ప్రదీప్, కిరణ్‌కుమార్, కామేష్, ఈశ్వరరావులను ఎస్పీ అభినందించారు.
Commentaires