top of page

‘నాక్‌’గా తప్పించారు!

Writer: NVS PRASADNVS PRASAD
  • ఆర్ట్స్‌ కళాశాలకు అర్హత లేదని ఫిర్యాదు

  • ప్రిన్సిపాల్‌ మీద కక్షతో గ్రేడ్‌ను అడ్డుకున్న ప్రబుద్ధులు

  • సురేఖ బదిలీకి ప్రత్యేక జీవో తెప్పిస్తున్న ఆ నలుగురు

  • ఎ`గ్రేడ్‌ వస్తే పాతుకుపోతారనే కుట్ర

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇంగ్లీష్‌ ముక్కల సారాంశం సూటిగా తెలుగులో చెప్పాలంటే.. ‘శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాలలో సీరియస్‌ పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయని, నాక్‌ బృందం దీని మీద చర్యలు తీసుకోవాలని, వీలైతే నాక్‌ సభ్యులే దీనిపై ఇన్వెస్టిగేషన్‌ చేయాలని’ అక్రిడేటెడ్‌ కమిటీకి శ్రీకాకుళం గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ మెన్‌ పేరుతో వెళ్లిన ఈమెయిల్‌ ఫిర్యాదు. పేరు, ఊరు లేకుండా జనవరి 23, 24 తేదీల్లో శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాలకు నాక్‌ గ్రేడ్‌ ఇవ్వడం కోసం పరిశీలనకు వచ్చిన అనంతరం వెళ్లిన ఫిర్యాదు ఇది. ఇందులో ఫిర్యాదుదారుడెవరో తెలియకపోయినా ఫిర్యాదులో ఉన్న అంశాలు ఏమేరకు వాస్తవమన్న విషయం మరోసారి చర్చించుకుంటే ఆర్ట్స్‌ కళాశాలకు నాక్‌ ఎ`గ్రేడ్‌ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఈ ఫిర్యాదేనని వేరేగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. తమకు కళాశాల మీద ఫిర్యాదు వచ్చిందని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ స్వయంగా నాక్‌ కమిటీయే ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మెయిల్‌కు ఒక నోటీసు పంపింది. ఇదే నోటీసు శనివారం కళాశాలలో అధ్యాపకుల వాట్సాప్‌ గ్రూపుల్లో తిరిగింది. కేవలం ముగ్గురు నలుగురు పని కట్టుకొని కళాశాలకు నాక్‌ ఎ`గ్రేడ్‌ రాకుండా అడ్డుకున్నా, మిగిలినవారంతా శక్తివంచన లేకుండా పని చేసినందుకు కృతజ్ఞతగా కళాశాల ప్రిన్సిపల్‌ శనివారం ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమయంలో గ్రూపుల్లో ఈ ఫిర్యాదు కనిపించింది. కేవలం ప్రిన్సిపల్‌ మీద ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగా కళాశాలకు ఎ`గ్రేడ్‌ రాకుండా అడ్డుకోవడం కోసం ఆకాశరామన్నలు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు కళాశాల ప్రిన్సిపల్‌నే టార్గెట్‌ చేసిన దుష్టచతుష్టయం ఈసారి జిల్లా ప్రతిష్ఠకు సంబంధించిన నాక్‌ గ్రేడను కూడా వీరి స్వార్థానికి బలి చేశారు. పెంకి సురేఖ ఇక్కడ ప్రిన్సిపల్‌గా ఉండటాన్ని మొదట్నుంచి అంగీకరించని కొందరు చాన్నాళ్లుగా ఆమెతో యుద్ధం చేస్తున్నారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న అంశం ప్రస్తుతానికి పక్కన పెడితే కేవలం సురేఖ మీద ధ్వేషంతో నాక్‌ ఎ`గ్రేడ్‌ రాకుండా ఫిర్యాదులు చేయడం కంటే దగుల్బాజీ పని మరొకటి లేదని పూర్వపు విద్యార్థులు బాధపడుతున్నారు. సురేఖను ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి ప్రత్యేకంగా జీవో తెప్పించుకుంటున్న వీరు ఇప్పుడు నాక్‌ ఎ`గ్రేడ్‌ కాలేజీకి వస్తే సురేఖకు మైలేజీ పెరుగుతుందని జిల్లా భవిష్యత్తును ఫణంగా పెట్టేశారు. గతంలో అనేక ఫిర్యాదులు ప్రిన్సిపాల్‌ మీద చేయడం, విచారణలు జరగడం, ఆ నివేదికలు ఏమయ్యాయో తేలకపోవడం, ఆమెకు బదిలీ కావడం, కోర్టును ఆశ్రయించడం, మళ్లీ ఇక్కడికే రావడం.. ఇవన్నీ ఒక లెక్క. కానీ నాక్‌ ఎ`గ్రేడ్‌ రాకుండా