top of page

నిజంగానే ఇంగ్లిషు భాష అంత గొప్పదా!?

Writer: ADMINADMIN

ప్రపంచంలోనే అతి గొప్ప భాషగా ఇంగ్లిషు అవతరించిందా? ఇప్పటికింకా ఇంగ్లిషు భాష క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదా? ఇప్పుడు విశ్వమంతా ఇంగ్లిషు భాషనే తలదాలుస్తున్నారా అని ఆలోచిస్తూ తవ్వుతుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు విశ్వవ్యాప్త జనాభా ఎనిమిది బిలియన్లు ఉంటే అందులో 1.8 బిలియన్ల ప్రజలు ఇంగ్లిషును మొదటి భాషగానో, రెండవ భాషగానో వినియోగిస్తున్నట్టు తేలింది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష మాండారిన్‌ భాషలుగానే ప్రపంచం గుర్తించినప్పటికీ అది కేవలం చైనాలోనే మాట్లాడే ఒక ప్రాంతీయ భాషగా మాత్రమే పరిగణించాలి. ఎక్కువ జనాభా ఉన్న కారణంగా చైనాకు ఆ ఖ్యాతి దక్కినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ఆంగ్ల భాషకు దక్కిన స్థానం విలక్షణమైనది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 67 స్వతంత్ర దేశాలలో ఇంగ్లిషు భాష అధికారిక భాషగా చలామణీలో ఉండగా, మరో 27 దేశాలలో సహాయ అధికారిక భాషగా (అసోసియేట్‌ లాంగ్వేజ్‌)గా ఇంగ్లిషు రాజ్యమేలుతోంది.

అయినప్పటికీ మన దేశంలో చాలామంది ఇంకా ఇంగ్లిషు భాషను రాజరికపు భాషగానే పరిగణించడం విడ్డూరం. మనకింకా కొన్ని వాసనలు పోకపోవడమే దానికి కారణం. దాదాపు మూడు శతాబ్దాల పాటు మనల్ని పరిపాలించిన బ్రిటిషువాడు వదిలిపెట్టిన భాషగానే దానిని మనం చూస్తున్నాం గాని, జీవితపు అన్ని పార్శ్వాలలో ఆ భాష నేర్చుకున్న వారికి దక్కుతున్న ఆదరణ, ఇతరత్రా విశేషాలు తెలుసుకుంటే ఆంగ్లం పట్ల మనకున్న అపోహలు పటాపంచలవుతాయి. ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో చైనా మండారిన్‌ భాషల తర్వాత ఇప్పుడు మన హిందీ రెండో స్థానం దక్కించుకుంది. తర్వాత కొన్ని అరబిక్‌ భాషలు, స్పానిష్‌ భాషలకు స్థానాలు ఉన్నప్పటికీ అవి ఆయా ప్రాంతాలలో పెరిగిన జనాభాను బట్టి మాత్రమే ఆ స్థానంలో ఉన్నాయని గ్రహించాలి. ఇంగ్లిషు విషయం అలా కాదు. నేల నాలుగు చెరుగులా ఆ భాషను వాడడానికి కారణాలేమిటి? సాంకేతిక అంశాలలోనే కాదు, వ్యాపారం, వాణిజ్యం, ఇంటర్‌నెట్‌ తదితర రంగాలన్నింటా ఇంగ్లిషు చొరబడడానికి కారణాలేమిటి? ఎప్పటికీ అంతరించిపోని భాషగా ఇంగ్లిషు ప్రాముఖ్యం సాధించడానికి కారణాలేమిటి?

ఇంతింతై వటుడిరతై!

