top of page

నాడు అనారోగ్యం సాకు..ఇప్పుడు మూడు పోస్టుల సోకు!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • లెక్చరర్‌గా ఉన్న తిరుమల చైతన్యకు ఇన్ని బాధ్యతలా?

  • ఇప్పటికే డైట్‌ ప్రిన్సిపల్‌గా అదనపు బాధ్యతలు

  • తాజాగా డీఈవో, సమగ్రశిక్ష ఏపీసీగా పెత్తనం

  • బదిలీలు, ‘నాడు`నేడు’ అక్రమాలపై గతంలోనే ఫిర్యాదుల వెల్లువ

  • చర్యలు తీసుకోకపోగా.. ఇన్ని పోస్టుల అప్పగింతపై విమర్శలు


నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. మైల్డ్‌స్ట్రోక్‌ కూడా వచ్చింది. పని ఒత్తిడి కారణంగా డీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను.. అంటూ 2023 జూలై 11న తిరుమలచైతన్య పాఠశాల విద్య కమిషనరేట్‌కు ఒక అన్‌ఫిట్‌ సర్టిఫికెట్‌ పంపారు.

ఏడాది తిరిగేసరికి అదే తిరుమలచైతన్య ఇప్పుడు ఏకంగా మూడు శాఖలకు బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒక్క బాధ్యతే చేపట్టలేనని చేతులెత్తేసిన ఉద్యోగికి మూడు బాధ్యతలు అప్పగించడం విడ్డూరం.

 జిల్లాలో మరో అధికారి లేరనో లేక తిరుమల చైతన్య మాదిరిగా యాటిట్యూడ్‌ చూపించే అధికారి రారని భావించారో తెలియదు గానీ డైట్‌ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా ఉన్న తిరుమల చైతన్యనే తీసుకువచ్చి జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే చేత్తో రిలీవ్‌ అయిన సర్వశిక్ష ఏపీసీ స్థానంలో కూడా తిరుమల చైతన్యనే కూర్చోబెట్టారు. ఇలా వద్దూ వద్దూ అన్న వ్యక్తినే తెచ్చి కూర్చోబెట్టడానికి ఆయన సమర్ధత, పనితీరు మాత్రం కారణం కాదన్న విషయం విద్యాశాఖలో అందరికీ తెలుసు. ఆయన మాత్రం తాను వద్దంటున్నా ప్రభుత్వ పెద్దలు తననే నియమిస్తున్నారంటూ చెప్పుకొంటున్నారట. మైల్డ్‌స్ట్రోక్‌ వచ్చి ఒక శాఖ పని ఒత్తిడికే తట్టుకోలేకపోయిన అధికారికి ఇప్పుడు మూడు శాఖలు ఇచ్చి ప్రాణాలు తీస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అర్థం చేసుకోరూ.. అని స్వర్ణకమలంలో భానుప్రియ ప్రశ్నించినట్లు ఎవరూ అడగకపోవడం వల్లే పాపం ఆయనకు మూడు శాఖల బాధ్యతలు అప్పగించినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో డీఈవోగా చేసి ఇప్పుడు వమరవల్లి డైట్‌కు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న తిరుమల చైతన్యకు మించి తెలుగుదేశం ప్రభుత్వానికి మరో అధికారి దొరక్కపోవడం విడ్డూరం.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘నేను మారాను. మీరు చేసిన ఉద్యమాలే కారణం. మీ వల్లే ఇక్కడికి వచ్చి డీఈవోగా బాధ్యతలు చేపడుతున్నాను. అందరూ సంపూర్ణ సహకారం అందించాలి’.. గత నెల 31న డీఈవో వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో తిరుమల చైతన్య అన్న మాటలివి. అంటే.. తాను డీఈవోగా పని చేసినప్పుడు వ్యవహరించిన తీరు వల్ల ఉపాధ్యాయులు రోడ్డెక్కారని ఆయనే ఒప్పుకున్నారన్నమాట. ఇప్పుడు మారానని చెప్పడం వెనుక ప్రధాన కారణం ఇప్పుడు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నా.. పూర్తిస్థాయి డీఈవో హోదాలో కొనసాగాలని కోరుకున్నట్లు అర్థమవుతుంది. తిరుమల చైతన్యకు పరిపాలనపై అవగాహన తక్కువ. అలా అని ఎవరైనా చెబితే ఆయనలో అపరిచితుడు బయటకొస్తాడు. రాజకీయ సిఫార్సుతో నే ప్రతిసారీ డీఈవోగా వస్తుంటారు. కానీ నాయకుల సిఫార్సులు అమలు చేయాలంటే మాత్రం ఎక్కడ లేని నిబంధనలు చెబుతుంటారు. పోనీ అలా కాదు.. ఈ కారణంతో చేయొచ్చని చెబితే ఆయనకు కోపమొస్తుంది. ఆ సిఫార్సుతో వచ్చిన ఉద్యోగి పనిని జీవిత కాలంలో జరగకుండా తొక్కేస్తారు. పదవి రానంత వరకు విధేయత చూపించే తిరుమల చైతన్య రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డీఈవోలు, డైట్‌ ప్రిన్సిపాళ్లు కుదురుకున్న తర్వాత ఇక శ్రీకాకుళానికి ఎవరూ రారని నిర్ధారించుకుని అప్పుడు తన విశ్వరూపం చూపిస్తారు. అందుకే తిరుమల చైతన్య డీఈవోగా వ్యవహరించిన కాలంలో ఉపాధ్యాయ సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చి ఆయన తాట తీశాయి. డీఈవో పోస్టు ఖాళీ అయితే డైట్‌ ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తికి అదనపు బాధ్యతలు అప్పగించాలన్న ఒకే ఒక్క స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ను ఉపయోగించుకొని తిరుమల చైతన్య డీఈవో కార్యాలయానికి వస్తున్నారు. కానీ గార మండలం వమరవల్లి ప్రభుత్వ డైట్‌ కాలేజీలో తిరుమల చైతన్య సీనియర్‌ లెక్చరర్‌ మాత్రమే. ఆ కాలేజీకి సుదీర్ఘ కాలంగా ప్రిన్సిపల్‌ లేకపోవడంతో అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. టెక్కలి డిప్యూటీ డీఈవోగా ఒకసారి, శ్రీకాకుళం డిప్యూటీ డీఈవోగా రెండుసార్లు పనిచేశారు. ఒకసారి సమగ్రశిక్షలో ఏఎంవో, పీవో, ఏపీసీగా పని చేశారు. 2023లో ఏప్రిల్‌లో డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

