
రెండోసారి పాతపట్నం బరిలో రెడ్డిశాంతి
`ఎవరికీ కీడు చేయలేదన్న అభిప్రాయమే ఆమెకు రక్ష
`ఒక్కొక్కరుగా దరిచేరుతున్న అసంతృప్తవాదులు
`కుటుంబ సభ్యుల సహకారంతో ప్రచారం వేగవంతం
జిల్లాలో అధికార వైకాపా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అసంతృప్తి జ్వాలలు అధికంగా ఉన్న రెండు నియోజకవర్గాలు పాతపట్నం, ఎచ్చెర్ల. ఈ రెండుచోట్లా పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అభ్యర్థులను మారుస్తారని కొంతకాలం క్రితం వరకు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆయన కొనసాగించిన అభ్యర్థుల మార్పు కసరత్తు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే దాదాపు 70 నియోజకవర్గాల్లో సిటింగులను మార్చినా ఈ రెండుచోట్లా సిటింగ్ ఎమ్మెల్యేలనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా జగన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ రెండూ కాపుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలే. ప్రస్తుతం వీరికి ప్రత్యర్థులుగా ఎన్డీయే కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇద్దరూ సొంత పార్టీలోనే అసమ్మతితో ఎదురీదుతున్నారు. అసలు ఈ రెండు నియోజకవర్గాల్లో సిటింగులైన గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డి శాంతిలకు ఏ ప్రాతిపదికన టిక్కెట్ ఇచ్చారు అన్న విశ్లేషణలో మొదటి భాగం ఈ కథనం.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పాతపట్నం పూర్తిగా ఉత్తరాంధ్రలో మాత్రమే ఉండే తూర్పుకాపులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. జిల్లాలో ఎచ్చెర్ల కూడా తూర్పుకాపులకు ప్రాధాన్యతనివ్వాల్సిన నియోజకవర్గమే అయినా దాంతో పోలిస్తే ఎక్కువ శాతం తూర్పుకాపులున్న ప్రాంతం. సహజంగానే తూర్పుకాపు నాయకులు పోటీ చేస్తే ఇది గెలుపునకు ద్వారం తెరిచినట్లే అందుకే ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న పార్టీ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రతిసారీ యుద్ధం జరుగుతునే ఉంటుంది. ఈసారి కూడా సిటింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని వైకాపాలో పెద్ద ఎత్తున అసమ్మతి శిబిరాలు నడిచినా.. లోకల్, నాన్‌లోకల్ సెంటిమెంట్‌ను రగిలించినా అధికార వైకాపా రెడ్డి శాంతి వైపే మరోసారి మొగ్గుచూపడానికి కారణం ఆమె నిజాయితీయే. ఢల్లీి నుంచి పాతపట్నం వచ్చి క్యాడర్‌కు అందుబాటులో లేకుండా రాజకీయాలు చేయడాన్ని సహించలేమంటూ వైకాపాలో ఆమె సామాజికవర్గానికే చెందిన నేతలు పెద్ద ఎత్తున అధిష్టానం ముందు నిరసన తెలిపినా, ఆమెకు టికెటిస్తే ఓడిరచితీరుతామని ప్రకటించినా రెడ్డిశాంతి వైపే జగన్మోహన్‌రెడ్డి తూగడానికి ప్రధాన కారణం ఆమె అర్బన్ టైప్ పాలిటిక్సే. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని, మిగిలిన రోజులు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న ఉత్తర భారతదేశ శైలి ఆమెది. అందుకే ఎంతమంది కాదన్నా స్వయంగా జిల్లాలో సీనియర్లు, మంత్రులు ఆమె ఓడిపోతారని చెప్పినా రెడ్డి శాంతి గెలుస్తారన్న నమ్మకంతో జగన్మోహన్‌రెడ్డి మరోసారి టికెటిచ్చి తన వద్ద విధేయతకే మొదటి మార్క్ అని చెప్పకనే చెప్పారు. దీనికి తోడు పార్టీని నమ్ముకొని ఆమె చాలా నష్టపోయారని, ఇప్పుడు గెలుపు గుర్రం, అసమ్మతి మంట వంటివి పరిగణనలోకి తీసుకుంటే మానవీయ విలువలకు అర్థం ఉండదని జగన్మోహన్‌రెడ్డి భావించారు. అందుకే 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రెడ్డిశాంతికే ఈ ఎన్నికల్లోనూ అనేక ప్రతికూలతల నడుమ సీటు ఖరారు చేశారు. అంతేకాకుండా ఆమెను గెలిపించే బాధ్యతను తూర్పుకాపు నాయకులకు అప్పగించారు.
