పూరీ జగన్నాథయాత్ర విశేషాలకు కొదవే లేదు
ఆలయం నిండా వైజ్ఞానికులకే అంతుచిక్కని రహస్యాలు
అందుకే దానికి విశ్వయాత్రగా నీరాజనాలు
ఈ ఏడాది ఉత్సవాలు ఆదివారం ప్రారంభం
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
పూరీ జగన్నాథ ఉత్సవాలు ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్రగా ప్రసిద్ధి చెందాయి. పతిత పావనుడిగా.. ఇలపై నడయాడే విష్ణుమూర్తిగా కోట్లాది భక్తులు భావించే జగన్నాథస్వామి తన సోదరుడు బలభద్రస్వామి, సోదరి సుభద్ర సమేతంగా ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ క్షేత్రంలో కొలువై పూజలందుకున్నాడు. ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు.. అంతకుమించిన నమ్మకాలకు ఆలవాలమైన జగన్నాథుని ఆలయాన్ని శ్రీమందిరంగా పిలుస్తారు. ఏడాదికోసారి జగన్నాథుడు తన సోదరి, సోదరుడితో కలిసి శ్రీమందిరం నుంచి తన అత్తగారి ఇల్లయిన గుండిచా మందిరానికి రథాల్లో వెళతారు. ప్రతిఏటా ఆషాడ శుద్ధ విదియనాడు జరిగే ఈ యాత్రను ఘోషయాత్ర అని అంటారు. శ్రీమందిరం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్లి అలిగి అక్కడే ఉండిపోయిన తన సతీమణి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడని ప్రతీతి. అత్తవారిల్లు అయిన గుండిచా మందిరంలోనే వారం రోజులు పూజలు అందుకున్న తర్వాత శ్రీమందిరానికి స్వామి తిరుగు ప్రయాణమవుతారు. దీన్ని మారు రథయాత్ర అని, బాహుదా యాత్ర అని అంటారు. ఆ తర్వాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు ధర్శనభాగ్యం కల్పిస్తారు. దాంతో రథయాత్ర పరిసమాప్తం అవుతుంది. అయితే కొన్ని శతాబ్ధాలుగా జరుగుతున్న జగన్నాథ రథయాత్ర తొలినాళ్లతో పోలిస్తే అనేక మార్పులు సంతరించుకుంది. యాత్రలో అనుసరించే సంప్రదాయాలు యథాతథంగా కొనసాగుతున్నా.. ఇతరత్రా కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు మాత్రం పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడంలేదు.
700 ఏళ్ల క్రితం వరకు ఆరు రథాల్లో..
జగన్నాథస్వామి రథయాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేవి అతిపెద్ద రథాలు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు వేర్వేరుగా మూడు రథాలు ప్రతి ఏటా కొత్తగా తయారుచేసి రథయాత్ర నిర్వహిస్తారు. కానీ చరిత్రలో ఉన్న వివరాల ప్రకారం దాదాపు 700 ఏళ్ల క్రితం వరకు రథయాత్రకు ఆరు రథాలు వినియోగించేవారట! ఈ విషయం బహుశా ఇప్పటి తరాలవారెవరికీ తెలియకపోవచ్చు. అదేంటి.. ముగ్గురు దేవుళ్లకు మూడు రథాలు సరిపోతాయి కదా! మరి ఆరు రథాలు వినియోగించడం ఏమిటన్న సందేహం కూడా కలగవచ్చు. అదెలా అంటే.. జగన్నాథస్వామి నిత్యపూజలు అందుకునే ప్రధాన ఆలయం శ్రీమందిరం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరం వరకు స్వామివార్ల రథాలు ప్రయాణిస్తాయన్న విషయం తెలిసిందే. ఈ దారి మధ్యలో బలగుండి అనే పెద్ద వాగు ప్రవహించేది. దాన్ని దాటించి స్వామివార్లను గుండిచా మందిరానికి చేర్చాల్సి వచ్చేది. అయితే రథాలు వాగు దాటలేవు. అందుకే ప్రత్యామ్నాయాన్ని నాటి యాత్ర నిర్వాహకులు ఆలోచించారు. శ్రీమందిరం నుంచి బయల్దేరే రథాల తరహాలోనే బలగండి వాగు ఆవలి తీరంలో మరో మూడు రథాలు సిద్ధం చేసి ఉంచేవారు. శ్రీమందిరం నుంచి స్వామివార్లను తీసుకొచ్చిన రథాలు వాగు ఇవతలి ఒడ్డున నిలిచిపోయేవి. రథాల్లోంచి విగ్రహమూర్తులు దించి పూజారులు, యాత్ర నిర్వాహకులు పడవల్లో ఆవలి తీరానికి తీసుకెళ్లేవారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న మరో మూడు రథాల్లో దేవతామూర్తులను ఆశీనులను చేసి గుండిచా మందిరం వద్దకు తోడ్కొని వెళ్లేవారు. మారు రథయాత్రలోనూ అదేవిధంగా చేసేవారు. ఆ విధంగా నాడు రథయాత్రకు ఆరు రథాలు సిద్ధం చేయాల్సి వచ్చేది. అయితే సుమారు 700 ఏళ్ల క్రితం పూరీని పాలించిన రాజా కేసరీ నరసింహ గుండిచా మందిరానికి వెళ్లి దారిలో ఉన్న బలగుండి వాగుపై వంతెనలాంటిది నిర్మించి రథయాత్ర ఏకధాటిగా సాగేందుకు మార్గం సుగమం చేశారు. అప్పటి నుంచే మూడు రథాలపైనే స్వామివార్లు ఏకబిగిన గుండిచా మందిరానికి వెళ్లే సంప్రదాయం ప్రారంభమైందని అంటారు.
