బీజేపీతో పొత్తు పేరుతో మేనేజ్ చేస్తున్న టీడీపీ
`కొందరికి కమలం టికెట్లు రాకపోవడానికి జగనే కారణమని తిరిగి ఆరోపణలు
`బలంగా ఉన్న నియోజకవర్గాలను పొత్తు పేరుతో వదులుకున్నదెవరు?
`ఆయా సీట్లలో తమవారినే బీజేపీ అభ్యర్థులుగా నిలబెట్టిందెవరు?
(రచ్చబండ)
` డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి
దేశంలో భారీ కుంభకోణాలకు పాల్పడిన చాలామంది బడాబాబులకు ఇప్పుడు కమలం పార్టీ సేఫ్‌జోన్‌గా మారింది. కర్ణాటకలో రూ.35వేల కోట్ల మైనింగ్ స్కామ్ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి మొన్న కమలం గూటికి మళ్లీ చేరారు. మహారాష్ట్రలో రూ.70వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్ నిందితుడు ఎన్డీయేలో భాగస్వామి అయ్యారు. బెంగాల్‌లో రూ.2,500 కోట్ల శారదా చిట్స్ కుంభకోణం నిందితుడు బీజేఎల్‌పీ నాయకుడయ్యారు. అసోం ఓటర్ స్కామ్ నిందితులూ బీజేపీ నాయకులే. గుజరాత్‌లో రూ.25వేల కోట్ల అక్రమ మద్యం వ్యాపారం చేసిన చోటా ఉదేపూర్ మాఫియా కాషాయ కండువా కప్పుకుంది. మొన్నటికి మొన్న లిక్కర్ స్కామ్ నిందితుడు రూ.51 కోట్ల ఎన్నికల బాండ్లు కొని బీజేపీకి సమర్పించాడు. ఆ తర్వాతే ఆయన బెయిల్‌పై బయటికొచ్చాడు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కామ్ నిందితులు ఆ పార్టీలోనే చక్రం తిప్పుతున్నారు. జార్ఖండ్‌లో బొగ్గు కుంభకోణంలో దోషిగా తేలిన వ్యక్తి భార్య బీజేపీలో చేరి ఆ రాష్ట్రం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలో భాగస్వామి అయ్యారు. ఇంతగా బీజేపీతో కలిసిపోయినవారే ఇప్పుడు కొందరికి ఆ పార్టీ టికెట్లు దక్కకపోవడానికి వైకాపా అధినేత జగన్ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత, ప్రస్తుత ఎన్నికల్లో జరిగిన పరిణామాలను చాలామంది ప్రస్తావిస్తూ వాటికి సమాధానం చెప్పగలరా?.. ఎవరు ఎవరిని మేనేజ్ చేస్తున్నారో వీటితో తేలిపోవడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదో వింత ట్రెండ్
తెలుగుదేశం కూటమిలో ఇప్పుడో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కూటమి పార్టీల్లో టికెట్ దక్కని అభ్యర్థులు దానికి జగనే కారణమని నిందిస్తున్నారు. మొన్నటికి మొన్న రఘురామకృష్ణంరాజు(ఆర్‌ఆర్‌ఆర్) తనకు టికెట్ రాకుండా జగన్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. పొత్తు కారణంగా అనపర్తి సీటును బీజేపీకి ఇచ్చేయడంతో అవకాశం కోల్పోయిన టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా తనకు టిక్కెట్ రాకుండా జగనే అడ్డుకున్నారని నిందారోపణ చేశారు. నవ్వుతారన్న జ్ఞానం కూడా లేకపోవడం విడ్డూరం. ఇప్పుడంటే జగన్ అడ్డుకున్నారనుకోవచ్చు గానీ 2014లో ఆర్‌ఆర్‌ఆర్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నదెవరు? అప్పట్లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ను హడావుడిగా టీడీపీ నుంచి బీజేపీలో చేర్పించి పొత్తులో భాగంగా నర్సాపురం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నించింది ఎవరు? దీన్ని పసిగట్టి బీజేపీ అధిష్టానం గోకరాజుకు టిక్కెట్ ఇచ్చింది ఎందుకు? ఇప్పుడు నర్సాపురం బీజేపీ ఎంపీ టికెట్ దక్కించుకున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ 2009లోనే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే ఇందులో జగన్ ఇవ్వడానికేముంది. 20 ఏళ్లుగా బీజేపీలో ఉన్న శ్రీనివాసవర్మకు విధేయత ప్రాతిపదికన టికెటిస్తే ఆర్‌ఆర్‌ఆర్‌కు టికెట్ రాకుండా జగన్ అడ్డుకోవడం ఎలా అవుతుంది. ఢల్లీి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌ల ప్రోటోకాల్ చూసిన ఆర్‌ఆర్‌ఆర్ బీజేపీలో కనీస సభ్యత్వం లేకుండానే టిక్కెటివ్వాలంటే ఎలా కుదురుతుంది? చంద్రబాబు బెయిల్ కోసం లోకేష్ ఢల్లీి వచ్చినప్పుడు, పవన్ కల్యాణ్ ఢల్లీి వెళ్లిన ప్రతిసారీ ఆర్‌ఆర్‌ఆర్ ఇంట్లోనే ఉన్నప్పుడు నిందించాల్సింది ఎవర్ని?
