`ప్రధాని హోదాలో ఉప ఎన్నిక బరిలో పీవీ
`ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకున్న నాటి సీఎం కోట్ల
`నామినేషన్లు వేయకుండా ఇండిపెండెంట్ల కిడ్నాప్
`ఆ గుట్టు బయటపడటంతో బజారున పడిన పరువు
`నేడు సూరత్‌లోనే అదే జరిగిందని ఆరోపణలు
`ఆ ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడే బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వరుసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ ఏకగ్రీవం రూపంలో తొలి స్థానం లభించడంతో సంబరాలు చేసుకుంటోంది. కానీ ఈ ఏకగ్రీవం వెనుక భారీ కుట్ర ఉందని, ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించడంతోపాటు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేసిన వారిని బెదిరించి బలవంతంగా రంగం నుంచి తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ రచ్చ చూస్తుంటే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు పోటీ చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికల్లో జరిగిన దారుణాలు గుర్తుకొస్తున్నాయి. ఆనాటి ఘటనలు ఈ తరం వారికి తెలియకపోవచ్చు గానీ.. ఇప్పుడు సూరత్‌లో జరిగినట్లు చెబుతున్న ఉదంతాలే అప్పటి నంద్యాల ఉప ఎన్నికలో చోటు చేసుకున్నాయి. పీవీ ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఏకైక ధ్యేయంతో నాడు నామినేషన్లు వేయడానికి వెళ్లిన ఇండిపెండెంట్లను కిడ్నాప్ చేసి బంధించారు. వారిలో కొందరు తప్పించుకోవడంతో ఆ దారుణాలు బయటపడ్డాయి. ఎన్నిక అనివార్యమైంది.

సూరత్‌లో ఏం జరిగిందంటే..
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ముకేశ్ దలాల్, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలేశ్ కుంభనీతోపాటు మరికొందరు ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లలో పరిశీలన, ఉపసంహరణ సమయంలో అనూహ్య, అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచిన వ్యక్తులు చేసిన సంతకాల్లో అవకతవకలు జరిగాయంటూ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ముందుజాగ్రత్తగా కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థి వేసిన నామినేషన్ కూడా చెల్లదంటూ తిరస్కరించారు. విచిత్రంగా ఇదే స్థానం నుంచి బరిలో నిలిచిన ఎనిమిది మంది ఇండిపెండెంట్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా బరిలో ఒక్క బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ మాత్రమే మిగిలారు. దాంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన పేరుతో జరిగిన తతంగాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఆ పార్టీ నేతలతో కుమ్మక్కై అధికారులు మోసపూరితంగా వ్యవహరించారని ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. నామినేషన్ల పరిశీలనలో కుట్ర జరిగినందున సూరత్ ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఫ్రెష్‌గా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తన నామినేషన్ చెల్లదని అధికారులు ప్రకటించిన నాటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభనీ కనిపించకుండాపోయారు. ఆయన్ను అజ్ఞాతంలో ఉంచి, బీజేపీలో చేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
నాడు నంద్యాలలో.. ఇంతకంటే దారుణాలు
సూరత్ ఏకగ్రీవ తతంగం జాతీయస్థాయిలో వివాదంగా మారింది. ఇదే సందర్భంలో 31 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఇండెపెండెంట్ల కిడ్నాప్ వ్యవహారాలను చాలామంది పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. నాడు ప్రధానమంత్రి హోదాలో పీవీ నరసింహారావు ఎంపీగా ఎన్నికయ్యేందుకు నంద్యాల ఉప ఎన్నిక బరిలో నిలిచారు. దానికి కొన్ని నెలల ముందు 1991 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచారంలో మానవబాంబు దాడికి గురై రాజీవ్‌గాంధీ దుర్మరణం చెందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ప్రధాని పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలన్న సందిగ్ధంలో ఆ పార్టీలో నెలకొంది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం మేధావి, అనుభవజ్ఞుడు, వివాదరహితుడైన పీవీ నరసింహారావు వైపు మెజారిటీ కాంగ్రెస్ నేతలు మొగ్గుచూపారు. కానీ అప్పటికే పీవీ రాజకీయ సన్యాసం ప్రకటించి, ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. అయినా సరే.. ఆయన్ను ఒప్పించి ప్రధానిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎన్నుకుంది. ఆ విధంగా పీవీ ప్రధాని పదవిని అలంకరించారు. దాంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన ఆరు నెలల్లో ఎంపీగా ఎన్నికవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తన సొంత జిల్లా అయిన కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పీవీని కోరారు. ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చూస్తామని చెప్పి మరీ ఒప్పించారు. పీవీ పోటీకి వీలుగా నంద్యాల ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత గంగుల ప్రతాపరెడ్డిని రాజీనామా చేయించారు. అలా ఖాళీ అయిన నంద్యాల లోక్‌సభ స్థానానికి 1991 అక్టోబర్‌లో ఉప ఎన్నిక నిర్వహించారు.
