నెత్తిన ఇన్‌ఛార్జి కిరీటం..చేతిలో గ్లాస్ భారం!
- ADMIN
- Apr 26, 2024
- 3 min read
`తెలుగుదేశంలో కొత్త పోకడ
`పొత్తులో జనసేనకు వెళ్లిన సెగ్మెంట్లకు కొత్త ఇన్‌ఛార్జీలు
`టికెట్ ఆశించి భంగపడినవారికే ఆ అవకాశం
`దాంతోపాటే ఆ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యత వారిపైనే
`సందిగ్ధంలో అసంతృప్తి నేతలు

ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా జనసేనకు ధారాదత్తం చేయాల్సి వచ్చిన నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలను టీడీపీ అధినేత చంద్రబాబు మార్చారు. దీనికి తోడు ఆయన నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించే బాధ్యతను వారిపైనే పెడుతూ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో ప్రచారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఈ భారాన్ని మోయడానికి సిద్ధపడటంలేదని భోగట్టా. అయితే తొలిసారి టికెట్ ఆశించినవారు మాత్రం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి రాగానే ఎమ్మెల్యే అయిపోయినట్లు ఫీల్ అవుతుండగా, మిగిలినవారు మాత్రం జనసేన అభ్యర్థిని గెలిపించే పూచీ తమది కాదని బహిరంగంగానే చెబుతున్నారు.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం టికెట్‌ను మామిడి గోవిందరావుకు ఇచ్చి అక్కడ టికెట్ ఆశించి భంగపడిన కలమట వెంకటరమణకు ఏకంగా జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. ప్రజాగళం కార్యక్రమానికి పాతపట్నం వచ్చిన చంద్రబాబునాయుడు.. పార్టీ అభ్యర్థి గోవిందరావును గెలిపించి తీసుకురావాలని కలమట రమణను కోరినా ఆయన ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం కావడంతో అక్కడి టీడీపీ కాపు నాయకులు పడాల భూదేవికి టికెటివ్వాలని చంద్రబాబుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. కానీ చంద్రబాబు ఆ సీటును పొత్తులో జనసేనకు కేటాయించి సిటింగ్ టీడీపీ ఇన్‌ఛార్జిని ఆ పార్టీలోకి పంపి గ్లాస్ గుర్తుపై పోటీకి అవకాశం కల్పించారు. పాలకొండను జనసేనకు కేటాయించాం కాబట్టి తన చేతిలో ఏమీ లేదని చెప్పిన టీడీపీ అధినేత మాటలు విని పడాల భూదేవి కూడా జనసేన కండువా కప్పుకున్నారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో ఆమెను తెలుగుదేశం పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. నిమ్మక జయకృష్ణ గెలుపు బాధ్యతను నెత్తికెత్తుకోవాలని సూచించారు. చివరి నిమిషం వరకు ఇక్కడ టికెట్లు మారుస్తారని చూసినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు జనసేనలో ఉన్న భూదేవికి టీడీపీ ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. ప్రధానమైన కాపు నాయకులంతా టీడీపీతో ఉన్నా, జయకృష్ణను మాత్రం వ్యతిరేకించారు. కానీ ఇక్కడ టీడీపీ గుర్తుమీద పోటీ చేసే అవకాశం లేకపోవడంతో వారంతా మిన్నకుండిపోయారు. కానీ ఓటర్లు మాత్రం జనసేనతో ముందడుగు వేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. స్వయంగా ఈ నియోజకవర్గంలో బలమైన కాపు సామాజికవర్గ నేత సామంతుల దామోదర్ సొంత గ్రామం పనుకువలసలో వంద కుటుంబాలు జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు జైకొట్టాయి. దీంతో నెమ్మదిగా ఒక్కొక్క నేత దృక్పథంలోనూ మార్పు రాబోతోందని అర్థమవుతోంది.