త్యాగాల్లోనూ సొంత స్వార్థమే
` తెలుగుదేశం బీజేపీతో పొత్తుపెట్టుకొని ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచేసిందన్న ఉద్యమం ఇప్పుడు రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతోంది. అయితే ఈ ఏడ్పులు, గోలలు కొన్నిచోట్ల మాత్రమే. తెలుగుదేశం పుట్టిన తర్వాత ఎచ్చెర్లలో రెండుసార్లు మాత్రమే ఆ పార్టీ ఓడిపోయింది. అంత బలమైన సీటును బీజేపీకి వదిలేసి కమ్మ అభ్యర్థికి కట్టబెట్టారు. బీజేపీలో ఉన్న చంద్రబాబు కులం వారికే సీటు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరూ మాట్లాడటంలేదు. అదే బద్వేలులో కథ మరోలా ఉంది. అక్కడ వంతాల సురేష్ అని ఒక కార్యకర్త ఉన్నారు. 2021 ఉపఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు 21వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పొత్తులో బీజేపీకే దక్కిన ఆ నియోజకవర్గంలో బొజ్జ రోశన్న అనే టీడీపీ కార్యకర్తకు బీజేపీ అభ్యర్థిత్వం కట్టబెట్టారు. అయినా ఎవరూ నోరు మెదపడంలేదు. ధర్మవరంలో 2019 ఎన్నికల తర్వాత వరదాపురం సూరి బీజేపీకి వెళ్లిపోతే అక్కడ పార్టీని పరిటాల కుటుంబం నడిపింది. యనమల కుటుంబంలో మూడు టిక్కెట్లిచ్చినా, వైకాపా నుంచి వచ్చిన వేమిరెడ్డికి రెండు సీట్లు ఇచ్చినా, ధర్మవరంలో కనీసం పట్టు లేని సత్యకుమార్‌కు సీటిచ్చినా ఎవరూ మాట్లాడటంలేదు. ఆదోనిలో పార్టీ ఏర్పడిన నాటి నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ ఒకటి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీనాక్షినాయుడు ఉండగా పొత్తు పేరుతో ఆ సీటును బీజేపీ కట్టబెడితే.. కనీసం డిపాజిట్‌లో పదో వంతు ఓట్లు కూడా సాధించలేని బీజేపీకి ఇస్తే ఎవరూ మాట్లాడటంలేదు. కానీ అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అన్యాయం చేసి బీజేపీ కార్యకర్తకు అవకాశం ఇచ్చినందుకు మాత్రం నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇక్కడ బీజేపీ టిక్కెట్ తెచ్చుకున్నవారు కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి.
సీనియర్ల సీన్ చినిగిపోయె..
` తెలుగుదేశం పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడానికి చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో త్యాగాలు చేయాల్సి వచ్చింది. 1983 నుంచి టీడీపీతో ఉన్న దేవినేని కుటుంబానికి ఈసారి సీటు దక్కలేదు. కోడెల కుటుంబానికి కూడా ఈ ఎన్నికల్లో సీటు లేదు. కళా వెంకట్రావుకు మొదటిసారి పార్టీ టిక్కెట్ దక్కనిది ఈ ఎన్నికల్లోనే. మాగంటి బాబుదీ అదే పరిస్థితి. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌కు ఈసారి టిక్కెట్ దక్కలేదు.
ఆ 22 మంది గల్లంతు
` 2014లో వైకాపా తరఫున గెలిచి చంద్రబాబు కొనుగోళ్ల బేరంతో వెళ్లిపోయిన 22 మంది అడ్రస్‌లు ఈ ఎన్నికల నాటికి పూర్తిగా గల్లంతయిపోయాయి. 2019 ఎన్నికల్లో కూడా అద్దంకి ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ గెలవడంతో 2024లో ఆయనకు మళ్లీ టీడీపీ సీటిచ్చింది. మిగిలినవారు మంత్రులుగా చేసినా, ఎంపీలుగా చేసినా ఈసారికి అడ్రస్‌లు లేకుండాపోయారు.
Comments