ఇండిపెండెంట్ల కిడ్నాప్‌లు
ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ కావడం, దాంతోపాటే నామినేషన్‌ల ఘట్టం ప్రారంభమయ్యాయి. తొలిసారి ప్రధాని పీఠం అధిష్టించిన తెలుగు నేత పీవీని గౌరవించాలన్న ఉద్దేశంతో ఆయనపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టడంలేదని అప్పటి తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీరామారావు ప్రకటించారు. దాంతో ఇతరులెవరినీ బరిలో నిలవకుండా చేస్తే పీవీ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించిన సీఎం కోట్ల తన అనుచరులను పురమాయించారు. ఆయన ఆదేశాలతో కర్నూలు కలెక్టరేట్ ముందు మకాం వేసిన కోట్ల మేనల్లుడు, అప్పటి పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, కర్నూలు మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్‌బాబు, తదితర కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో వ్యవహరించారు. నామినేషన్ పత్రాలతో కనిపించిన వారందరినీ తీసుకెళ్లి నిర్బంధించారు. అలా నామినేషన్ల ఘట్టం పూర్తి అయ్యేవరకు ఈ నిర్బంధకాండ కొనసాగించారు. అయితే వారిలో ఒక అభ్యర్థి వారి చెర నుంచి బయటపడి హైదరాబాద్ పారిపోయి అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి అభ్యర్థుల కిడ్నాప్‌ల గురించి వెల్లడిరచడంతో తీవ్ర కలకలం రేగింది. రాజకీయ రచ్చ జరిగింది. అదే సమయంలో బీజేపీ తన అభ్యర్థిగా బంగారు లక్ష్మణ్‌ను నిలబెట్టడం, దళిత ఎమ్మెల్యే మోత్కూరు నర్సింహులు కూడా నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఆ విధంగా పీవీని ఏకగ్రీవంగా పార్లమెంటుకు పంపాలన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి లక్ష్యం నెరవేరకపోగా ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారన్న చెడ్డపేరు పొందాల్సి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో పీవీ నరసింహారావు 5.80 లక్షల మెజారిటీ సాధించి కొత్త రికార్డు నెలకొల్పడం మరో చరిత్ర.
75 ఏళ్లలో 35 మంది ఎంపీలే ఏకగ్రీవం
నాటి నంద్యాల ఘటనలను గుర్తుకు తెచ్చేలా ఈ ఎన్నికల్లో సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎంపీ అయినా అదీ కొత్త చరిత్రే. గత 12 ఏళ్లలో లోక్‌సభకు ఏకగీవ్రంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ముకేశ్ దాలాల్‌తో పార్టీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ చరిత్ర సృష్టించాయి. చివరిసారిగా 2012లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్ సతీమణి డిరపుల్ యాదవ్ పార్లమెంటుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు. అయితే తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించడంతో ఆయన యూపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దాంతో ఎంపీ సీటుకు రాజీనామా చేయడంతో 2012లో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా భారత ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు సూరత్‌తో కలిపి 35 మందే ఏకగ్రీవంగా ఎంపీలైన ఘనతను సాధించారు. 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా ఏడుగురు అభ్యర్థులు పోటీ లేకుండా ఏకగ్రీవ ఎంపీలై రికార్డు సృష్టించారు. 1951, 1967 ఎన్నికల్లో ఐదుగురు చొప్పున, 1962లో ముగ్గురు, 1977లో ఇద్దరు, 1971, 1980, 1989ల్లో ఒక్కొక్కరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిక్కిం, శ్రీనగర్ స్థానాలు రెండుసార్లు ఏకగ్రీవమయ్యాయి. వైబీ చవాన్, ఫరూక్ అబ్దుల్లా, హరేకృష్ణ మహతాబ్, టీటీ కృష్ణమాచారి, పీఎం సయీద్, ఎస్‌సీ జమీర్ తదితర ప్రముఖ నేతలు ఈ జాబితాలో ఉన్నారు.
Comments