top of page

నంది అవార్డుల పునరుద్ధరణకు రంగం సిద్ధం!

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • Jun 26
  • 1 min read

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నంది అవార్డులు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవార్డుల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నంది అవార్డుల పునరాగమనానికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో పెండింగ్‌లో ఉన్న అవార్డుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ ఫిల్మ్ వంటి విభాగాల్లో ప్రకటించాల్సిన పాత అవార్డుల ప్రక్రియను ఒకేసారి పూర్తి చేసి, ఆ తర్వాత 2025 నుంచి కొత్త విధానంలో క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వడం మంచిదని సూచించారు. ఈ ప్రతిపాదనకు బాలకృష్ణ సైతం పూర్తి మద్దతు ప్రకటించినట్లు సమాచారం.

పాత వైభవం తిరిగి వచ్చేనా..?

తెలుగు సినిమా చరిత్రలో నంది అవార్డులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం నుంచి లభించే అత్యున్నత గౌరవంగా దీనిని భావిస్తారు. అలాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోవడం సినీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ‘గద్దర్ అవార్డుల’ను ప్రకటించడమే కాకుండా, రెండు సార్లు అవార్డుల ప్రదానోత్సవాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ నంది అవార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని సినీ పరిశ్రమ కోరుకుంటోంది.

ప్రస్తుతం వినిపిస్తున్న సంకేతాల ప్రకారం.. మరో ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి నంది అవార్డులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత వివాదాలను పక్కనబెట్టి, అవార్డుల ప్రదానోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహిస్తే నందీ అవార్డులకు పాత వైభవం తిరిగి రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page