ప్రపంచ పటంలో ఇంగ్లండు ఎంత చిన్న దేశమో మనకు తెలిసిందే. అలాంటి ఇంగ్లండు దేశంలో వెస్సెక్స్‌ అనే చిన్న గ్రామం దగ్గర పుట్టిన ఈ ఆంగ్ల భాష దినదిన ప్రవర్ధమానమై నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిల్లింది. నిజానికి భూమి మీద భాషలన్నీ సంస్కృతం నుంచే పుట్టాయని కొందరు చేస్తున్న వాదనను భాషా శాస్త్రవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇండో జర్మన్‌ భాషలు మాత్రమే సంస్కృతం నుంచి పుట్టాయని, ఇంగ్లిషు మాత్రం కానేకాదని వారు వాదిస్తున్నారు. మాతృ అనే సంస్కృత పదం నుంచి మదర్‌ అనే ఇంగ్లిషు పదం ఉత్పన్నమైందని, పితృ నుంచి ఫాదర్‌ వచ్చిందని, భాతృ నుంచి బ్రదర్‌ వచ్చిందనే కొన్ని ఉదాహరణలతో వారు చేస్తున్న వాదనలన్నీ అడ్డుగోలువని వారి వాదన. నిజానికి గ్రీకు, లాటిన్‌ భాషలతో పాటు సంస్కృత భాష కూడా ఎన్నడో మరణించింది. ఒకప్పుడు గొప్పగా పరిఢవిల్లి, అజరామరమైన సాహిత్యాన్ని మనకు అందించిన ఈ గొప్ప భాషలు ఎలా మృతి చెందాయన్నది ఆసక్తికరమైన విషయం. ఇవెలా చనిపోయాయంటే, ఈ భాషలు కేవలం గ్రంథాలకు పరిమితమవడం వల్ల. అంటే మనుషులు మాట్లాడకపోవడం వల్ల. అంతే. సింపుల్‌గా చెప్పాలంటే మాట్లాడేవారు లేక అంతరించిపోయాయంతే.

చాలా చిన్న గ్రామంలో పుట్టిన ఆంగ్ల భాష ఇంతగా పరిఢవిల్లడానికి ఆ భాషలో పదాలు ఎంతగా విస్తరించాయో కదా, మరి అన్ని పదాలను ఇంగ్లిషు భాష ఎక్కడి నుంచి సంపాదించింది అన్నదే అసలు ప్రశ్న. ప్రతి రెండు సంవత్సరాలకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఆరేడు పేజీలకు సరిపడా పదాలను పెంచుకుంటూ వెళ్తున్నారు. సరికొత్త పదాలను అనుబంధంగా చేరుస్తూనే ఉన్నారు. అదెలా సాధ్యమవుతోంది? ఎక్కడి నుంచి ఆ పదాలను ఏరుకొచ్చి డిక్షనరీలో ప్రతిసారీ జతపరుస్తున్నారు? ఆశ్చర్యకరమైన సమాధానమేమంటే, ఈ ప్రపంచంలో దాదాపు ఆరు వేల భాషలుంటే, ఈ అన్ని భాషల నుంచి కూడా పదాలను తనలో కలుపుకొంటోంది ఇంగ్లిషు భాష. (ఇదే పని మన తెలుగు భాష చేస్తే, భాషకేదో జరిగిపోతుందని, సంకరమైపోతోందని మన భాషాప్రియులు గగ్గోలు పెడుతుంటారు. మనవన్నీ ద్వంద్వ ప్రమాణాలు). అనేక ఇతర భాషల నుంచి సేకరించి తెచ్చుకున్న పదాలను ఆంగ్లీకరణ (ఇంగ్లిషైజ్‌) చేసుకుని తన పదాలుగా చేసుకుంటూ నిరంతరం పెరుగుతూనే, విస్తృతమవుతూనే, మార్పును ఆహ్వానిస్తూనే పోతోంది. అందుకే ఈ భూమి మనుగడలో ఉన్నంత వరకూ, మనుషులు భాషతో భావ వినిమయం చేస్తున్నంత వరకూ ఇంగ్లిషు భాషకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని భాషా శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఈ కారణం వల్లనే ప్రపంచంలోని అన్ని భాషల వారూ ఇంగ్లిషును అక్కున చేర్చుకుంటున్నారు. ప్రపంచ భాషలతో పోలిస్తే తెలుగు మాట్లాడేవారు చాలా తక్కువ కదా, అయినా మన భాష నుంచి కూడా చాలా పదాలను ఇంగ్లిషు భాష అరువు తీసుకుంది. రాజు అనడానికి ఇప్పుడు ఇంగ్లిషులో కింగ్‌ అనడం మానేసి, రాజా అనే అంటున్నారు. జైలును ప్రిజన్‌ అనడం మానేసి జైలనే పిలుస్తున్నారు. మన సమోసాను అదే పేరుతో తినేస్తున్నారు. మన చీరనుంచే శారీ వచ్చిందని అంటారు. మన (ఇంటి పైకప్పు కింద సామాన్లు పెట్టుకోవడానికి వాడే) అటుకు నుంచే అట్టిక్‌ పదం వచ్చిందనీ, (గ్రామం చివర్లో తోటకు వెళ్లడానికి ఉండే సందు) గోర్జి నుంచే గోర్జ్‌ అనే పదం వచ్చిందనీ చెప్తారు. (ఇంకిపోవడం నుంచే సింక్‌ అవ్వడం, ఎవరైనా ఏదైనా అడిగితే జవాబు చెప్పకపోతే ‘నోరు విప్పలే’ అంటాం కదా, దానినుంచే ‘నో రిప్లై’ వచ్చిందని జోక్‌ చేస్తుంటాం లెండి).