మేలు సంగతేమో గానీ కీడు చేయలేదు
రెడ్డి శాంతి టికెట్ సంపాదించడానికి ప్రధాన కారణం ఆమె నిజాయితీయే. జగన్మోహన్‌రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, చివరకు ఇసుకను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వల్ల ఎమ్మెల్యేల ఖర్చులకు కూడా డబ్బులు రావడంలేదని భావించిన జిల్లాలోని అనేకమంది నాయకులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డారు. మరికొందరు తమ అనుయాయులకు కట్టబెట్టారు. ఓవైపు జేపీ సంస్థ ఇసుక అమ్ముతుండగానే, దానికి సమాంతరంగా అనేకచోట్ల వైకాపా నాయకులు ఇసుక వ్యాపారం చేశారు. కానీ రెడ్డి శాంతి ఆ ఇసుకలోనే అడుగు పెట్టలేదు. అలాగే నియోజకవర్గంలో 2019లో టీడీపీకి పని చేసినవారిపై గానీ, ప్రస్తుతం తనను వ్యతిరేకిస్తున్న వైకాపా గ్రూపుపై గానీ ఎక్కడా కక్షసాధింపు చర్యలకు దిగలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కోసం పని చేసిన ఉపాది óహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను జిల్లావ్యాప్తంగా తొలగించారు. కానీ రెడ్డి శాంతి ఆ పని చేయలేదు. గత ఎన్నికల్లో టీడీపీకి పని చేసిన ఏ ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ జోలికి పోలేదు. ఆశావర్కర్లు తాము చెప్పినట్టు వినలేదని సాక్షాత్తు మంత్రులు, ఆ పైస్థాయి నాయకులే అనేకచోట్ల వీరిని తొలగించాలని ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు అనేకమందిని తొలగించారు కూడా. ఇటువంటి అనవసర తొలగింపులు భరించలేక కొందరు అధికారులు చేతులెత్తేస్తే, వారిపై ఆకాశరామన్న ఫిర్యాదులు చేసి వేధించారు కూడా. కానీ పాతపట్నం నియోజకవర్గం నుంచి ఇటువంటి సిఫార్సులు, కక్షసాధింపు లేఖలు లేకపోవడమే ఇప్పుడు ఆమెకొచ్చిన అడ్వాంటేజ్. మా ఎమ్మెల్యే మాకు మేలు చేశారో లేదో తెలీదు గానీ, కీడు మాత్రం చేయలేదని ఆ నియోజకవర్గంలో చాలామంది చెప్పుకోవడం ఇందుకు నిదర్శనం.
కుటుంబపరంగా నష్టపోయారన్న సానుభూతి
ఒక ఎంపీపీ ఫోన్ చేసినా రెడ్డి శాంతి లిఫ్ట్ చేయరని, నిర్దేశిత కార్యక్రమానికి సమయానికి రారని, అన్నింటికీ పీఏల పైనే ఆధారపడతారని, వారి జులుం భరించలేకపోతున్నామని చెప్పేవారే తప్ప.. ఫలానా రోడ్డు కాంట్రాక్టు రెడ్డి శాంతే తీసుకున్నారని గానీ, లేదంటే నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పర్సంటేజీలు వసూలు చేశారని గానీ, వంశధార నిర్వాసితుల ప్యాకేజీలో వాటాలు పొందారని గానీ అసమ్మతి నాయకులు సైతం చెప్పడంలేదు. బహుశా జగన్మోహన్‌రెడ్డి ఆమెపై భరోసా ఉంచడానికి ప్రధానమైన కారణం ఇదే అయివుంటుంది. దీనికి తోడు జగన్మోహన్‌రెడ్డికి రెడ్డి శాంతి కుటుంబం పై సానుభూతి ఉంది. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి ఢల్లీి నుంచి శ్రీకాకుళం గల్లీకి వచ్చిన రెడ్డి శాంతి ఆ ఎన్నికల్లో వైకాపా కోసం భారీగా ఖర్చుపెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో పాటు పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. అలా అని నెపం ఆమె మీదకు నెట్టేయకుండా జగన్మోహన్‌రెడ్డి వెంటనే ఆమెకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014లో పాతపట్నంలో వైకాపా నుంచి గెలిచిన కలమట వెంకటరమణ ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిపోవడంతో వెంటనే పాతపట్నం బాధ్యతలు చూసుకోమని చెప్పి రెడ్డి శాంతిని ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆమె పాతపట్నంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. జగన్ ఊహించినట్టుగానే ఆమె 2019లో గెలిచారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. భర్త రెడ్డి నాగభూషణం మరణించిన తర్వాత ఆమె పూర్తిగా డిప్రెషన్‌కు గురయ్యారు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలతో భర్త లేకుండా, పిల్లల జీవితాలు ఇంకా సెటిల్ కాకుండా నెట్టుకొస్తున్న సమయంలో అక్కడ పీఏలదే రాజ్యమైపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల నాటికి పీఏ వ్యవస్థను పక్కన పెట్టి నేరుగా వైకాపా క్యాడర్‌తోను, ఓటరుతోను సంబంధాలు నెరపడానికి రెడ్డిశాంతి ఇద్దరు కుమారులు రంగంలోకి దిగారు.