నాయకుడితో తమకు సంబంధం లేదని, పార్టీ నిర్దేశించినవారికి ఓటేస్తామనే ఓ కొత్త ధోరణి ఇరుపార్టీల్లోనూ ఈ ఎన్నికల్లో కనిపిస్తోంది. దీనికి ప్రధానమైన కారణం.. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుడు అనే స్థాయిని పూర్తిగా చంపేశారు. ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీలో కూడా అదే కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా పెందుర్తి టికెట్టును కూడా జనసేన నాయకుడు పంచకర్ల రమేష్‌కు కేటాయించారు. ఇక్కడ టికెట్ ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి చివరి నిమిషంలో మాడుగుల నుంచి పోటీ చేసేందుకు బీ ఫారం ఇచ్చారు. కానీ 2019 తర్వాత అక్కడ గండి బాబ్జీ టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. గతంలో పరవాడ ఎమ్మెల్యేగా చేసిన గండి బాబ్జీకి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో పెందుర్తిలో పోటీ చేసే అవకాశం టీడీపీ ఇస్తుందని భావించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఇక్కడ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌ను గెలిపించే బాధ్యత గంజి బాబ్జీ భుజాలపై వేస్తూ ఆయన్ను టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. గండి బాబ్జీకి ఉన్న ఓటుబ్యాంకు, బండారు సత్యనారాయణ మూర్తికి ఉన్న ఓటుబ్యాంకు కలిపి జనసేన అభ్యర్థి రమేష్‌కు పోలరైజ్ చేయాలని ఆ పార్టీ నిర్దేశించింది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలైన సీతంరాజు సుధాకర్ ఆ తర్వాత టీడీపీ గూటికి చేరారు. దీనికి కారణం ఆయనకు దక్షిణ విశాఖ నుంచి టీడీపీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరగడమే. కానీ ఇక్కడ అదే వైకాపా నుంచి వచ్చి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్‌ను బరిలో నిలిపారు. కాబట్టి ఇప్పుడు సీతంరాజు సుధాకర్‌ను విశాఖ సౌత్ ఇన్‌ఛార్జిగా నియమించి గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్న వంశీకృష్ణను గెలిపించాలని పార్టీ కోరుతోంది. విశాఖ సౌత్‌లో గతంలో ద్రోణంరాజు శ్రీనివాస్ గెలుపొందారు. ఈయన బ్రాహ్మణ కులానికి చెందినవారు కాగా.. సీతంరాజు సుధాకర్ కూడా అదే సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వంశీకృష్ణను గెలిపించడం కోసం సుధాకర్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ ఇన్‌ఛార్జిగా వర్మ ఉన్నందున రానున్న రోజుల్లో జనసేన పోటీ చేస్తున్న మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టికెట్ ఆశించినవారికి ఇన్‌ఛార్జీ కిరీటం పెట్టి , గెలుపు బాధ్యతలు అప్పగించడానికి తెలుగుదేశం సిద్ధపడుతోంది.
రాష్ట్రంలో మళ్లీ వైకాపాయే అధికారంలోకి వస్తుందని భావిస్తున్నవారు ఎంతమంది ఉన్నారో, తెలుగుదేశం కూటమి గెలుస్తుందన్నవారు కూడా అంతేమంది ఉన్నారు. అధికారానికి ఈ రెండు పార్టీలు సమాన దూరంలో ఉండటంతో చంద్రబాబునాయుడు చెప్పినట్లు ఇన్‌ఛార్జిగా ఉంటూ జనసేన అభ్యర్థులను గెలిపించుకోవడమా, లేదంటే వైకాపా అభ్యర్థికి పరోక్షంగా మద్దతు తెలపడమా అనేదాన్ని టికెట్లు దక్కని టీడీపీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించడం వల్ల భవిష్యత్తులో తామే అభ్యర్థులమవుతామని భావిస్తే, అక్కడ జనసేన అభ్యర్థులకు వెనుక నుంచి దెబ్బేస్తారు. లేదూ అభ్యర్థులను గెలిపించుకుని వెళితే తమకు గుర్తింపు ఉంటుందని ఆలోచిస్తే గెలుపు కోసం పని చేస్తారు. ఏది ఏమైనా రాష్ట్రంలో స్థానిక నాయకుడి వెనుక ఓటరు లేడు. ఈ ఎన్నికలు కేవలం జగన్మోహన్‌రెడ్డికి, చంద్రబాబునాయుడుకు మధ్యే జరుగుతున్నాయి.
Comments