విదేశ భాషలందు ఇంగ్లిషు భాష లెస్స

నేల నాలుగు చెరుగులా ఇంగ్లిషు భాష వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణాలు ఇవి కావచ్చని లింగ్విస్టులు భావిస్తారు. అంతర్జాతీయ వాణిజ్యం, డబ్బు మారకం, సాంకేతిక అభివృద్ధి ఇంగ్లిషులోనే జరగడం ఆ భాష విస్తరణకు ప్రత్యక్షంగా సహాయపడుతోన్న ప్రముఖమైన కారణాలు. ఆ భాష మిగిలిన చాలా భాషలతో పోలిస్తే నేర్చుకోవడానికి అత్యంత సులువైనది కావడం, ఆ భాషను వినియోగించడానికి అత్యంత సరళమైనది కావడం ఇతర కారణాలుగానే భావిస్తున్నారు. నిరంతరం భాష స్వరూప స్వభావాలు మారుతూనే ఉండడం వల్ల ఆ భాషకు గొప్ప ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీనివల్ల భాషకు కాఠిన్యం ఉండదు. వందల సంవత్సరాల పాటు ఒకే గ్రామర్‌ పుస్తకాలు ఉండవు. (మన తెలుగు భాష విషయం తీసుకుంటే, కొన్ని వందల సంవత్సరాల కిందట పరవస్తు చిన్నయసూరి రాసిన బాల వ్యాకరణాన్నే ఇంకా భాష వాడకానికి నిబంధనల గ్రంథంగా తీసుకుంటే భాష ఎదిగినట్టా, ఆ కాలంలోనే ఉండిపోయినట్టా?) ఇంగ్లిషు భాష విషయంలో అలా కుదరనే కుదరదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొత్త రకపు గ్రామర్‌ పుస్తకాలు పుట్టుకొస్తున్నాయి. భాషను వాడడంలో ఉండే కాఠిన్యాన్ని తొలగిస్తూ, అందరూ భాషను వాడేందుకు వీలుగా సరళీకరిస్తూ, నిబంధనలను సడలిస్తూ వ్యాకరణ గ్రంథాలు వస్తున్నాయి. దీనివల్ల ఆంగ్ల భాష కఠినం(రిజిడ్‌)గా ఉండకపోవడం కూడా భాష విస్తార వినియోగానికి మరో కారణం అవుతుంది.

