బక్తియార్ ఖిల్జీ చేశాడని ప్రచారం
ముస్లిం పాలకులు తగులబెట్టారని పాఠాలు
ప్రధాని మోదీ ప్రచారంపై సోషల్‌మీడియాలో కథనాలు
(దుప్పల రవికుమార్)

మొన్న జూన్ 19న నలంద విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణాన్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప విద్యాకేంద్రంగా విలసిల్లిన నలంద విశ్వవిద్యాలయాన్ని 12వ శతాబ్దంలో ముస్లిం దురాక్రమణదారులు తగులబెట్టేశారని చెప్పారు. ఆయన మన దేశంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఒక అబద్దాన్ని వల్లెవేశారు. వాడుకలో ఉన్న ఒక అతిశయోక్తిని పునరుద్ఘాటించారు. మహమ్మద్ ఘోరీ ఆస్థానంలోని బక్తియార్ ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయాన్ని తగులబెట్టినట్టు ఆయన ఉద్దేశం. విశ్వవిద్యాలయానికి నిప్పుపెట్టిన తర్వాత మూడు నెలలు లేదా ఆరు నెలల పాటు ఆ లైబ్రరీలోని పుస్తకాలు తగలబడ్డాయని కూడా జనం నమ్ముతున్నారు. ఈ కట్టుకథని ఆయన తన ప్రసంగంలో చిలుకపలుకుల్లాగ పలికారు. నిజానికి ఆ ప్రారంభోత్సవానికి మయన్మార్, శ్రీలంక, వియత్నాం, జపాన్, కొరియా దేశాల రాయబారులు హాజరయ్యారు. ఈ దేశాలన్నింటిలో ఒకప్పుడు బౌద్ధం ఘనంగా విస్తరించింది. మన దేశం నుంచి అశోక చక్రవర్తి పంపిన బౌద్ధ అనుయాయులు ఈ దేశాలలో బౌద్ధ వ్యాప్తి చేశారు. నలందలో లభించిన పురావస్తు ఆధారాలను బట్టి ఈ విశ్వవిద్యాలయం ప్రముఖ బౌద్ధ కేంద్రంగా విరాజిల్లినట్టు తెలుస్తోంది. అలాంటిచోట ఇలాంటి మాటలు చెప్పడం వల్ల తనకు చరిత్ర పట్ల ప్రాథమిక ఆవగాహన కూడా లేదని చెప్పకనే చెప్పినట్టవుతుంది.
శిథిలమైపోయిన నలంద స్థానంలో ఒక అద్భుతమైన ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని పునఃప్రతిష్టించాలని ఆనాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ 2006లో ప్రతిపాదించారు. ఆయన సదుద్దేశాన్ని ఆనాటి బీహార్ శాసనసభ ఆమోదించగా, యూపీఏ ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేసింది. మొత్తానికి మోదీ 3.0 హయాంలో ఆ పని పూర్తయింది. ఈ దేశ ప్రధాని చేసిన ఆ వ్యాఖ్యల వల్ల ఇప్పటికే ప్రజలలో స్థిరంగా ఉన్న ` ముస్లిం దండయాత్రికులు ఈ దేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేశారని ఒక తప్పుడు అభిప్రాయాన్ని బలపరిచినట్లయింది. మతతత్వ దురుద్దేశాలతో బ్రిటీషు చరిత్రకారులు చేసిన తప్పుడు ఊహల్ని ప్రచారంలో పెట్టడం ద్వారా హిందూ, ముస్లిం మతోన్మాదులకు బలం చేకూరుతుందే తప్ప ఈ దేశ సమగ్రతకు ఏమాత్రం తావివ్వదు. హిందువులకు వ్యతిరేకంగా ఇలాంటి అభిప్రాయాలను ప్రచారంలో పెట్టడం ద్వారా పాకిస్తాన్‌లో భయోత్పాతాన్ని సృష్టించిన ముస్లిం లీగ్ మాదిరిగా మన దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్నో అసత్యాలను, అర్థసత్యాలను ప్రచారంలో పెట్టి హిందువుల్లో ముస్లింల పట్ల ఏహ్యభావాన్ని పెంపొందిస్తోంది. సరిగ్గా దీని గురించి సర్దార్ వల్లబ్ భాయి పటేల్ ఇలా రాసారు.. ‘‘వీరి (ఆరెస్సెస్ ప్రచారకుల) ఉపన్యాసాలు పూర్తిగా మతతత్వ విద్వేషంతో నిండివుంటాయి. హిందువులను ఆకట్టుకోవడానికి, వారిని రక్షించడానికి ఇలాంటి విషం చిమ్మనవసరం లేదు. ఇలా చిమ్మిన విషం వల్లనే ఈ దేశం మహాత్మా గాంధీని కోల్పోవలసి వచ్చింది’’. మైనారిటీల నుంచి మెజార్టీ ప్రజలను రక్షించడమేమిటో ఎప్పటికీ అర్థం కాని విషయం.
