top of page

నిజమే..! బడి పంతుళ్లు బతకలేకపోతున్నారు

Writer: ADMINADMIN
  • సీహెచ్‌ దుర్గాప్రసాద్‌


మొన్న జరిగిన రెండు ఘటనలు...

  • అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడ్నే కొట్టి చంపిన విద్యార్థులు.

  • హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య 35 ఎంఎం థియేటర్‌కు అర్థరాత్రి తన పిల్లలతో సహా పుష్ప`2 సినిమా చూడటానికి వెళ్లి తొక్కిసలాటలో మృతిచెందిన మహిళ.

సమాజంలో పిల్లల పెంపకం ఎలా మారిందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనాలు ఉండవు.

క్లాసులో నిశబ్ధంగా ఉండమని చెప్పినందుకు ఒక టీచర్ని తొమ్మిదో తరగతి విద్యార్థులు కొట్టి చంపారు. ఇది కింద పోస్టు చేసిన వార్త సారాంశం. ఇది చాలామందికి ఒక డబుల్‌ కాలమ్‌ వార్త. మరి కొంతమంది ఇది మన స్కూల్లో, మన ఊర్లో కాదు కదా అనుకోవచ్చు. కానీ ఈ నీచ సంస్కృతి చెద మాదిరి ప్రతి స్కూల్‌కి వ్యాపిస్తుంది. ఎవరిని నిందించాలి.. తల్లిదండ్రులనా, టీచర్లనా, వ్యవస్థనా...? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ వారంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తల్లిదండ్రుల సమావేశాన్ని ఉద్దేశించి నిన్న విద్యాశాఖ కార్యదర్శి ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఒక గొప్ప కార్యక్రమం.. అనుమానం లేదు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను స్కూళ్లకు రప్పించడం ఒక గొప్ప చాలెంజ్‌ అంటున్నారు. ఇది నూటికి నూరుశాతం వాస్తవం. వేల రూపాయిలు ఫీజు కట్టించుకున్న స్కూళ్ల యాజమాన్యాలు పేరెంట్స్‌ మీట్‌ పెట్టినా పావు వంతు తల్లిదండ్రులు రారు. ఈ మధ్య ఒక స్కూల్‌ వారు ఒక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడుతో ఆర్ట్‌ ఆఫ్‌ పేరెంటింగ్‌ నిర్వహించాలి అనుకున్నారు. దాని కోసం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ చివరికి ఆ కార్యక్రమం వాయిదా పడిరది. కారణం తల్లిదండ్రులు రావడానికి ఆసక్తి చూపరని తెలిసింది. ఒకప్పుడు స్కూల్‌ నుంచో కాలేజ్‌ నుంచో ఒక పిలుపు వస్తే ఎక్కడ పని అక్కడ వదిలేసి తల్లో తండ్రో పరిగెత్తి వెళ్లి స్కూల్‌ పెద్దని కలిసేవారు. ఇప్పుడు అలా కాదు. పేరెంట్స్‌ మీట్‌ కు రారు సరే మీ అమ్మాయి లేదా అబ్బాయి కోసం మాట్లాడాలి అంటే మాకు తీరిక లేదు అన్న సమాధానం వస్తుంది. ఎవరి కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారో వారే పక్కతోవ పడుతుంటే ఎవరి కోసం ఈ సంపాదన అన్న స్పృహ లేకపోతే ఎలా..? జనతా గారేజ్‌ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక మాట చెప్తాడు. నీ కొడుకు సరైనోడు అయి వృద్ధిలోకి వస్తే నీ ఆస్తి వైపు కన్నెత్తి చూడడు. అదే వాడు దారితప్పితే ఏడాది తిరిగేలోపు నీ ఆస్తిని కర్పూరంలా తగలెట్టేస్తాడు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. చాలా కాలేజీల్లో ఇప్పుడు కొత్త విధానం మొదలయ్యింది. పిల్లల చెడు అలవాట్లు తల్లిదండ్రులకు చెప్పరు. మనం ప్రతి విషయం తల్లిదండ్రులకి చెప్పకూడదు సార్‌. ఈ రెండేళ్లలో పెద్ద గొప్ప తప్పు ఏం జరిగిపోదు. మనం చెప్పినా.. నా కొడుకు/ కూతురు బంగారం.. మీ కాలేజీలో చేర్చాక ఇలా తయారయ్యారు అంటారు. ఎందుకొచ్చిన తలనొప్పి. ఇది ఒక కార్పొరేట్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ స్వయంగా నాతో చెప్పిన మాట.

మరోవైపు ఈ దేశానికి డాక్టర్ల కొరత లేదు, ఇంజనీర్ల కొరత లేదు కానీ ఒక మంచి టీచర్‌ అని చెప్పబడేవారు వేళ్లపై లెక్కించవచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మధ్య నిరంతరం కనబడుతున్న వార్త ఫలానా స్కూల్లో కీచక ఉపాధ్యాయుడు అని, ఏ వృత్తిలో ఈ తప్పు చేసిన అది కీచక పనే కానీ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే పెడుతున్న టైటిల్‌ ఇది. కంటిరెప్పలా కాపాడాల్సిన టీచర్‌ ఈ దుర్మార్గానికి పాల్పడడం దారుణమైన మనస్తత్వాలను ప్రతిబింబిస్తుంది.

