నిజంగా ‘ఆనందభైరవమే!!
- Guest Writer
- May 22
- 4 min read

జంధ్యాల గారు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటిలోనూ నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఈ ఆనందభైరవి . కళా తపస్వి విశ్వనాధ్ దర్శక చరిత్రలో శంకరాభరణం, సప్తపది ఎలాగో జంధ్యాలకు ఈ ఆనందభైరవి అలాంటిది.
ఈ సినిమా కేవలం నాట్య, సంగీతభరిత సినిమా మాత్రమే కాదు. వేల సంవత్సరాలుగా మనసుల్లో పాతుకుపోయిన మూఢాచారాలకు, దుస్సాంప్రదాయాలకు పాతర వేయటానికి చేసిన ప్రయత్నం కూడా.
అందువలన ఈ సినిమాను శంకరాభరణం, సప్తపది వరుసలోకి తీసుకుని వెళ్ళాలి. సాగరసంగమం , సిరిసిరిమువ్వ వరుసలోకి కూడదని నా అభిప్రాయం. ఇట్స్ ఏ మ్యూజికల్ వండర్ స్ప్లెండర్. ఓ అపురూప దృశ్య కావ్యం, ఓ కళాఖండం.
మన తెలుగు వారి నాట్యం కూచిపూడి. ఆ కూచిపూడి నృత్యాన్ని ఆడవారు ఆడకూడదని సిధ్ధేంద్ర యోగి ఆంక్ష విధించారని, అది ఆనాటి కాల మాన దేశ పరిస్థితులను బట్టి ఆ ఆంక్షను విధించి ఉంటారని నారాయణ శర్మ చేత చెప్పిస్తాడు జంధ్యాల. శిక్షణ ఇస్తే కులంతో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్న ఎవరయినా రాణిస్తారని సమాజానికి చెప్పే ప్రయత్నం ఈ సినిమా.
తన తర్వాత తన నాట్య వారసత్వాన్ని తన కుమారుడు కొనసాగించాలని శర్మ గారి ఆకాంక్ష. కడుపు నింపని ఆ కూచిపూడి నృత్యం కన్నా మామూలు చదువు చదువుకుని సుఖంగా బతకటం మంచిదని ఆ తల్లి, మేనమామల ఆలోచన.
నిస్సహాయ స్థితిలో రోడ్ల మీద సర్కస్ ఫీట్లతో కడుపు నింపుకునే ఒక దొమ్మరి పిల్లను తెచ్చుకుని ఆమెను గొప్ప నృత్య కళాకారిణిగా తీర్చిదిద్దుతారు శర్మ గారు. ఆ క్రమంలో అగ్రహారీకుల చేత బహిష్కరించబడతాడు. శర్మ గారు భార్యను త్యజించి ఊరి చివర పాక వేసుకుని ఆ దొమ్మరి పిల్లకు భైరవి అని అమ్మ వారి నామాన్ని ఇచ్చి గొప్ప నృత్య కళాకారిణిని చేస్తారు.
మాళవిక.. నృత్య పోటీలో గెలిచి తన గురువు గారిని అదే ఊరి వాళ్ళు కంకణం తొడిగి గౌరవించేలా చేస్తుంది భైరవి. తన భార్య పది మందిలో నాట్యం చేయ ఇష్టం లేని కొడుకుతో కాకుండా మరో కరటకునితో వివాహం నిశ్చయించి, పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయి ఆనందుని వివాహం చేసుకుంటుంది భైరవి. జీర్ణించుకోలేని శర్మ గారు తనువు చాలిస్తారు.
కొండముది శ్రీరామచంద్ర మూర్తి వ్రాసిన చిరుమువ్వల మరుసవ్వడి నవల ఆధారంగా నిర్మించబడిన ఈ సినిమా ఆ కధను తెరకు ఎక్కించిన విధానం అద్భుతం. ఇక్కడే ఏ దర్శకుని సృజనాత్మకత బయటపడేది. అందులో జంధ్యాల సఫలీకృతులు అయ్యారు. ముఖ్యంగా భైరవి పాత్రకు కథక్ నృత్యకారిణి మాళవికను, శర్మ గారి పాత్రకు గిరీష్ కర్నాడుని, శర్మ గారి తండ్రి పాత్రకు పుచ్చా పూర్ణానందం గారిని, శర్మ గారి భార్యగా కాంచనను ఎంపికే అసామాన్యం. ఆ పాత్రలకు సరైన ఎంపికలు.
