top of page

నాడు అతనే ఒక సైన్యం..నేడు సకుటుంబ సపరివార సమేతం

Writer: DV RAMANADV RAMANA
  • `నాడు ఎన్టీఆర్‌ ఒంటిచేత్తో నడిపించిన పార్టీ టీడీపీ

  • `నేడు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌, భవనేశ్వరి ప్రచారం

  • `ప్రత్యేకించి మంగళగిరిలో మోహరించిన నందమూరి ఫ్యామిలీలు

  • `భార్యల ప్రచారం పాతదే అయినా ఇది మాత్రం పెద్ద విశేషమే

(రచ్చబండ)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఒక పెను సంచలనం. సినీరంగంలో తిరుగులేని స్టార్‌గా వెలుగొందిన ఎన్టీరామారావు 1982లో ఈ పార్టీని స్థాపించినప్పుడు వెటకారాలు, పెదవి విరుపులు వెక్కిరించాయి. కానీ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే రికార్డు మెజారిటీతో విజయం సాధించి 1983లో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఔరా.. అనిపించిన ఘనత ఎన్టీఆర్‌దే. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ అతనే ఒక సైన్యం అన్నట్లు వ్యవహరించారు. చైతన్యరథం ఎక్కి ఊరూవాడా తిరుగుతూ ఒంటి చేత్తో పార్టీని నడిపించారు. ఎన్నికల్లోనూ ఘనతరమైన విజయాలు నమోదు చేశారు. పార్టీలో సంక్షోభాలు తలెత్తినప్పుడు కూడా ఆయన ఒక్కరే ఎదురునిలిచి పోరాడారే తప్ప.. ఏనాడూ తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి రానివ్వలేదు. ప్రచారం పేరుతో రోడ్లు ఎక్కనివ్వలేదు. ఎన్టీఆర్‌ తన పర్యటనలకు వినియోగించిన చైతన్యరథానికి సారధిగా వ్యవహరిస్తూ ఆయన కుమారుడు హరికృష్ణ నిత్యం తండ్రి వెన్నంటే ఉన్నా ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తొలినుంచి పార్టీలో ఉన్నా అందరి మాదిరిగానే ఒక కార్యకర్తగా, నాయకుడిగానే వ్యవహరించారు. కానీ అప్పట్లో కాంగ్రెస్‌లో ఉండి, ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశంలోకి వచ్చేసిన చిన్నల్లుడు చంద్రబాబు వచ్చిన తర్వాతే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన జోక్యం పెరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత పరిణామాల్లో పార్టీ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతుల్లోకి వెళ్లినా కూడా దాదాపు అదే పంథా కొనసాగింది. ఎన్నికల్లో విజయాల కోసం పార్టీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నారా`నందమూరి కుటుంబాలను మూకుమ్మడిగా ఎప్పుడూ ప్రచారం పేరుతో రోడ్లపైకి రానివ్వలేదు. కానీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దానికి పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని గెలిచిపించడానికి, నారావారికి మళ్లీ ప్రభుత్వ పగ్గాలు అందించడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా నందమూరి కుటుంబాలన్నీ రోడ్లేక్కాయి. పార్టీ కరపత్రాలు, జెండాలు పట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతున్నాయి.

ఇప్పుడు పరిస్థితి మారింది

గత ఎన్నికల నాటివరకు ఒకలా ఉన్న పరిస్థితి.. ఈ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో తన చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరపరాజయాన్ని తెలుగుదేశం మూటగట్టుకుంది. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. దాంతో ఈ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఇప్పుడు కూడా గెలవకపోతే పార్టీ ఉనికి, చంద్రబాబు నాయకత్వానికి ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం ఈసారి మళ్లీ పాత మిత్రులైన జనసేన, బీజేపీలతో కలిసింది. ఎన్డీయే కూటమిగా ఎన్నికల బరిలో నిలిచింది. నారా`నందమూరి కుటుంబాల నుంచి చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌, శ్రీభరత్‌లు పోటీ చేస్తున్నారు. వీరిలో పార్టీ అధినేతగా చంద్రబాబు, స్టార్‌ క్యాంపెయినర్లుగా బాలకృష్ణ, లోకేష్‌లు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే.. వారు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో వారి సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి మకాం వేశారు. బాబు తరఫున నామినేషన్‌ వేయడం నుంచి అన్నీ ఆమె చూసుకుంటుండగా నారా కుటుంబీకులు ఆమెకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇక హిందూపురం బరిలో ఉన్న బాలకృష్ణ తరఫున సతీమణి వసుంధర ప్రచారం చేస్తుండగా, మంగళగిరిలో పోటీ చేస్తున్న లోకేష్‌ తరఫున ఆయన భార్య, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి విస్తృత ప్రచారం చేస్తున్నారు. విశాఖ లోక్‌సభ బరిలో ఉన్న బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు అండగా ఆయన సతీమణి ప్రచారం చేస్తున్నారు.

