top of page

నాటకాలాడుతున్నారా?

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Jun 11
  • 2 min read
  • పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చేస్తాను

  • నా బ్యాక్‌గ్రౌండ్ నీకు తెలియదు

  • నా లిమిట్ వరకు నేను ఊరుకుంటున్నాను

  • మించిపోయి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు

  • వార్డు ఎమినిటీస్ సెక్రటరీ బెదిరింపులు

  • తాజా ఆడియో కలకలం

  • సమస్య పరిష్కారానికి కాలనీవాసుల డిమాండ్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

  • మొన్నటికి మొన్న పాత టీపీఎం హైస్కూల్ రోడ్డులో వీధి దీపాలు వేయాలంటూ వార్డు ఎమినిటీస్ సెక్రటరీకి ఫోన్ చేస్తే, ఏం తిక్క తిక్కగా ఉందా? నీ వ్యవహారం పర్సనల్‌గా తీసుకోమంటావా? అంటూ వచ్చిన రిప్లై సోషల్‌మీడియాలో చక్కెర్లు కొట్టడం, తర్వాత అనేక పత్రికల్లో కథనాలు రావడం చూశాం.

  • అంతకు ముందు గొంటివీధి సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కథనాలూ చదివాం.

  • అంతెందుకు.. స్వయంగా అప్పటి మున్సిపల్ కమిషనర్ దుర్గాప్రసాద్ ప్రస్టేజియస్‌గా తీసుకొని అక్రమంగా నిర్వహిస్తున్న ఒక వేహికల్ షోరూమ్‌కు తాళాలు వేస్తే మున్సిపాలిటీకి వ్యతిరేకంగా అక్కడ ప్లానింగ్ సెక్రటరీ మినిట్ టు మినిట్ సమాచారం చేరవేసి కోర్టులో మున్సిపాలిటీకి వ్యతిరేకంగా స్టే వచ్చినట్లు వ్యవహరించిన తీరుపై కూడా కథలు కథలుగా చెప్ప్పుకోవడం మనకు తెలుసు.

ఇప్ప్పుడు తాజాగా పీఎన్ కాలనీ పరిధిలో ఉన్న సోడా లేఅవుట్‌లో (రెండో లైన్) రోడ్లు, కాలువలు నిర్మించాలని పదే పదే కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తున్న ఒక వ్యక్తికి చౌదరి సత్యనారాయణ కాలనీలో ఉన్న సచివాలయం ఎమినిటీ సెక్రటరీ తరుణ్‌కుమార్ ఇచ్చిన వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. నీ పనేదో నువ్వు చూసుకోక నాతో పెట్టుకుంటే స్టేషన్‌కు ఈడ్చేస్తానని ఒకసారి, నా బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే హడలిపోతావని అర్థం వచ్చేలా మరోసారి, ఓవరాల్‌గా సగటు పన్ను కడుతున్నవారికి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్ప్పుడు తిరుగుతోంది.

వివరాల్లోకి వెళితే..

సోడా లేఅవుట్‌లో నివసిస్తున్న రవికుమార్ అనే వ్యక్తి పీఎన్ కాలనీ రెండో లైన్‌లో ఉన్న అనేక సమస్యలపై అనేకమార్లు గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఒకసారి వీధిదీపాల కోసమైతే, మరోసారి కరెంట్ స్తంభాల కోసం, ఇంకోసారి కుక్కల బెడదపైన ఇలా ప్రజాగ్రీవెన్స్‌లో ఫిర్యాదులిచ్చి సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండో లైన్‌కు రోడ్డు, కాలువలు కావాలని ఆయన ఎప్పటినుంచో పోరాడుతున్నారు. ఈ ఒక్క సమస్య మీదే ఆయన 15 సార్లు ఫిర్యాదు చేశారంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. ఈయన బాధ పడలేకో, లేదంటే ఎమ్మెల్యే రోడ్డు లేని ప్రాంతాలకు రోడ్డు వేయాలన్న పాలసీ పెట్టుకోవడం వల్లో ఏడాది క్రితం అప్పటి ఎంఈ, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి ఎస్టిమేట్ వేయాలని సంబంధిత సచివాలయ అధికారులకు సూచించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు అటకెక్కిపోయింది. మళ్లీ గ్రీవెన్స్‌కు ఫిర్యాదు వెళ్లడంతో రెండు నెలల క్రితం అప్పటి ఎంఈ వచ్చి ఎస్టిమేషన్లు వేసి పంపించాలని అదే సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈసారి ఈ స్థానంలో ఎమినిటీ సెక్రటరీ తరుణ్ ఉన్నారు. ఫిర్యాదు ఇచ్చిన ప్రతిసారి సమస్య పరిష్కారమైపోయినట్టు ఉన్నతాధికారులకు రిప్లై ఇవ్వడంతో ఇక్కడ రోడ్డు, కాలువలు వేశారనే అంతా భావిస్తున్నారు. తీరా చూస్తే గత శనివారం వరకు సచివాలయం నుంచి ఎస్టిమేషన్లే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లలేదు. కానీ ఎస్టిమేషన్లు వేసిన తర్వాత కూడా మళ్లీ ఫిర్యాదు ఎందుకు పెట్టావంటూ రవికుమార్‌ను ఎమినిటీస్ సెక్రటరీ ఫోన్ చేసి తన బలుపు మాటల్లో ప్రదర్శించారు. ఇటీవల తాను గ్రీవెన్స్‌కు వెళ్లలేదు మహాప్రభో అని మొత్తుకుంటున్నా పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకుపోతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. సచివాలయంలో వేరే ఉద్యోగి ఆపడం వల్ల ఆగానని, ఈసారి తానేమిటో చూపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగారు. తనకు ఇదొక్కటే పని కాదని చెప్ప్పుకొచ్చిన తరుణ్‌కుమార్ ఇన్నాళ్లూ రవికుమార్ పెట్టిన గ్రీవెన్స్ మీద ఆయనకు కూడా ఎండార్స్‌మెంట్ ఇవ్వకుండా పైఅధికారులకు ఏమి రిప్లై ఇచ్చారో చెప్పాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page