సహజ మరణమూ సాధ్యమే!
అప్పట్లో నలంద విశ్వవిద్యాలయం ఒక గురుకులం మాదిరి విద్యాసంస్థ (రెసిడెన్షియల్ యూనివర్శిటీ). బీహార్‌లోని రాజ్‌గిరి ప్రాంతంలో ఉండేది. దీనిని గుప్తులు ఆరవ శతాబ్దంలో ఏర్పాటు చేసారు. ఇక్కడ బుద్ధ తాత్వికతతో పాటు, బ్రాహ్మణ వాజ్ఞయమైన వేదాంతం, పురాణాలతో పాటు గణితం, తర్కం, ఆరోగ్య శాస్త్రం మొదలైన విషయాలు బోధించేవారు. బహిరంగ చర్చ, తర్క పద్ధతి బోధనల వల్ల ఈ విశ్వవిద్యాలయ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిరచి దేశదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. గుప్తుల తదనంతర రాజులు కూడా వీటికి నిధులు వెచ్చించి వీటిని సమాదరించారు. రాజుల ప్రోత్సాహంతోనే ఇలాంటి విశ్వవిద్యాలయాలు మనగలిగేది. తర్వాత పాళ, సేన సామ్రాజ్యాలలో కొంత ఆదరణ తగ్గింది. దానికి కారణం ఆ రాజులు తమ సహాయాన్ని మరికొన్ని ఇతర విశ్వవిద్యాలయాల స్థాపనకు పూనుకోవడమే. ఓ దంతపురి, విక్రమశిల వంటి నూతన విశ్వవిద్యాలయాలను వీరు ఏర్పాటుచేశారు. నిజానికి అప్పుడే నలంద పతనం ప్రారంభమైంది. మరి లక్షలాది పుస్తకాలను, రాతప్రతులను, అరుదైన గ్రంథాలను నెలల తరబడి తగలబడేటట్టు కాల్చేసింది ఎవరు? ఎక్కువమంది ఖిల్జీని నిందించడానికి కారణం బ్రిటిష్ చరిత్రకారులు. ఎలాంటి ఆధారాలు చూపకపోయినప్పటికీ నింద మాత్రం ఖిల్జీపై వేశారు. ఖిల్జీ అయినా, మరే విదేశీ దురాక్రమణదారుడైనా వారి ప్రధాన ఉద్దేశం దోపిడీ చేయడం, దోచుకోవడమే. ఖిల్జీ అయోధ్య నుంచి బెంగాల్ వెళుతూ కిలా`ఇ`బిహార్‌పై సంపద గల దుర్గం అని దాడి చేశాడు. కాని ఈ దారిలో నలంద లేదు. నిజానికి ఈ దారికి నలంద చాలా దూరంగా ఉండేది. అంతేకాక ఒక విశ్వవిద్యాలయంపై దాడి చేయడానికి తగిన కారణాలు కూడా ఖిల్జీ దగ్గర లేవు.