చదువుకు సంబంధించిన అంశాలలోనే కాక, ఉద్యోగాలు సంపాదించే విషయంలో కూడా ఇంగ్లిషు భాష వినియోగించేవారికి చాలా మేలు చేస్తుందనే రహస్యం అందరికీ తెలిసిందే. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు చాలా అందుబాటులో ఉండే భాషగా ఇంగ్లిషుకు మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా గొప్ప పేరు. ఉదాహరణకు చైనా కమ్యూనిస్టు దేశమే అయినప్పటికీ ఆ దేశపు మల్టీ నేషనల్‌ కంపెనీలు విదేశీ విపణిలోకి రావాలని అర్రులు చాచారు. గ్లోబల్‌ బిజినెస్‌లోకి రావడానికి వీలుగా ఆ దేశంలో విద్యార్థులను ఇంగ్లిషు నేర్చుకోమని చైనా ప్రభుత్వం ప్రోత్సహించింది. వందలాదిగా చైనా యువతీయువకులు ప్రపంచమంతా ఎంఎన్‌సీలలో ఉద్యోగాల కోసం బయల్దేరారు. తమ దేశంలో నిరుద్యోగం తగ్గించడానికి, విదేశీ మారకద్రవ్యం సంపాదించడానికి ఇది పనికొచ్చిందని ఒక సందర్భంలో ఆ దేశపు సంపన్న వాణిజ్యవేత్త జాక్‌ మా ప్రస్తావించాడు. ఆ విధంగా ఒక్క చైనాలోనే కాకుండా ప్రపంచమంతా ఈ ధోరణి విస్తరించింది. విద్యా ఉద్యోగపరమైన అవకాశాలు ఇంగ్లిషు భాషకు ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచమంతా ఇంగ్లిషుకు ఆదరణ పెరిగింది. యువతీ యువకులు తప్పనిసరిగా నేర్చుకోవలసిన ఒక నైపుణ్యంగా ఆ భాషావాడకం మారింది.

లేనిపోని గొప్పలివ్వొద్దు

దీంతో మనకు తెలియకుండానే ఈ భాషకు ప్రెస్టిజ్‌ ఆపాదించబడిరది. అంటే ఆ భాష తెలిసిన వారు సమాజంలో గొప్పవారిగా, భాష పట్టుబడకపోతే విఫలమైనవారిగా చూడడం మనకు తెలియకుండానే ఒక సోషల్‌ సైక్‌గా మారింది. ఈ భాషను భావ వ్యక్తీకరణకు పనికొచ్చే ఒక పనిముట్టుగా కాకుండా, సమాజంలో మరో అంతస్తును అందించే ఒక ఆయుధం లేదా అవకాశంగా చూడడం మొదలైంది. దీనిని మనం పరిహరించగలగాలి. ఇంగ్లిషు తర్వాత అంతే సరళంగా ఉండి ఉద్యోగాలు, ఉపాధి అందించగలిగిన భాషలుగా స్పానిష్‌, జర్మన్‌, అరబిక్‌, పోర్చుగీసు, రష్యన్‌, ఫ్రెంచ్‌ భాషలు నిలుస్తున్నాయి. ఒక భాషపై పట్టు సాధించిన వారికి మిగతా భాషలు నేర్చుకోవడం సులువవుతుంది. బహుభాషలు వినియోగించగల రాజకీయ నాయకుడిగా, పండితుడిగా మన మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు గొప్ప పేరు. ఆయన అనేక భాషలు నేర్చుకోవడానికి ప్రేరణ మన జిల్లావాసి కావడం మనకు గర్వకారణం. టెక్కలి వాసి రోణంకి అప్పలస్వామి పలు భాషలు నేర్చుకోవడమే కాక, అందులో విస్తృతమైన సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారు. ఏదైనా పరభాష నేర్చుకోవడం మాతృభాషపై పట్టు సాధించడంతోనే మొదలవుతుందని యువతరం గుర్తించాలి. ఇంగ్లిషు భాష నేర్చుకోవడానికి సులువైన రహదారుల గురించి మరోసారి తెలుసుకుందాం.

- దుప్పల రవికుమార్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page