హాలీవుడ్ సినిమాలు చూసి ఇవేవో సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయిలే అనుకోవడం సహజం. కానీ అవే నిజంగా జరిగి వాటిని నేను రిపోర్ట్ చేస్తూ విశ్లేషణ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. పుస్తకాల్లో రాసినట్లుగా నిజజీవితంలో జరుగుతాయా? మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనలని కొద్దిగా శ్రద్ధ పెట్టి గమనిస్తూ ఉంటే పుస్తకంలో రచయిత ఊహలు పూర్తిగా కాకపోయినా కొంతైనా వాస్తవం అనే అనిపిస్తాయి. కావాల్సిందల్లా కాస్తంత పరిశీలనాత్మక దృష్టి, మరి కొంచెం సహనం!

ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోస్సాద్ అచ్చం సినిమాల్లో చూపినట్లే తన ఆపరేషన్‌ని పూర్తిచేసింది.. కాదు ఇంకా చేస్తూనే ఉంది. లెబనాన్ హిజబొల్లా ` ఇజ్రాయేల్ మోస్సాద్. గత మూడు రోజులుగా లెబనాన్‌లో ఎక్కడో ఒకచోట పేలుళ్లు జరగడం, తీవ్ర గాయాలు కావడం, లేదా చనిపోవడం జరుగుతూ వస్తోంది. బాధితులందరూ హెజ్బొల్లా తీవ్రవాదులే. పేలుళ్లకి కారణం మెసేజెస్ పంపించే పేజర్లు, మొబైల్ ఫోన్లు, వాకీటాకీలు, వైర్లెస్ రేడియో సెట్లు, ఇలా కమ్యూనికేషన్ కోసం వాడే ప్రతిదీ పేలిపోతున్నాయి. ఇంతకీ హెజ్బొల్లా పేజర్లు ఎందుకు వాడడం మొదలుపెట్టింది? అఫ్కోర్స్ మొబైల్ ఫోన్లని మోస్సాద్ హ్యాక్ చేసి రహస్యంగా తమ సంభాషణలను వింటున్నదనే అనుమానంతో.
అయితే హెజ్బొల్లా అనుమానాలకు ఆధారం ఉంది. పది రోజుల క్రితం ఇరాన్ నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు లెబనాన్‌లోని హెజ్బొల్లా బేస్‌కి వచ్చాయి. అది ఇజ్రాయెల్ సరిహద్దుకు దగ్గరలో ఉండడం వల్ల ప్రమాదం అని భావించిన హెజ్బొల్లా నాయకులు ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి దూరంగా మనుష్య సంచారం లేని రెండు కొండల మధ్య దట్టమైన అడవిలో గొడౌన్స్‌కి తరలించింది. హెజ్బొల్లా మొత్తం ఆయుధాలను తరలించిన రెండు రోజుల తర్వాత ఇజ్రాయెల్‌కి చెందిన రెండు ఎఫ్-15 జెట్ ఫైటర్స్ మరో రెండు ఎఫ్-16 జెట్ ఫైటర్స్ రెండు గోడౌన్స్‌ని పేల్చివేసాయి. ఇరాన్ నుంచి వచ్చిన ఆయుధాలు మొత్తం గోడౌన్స్‌లోకి తరలించే వరకూ ఆగి ఇజ్రాయెల్ దాడిచేసింది. ఆయుధాలు, పేలుడు పదార్ధాలు పేలిపోయి రెండు రోజుల వరకూ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అంటే ఎంత భారీగా నిల్వలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఈ ఘటన తర్వాత హెజ్బొల్లా 4G, 5G లతో పనిచేసే మొబైల్ ఫోన్లని వాడడం ఆపేసింది. అంతకు నెల రోజుల ముందే ముందు జాగ్రత్తగా సెకండ్ జెనరేషన్‌వి అయిన పేజర్ల కోసం ఒక ఇరాన్‌కి చెందిన సంస్థ ద్వారా ఆర్డర్ పెట్టింది. ఇరాన్ సంస్థ తైవాన్‌కి ఆర్డర్ పెట్టింది పేజర్స్ కోసం. తైవాన్‌కి చెందిన గోల్డ్ అపోలో వీటిని సప్లై చేసింది అని మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తున్నది. అంటే ఆర్డర్ చేసిన సంస్థ ఇరాన్ దేశానికి చెందినది. అవి లెబనాన్‌కి చేరుకొన్నాక వాటిని హెజ్బొల్లా టాప్ కమాండర్స్‌తో పాటు ఫైటర్స్‌కి, కొరియర్స్‌కి ఇచ్చింది. గోడౌన్స్‌ని ఇజ్రాయెల్ పేల్చివేసిన తర్వాత మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థని పేజర్లు, వాకీటాకీలు, వైర్లేస్ రేడియోలకు పరిమితం చేసింది హెజ్బొల్లా.