అడ్డుకోవడం మాత్రం క్షమించరాని నేరం. నాక్‌ బృందానికి ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసిన అంశంలో వాస్తవాలు ఉంటే ఉండొచ్చుగాక. లేదూ అంటే కేవలం సురేఖను బలిపశువును చేయడానికే నాలుగు వాక్యాలు పేర్చివుండొచ్చు కూడా. ఏం జరిగినా నాక్‌ ఎ`గ్రేడ్‌ రావడానికి కావలసిన నార్మ్స్‌ అన్నీ ఆర్ట్స్‌ కళాశాలకు ఉండకపోవచ్చు. అలా అని రాష్ట్రంలో ఉన్న నాక్‌ ఎ`గ్రేడ్‌ సంస్థల్లో 100 శాతం ఈ నార్మ్స్‌తోనే ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్‌ కాలేజీ నుంచి సిద్ధిపేట వద్ద ఉన్న డెంటల్‌ కాలేజీ వరకు, పక్కనే ఉన్న రాగోలు జెమ్స్‌ మెడికల్‌ కాలేజీలో సీట్లు పెంచాలన్నా, పీజీకి అప్‌గ్రేడ్‌ చేయాలన్నా, మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి కావాలన్నా వేరేచోట నుంచి ఆ బృందం వచ్చినప్పుడు వైద్యులను తెచ్చి ఓ షో చేస్తుంటారు. ఈ విషయం చదువులు చెప్పే అధ్యాపకులకు తెలియనిది కాదు. ఎందుకంటే.. ఒకసారి నాక్‌ లాంటి వ్యవస్థలు ఎ`గ్రేడ్‌, మెడికల్‌ కౌన్సిల్‌ లాంటివి అనుమతులు ఇస్తే అక్కడి విద్యార్థుల, అధ్యాపకుల భవిత బాగుంటుంది. అందుకే ఆ సమయంలో అందరూ కలిసికట్టుగా పని చేస్తారు. సిద్ధిపేటలో ఉన్న డెంటల్‌ కాలేజీ ప్రైవేటుదే అయినా అక్కడి మేనేజ్‌మెంట్‌కు, ఫ్యాకల్టీకి మధ్య ఎన్ని పొరపొచ్చాలు ఉన్నా మెడికల్‌ కౌన్సిల్‌ పర్యవేక్షణకు వచ్చినప్పుడు మాత్రం తమకు మించిన కాలేజీ లేదనే చూపిస్తున్నారు. ఆర్ట్స్‌ కాలేజీ ప్రభుత్వానిదైవుండి సురేఖకు ఎక్కడ పేరొస్తుందోనని కుట్రకు పాల్పడినవారు ఆర్ట్స్‌ కళాశాల చరిత్రను తెలుసుకుంటే మంచిది. తరగతి గదుల్లో స్లాబుకు కొన్నిచోట్ల పెచ్చులూడుతున్నాయని మరీ ఫిర్యాదు చేసినవారికి నాక్‌ ఎ`గ్రేడ్‌ వస్తే నిధులు ఎక్కువ మంజూరవుతాయని, దాంతో కళాశాలను బాగుచేసుకోవచ్చన్న విషయం తెలియకపోవడం విడ్డూరం. ముఖ్యంగా సురేఖను ఇక్కడి నుంచి పంపేసి ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్‌ కాలేజీలో తిష్ఠ వేయడానికి ఎప్పట్నుంచి ఆకాశరామన్న యుద్ధాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ మొదలుకొని ఉన్నత విద్య కమిషనరేట్‌ వరకు సురేఖ మీద ఉన్నన్ని ఫిర్యాదులు రాష్ట్రంలో మరో కళాశాల ప్రిన్సిపాల్‌ మీద లేవు. వీటిని క్లియర్‌ చేసి సురేఖ తప్పు చేశారని నిరూపించి ఆమెను బదిలీ చేయించడం ఒక ఎత్తు. లేదా మరో చర్యలు తీసుకోవాలని కోరడంలో తప్పు లేదు. కానీ నాక్‌ గ్రేడ్‌ను దిగజార్చడం మాత్రం ముమ్మాటికీ తప్పే. కాలేజీకి ఎ`గ్రేడ్‌ వస్తే సురేఖ ఇంటికి సున్నాలు పడవు. కాలేజీ గోడలకే నాలుగు రంగులద్దుకోవచ్చు. ఇక్కడ ఇది మనది అని భావించి పాఠాలు చెబుతున్న అధ్యాపకులకు మరో నాలుగు రూపాయల జీతం పెరుగుతుంది. ఇవన్నీ పట్టకుండా విశాఖపట్నం నుంచో, మరో చోట నుంచో అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తూ ఈ జిల్లాలో పని చేయడానికి ఏమాత్రం ఇష్టపడని కొందరు, పాఠాలు చెప్పడం కంటే రాజకీయాలు చేయడానికే ప్రాముఖ్యతనిచ్చే మరికొందరు, లెక్చరర్‌ అనిపించుకోవడం కంటే జిల్లా అధికారిని పిలిపించుకోవాలన్న కోరికతో ఇంకొందరు కళాశాలకు రావాల్సిన నాక్‌ గ్రేడ్‌ను నాక్‌గా తప్పించారు. కారణమేంటయ్యా అంటే.. సురేఖ చేతకానితనమని పేరు పెట్టారు.

1 commentaire


Tankala Sai
Tankala Sai
01 févr.

ఈ మెయిల్ పంపిన వారి పై చర్యలు తీసుకోవాలి.

J'aime

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page