నిధులున్నా సౌకర్యాలు సున్న
రిమ్స్ వైద్య కళాశాలలో సమస్యల తిష్ఠ
క్యాంటీన్‌లో భోజనం నోట్లో పెట్టలేం
తాగే నీటికి పాదయాత్ర తప్పనిసరి
హాస్టల్‌కు విద్యుత్ సరఫరా బంద్
స్నానాలు, చదువులకు కొద్దిరోజులుగా సెలవ్

రిమ్స్ సర్వజన అసుపత్రి, మెడికల్ కళాశాల బ్రాండ్ ఇమేజ్‌ను అధికారులే దెబ్బతీస్తున్నారు. దేశంలో టాప్ 50 జాబితాలో ఉన్న రిమ్స్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించడానికి దేశంలో అనేక రాష్ట్రాలకు చెందిన విద్యుర్థులు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆలిండియా మెడికల్ కౌన్సిల్ నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారా అనేక మంది ఉత్తర, దక్షణ భారతదేశంకు చెందిన విద్యార్ధులు రిమ్స్‌లో చేరుతున్నారు. 2007లో 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైన రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రస్తుతం పీజీ స్థాయికి చేరింది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించడానికి చేరిన విద్యార్ధులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. కళాశాల నిర్వహణకు, విద్యార్ధులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కేటాయించే నిధులను ఖర్చు చేయకుండా వెనక్కు జమ చేసే అధికారులు ప్రస్తుతం కళాశాలను పర్యవేక్షిస్తున్నారు. కళాశాలకు గతంలో డైరెక్టర్ పోస్టు ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రిన్సిపల్ పోస్టుగా మార్చేశారు. రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ హృద్రోగ వైద్యనిపుణుడిగా అనుభవం కలిగిన వ్యక్తి ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నా వైద్య విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడంలేదని ఆరోపణలు ఉన్నాయి.
బాయ్స్ హాస్టల్‌లో విద్యుత్ కష్టాలు
రిమ్స్ వైద్య కళాశాలలో విద్యను అభ్యసించే మొదటి ఏడాది విద్యార్ధులకు వసతి కల్పిస్తున్న బాయ్స్ హాస్టల్‌లో కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. రెండు నెలల క్రితం నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్ధులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లినా సమస్యకు పరిష్కారం చూపించలేదు. విద్యార్ధులు రోజులు తరబడి స్నానాలు చేయకుండా ఉండాల్సి వస్తుందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్ధమవుతుంది. ప్రిన్సిపల్‌కు సమస్యను విన్నవించిన ప్రతిసారీ చేసేద్దాం, అయిపోద్ది అని చెప్పి విద్యార్ధులను పంపించేస్తున్నారు. బాయ్స్ హాస్టల్‌లో విద్యార్ధులు మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ కోసం ఆస్పత్రికి వెళుతున్నారు. ఓల్టేజ్ సమస్య వల్ల ఫ్యాన్లు తిరగడం లేదు. మొదటి ఏడాది నుంచి నాలుగో ఏడాది వరకు మొత్తం 200 మంది విద్యార్ధులు బాయ్స్ హాస్టల్స్‌లో ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. గర్ల్స్ వసతిగృహంలో పరిస్థితి ఏమిటో వేరేగా చెప్పనక్కర్లేదు. సమస్యను కుటుంబ సభ్యులకు చెప్పడానికి అమ్మాయిలు సాహసించడం లేదు. ఒకవేళ కళాశాలలో ఉత్పన్నమవుతున్న దారుణాలు వెలుగులోకి వస్తే విద్యార్ధులను టార్గెట్ చేసి ప్రాక్టికల్స్ మార్కుల్లో కోత పెట్టి ఇబ్బంది పెడతారని భయం వైద్య విద్యార్ధుల్లో ఉంది.
