top of page

నేతిబీరలో నెయ్యి.. మండలిలో పార్టీరహితం ఒకటే

Writer: ADMINADMIN
  • మండలి ఎన్నికల్లో పార్టీల ప్రమేయం అవసరమా!

  • సలహాలిచ్చే సరుకున్న ఎమ్మెల్సీలు ఎక్కడ?

  • ప్రజాకంటక బిల్లులు అడ్డుకుని ఎన్నేళ్లయింది?

  • గవర్నర్‌ కోటాలోనూ నామినేట్‌ అవుతున్న అనర్హులు

చట్టాలు చేయడానికి శాసనసభ్యులు కావాలి. కానీ ఆ శాసనసభ్యుడు సభకు ఎన్నికవ్వాలంటే మన దేశంలో చట్టం మీద అవగాహన ఉండాలని గాని, లేదూ అది చదివి ఉండాలని గాని నిబంధన లేదు. కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన శాసనసభ్యులు ఎన్నికవుతున్నారు కాబట్టి వీరు చేసిన తప్పుఒప్పులను ఎత్తిచూపేందుకు, సరిదిద్దేందుకు మేథావులతో కూడిన సమాంతర వ్యవస్థ కూడా ఒకటుండాలని భావించి అన్ని వర్గాలకూ అందులో చోటు కల్పించడానికి ఏర్పాటు చేసుకున్నదే శాసనమండలి. ఇప్పుడు అది కూడా కులాలు, మతాలు కోటాలో చేరిపోగా, దురదృష్టమేమిటంటే.. ఎమ్మెల్యేగా తిరస్కరించినవారిని సైతం ఎమ్మెల్సీగా పంపి జబ్బలు చరుచుకుంటున్నారు. మేథావులు కూర్చోవాల్సిన చోట పార్టీ నాయకులు తిష్ట వేస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఎంపిక లేదా ఎన్నిక జరగాల్సిన చోట ఒక్క పార్టీ గుర్తు మినహాయించి అన్నింటిలోనూ రాజకీయ పార్టీల ప్రమేయం కనిపిస్తుంది. అందుకే శాసనసభలో అధికార పక్షం ఓకే చేసిన బిల్లుకు శాసనమండలిలో అభ్యంతరాలు చెప్పిన సందర్భాలు ఈమధ్య కాలంలో కనిపించడంలేదు. అందుకు కారణం.. మండలి కూడా రాజకీయ మంటల్లో కాలిపోయింది. క్వాలిటీ పడిపోయింది. ఇటువంటప్పుడే మేథావుల సభలో పార్టీల ప్రమేయం అవసరమా? అనిపించకమానదు.

ప్రతీ దేశానికి ఒక రాజ్యాంగమంటూ ఉంటుంది. అది ఆ దేశంలో నివశించే ప్రజలందరికీ సామాజిక న్యాయం కల్పించాలి అంటోంది. అదే విధంగా పాలనాధికారం కేవలం కొన్ని వర్గాల సొత్తు కాదని, వివిధ వర్గాల ప్రజల నిష్పత్తిని బట్టి ఆ వర్గాలకి కూడా పాలనాధికారంలో సమన్యాయం కల్పించాలని నొక్కి వక్కాణిస్తోంది. అచ్చం ఇలాంటి ఉన్నత భావాలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం రాశారు. నిజమే కదా! మరి ఇప్పుడేమయింది? అని మీరనవచ్చు. అక్కడికే వస్తున్నాను.

ఇటీవల అంటే.. ఫిబ్రవరి 27న మన రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సుమారు ఏడెనిమిది లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరేమయిందీ? ఈ ఎన్నికల రోజున పోలింగ్‌ సెంటర్ల వద్ద ఘర్షణలు జరగడం, అక్కడ కూడా రిగ్గింగ్‌ ఆరోపణలు వినడం నూతన విషసంస్కృతికి తెర లేచిందా అనిపిస్తుంది. కొంతమంది విజ్ఞుల అభిప్రాయం ప్రకారం కొన్నిచోట్ల ఘర్షణలను గమనిస్తే జనరల్‌ ఎన్నికలను తలపించాయి. జరిగింది రెండు పట్టభద్రుల స్థానాలకు, ఒక ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక. కానీ పాలకులు ఈ ఎన్నికలను ఎందుకింత సవాలుగా తీసుకుంటున్నారు? నిజానికి గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా రంగాలలో విశేష కృషి చేసినవారు పోటీ చేయాలి. కానీ రాజకీయ పార్టీలు చొరబడి పోటీ చేయడం ప్రజాస్వామ్యవాదులుగా ఆలోచించడానికి, చూడటానికి కూడా బాగోలేదు. ఎప్పుడైతే ఇలాంటి ఎన్నికల్లో రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా పాల్గొంటుందో ధన ప్రవాహం పోటెత్తుతుందనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