క్రమంగా సర్దుకుంటున్న పరిస్థితి
2014లో రెడ్డి శాంతి శ్రీకాకుళంలో అడుగు పెట్టేనాటికి భర్త ఉద్యోగంలో ఉన్నారు. పిల్లలు చదువుతున్నారు. అప్పుడు పెద్ద కుమారుడు శ్రావణ్‌తో రాజకీయాలు నడిపించారు. ఇప్పుడు శ్రావణ్‌కు తోడుగా చిన్నకుమారుడు రెడ్డి ఓం శ్రీకృష్ణ కూడా రావడంతో ఆమె ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు సోదరుడు పాలవలస విక్రాంత్, తండ్రి పాలవలస రాజశేఖరం పాతపట్నంలో కుమార్తెకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ నుంచి కలమట వెంకటరమణకు కూడా టికెట్ రాకపోవడంతో పాత చుట్టరికాలను వాడుకుంటున్నారు. మరోవైపు అసమ్మతి నేతలకు జిల్లా వైకాపా జోనల్ ఇన్‌ఛార్జి చిన్నశ్రీను సర్దిచెబుతున్నారు. ఈమేరకు నాలుగు రోజలు క్రితం పాలకొండలోని పాలవలస కల్యాణ మండపంలో పాతపట్నం వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించి రెడ్డిశాంతిని గెలిపించడం ఎంత అవసరమో వివరించారు. ఇక్కడ రెడ్డిశాంతిని ప్రధానంగా వ్యతిరేకిస్తున్న లోతుగడ్డ తులసీ వర్గంలోని ఒక్కొక్కరినీ రెడ్డి శాంతితో ప్రచారానికి పంపిస్తున్నారు. పాతపట్నం జెడ్పీటీసీ, హిరమండలం ఎంపీపీలు ఇప్పటికే రెడ్డి శాంతి గూటికి చేరినట్లు కనిపిస్తోంది. అలాగే కొత్తూరులో లోతుగడ్డ తులసీ కలిసి రాకపోతే, ఆయన్ను వ్యతిరేకిస్తున్న బైరాగినాయుడును కలుపుకొని వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఈయన వెనుక కూడా కొందరు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఉండటం గమనార్హం. రెడ్డి శ్రావణ్ గుడ్‌మార్నింగ్ పాతపట్నం అంటూ ఎన్నికల ఫీవర్ మొదలవక ముందు నుంచి ఓ కార్యక్రమం చేపట్టి ప్రజలను కలుస్తున్నారు. పాతపట్నానికి ఉన్న విచిత్రమేమిటంటే.. ఇక్కడ ఎమ్మెల్యేలే కాకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడా ఐదేళ్లకోసారి పార్టీ మార్చేస్తుంటారు. ఓటర్లు కూడా వారికి మద్దతిస్తుంటారు. అందుకే ప్రస్తుతం సిటింగులుగా ఉన్నవారికి మాత్రమే బలముందని భావించకుండా భవిష్యత్తులో పోటీ చేసి నెగ్గగలిగేవారిని సైతం రెడ్డి శాంతి కలుస్తున్నారు. నియోజకవర్గంలో 2,27,417 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు పదిసార్లు తూర్పుకాపు సామాజికవర్గానికి చెందినవారే ఎమ్మెల్యే అయ్యారు. ఎస్సీలు నాలుగుసార్లు, పోలినాటి వెలమ రెండుసార్లు, కమ్మ ఒకసారి, క్షత్రియ ఒకసారి ఎన్నికయ్యారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ ఏడుసార్లు, తెలుగుదేశం ఐదుసార్లు, వైకాపా రెండుసార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, ఎన్టీఆర్ తెలుగుదేశం ఒకసారి గెలుపొందాయి. నియోజకవర్గంలో 33.22 శాతం ఓటర్లు తూర్పుకాపులే. ఆ తర్వాత స్థానంలో కాళింగులు 11.58 శాతంతో ఉన్నారు. పోలినాటి వెలమ 10.37 శాతం, ఎస్సీ (మాల) 7.93 శాతం, సవర 7.93 శాతంతో సమానంగా ఉన్నారు. వైకాపా ఎంపీ అభ్యర్థిగా కాళింగ సామాజికవర్గానికి చెందిన పేరాడ తిలక్‌ను బరిలో నిలపడం వల్ల 11 శాతానికి పైగా ఉన్న ఈ ఓట్లు కూడా పోలరైజ్ అయితే గెలుపు అంచనాలు మారుతాయి.
Comments