బీహార్ ఉపఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ప్రశాంత్‌కిశోర్ పార్టీ
మూడుచోట్ల డిపాజిట్లు రాలేదు
ఐప్యాక్‌ను నమ్ముకొని నష్టపోయిన జగన్
పార్టీని ఐప్యాక్ చేతిలో పెట్టిన ఫలితమే 11 సీట్లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శాస్త్రాలు చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్టు అనేక రాష్ట్రాల్లో పార్టీలను అధికారంలోకి తెచ్చారని మన నేతలు చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా అవతారం ఎత్తాక జరిగిన బీహార్ ఎన్నికలు ఆయనకు చుక్కలు చూపించాయి. రాజకీయాల్లో సలహాలు ఇచ్చి రూ.100 కోట్లు ఫీజు తీసుకునే ప్రశాంత్ కిషోర్‌కి సొంత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో 4 స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టారు. ఒక స్థానంలో డిపాజిట్ వచ్చింది, మూడు స్థానాలలో డిపాజిట్ కోల్పోయారు. దేశం అంతా సర్వేలు చేసే ప్రశాంత్ కిషోర్ తన పార్టీ పోటీ చేసిన 4 స్థానాలలో సర్వే చేయలేదా? 4 స్థానాలలో పోటీ చేస్తే అధికార పార్టీకి పోటీ ఇవ్వలేనప్పుడు ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలతో ముఖ్యమంత్రులు అయ్యారా? మరి 3 స్థానాలలో ఆయన డిపాజిట్ ఎందుకు కోల్పోయారు? బెలగంజ్ నుంచి పోటీ చేసిన మొహమ్మద్ అమ్జాద్ 17,285 ఓట్లు మాత్రమే వచ్చి మూడోస్థానంలో నిలిచారు. డిపాజిట్ కూడా కోల్పోయారు. ఇమామ్ గంజ్ నియోజకవర్గంలో పీకే అభ్యర్ధిగా పోటీ చేసిన జితేంద్ర పాశ్వాన్‌కు 37,103 ఓట్లతో మూడోస్థానం దక్కింది. రామ్‌ఘర్ నియోజకవర్గంలో సుశీల్ కుమార్ సింగ్‌కు 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ దక్కలేదు. తిరారి నియోజకవర్గంలో సురాజ్ తరఫున కిరణ్ సింగ్ పోటీచేస్తే 5,592 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. ఇవన్నీ చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలతో ప్రధానిగా మోడీ అయ్యారా? మమతాబెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారా? 230 సీట్లు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారా? 151 సీట్లు వచ్చాయా? ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారా? 134 సీట్లు వచ్చాయా? ప్రధానిగా మోడీని ముఖ్యమంత్రులుగా చేసిన ప్రశాంత్‌కిషోర్ తన పార్టీ అభ్యర్థులను ఎందుకు గెలిపించుకోలేకపోయారు?