నారా వారసుడి కోసం..

అంతవరకు ఫర్వాలేదు గానీ.. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పోటీ చేస్తున్న మంగళగిరిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా నందమూరి కుటుంబాలవారే కనిపిస్తున్నారు. అక్కడి జనం ఈ విషయాన్ని పెద్ద విశేషంగా చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్‌ ఓడిపోయారు. రాష్ట్ర మంత్రి హోదాలో, టీడీపీలో కీలక నేత ఉన్నప్పటికీ లోకేష్‌ ఓడిపోవడం నారా`నందమూరి కుటుంబాలను తీవ్రంగా బాధించింది. పోయినచోటే వెతుక్కోవాలన్నట్లు లోకేష్‌ మళ్లీ మంగళగిరి నుంచే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన గెలుపును కాంక్షిస్తూ సతీమణి బ్రాహ్మణి అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. అయితే ఈసారి కూడా గెలవకపోతే పరువు పూర్తిగా పోతుందనుకున్నారో.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అంత సానుకూలంగా లేదనుకున్నారో గానీ ఎక్కడెక్కడో ఉన్న నందమూరి కుటుంబాలన్నీ మంగళగిరిలో వాలిపోయి లోకేష్‌ను గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత ఆయన జీవించి ఉన్నంతవరకు ఏనాడూ పార్టీ జెండా పట్టనివారు.. ఒక్క నినాదం కూడా చేయనివారు లోకేష్‌ కోసం ఈసారి మూకుమ్మడిగా రోడ్డెక్కారు. వీరంతా మంగళగిరి వీధుల్లో తిరుగుతూ, ఇంటింటికీ వెళుతూ ప్రజలను కలిసి లోకేష్‌ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీ కరపత్రాలు, మేనిఫెస్టో పత్రాలను ఇంటింటికీ పంచుతున్నారు. లోకేష్‌ను గెలిపిస్తే నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మంగళగిరిలో ప్రచారం చేస్తున్న వారిలో ఎన్టీఆర్‌ పెద్దకుమార్తె నందమూరి లోకేశ్వరి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు ఉన్నారు. అదేవిధంగా బాలకృష్ణ సోదరులు నందమూరి జయకృష్ణ, రామకృష్ణల కుమారులు, మనవళ్లు ప్రచారానికి వచ్చారు. ఆమెరికా నుంచి వచ్చిన వారు కూడా వీరిలో చాలామంది ఉండటం విశేషం. వీరంతా జెండాలు పట్టుకుని, టోపీలు పెట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతున్నారు.

కుటుంబాల ప్రచారం సాధారణమే గానీ..

ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేయడమే గతంలో లేకపోయినా.. కొంతకాలంగా అది కామన్‌గా మారిపోయింది. అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేస్తున్న వారికి మద్దతుగా వారి కుటుంబాల్లోని సభ్యులు, సంతానం ఎన్నికల ప్రచారం నిర్వహించడం దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తోంది. కానీ పార్టీ అధ్యక్షులు, ఇతర కీలక బాధ్యతల్లో ఉన్నవారు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో అధినేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారి వారసులు, భార్యలు, ఇతర సభ్యులు ప్రచారం చేయడం సహజం. ఆ క్రమంలో వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే, ఆయన పోటీ చేస్తున్న పులివెందులలో ప్రచార బాధ్యతలను సతీమణి భారతి, ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి మోస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్రంలో పర్యటిస్తుంటే కడపలో కజిన్‌ సోదరి సునీత ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీయే అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తుంటే ఆయన బరిలో నిలిచిన పిఠాపురంలో ప్రచార బాధ్యతలను సోదరుడు నాగబాబు చూస్తున్నారు. ఆ దృష్టితో చూస్తే చంద్రబాబు, లోకేష్‌ తరఫున నారా`నందమూరి కుటుంబాలు ప్రచారం చేయడం తప్పు కాదు కానీ.. వారి సతీమణులే కాకుండా నందమూరి కుటుంబాలన్నీ మూకుమ్మడి ప్రచార రంగంలోకి దూకడమే ఈ సార్వత్రిక ఎన్నికల ప్రత్యేకతగా నిలుస్తోంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page