మార్గదర్శకాలనే ఏమార్చేలా చేశారు

వైకాపా హయంలో మాజీ మంత్రి ధర్మాన చెంత చేరి పోస్టింగులు తెచ్చుకున్న తిరుమల చైతన్య ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల పంచన చేరి వారం రోజుల్లోనే రెండు జిల్లాస్థాయి పోస్టుల బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే సీనియర్‌ లెక్చరర్‌గా ఉంటూ డైట్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు మరో రెండు అదనపు తోకలు చేరాయి. రెగ్యులర్‌ డైట్‌ ప్రిన్సిపల్‌కు మాత్రమే డీఈవోగా బాధ్యతలు అప్పగించాలనే స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఉంది. కానీ ఈయన రెగ్యులర్‌ ప్రిన్సిపల్‌ కాదు. దాంతో పక్క జిల్లాలో ఉన్న రెగ్యులర్‌ డైట్‌ ప్రిన్సిపల్‌ ఎవరైనా వచ్చి ఇక్కడ డీఈవోగా చేరిపోతారని భావించి ఆ స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ను కాదని డైట్‌లో సీనియర్‌ లెక్చరర్‌కు డీఈవో ఎఫ్‌ఏసీ బాధ్యతలు ఇవ్వాలని ఉత్తర్వులు తయారు చేయించుకున్నారు. వాస్తవానికి భీమిలీ డైట్‌కు రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ ఉన్నారు. కుటుంబ, ఆరోగ్య కారణాల రీత్యా ఆర్‌జేడీ పోస్టును కాదనుకుని మరీ ఆమె భీమిలీ డైట్‌ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం చూప్తే ఆమె డీఈవోగా ఇక్కడకు రావాలి. కానీ డైట్‌ సీనియర్‌ లెక్చరర్‌ అని మార్పించుకోవడంతో తిరుమల చైతన్యకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. గత నెల 30న రాత్రి 10 గంటలకు ఆర్‌జేడీ విజయభాస్కర్‌ను ఇన్‌ఛార్జి డీఈవో నియమిస్తూ పాఠశాల విద్యా కమిషనరేట్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇది తెలుసుకున్న తిరుమల చైతన్య టీడీపీ నేతలతో ఉన్నతాధికారులకు ఫోన్‌ చేయించి జిల్లాలో విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైందని, దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పించడం ద్వారా ఆ ఉత్తర్వులను రద్దు చేయించారు. ఆ తర్వాత గతంలో ఆర్‌జేడీగా పనిచేస్తూ జిల్లాలో ఇన్‌ఛార్జి డీఈవోగా వ్యవహరించిన జ్యోతికుమారిని రెగ్యులర్‌ డీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ అది కూడా మారిపోయింది. అదే సమయంలో డీఈవో పోస్టింగ్‌ కోసం గతంలో అదనపు బాధ్యతలు నిర్వహించిన పగడాలమ్మ విశ్వప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదని తెలిసింది.