జగన్‌మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరో అడుగు ముందుకేసి అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీని నడిపే పనిని కూడా ఆయన చేతిలోనే పెట్టి పూర్తిగా ప్రతిష్ఠ కోల్పోయారు. కేసీఆర్ పార్టీ వ్యవస్థలోకి ప్రవేశించాలని చూసిన ప్రశాంత్ కిషోర్‌ను నిర్ధాక్షణ్యంగా కాంట్రాక్టు రద్దు చేసి బయటికి పంపించారు. జగన్‌మోహన్ రెడ్డి తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అంటారు కాబట్టి తనకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్మెల్యేలు కలవలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోయాక సామాన్య కార్యకర్తలు కలవలేని పరిస్థితి ఉంది. కార్యకర్తలు అనే పదం జనరల్‌గా ఆయనకు నచ్చదు. ఐ ప్యాక్ టీమ్ అంటే ఆయనకు ఇష్టం. ఐ ప్యాక్ టీమ్ గత ఐదేళ్లు రాజకీయాలు చేసింది. ఐ ప్యాక్ టీమ్ చేసే పనులకు పెద్ద నాలెడ్జి అవసరం లేదు. పక్క పార్టీలో ఉన్న నాయకుని దగ్గరకు వెళ్లి వైకాపాలో చేరండి టికెట్ ఇప్పిస్తాం అని లాబీయింగ్ చేసి వాడి దగ్గర డబ్బులు నొక్కి, జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు వచ్చి ఫలానావాడు గెలుస్తారని ఫేక్ రిపోర్ట్ ఇచ్చారని, ఆ మేరకే జగన్మోహన్‌రెడ్డి నష్టపోయారన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఫేక్ రిపోర్టు ఇవ్వడానికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మాస్టర్ డిగ్రీలు, పీజీలు అవసరం లేదు. చివరకు ఎన్నికలకు ముందు సభల నిర్వహణ బాధ్యతను కూడా జగన్మోహన్‌రెడ్డి ఐప్యాక్ టీమ్‌కే అప్పగించారు. గడిచిన ఐదేళ్లలో భారీ ఎత్తున సొమ్ములు సంపాదించుకున్న టీమ్ సభ్యులు ఇప్పుడు పత్తా లేకుండాపోయారు.
వైకాపాలో బాస్ అయిన జగన్‌మోహన్‌రెడ్డికి, కిందిస్థాయి కార్యకర్తలకు ఎలాంటి సంబంధం ఉండదు. జగన్‌మోహన్‌రెడ్డి డిక్షనరీలో భయం అనే మాట లేదు. అలాగే కార్యకర్తలు అనే మాటా లేదు.. జగన్‌మోహన్‌రెడ్డి తన 2019-2024 పాలనలో కానీ.. ఎన్నికల ప్రసంగాల్లో ఎక్కడైనా నా కార్యకర్తలు అనే మాట జగన్ మోహన్ రెడ్డి వినిపించలేదు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వైకాపా అధినేత జగన్ ఇద్దరు నేతలు సొంత పార్టీ నాయకులను లెక్కచేయరా?.. అంటే అవుననే ఎక్కువమంది అంటారు. నాలుగు సిద్ధం సభలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగించిన జగన్‌కు వచ్చిన సీట్లు 11/175. ఏడు బహిరంగ సభలతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగించిన రాహుల్ గాంధీకి వచ్చిన సీట్లు 16/101. జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయారు. రాహుల్ గాంధీ గత పదేళ్లు నిద్రపోయి 2021లో యాక్టివ్ అయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహించి 2024 లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయ్యారు. గత ఐదేళ్లు నిద్రపోయిన జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎన్నిక అయ్యేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ రెండు భిన్న ధృవాలు, రెండు భిన్న మనస్తత్వాలు. ఇద్దరికీ ఒక కామన్ లక్షణం ఉంది.. సొంత పార్టీ నేతలకు లెక్క చేయకపోవడం. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా బుజ్జగించరు. పార్టీ మారుతారని సమాచారం ఉంటే మొహం చూడటానికి కూడా ఇష్టపడరు. నేను సీటు ఇచ్చినవాడు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు అని జగన్ అనుకుంటారు. బహుశా రాహుల్‌ది కూడా ఇదే ఫీలింగ్ అనే భావన ఉంది. అసలే అది కాంగ్రెస్. బీహార్ ఉపఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రశాంత్ కిశోర్ ఆ నెపాన్ని పూర్తిగా రాష్ట్రం మీదకు, ప్రజల మీదకు నెట్టేశారు. బీహార్ ఒక విఫల రాష్ట్రమని ప్రకటించేశారు. కానీ రెగ్యులర్ పాలిటిక్స్ చేసే జగన్మోహన్‌రెడ్డికి ఆ సదుపాయం లేదు. అంతో ఇంతో ఈవీఎంల మీద అనుమానం ఉండటం వల్ల కొద్ది రోజలు జగన్మోహన్‌రెడ్డి నెట్టుకొచ్చారు. కానీ మహారాష్ట్ర ఎన్నికలు చూసిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి మారాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తుంది.
మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏకనాథ్ షిండే లాంటి ఒక చరిష్మా లేని నాయకుడ్ని ముఖ్యమంత్రిని చేసినా, ఆయన సారధ్యంలో మరోసారి అక్కడ ఎన్డీయే కూటమి విజయం సాధించిందంటే.. అందుకు ఒకే ఒక కారణం ముఖ్యమంత్రి అయినా కూడా ఏకనాథ్ షిండే నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. కార్యకర్తల తర్వాతే పార్టీ, ప్రభుత్వమన్న రీతిలో వ్యవహరించారు.
రాజకీయ పార్టీనా? లిమిటెడ్ కంపెనీనా?
జగన్‌మోహన్ రెడ్డికి మంత్రులను, నాయకులను, కార్యకర్తలను కలవడం ఇష్టం ఉండదు. ఆయన సర్వం నేనే, నన్ను చూసి గెలిపించారనుకొనే భ్రమలో ఉన్నారు. ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖరరెడ్డే గుర్తు లేరు. 2014 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని చూసి 67 సీట్లు, 2019లో ఆయనను చూసి 151 సీట్లు, 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లు కూడా జగన్‌మోహన్ రెడ్డిని చూసి ఓట్లు, సీట్లు ఇచ్చారని ఆయనకు బాగా తెలుసు. జగన్‌మోహన్ రెడ్డి వైకాపా అనే లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఇందులో ఆయన విశ్వాసపాత్రులు అయిన వారిని డెరైక్టర్లుగా నియమించుకున్నారు.. లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు ప్రెస్‌మీట్ పెట్టి యజమాని మాటగా చెబుతారు. లిమిటెడ్ కంపెనీలో ఉన్న మిగిలిన డైరెక్టర్లు, ఉద్యోగులు తల ఉపుతూ ఉండాలి. జై జగన్, జైజై జగన్ అంటూ నినాదాలు చేస్తూ చిరిగిపోయిన చొక్కా, అరిగిపోయిన చెప్పులు కాళ్లకు వేసుకొని రోడ్లు ఎక్కి తిరుగుతూ జైలుకు వెళ్లినా, జగన్‌మోహన్ రెడ్డి వెళ్లి డిజిపిని కలవరు. పైస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయరు. మీ చావు మీరు చావండి అంటూ వైకాపా లీగల్ సెల్ ఒకదాన్ని వేసి మీడియా ముందుకు వచ్చి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ప్రకటన చేస్తారు. ఆ వైకాపా లీగల్ ఎప్పుడు ఎక్కడ పని చేస్తుందో బాధితులకు తెలియదు. బాధితులు మాత్రం తమకు తెలిసిన వారందర్నీ సాయం చేయండి అని అడుగుతున్నారు.
నేను, నాది, నేనే అనే గర్వం వదిలిపెట్టి మనం, మనది, మన అందరం అనే కలుపుగోలుతనం ఉంటే తప్ప ప్రస్తుతం రాజకీయాలు నడవవు. పార్టీ అనేది ఒక వ్యవస్థ. పార్టీ అనేది ఒక కుటుంబం. కుటుంబంలో సమస్యలుంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ఓపిక లేకపోతే మీరు ఎలాగూ వ్యాపారాలు చేస్తారు కాబట్టి వెళ్లి వ్యాపారం చేసుకుంటే పిచ్చి అమాయకులు అయిన కార్యకర్తలు నోరు మూసుకొని ఎవరి పనులు వాళ్లే చూసుకుంటారు. వ్యాపారాలు కావాలా? రాజకీయాలు కావాలా? డిసైడ్ చేసుకుంటే మంచిది.
Comments