తోపుడు బండి వ్యాపారి రాముగా గుర్తింపు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నాగావళి పాత వంతెన కింద మృతదేహం ఉన్నట్టు శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నగరంలోని తోటపాలెం జంక్షన్ నీలమ్మకాలనీలో నివాసముంటున్న కొత్తూరు మండలం బత్తిలికి చెందిన యాదవరెడ్డి రాము(40)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు రాము స్థానికంగా తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాము గత కొంతకాలంగా మతిస్థిమితం లేనట్లు వ్యవహరిస్తున్నాడని స్థానికులు తెలిపారు. గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో కోటేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతునికి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ హరికృష్ణ సంఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వంతెన కింద మృతదేహం ఉందన్న సమాచారంతో పాత వంతెన వద్ద స్థానికులు గుమిగూడడంతో వంతెనపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.
Comments