ఇక్కడే ఇజ్రాయెల్‌ని తక్కువ అంచనా వేసింది హెజ్బొల్లా, ఇరాన్‌లు. 2G నెట్వర్క్ మీద పనిచేసే పేజర్స్‌ని హ్యాక్ చేయలేదని అనుకున్నారు కానీ అందులో నిజం ఉంది. కానీ ఎలా పేలిపోతున్నాయి? పేజర్స్‌లో ఉండేది ట్రిపుల్`ఎ బ్యాటరీలు. అవి పేలితే తీవ్రంగా గాయపడడం, లేదా చనిపోవడం జరగదు. అసలేం జరిగింది అంటే.. ఆర్డర్ తీసుకున్నది తైవాన్‌కి చెందిన గోల్డ్ అపోలో అయినా ఈ రోజుల్లో వాటి కోసం సమయం వృధా చేసే స్థితిలో లేదు కాబట్టి విడి భాగాలు గోల్డ్ అపోలోకి చెందిన లైసెన్స్‌డ్ సంస్థ హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఉంది. పేజర్స్‌ని పంపించి అక్కడ వాటిని అసెంబుల్ చేసి ఇరాన్‌కి డెలివరీ చేసింది. సరిగ్గా బుడాపెస్ట్‌లోనే అంతా జరిగింది. పేజర్స్‌ని అసెంబుల్ చేసే సమయంలో మోస్సాద్ వాటిలో 3 గ్రాముల నుంచి 5 గ్రాముల మధ్య బరువు ఉండే ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్స్‌ని బ్యాటరీతో కలిపి ఒక చిన్నసైజులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసింది. పేజర్స్‌లో మోస్సాద్ (మే బి ఇన్ 5 కేబీ) ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్ మోస్సాద్ నుంచి వెళ్లే కమాండ్‌తో మాత్రమే ఆ సాఫ్ట్‌వేర్ పనిచేసి బ్యాటరీ నుంచి వచ్చే పవర్ ద్వారా పేలుతుంది అన్నమాట!
ఇప్పటి వరకూ 7వేల మంది హెజ్బొల్లా ఉగ్రవాదులు పేలుళ్ల బారిన పడ్డారు. రెండు రోజుల్లో లేబనాన్, సిరియాలలో వరుస పేలుళ్లు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పేలుళ్ల వల్ల చనిపోయిన వారి సంఖ్య 47కి చేరుకుంది. దీనివల్ల ఎవరెవరు హెజ్బొల్లాకి పని చేస్తున్నారో బయటపడిరది. తోపుడు బళ్ల మీద పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునేవారు, మోటార్ గ్యారేజ్‌లో పని చేసేవాళ్లు, హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వ వాహనాలు నడిపే డ్రైవర్లు, ఇలా అన్ని రంగాల్లో పని చేసేవారు హెజ్బొల్లా నెట్‌వర్క్‌లో ఉన్నారు. వీళ్లకి పేజర్స్ ఇచ్చింది హెజ్బొల్లా. హెజ్బొల్లాకి పనిచేసే వాళ్లు మాత్రమే పేజర్స్‌ని వాడుతున్నారు కాబట్టి బాధితులు కూడా వాళ్లే. బాధితుల్లో గృహిణులు కూడా ఉన్నారు.
మరి మొదటిసారిగా పేజర్స్ పేలినప్పుడు సమాచారం మిగతా వాళ్లకి ఇచ్చి పేజర్స్‌ని దూరంగా పారేయండి అని హెజ్బొల్లా అగ్ర నాయకత్వం ఎందుకు హెచ్చరించలేకపోయిందన్న ప్రశ్న రావొచ్చు. హెజ్బొల్లా టాప్ లీడర్స్ కూడా వీటి బారిన పడి హాస్పిటల్‌లో ఉన్నారు. మొబైల్ వాడకూడదు కాబట్టి వేరే వ్యవస్థ లేదు సమాచారం ఇవ్వడానికి. అందుకే సంఖ్య 7వేలకి చేరుకుంది. బాధితుల్లో చొక్కా జేబులో పేజర్ పెట్టుకున్నవాళ్లు మరణించారు. కారణం.. జేబు గుండెకి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఎక్కువ శాతం ప్యాంటు జేబులో పేజర్‌ని పెట్టుకున్నారు కాబట్టి ప్రాణహాని జరగలేదు. కానీ పేలుడుకి టెస్టికిల్స్ (వృషణాలు) చితికిపోయినవారే ఎక్కువగా ఉన్నారు. వీళ్లు స్వర్గానికి వెళ్లినా ఉపయోగం ఉండదు.
నాకైతే పాత జేమ్స్‌బాండ్ సినిమాలో మిస్టర్ క్యూ గుర్తుకు వచ్చాడు! మిస్టర్ క్యూ తన కొత్త ఆవిష్కరణలను బాండ్‌కి చూపిస్తూ అవి ఎలా పని చేస్తాయో ట్రయల్ వేసి చూపించడం మీరూ చూసే ఉంటారు కదా!
- పొట్నూరి పార్ధసారధి
Comments