రథం తాడు తాకడానికి పోటీ
రథోత్సవాల్లో పాల్గొనడానికి దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో హాజరయ్యే భక్తులు స్వామివార్ల రథాలు లాగడానికి పోటీపడతారు. అది వీలుకాకపోతే కనీసం రథం తాడును తాకినా చాలు అదే అదృష్టంగా భావిస్తారు. తాడు పట్టుకుని రథాన్ని లాగినా.. తాడును ఒక్కసారి తాకినా జన్మజన్మల పాపాలు పోతాయన్నది భక్తుల నమ్మిక. రథం, రథ చక్రం, తాడు ఇలా ఏ భాగాన్ని తాకినా పాపాలు తొలగిపోయి పునర్జన్మ లేకుండా మోక్షం ప్రాప్తిస్తుందని విశ్వాసం. రథోత్సవ సమయంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలతోపాటు ఆ రథాల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఆశీనులు అవుతారని, రథాన్ని తాకితే ఆ దేవతలను కూడా స్పృశించడంతో సమానంగా భావిస్తారు.
రథోత్సవం చుట్టూ అనేక నమ్మకాలు
ఇదే కాకుండా జగన్నాథ రథోత్సవం రోజు అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ప్రతి ఏటా రథయాత్ర రోజు వర్షం కురుస్తుందన్నది అటువంటి నమ్మకమే. అందుకు తగినట్లే రథయాత్ర రోజు వర్షం కురవకపోవడం అన్నది వందల సంవత్సరాల రథయాత్ర చరిత్రలో ఒక్కసారి కూడా జరగలేదు.
రథయాత్రకు ప్రతిఏటా తయారుచేసే రథాలకు వేప చెక్క మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే రథాల తయారీలో ఆధునిక ఉపకరణాలు గానీ, ఇనుము, ఇతరత్రా ఏ లోహ వస్తువులు గానీ ఉపయోగించరు. చెక్క సుత్తులు, చెక్క మేకులనే ఉపయోగిస్తారు. కొలత ప్రకారం రథాల తయారు చేయడానికి చేతి కొలతలే తీసుకుంటారు.
రథాల తయారీలో సుమారు 1400 మంది కళాకారులు పాల్గొంటారు. తరతరాలుగా కొన్ని కుటుంబాలవారే వంశ పారంపర్యంగా ఈ పని చేస్తున్నారు. మొదటి నుంచీ ఈ ఆచారం అప్రతిహతంగా కొనసాగుతోంది.
రథాలను పూర్తిగా వేపచెక్కతో తయారు చేసినప్పటికీ మూడు రథాలనూ దాదాపు 208 కిలోల బంగారు నగలతో అలంకరిస్తారు.
పూరీ రథయాత్ర ఉత్సవాన్ని ఒడిశాతో సరిసమానంగా బెంగాల్‌లోనూ నిర్వహిస్తారు. మహాప్రభు చైతన్యదేవ్ అక్కడ దీన్ని ప్రారంభించారు. దానికోసం నీలాచల్(పూరీ) నుంచి బెంగాల్ వరకు తొలి రథాలను ఊరేగింపుగా తీసుకెళ్లారని చరిత్ర చెబుతోంది.
Comments