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజాష్‌ అహ్మద్‌ టీచర్‌గా పని చేస్తున్నారు. బుధవారం విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తూ ఉన్నారు. పక్కనే తొమ్మిదో తరగతి నుంచి విపరీతమై అల్లరి వినిపిస్తోంది. ఆయన ఆ తరగతికి వెళ్లి వాళ్లని మందలించాడు. వారిలో ఇద్దరు కవల పిల్లలున్నారు. వాళ్లిద్దరూ బాగా అల్లరి చేస్తున్నారని గుర్తించి వారిలో ఒకరిపై దెబ్బ వేశారు. అదే తన ప్రాణం తీస్తుందని ఆయన ఊహించలేదు. దెబ్బ పడ్డ వెంటనే ఆ విద్యార్థి, అతని సోదరుడు ఆయనపై తిరగబడ్డారు. మరో విద్యార్థి సైతం వారికి తోడయ్యారు. ముగ్గురూ కలిసి అహ్మద్‌పై దాడి చేశారు. ఆ కవలల్లో ఒకరి వద్ద కడియం ఉంది. దాంతో ఆయన ఎడమ కన్ను మీద కొట్టాడు. ఆయనకు గాయం కావడంతో పాటు కళ్లజోడు పగిలిపోయింది. ఉపాధ్యాయుడు.. అందరికీ పాఠాలు చెప్పే మనిషి. చుట్టూ పిల్లల మధ్యే తనపై దాడి జరిగితే తట్టుకోగలడా? నొప్పి కన్నా ఎక్కువగా అవమానం ఆయన్ని బాధించింది. అప్పటికే తోటి ఉపాధ్యాయులు వచ్చి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఆ విద్యార్థులతో ఆయనకు క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ అహ్మద్‌ దాన్ని తిరస్కరించారు. ‘సారీ’ అనే రెండక్షరాల పదం తన ఆవేదనను చల్లార్చలేదని ఆయనకు తెలుసు. వెళ్లి స్టాఫ్‌ రూంలోని కుర్చీలో కూర్చున్నారు. మళ్లీ లేవలేదు. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనోవేదనతో గుండె ఆగి మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పే ఓ ఉపాధ్యాయుడికి దక్కిన గౌరవం, జరిగిన సన్మానం ఇది. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమిటంటే, తొమ్మిదో తరగతి చదివే ఆ పిల్లలకు గంజాయి అలవాటు ఉందని సమాచారం. అయితే పోలీసులు దీన్నింకా ధ్రువీకరించడం లేదు. వాళ్లు క్లాసులో కూడా రౌడీల్లాగే ఉంటారని, అలాగే ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడతారని తోటి విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పుడు పిల్లల చదువుల మీద వాళ్ల తల్లిదండ్రులకు పెద్ద ఆశలేం లేవు. తమను ఉద్ధరిస్తారన్న పిచ్చి ఊహలు అసలే లేవు. తమ మీదకు కేసులు, కోర్టు గొడవలు తేకపోతే చాలురా దేవుడా అన్నట్లు ఉన్నారు. ఇంటర్‌కు వచ్చేదాకా వాడు గంజాయి బారిన పడకపోతే గొప్ప. డిగ్రీ దాటేదాకా పోలీసులకు చిక్కకపోతే గొప్ప. ఎవర్నీ అత్యాచారం చేయకుండా ఉంటేనో, హెచ్‌ఐవీ రాకుండా ఉంటేనో మహా గొప్ప. మనదేశంలో 35 శాతం హెచ్‌ఐవీ కేసుల్లో బాధితుల వయసెంతో తెలుసా? 15-24. మీరు నమ్మకపోయినా ఇదే నిజం. రాన్రానూ మైనర్ల నేరాల సంఖ్య పెరుగుతూ ఉంది. గంజాయి అమ్మకాలు, కొనుగోలులో కూడా వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మీ పిల్లలు వాళ్ల స్కూళ్లలో, కాలేజీల్లో ఎలా ఉంటున్నారో గమనించుకోండి. భావిభారత రౌడీలు మీ ఇంట్లో నుంచే వెళ్తున్నారేమో ఓ కంట కనిపెట్టండి. ఇక ఉపాధ్యాయుల సంగతి, వాళ్ల ప్రాణాలకు బడిలో రక్షణ లేదని తేలిపోయింది.

హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి, భర్త భాస్కర్‌, కొడుకు శ్రీతేజ్‌, కుమార్తె సాన్వికతో పాటు సంధ్య థియేటర్‌కు పుష్ప`2 ప్రీమియర్‌ షో చూడటానికి వెళ్లింది. అక్కడికి అల్లు అర్జున్‌ వస్తున్నాడనే సమాచారంతో విపరీతమైన జనం వచ్చారు. తొక్కిసలాట, ఉద్రిక్తత, పోలీసులు లాఠీఛార్జి చేసిన అదుపులోకి రాలేదు. ఫలితంగా ఆమె కన్ను మూసింది. కొడుకు చావుబతుకుల మధ్య ఉన్నాడు. అసలు ఇలాంటి ప్రీమియర్లకు కుటుంబాలతో ఆడవారితో వెళ్లొద్దని అందరూ సలహా ఇస్తారు. పైగా ఇద్దరు చిన్నపిల్లలను ఈ షోకు పట్టుకెళ్లడాన్ని ఎలా చూడాలి? తన కొడుకు అల్లు అర్జున్‌ అభిమాని అని, వాడి కోరిక తీర్చడానికి వెళ్లిన ఆ తల్లిదండ్రుల్ని ఏమనాలి? సమాజంలో ఇప్పుడు అన్నింటికంటే కష్టమైన టాస్క్‌ గుడ్‌ పేరెంటింగే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page