ఈ సినిమా కొరకు యాభై ఏళ్ళు దాటిన గిరీష్ కర్నాడ్ కష్టపడి కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నాడట. ఈ సినిమా క్లైమాక్సులో యోగ మార్గం ద్వారా కపాల భేదనం పొందే సీన్లో అద్భుతంగా నటించారు. ఆ సీన్లో ఆయన ప్రదర్శించిన నాట్య నైపుణ్యం అద్భుతం.
కపాల భేదనం పొందిన మనుషులకు పునర్జన్మ లేని మోక్షం ప్రాప్తిస్తుంది అనేది సనాతన ధర్మంలో విశ్వాసం. ఆ నిష్క్రమణను ఈ సినిమాలో యోగ మార్గం ద్వారా జంధ్యాల చాలా గొప్పగా చూపారు. ఇక్కడే జంధ్యాల అపర విశ్వనాథ్ అయిపోయాడు.
ఈ సినిమాలో మరో గొప్ప పాత్ర శర్మ గారి తండ్రి పాత్ర. ఈ పాత్రను ధరించిన పుచ్చా పూర్ణానందం గారిది మా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెద కొండూరు గ్రామం . బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేసిన ఈయన తెనాలిలో ప్లీడర్ వృత్తిలో ఉంటూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. సావర్కర్ అభిమాని.
రచయిత గోపీఛంద్ సహాధ్యాయి. రంగ స్థల నటుడు అయిన వీరిని ఈ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం చేసారు జంధ్యాల. తర్వాత జంధ్యాల మరి కొన్ని సినిమాలలో కూడా చక్కని నటనను ప్రదర్శించారు.
కాంచన. కుమారుడి మీద ప్రేమ, భర్త పట్టుదల తెలిసిన ఇల్లాలి బాధ్యతల మధ్య నలిగిపోయే మహిళగా చాలా గొప్పగా నటించింది. ఈ నలుగురి తర్వాత చెప్పుకోవలసింది సుత్తి జంట , శ్రీలక్ష్మి. ఎక్కడా విసిగించకుండా ఈ ముగ్గురి హాస్యాన్ని మలిచాడు హాస్యబ్రహ్మ జంధ్యాల. ముఖ్యంగా ఈల రాణిగా శ్రీలక్ష్మి నటన ప్రేక్షకులు మరచిపోలేరు. సినిమా నడకలో చక్కటి భాగం అవుతాడు సుత్తి వీరభద్రరావు. బాగా నటించారు.
సంగీత, నృత్య ప్రధానమైన ఈ సినిమాకు ప్రాణం రమేష్ నాయుడు సంగీత దర్శకత్వ, శేషు నృత్య దర్శకత్వం. మౌనం కూడా భాషే. ఈ మౌన భాషను ఈ సినిమాలో రమేష్ నాయుడు బాగా చూపారు. సౌండ్ లేకుండా కొన్ని సన్నివేశాలు నడుస్తాయి. మౌన భాషతో పాటు శబ్దం. పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి.
ముందుగా గుర్తుకొచ్చే పాటలు పిలిచిన మురళికి వలచిన మువ్వకు ఎదలో ఒకటే రాగం అది ఆనంద భైరవి రాగం. అసలు ఈ టైటిల్ని ఎంపిక చేసుకోవటం లోనే జంధ్యాల సక్సెస్ నిండి ఉంది. హీరో పేరు ఆనంద్. హీరోయిన్ పేరు భైరవి. వెరశి ఆనందభైరవి . అది రాగం కూడా. మరోసారి హేట్సాఫ్ టు జంధ్యాల.
మరో పాట కొలువైతువా రంగశాయీ. దేవులపల్లి వారు వ్రాసిన ఈ పాట నాట్య పోటీకు చిత్రీకరించబడిరది. అద్భుతంగా ఉంటుంది. జీవన సారమంతా కలబోసిన పాట సుడిగాలిలోన దీపం కొడగొట్టిపోతే మాయం. వేదాంతాన్ని అంతా రంగరించి పోసారు ఈ పాటలో. జిత్ మోహన్ మిత్రా, కాకినాడ శ్యామల, చిరంజీవి కవితల మీద ఉంటుంది. రోడ్ మీద వేసే గారడీలో ఇంత వేదాంతాన్ని పెట్టటం, సాధారణ జనం భాషలో వ్రాయటం గొప్ప విషయం.