ఫిర్యాదులున్నా అదనపు బాధ్యతలు

గత ఏడాది జూన్‌లో జరిగిన బదిలీల సందర్భంగా డీఈవోగా అదనపు బాధ్యతల్లో ఉన్న తిరుమల చైతన్య పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఉపాధ్యాయ సంఘాలన్నీ నెల రోజుల పాటు ఉద్యమించాయి. బదిలీ మార్గదర్శకాలు పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్య కారణాలు చూపించినా పట్టించుకోలేదని వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన అప్పటి ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నవీన్‌ ఫిర్యాదుదారుల అభ్యర్ధనలను పరిశీలించి నోట్‌ఫైల్‌ పెట్టినా తిరుమల చైతన్య పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి కలెక్టర్‌ పిలిపించి చీవాట్లు పెట్టినా తిరుమల చైతన్యలో మార్పు రాలేదు. ‘నాడు`నేడు’లో అవకతవకలకు తిరుమల చైతన్య పాల్పడ్డారన్న ఫిర్యాదుపై సీఎంవో అధికారులు క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. నాడు`నేడు నిధులు, సిమెంట్‌, ఐరన్‌ పక్కదారి పట్టించారన్న ఫిర్యాదుపై మాజీ సీఎం జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డి అప్పటి కలెక్టర్‌ లాఠకర్‌తో విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిగితే తనపై చర్యలు తప్పవని గ్రహించిన తిరుమల చైతన్య ఆరోగ్యం సహకరించడం లేదంటూ డీఈవో బాధ్యతల నుంచి తప్పుకొన్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ తిరుమల చైతన్యపై వచ్చిన ఆరోపణలు అలాగే ఉన్నా.. అప్పటి సీఎంవో ఇచ్చిన ఆదేశాలు రద్దు కాకపోయినా డీఈవోగా, ఏపీసీగా అతనికే అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఎవరి ప్రాపకంతో డీఈవోగా వచ్చారని ప్రశ్నిస్తున్నాయి.

నాడు రోడ్డెక్కిన టీచర్లు.. ఇప్పుడూ ఆగ్రహం

వైకాపా నాయకులు ఇచ్చిన సిఫార్సు లేఖలకు న్యాయం చేసేందుకు గతంలో ఆయన కౌన్సెలింగ్‌ వ్యవస్థనే పూర్తిగా పక్కదారి పట్టించేశారనే ఆరోపణలు వచ్చాయి. వాటికి ఉదాహరణలతో బాధితులు రోడ్డెక్కారు. బదిలీల్లో మెడికల్‌ ప్రిఫరెన్షియల్‌ కేటగిరీని పరిగణనలోకి తీసుకోలేదని, బదిలీ కోరని వారికి దగ్గరి పోస్టింగ్‌లు ఇవ్వడం, ఎన్‌టైటిల్‌ పాయింట్స్‌లో నిబంధనలకు పాతరేయడం తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి. మాన్యువల్‌గా రీకౌన్సెలింగ్‌ నిర్వహించడం, ఎనిమిదేళ్లు పూర్తికాకపోయినా కొందరు మహిళా టీచర్లకు స్పౌజ్‌ పాయింట్లు కేటాయించడం ద్వారా బదిలీల ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారని తిరుమల చైతన్యపై విమర్శలు ఉన్నాయి. ఆయన అవగాహన రాహిత్యం, డబ్బుల యావ కారణంగా బదిలీ ప్రక్రియ నెల రోజుల పాటు సాగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఆయన్ను ఇన్‌ఛార్జి డీఈవో బాధ్యతల్లో కూర్చోబెట్టారో ఆ ఎమ్మెల్యే చేసిన సిఫార్సులనే నిబంధనలకు అనుకూలంగా ఉన్నా తిరుమల చైతన్య పక్కన పెట్టేశారు. కొద్దిగా ఫేవర్‌ చేయండని అడిగితే.. ఎమ్మెల్యేను ఏకవచనంతో సంభోదిస్తూ నా ముందు వాడెంత? అనే రీతిలో కొందరు ఉపాధ్యాయులను అవమానించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అపరిచితుడు సినిమాలో హీరో మాదిరిగా స్ల్పిట్‌ పర్సనాలిటీతో వ్యవహరిస్తారన్న విమర్శలున్నాయి. వాస్తవానికి వైకాపా ప్రభుత్వంలో పగడాలమ్మకు అన్యాయం జరిగింది. డీఈవోగా పని చేస్తుండగానే ఆమెను టెక్కలి డిప్యూటీ డీఈవోగా బదిలీ చేసి, ఆ తర్వాత పదోన్నతి వచ్చినా.. శ్రీకాకుళంలో పోస్ట్‌ ఖాళీ ఉన్నా ఇవ్వకుండా మన్యం జిల్లాకు పంపించేశారు. ఆమెకు సబ్జెక్ట్‌ లేకపోయినా నిబంధనల గురించి వివరిస్తే తెలుసుకునే జ్ఞానం ఉంది. ఆ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో గొడవలు లేకుండా ఆమె పని చేసుకుపోయేవారు. ఇప్పుడు రెగ్యులర్‌ డీఈవోల బదిలీల్లో మళ్లీ పగడాలమ్మను తీసుకురావడానికి మంత్రి అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. కానీ ఈలోగా తిరుమల చైతన్య ఉపాధ్యాయ సంఘాలను రోడ్డెక్కించకుండా ఉండగలరా అనేదే ప్రశ్న.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page