`2009లో సీఎం వైఎస్ నల్లమల కొండల్లో దుర్మరణం
`పాతతరం హెలికాప్టర్లు కావడంతోనే సమస్యలు
`ప్రతికూల వాతావరణ పరిస్థితులూ కూడా కారణమే
`ఇద్దరూ రెండుసారి ఎన్నికైన కొన్ని నెలలకే మృతి
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఆయనతోపాటు విదేశాంగ శాఖ మంత్రి సహా హెలికాప్టర్‌లో ప్రయాణించిన వారందరూ మరణించినట్లు వెల్లడిరచింది. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పొగమంచు, ప్రతికూల వాతావరణం వల్ల ఇరాన్`అజర్‌బైజాన్ పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ప్రమాద ప్రాంతాన్ని గుర్తించిన ఇరాన్ రక్షణ దళాలు ఆ ప్రాంతంలో గాలింపు జరిపి హెలికాప్టర్ అవశేషాలను, దేశాధ్యక్షుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్, మరో పదిమంది మరణించారు. ఈ దుర్ఘటన సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక ఘోర దుర్ఘటనను గుర్తు చేస్తోంది. 2009 ఎన్నికల్లో వరుసగా రెండోసారి కాంగ్రెస్‌ను గెలిపించి, మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్ని నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చిత్రమేమిటంటే ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడి మృతికి, అప్పుడు వైఎస్ దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్లు ఒకే కంపెనీ తయారు చేసినవే. అలాగే ఇద్దరు నేతలూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతూ ప్రమాదానికి గురి కావడం మరో విశేషం.
ప్రారంభోత్సవానికి వెళ్లి వస్తూ..
ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన డ్యామ్‌ను ప్రారంభించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్, మరికొందరు ఉన్నతాధికారులు అమెరికాకు చెందిన బెల్ కంపెనీ తయారు చేసిన బెల్ 212 రకం చాపర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అజర్‌బైజాన్ పర్వత ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో అది కూలిపోయింది. దాంతో అందులో ఉన్న మొత్తం 10 మంది ఈ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలాన్ని గుర్తించడం చాలా కష్టమైంది. ఫలితంగా అధ్యక్షుడి జాడ, క్షేమ సమాచారం తెలియక ఆయోమయ, ఆందోళనకర పరిస్థితి ఏర్పడిరది. చివరికి ఆ ప్రాంతాన్ని గుర్తించి రక్షణ, సహాయ బృందాలు అక్కడికి చేరుకోవడంతో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా ఆయనతో ఉన్న వారందరూ మరణించారని ధ్రువపడిరది.
15 ఏళ్ల క్రితం ఇదే తరహాలో..
ఈ చాపర్ ప్రమాదంతో 15 ఏళ్ల క్రితం మన రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనకు అనేక సారుప్యతలు కనిపిస్తున్నాయి. నాడు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ చిత్తూరు జిల్లా పర్యటనకు హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లి మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురై మరణించారు. ప్రస్తుత నంద్యాల జిల్లాలోని దట్టమైన నల్లమల అరణ్య ంలో నల్లకాలువ సమీప కొండల్లో వైఎస్ ప్రయాణిస్తున్న చాపర్ కూలిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే నాటి ప్రమాదానికి కారణంగా నిర్థారించారు. అప్పుడు కూడా ప్రమాదం జరిగిన 14 గంటల తరువాత గానీ రెస్క్యూ బృందాలు అది కూలిన ప్రదేశాన్ని, శిథిలాలను గుర్తించలేకపోయాయి. ఇప్పుడు కూడా ప్రమాదం జరిగిన 18 గంటల తరువాతే ఎక్కడ కుప్పకూలిందో గుర్తించగలిగారు. అలాగే నాడు వైఎస్‌ఆర్, నేడు ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రైసీని పొట్టనబెట్టుకున్నవి ఒకే కంపెనీకి చెందిన హెలికాప్టర్లు కావడం గమనార్హం. నాడు వైఎస్‌ఆర్‌ను పొట్టన పెట్టుకున్నది బెల్ 430 రకం హెలికాప్టర్ కాగా, నేడు ఇరాన్ అధ్యక్షుడి మరణానికి కారణమైన చాపర్ బెల్ 212 రకం కావడం విశేషం. ఇద్దరు నాయకులూ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తరువాతే ప్రమాదాల్లో మరణించారు.
మృత్యు విహంగాలు
పాతతరానికి చెందిన బెల్ కంపెనీ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బెల్ హెలికాప్టర్ల ప్రమాదాలు చాలానే జరిగాయి. ఎందరో మరణించారు.
`1982 సెప్టెంబర్ 14న బెల్ 212 హెలికాప్టర్ నార్త్ సీలో కుప్పకూలడంతో ఆరుగురు మరణించారు.
`1986 జూన్ 18న బెల్ 206 రకం హెలికాప్టర్ గ్రాండ్ కాన్యాన్ ఫ్లైట్‌ను ఢీకొనడంతో ఐదురుగు దుర్మరణం చెందారు.
`1990 ఆగస్టు 27న బెల్ 206 రకం హెలికాప్టర్ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
`1991 ఏప్రిల్ నాలుగున బెల్ 412 రకం హెలికాప్టర్ ఫిలడెల్ఫియాలో కుప్పకూలడంతో 5 మంది సిబ్బంది మృతి
`2006 డిసెంబర్ 10న బెల్ 412 రకం హెలికాఫ్టర్ కాలిఫోర్నియాలో కూలిపోవడంతో ముగ్గురు మరణించారు.
`2009 మార్చి 25న బెల్ 206 హెలికాప్టర్ టర్కీలోని కేస్ పర్వతాల్లో కుప్పకూలి ఆరుగురు మరణించారు.
`2009 సెప్టెంబర్ రెండో తేదీన బెల్ 430 హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కుప్పకూలి నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ మరణించారు.
`2016 జూలై ఆరో తేదీన బెల్ 525 హెలికాప్టర్ ఇటలీలో కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందారు.
`2018 జనవరి 17న బెల్ యూహెచ్-1 హెలికాప్టర్ మెక్సికోలో కుప్పకూలి ఐదుగురి మరణానికి కారణమైంది.
Comments