మీ కక్కుర్తిలో నా కమండలం!
- SATYAM DAILY
- Mar 18
- 2 min read
టెన్త్ పరీక్షా పత్రాల కోసం తిరుగుతున్న కార్లు ఉపాధ్యాయులవే
డీఈవో కార్యాలయంతో క్విడ్ ప్రో కో

( స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద ప్రశ్న పత్రాలు తీసుకెళ్లడానికి నిరీక్షిస్తున్న స్కోడా, ఎర్టిగా కార్లు)
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అదేదో సినిమాలో హాస్యనటుడు ఆలీ తన చుట్టూ ఉన్న సన్యాసులు కక్కుర్తి పడుతుంటే.. నీ కక్కుర్తిలో నా కమండలం అంటాడు. సరిగ్గా ఈ డైలాగు మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సరిపోయేట్టుంది. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లడం, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని పాఠశాల నుంచి వెనక్కు తీసుకురావడం కోసం విద్యాశాఖ కార్లను రోజువారీ పద్ధతిలో అద్దెకు తీసుకుంటుంది. దశాబ్దాలుగా టాక్సీ నడుపుతూ సరైన సంపాదన లేనివారంతా పరీక్షా పత్రాల తరలింపునకు ముందుకొస్తారు. కానీ ఈసారి మన బడిపంతుళ్లు ఆ అవకాశం కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదు. తమ వద్ద ఉన్న సొంత కార్లనే పరీక్షా పత్రాల రవాణాకు ఉపయోగించి సొమ్ములు చేసుకుంటున్నారు. పది కిలోమీటర్లకు ఒక లీటరు ఆయిల్ చొప్ప్పున ఎన్ని కిలోమీటర్లు వెళ్తే.. ఆమేరకు ఆయిల్, రోజుకు రూ.1,325 కారు అద్దె కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ సొమ్మును కూడా ఎందుకు వదులుకోవడం అని మన గురువులకు అనిపించిందో ఏమో.. ఈసారి 90 శాతం కార్లను సొంతంగానే పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి డీఈవో కార్యాలయంలో నీకింత.. నాకింత అనే పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలో రియల్ ఎస్టేట్, ఎలఐసీ ఏజెన్సీ, చిట్స్ అండ్ ఫైనాన్స్ వంటి కమిషన్ వ్యాపారాల్లో రెండుచేతులా సంపాదించేవారు ఇప్ప్పుడు ఈ ప్రశ్నపత్రాల రవాణా కాంట్రాక్ట్‌ను వదులుకోడానికి ఇష్టపడలేదు. వాస్తవానికి జిల్లాలో ఉద్యోగాలు రాక బ్యాంకులిచ్చే రుణంతో కార్లు కొనుక్కొని టాక్సీ కింద నడుపుకొంటున్న అనేకమంది నిరుద్యోగులు ఇటువంటి వాటికి ముందుంటారు. కానీ ఈసారి వారందర్నీ కాదని ఉపాధ్యాయులే తమ సొంత కార్లను పెట్టుకున్నారు. శ్రీకాకుళం హెడ్‌క్వార్టర్‌లో ఉంటూ సంబంధిత పాఠశాలకు వెళ్లడానికి ఒక ఉపాధ్యాయుడు కారు తీసుకుంటే.. దానిని అదే పాఠశాలకు వెళ్లే మరో నలుగురు రోజువారీ ఖర్చులు భరించి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. ఆ విధంగా ఇప్ప్పుడు దాదాపు హెడ్‌క్వార్టర్‌లో ఉండే 90 శాతం టీచర్ల వద్ద కార్లు ఉన్నాయి. వీరంతా జిల్లా నలుమూలల పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఈ కార్లు పెట్టుకున్నారు. సంబంధిత మండలంలో ఉన్న పోలీస్‌స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లి కేంద్రాల వద్ద అప్పగించడం, పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను తీసుకువచ్చి సంబంధిత పోస్టాఫీసులో అప్పగించడం ప్రధానమైన విధి. ఇందులో పోలీస్‌స్టేషన్, పరీక్షా కేంద్రం, పోస్టాఫీసుల మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటే.. అందులో ప్రతీ 10 కిలోమీటర్లకు లీటరు ఆయిలు వచ్చేస్తుంది. దీనికి తోడు కారు తమదే కాబట్టి, డ్రైవర్‌ను ఇంతకు ముందే జీతానికి పెట్టుకున్నారు కాబట్టి ఎంచక్కా ఈ వ్యాపారం కూడా ఈ సీజన్లో చేసేస్తున్నారు. దీనికి డీఈవో కార్యాలయం అండదండలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతున్న ఈ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు మోసుకెళ్లడం ఉపాధ్యాయుల వాహనాలే చేస్తున్నాయి. అది కూడా ఎలాంటి కార్లంటే.. ఏడుగురు కూర్చునే అవకాశం ఉండే ఎర్టిగా, స్కోడా, హుండాయ్ ఐ`20, టొయోటో కంపెనీల వాహనాలు ఉన్నాయి. కొన్నిచోట్ల పొరపాటున టాక్సీ డ్రైవర్లకు ఈ అవకాశం ఇచ్చినా కూడా ఆ పాఠశాల మీద సర్వహక్కులూ తమవేనని, దీనిని వదులుకోవాలని భయపెట్టిన ఉపాధ్యాయులూ ఉన్నారట. అయితే డీఈవో కార్యాలయానికి బిల్లులు పెట్టినప్ప్పుడు మాత్రం ఏదో ఒక ట్రావెల్ ఏజెన్సీ బిల్లులు పుట్టించో, లేదూ అంటే తమ పేరు బయటకు రాకుండా వేరేవారి పేరుతో బిల్లులు తీసుకొని సమర్పిస్తారు. అందుకే కక్కుర్తిలో కమండలం అన్నది.






Comments