శాసనసభలో చట్టాలు అవుతాయి, వాటిలో ఏవైనా లోపాలుంటే చెప్పండి అంటూ ఈ బిల్లులు శాసనమండలికి వెళతాయి. ఒకవేళ శాసనసభ పంపిన వాటిని మండలి అంగీకరించవచ్చు లేదా తిరస్కరించనూవచ్చు. అయినా శాసనసభ చట్టం చేసుకొని పోవచ్చును. కానీ శాసనసభ దుందుడుకుగా ఉంటే, దానిని నిరోధించి సక్రమ మార్గాన పెట్టే అనుభవశాలి శాసనమండలి. మరి శాసనసభల్లోలాగే శాసనమండలిలో కూడా ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు దిగిపోతే వారిని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థుల వల్ల అవుతుందా? రాజకీయ పార్టీలు, నాయకులు దీనిపై కాసింత సీరియస్‌గానే ఆలోచించాలి.

ప్రస్తుతం మన శాసనమండలిలోని 58 స్థానాలలో 50 స్థానాలు ఎన్నికలు జరిగేవి కాగా, మిగిలిన 8 స్థానాలు గవర్నర్‌ కోటాలో భర్తీ చేస్తారు. గవర్నర్‌కు కూడా ప్రభుత్వమే పేర్లను పంపుతుంది.

సాధారణంగా ఈ పేర్లు కలిగినవారు ముఖ్యంగా ఉన్నత మానవతా మూర్తులుగా ఉండాలి. ఏదో ఒక సేవారంగంలో నిస్వార్థంగా సేవ చేస్తున్నవారయి ఉండాలి. కానీ నేడు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం కలిగినవారిని సైతం గవర్నర్‌ కోటాలో నియమించిన సందర్భాలున్నాయి. మీకు గుర్తుందా? తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం గవర్నర్‌ కోటాకి గాను పంపిన వ్యక్తులలో ఒకరిని అప్పటి గవర్నర్‌ తమిళ సై తిరస్కరించారు. ఆ వ్యక్తి ఏ రంగంలో సేవ చేశారో చెప్పండి.. అని అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ నాయకులు (ఎవరు అధికార పార్టీలో ఉన్నప్పుడు వారు) తమ అభ్యర్థులకు పదవులను పంచిపెట్టే ప్రాతిపదికనే దీనిని భావిస్తున్నారు. నీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించకపోతే ఎమ్మెల్సీ చేసేద్దాం అంటూ శాసనమండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తుండటం శోచనీయం. నిన్నటి గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఒక చోట పోటీ చేస్తున్నవారికి పరోక్ష మద్దతునివ్వడం, మరోచోట ప్రత్యక్షంగానే పోటీకి దిగిపోవడం బడిత ఉన్నవారిదే బడి అన్నట్లుగా ఉంది.

శాసనమండలి ప్రధానోద్దేశం కొంతవరకయినా కళంకాలు అంటని వారిని ఒడిసి పట్టుకోవడం. కానీ నేడు రాజకీయ పార్టీలే తమ అభ్యర్థులను బరిలో దింపడం (శాసనసభల్లో అత్యధిక మెజారిటీ ఉన్నప్పటికీ) బాధించే విషయం. నిజానికి ఎమ్మెల్సీ ఓటర్లు పరిమిత సంఖ్యలో ఉంటారు. ఏ రంగానికి చెందిన ఎన్నికయితే, ఆ రంగానికి సంబంధించిన వ్యక్తులనే, ఆ రంగాలకు చెందిన ఓటర్లు ఎన్నుకోవాలి. అది నైతికత. కానీ ఒకసారి ఎమ్మెల్సీ అయితే, ఆరేళ్లు పదవీ కాలంలో ఉండొచ్చు. మంచి జీతభత్యాలు, ప్రభుత్వానికి నచ్చితే ఇటునుంచే మంత్రి కావచ్చు.. ముఖ్యమంత్రీ కావచ్చు అనే ఆలోచనలు తప్పించి వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, టంగుటూరి ప్రకాశం, లాల్‌బహదూర్‌ శాస్త్రి లాంటి మేరుపర్వతాల చెంతన చేరదామన్న ఆలోచన లేదు.

నలిగిపోయిన ఒక పంచె, లాల్చీలతో కూడిన చేతిసంచితో వావిలాల, పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన పుచ్చలపల్లి, తాను చనిపోయే నాటికి కనీసం తన అంత్యక్రియలకు పావలా కూడా దాచుకోని ప్రకాశం, హోంలెస్‌ హోంమినిస్టర్‌ లాల్‌ బహదూర్‌ శాస్త్రిలు కూడా ఇదే నేలపై నడిచారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే బతికారు. ఇకనైనా వారి అడుగుజాడల్లో నడుద్దాం. లేకపోతే చనిపోయిన వారి ఆత్మలు రోధిస్తాయి.. ప్లీజ్‌..!

- హిస్టరీ రఫీ సార్‌
- హిస్టరీ రఫీ సార్‌


 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page