మరో పాట చైత్రము కుసుమాంజలి. శిష్యురాలికి నాట్యం నేర్పించే పాట. అద్భుతమైన చిత్రీకరణ. ఇలాంటిదే మరో పాట బ్రహ్మాంజలి. ఇదీ నాట్యం నేర్పే మొదట్లో వస్తుంది. గురు బ్రహ్మా అంటూ మొదలయ్యే ఈ పాటలో శర్మ గారు తన తండ్రి పాదాలకు నమస్కరిస్తే, భైరవి శర్మ గారికి నమస్కరించటం చాలా బాగా చూపారు జంధ్యాల.
క్లైమాక్స్ గీతం రా రా రా రాగమై. ఇదే కొద్దిగా సెట్, ఫిట్ కాలేదేమో అనిపిస్తుంది నాకు.
ఈ పాటల్ని వ్రాసిన వేటూరి, దేవులపల్లి, బి యల్ యన్ ఆచార్యలను, పాడిన బాలసుబ్రమణ్యం, యస్ జానకి, యస్ పి శైలజలను అభినందించాలి. సినిమా కధనానికి ప్రాణం పోసారు.
ఇతర ప్రధాన పాత్రల్లో ముఖ్యమయినది ఆనంద్ స్నేహితురాలి పాత్ర ప్రియ. రెండు జెళ్ళ సీత మహాలక్ష్మి బాగా నటించింది. చక్కటి పాత్ర. ఆమె తండ్రిగా రమణమూర్తి, దుర్భుధ్ధి స్నేహితుడు కరటకునిగా శుభాకర్ నటించారు. ఇతర పాత్రల్లో హేమసుందర్, డబ్బింగ్ జానకి, ప్రభృతులు నటించారు.
ఈ సినిమా ఔట్ డోర్ షూటింగ్ అంతా కోరుకొండలో చేసారు. ఆ గ్రామం, పరిసర ప్రాంతాల, బీచ్, వగైరాలను అన్నీ గోపాలరెడ్డి గారు బ్రహ్మాండంగా కెమేరాలో బంధించారు. కోరుకొండ విశిష్టాద్వైత సంఘం వారికి టైటిల్సులో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు జంధ్యాల. వారిదీ ప్రధాన పాత్రే సినిమాలో.
ఈ సినిమాలో నృత్యమే ప్రధానం. భైరవితో పాటు నృత్య పోటీలలో పాల్గొనే నాట్యకారుడిగా నాట్యాచార్య వెంకట రామ శర్మ మహాద్భుతంగా నర్తించారు . ముఖ్యంగా రెండో పోటీలో ఈ మహానుభావుడు, మాళవికలు తమ నాట్య విరాటాన్ని ప్రదర్శిస్తారు. హ్యాట్సాఫ్ టూ బోత్ ఆఫ్ దెమ్..సినిమాలో గిరీష్ కర్నాడ్ నాట్యాలు కూడా గొప్పగా ఉంటాయి. హ్యాట్సాఫ్ టూ శేషు.
ఇంత గొప్ప దృశ్య కావ్యానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. 11 కేంద్రాలలో వంద రోజులు ఆడిరచారు. వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ వళ్ళువార్ కొట్టంలో జరిగింది. అంతేనా ! అవార్డుల వర్షం కురిసింది. నాలుగు నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ఛాయాగ్రాహణం, ద్వితీయ ఉత్తమ కధారచన.
ఇవే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకత్వానికి కూడా. ఇవన్నీ కాకుండా ఔత్సాహిక కళా వేదికలు ఇచ్చిన పురస్కారాలు కుప్పలుకుప్పలు.
ఇంత గొప్ప దృశ్య కావ్యానికి కారణమయిన కూచిపూడి నృత్యం మన తెలుగు వారిది. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న కృష్ణా జిల్లా లోని కూచిపూడి గ్రామానిది. అలాంటి ఈ కూచిపూడి గ్రామంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని మన ప్రభుత్వం నెలకొల్పటమే ఈ నాట్యానికి మనమంతా ఇచ్చే నివాళి.
ఇంతకుముందు ఎవరయినా ఈ సినిమాను చూడకపోతే అర్జెంటుగా చూసేయండి. మన తెలుగు నాట్యానికి, సంస్కృతికి, అభ్యుదయ భావజాలానికి పెద్ద పీట వేయండి. విశ్వనాథ్ ఎంత చిరస్మరణీయుడో, ఈ సినిమా ద్వారా జంధ్యాల కూడా అంత చిరస్మరణీయుడు. ఎందరో మహానుభావులకు అందరికీ వందనములు.
సుబ్రహ్మణ్యం దోగిపర్తి
Comments