ఆనాటి చరిత్రను సూచించే చాలా గ్రంథాలలో ఖిల్జీ నలంద వైపు వెళ్లాడనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ‘తబఖత్`ఎ`నాసిరి’ గ్రంథాన్ని రాసిన మిన్హజ్`ఎ`సిరాజ్ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ధర్మస్వామి, సుంపా అనే ఇద్దరు టిబెటన్ పండితులు భారతదేశ చరిత్ర గురించి రాశారు. ముఖ్యంగా బుద్ధిజం వ్యాప్తి గురించి పరిశోధన చేశారు. వీరెక్కడా నలంద గురించి గాని, అది తగలబడడం గురించి గాని ప్రస్తావించలేదు. టిబెట్ నుంచి వచ్చిన మరో పండితుడు తారానాథ్ సైతం ఖిల్జీ ఇటువైపు రావడం ఎక్కడా చర్చించలేదు. మరో విచిత్రం ఏమంటే సమకాలీన బుద్ధిస్టు నిర్మాణాలైన అంజతా, ఎల్లోరా, సాంచీ స్థూపాలు ఎక్కడా విదేశీ దురాక్రమణదారుల బారిన పడలేదు. స్వదేశీ చరిత్రకారులైన జాదూనాధ్ సర్కార్, ఆర్‌సీ మజుందార్లు కూడా ఎక్కడా ఖిల్జీ నలందను ధ్వంసం చేసినట్లు ప్రస్తావించలేదు. మరో ప్రాచీన భారత చరిత్రకారుడు డి.ఎన్ రaా రాసిన దాని ప్రకారం, ‘‘కాకుత్సిద్ధ రాజు నలేంద్ర (ఇప్పటి నలంద) వద్ద నిర్మించతలపెట్టిన దేవాలయంలో ఉండగా, కొంతమంది శ్రమణులు తీర్థిక బిచ్చగాళ్లను అల్లరి పెట్టారని, దాంతో కోపగించిన తీర్థిక భిక్షాటనపరులు సూర్యసాధన చేసి, ఆత్మార్పణ చేసుకున్నారని, వారి ఆగ్రహమే జ్వాలలుగా రేగి, ఆ విశ్వవిద్యాలయాన్ని బూడిద చేసిందని, టిబెటన్ సన్యాసి తారానాథ్ ప్రస్తావించినట్లు డి.ఎన్. రaా తెలిపారు. ‘బీహార్‌లో మిగిలిన ప్రాచీన శిథిలాలు’ గ్రంథంలో డి.ఆర్. పాటిల్ బుద్ధిస్ట్ సన్యాసులు, బ్రాహ్మణ పూజారులు ఘర్షణల్లో విశ్వవిద్యాలయం దెబ్బతిన్నదని అనుమానం వ్యక్తపరిచారు.
మనం చేసిన తప్పును ఇంకొకరి మీదకి నెట్టడమే!
మనం ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఒకటుంది. బ్రాహ్మినిజం బలపడినాక మాత్రమే బుద్ధిజంపై దాడులు పెరిగాయి. అశోకుని తదనంతరం బుద్ధ తత్వం దేశమంతా వ్యాపిస్తున్న వేళ, సమానత్వ భావన కూడా విస్తరించింది. దాని ఫలితంగా పూజాదిక తంతులకు కాలం చెల్లడం మొదలైంది. దాంతో బ్రాహ్మణుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఈ అసంతృప్తి బాగా ప్రజ్వరిల్లి, అశోకుని మనుమడు బృహద్రధుడు రాజయ్యాక, ఆయనను సేనాధిపతి పుష్యమిత్ర శృంగుడు హత్య చేశాడు. ఎంతోమంది బౌద్ధ సన్యాసులను ఊచకోత కోశాడు. లభిస్తోన్న అన్ని ఆధారాలు నలంద విశ్వవిద్యాలయాన్ని ఆనాటి మతతత్వం తలకు పట్టించుకున్న కొందరు బ్రాహ్మణులే నేలమట్టం చేశారని నిరూపిస్తున్నాయి. ఈ కఠిన వాస్తవానికి విరుద్ధంగా సమాజంలో ఇస్లామోఫోబిక్ ప్రోపగాండాలో భాగంగా ఖిల్జీని ఈ వివాదంలోకి దించినట్లు తేలుతోంది. ఒకవైపు ఆనాటి విద్యాలయాలలో కరడుగట్టిన బ్రాహ్మణతత్వం, ప్రశ్నించకుండా పెద్దల మాట విధిగా ఆచరించాల్సిందే అనే మూఢత్వం రాజ్యమేలుతుండేవి. దానికి విరుగుడుగా బహిరంగ చర్చ, తార్కికతకు పెద్ద పీట వేసిన నలంద విశ్వవిద్యాలయం ఎందరికో కంటగింపుగా మారింది. అలాంటి వారే ఒక పథకం ప్రకారం ఆ విశ్వవిద్యాలయాన్ని నామరూపాల్లేకుండా చేసారని చరిత్ర నిరూపిస్తోంది.
Comentarios