ఆహారం సరఫరాలో వ్యత్యాసం
ఈ సమస్యతో పాటు కళాశాలలో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి నాలుగో ఏడాది విద్యార్ధులంతా ఒక క్యాంటీన్‌లో భోజనం చేయాలి. రెసిడెంట్ డాక్టర్లు, పీజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ఆహారం పంపిణీ చేస్తున్నారు. విద్యార్ధులకు అక్కడ క్యాంటీన్ నిర్వాహకులు ఏది పెడితే అది తినాలి. ఆహారం బాగులేదని ప్రత్యేక క్యాంటీన్లో భోజనం చేయడానికి అవకాశం లేదు. ప్రతి నెల మెస్‌కు రూ.3,600 బిల్లు కట్టి అక్కడ వారు పెట్టే ఆహారం తినలేక, రిమ్స్ బయటకు వచ్చి తింటున్నారు. వైద్య విద్యార్ధులు, రెసిడెంట్ డాక్టర్లు, పీజీ విద్యార్ధులు ఒకే మొత్తాన్ని అంటే రూ.3,600 నెలకు చెల్లిస్తున్నా వేర్వేరు క్యాంటీన్లు ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. వైద్యవిద్యార్ధుల కోసం ఏర్పాటుచేసిన క్యాంటీన్‌ను మూడో ఏడాది వైద్య విద్యను బోధించే ప్రొఫెసర్ కాంట్రాక్ట్ తీసుకొని సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సీనియర్ విద్యార్ధులు జూనియర్లను ఫుడ్‌పై కంప్లైయింట్ పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. కంప్లైయింట్ పెడితే మూడో ఏడాది వైద్య విద్యను భోదించే ప్రొఫెసర్ కాబట్టి సమస్యలు ఎదురవుతాయని హితబోధ చేస్తున్నారని తెలిసింది. దీంతో క్వాలిటీ ఆహారం అందక విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారని సమాచారం. మధ్యాహ్నం కేవలం ఒక గంట మాత్రమే భోజన విరామ సమయం కాబట్టి కళాశాల బయటకు వచ్చి ఆహారం తినే అవకాశం కూడా లేదు.
నీటిని కొనుక్కొని తాగుతున్నారు
తగినంత పౌష్టికాహారం అందకపోతే చదువును ఎలా కొనసాగించగలమన్న ఆలోచనతో వైద్యవిద్యార్ధులు సతమతమవుతున్నారు. బాయ్స్ వసతి గృహంలో తాగేందుకు నీరు అందుబాటులో లేదంటే నమ్మశక్యం కాదు. విద్యార్ధులే బయట నుంచే వాటర్ బాటిల్స్ కొనుక్కొని తెచ్చుకుంటున్న పరిస్థితి. లేదంటే ఇద్దరు ముగ్గురు విద్యార్ధులు కలిసి 20 లీటర్ల వాటర్ కేన్స్ తెచ్చుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో కాలేజీకి వెళ్లిన సమయంలో అక్కడ నుంచి హాస్టల్‌కు వచ్చినప్పుడు బాటిల్స్‌లో డ్రిరకింగ్ వాటర్ నింపుకొని వారి వెంట తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్ధులు చదువుపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని తెలిసింది. కాలేజీ నుంచి హాస్టల్‌కు వెళుతూనే అక్కడ సమస్యలను గుర్తుకుతెచ్చుకొని డీలా పడిపోతున్నారు. కాలేజీలో ఉన్న మరో విచిత్రం ఏమిటంటే.. మొదటి ఏడాది విద్యార్ధులు వారి గదుల్లోనే చదువుకోవాలి. రెండు నుంచి నాలుగో ఏడాది విద్యార్ధులు మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్, లైబ్రేరీలో చదువుతారు. ఇక్కడ మొదటి ఏడాది విద్యార్ధులు చదవడానికి వీళ్లేదు. ఈ రూల్ రిమ్స్ అధికారులు పెట్టారో? సీనియర్ విద్యార్ధులు పెట్టారో తెలియదు. హాస్టల్ లైబ్రరీలో మొదటి ఏడాది విద్యార్ధులకు ఎంట్రీ లేదంటే నమ్మశక్యం కాదు. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం చూపించడంలేదని తెలిసింది.
విద్యార్ధుల చందాలతో ల్యాప్‌టాప్
ఈ ఏడాది అదనంగా 50 సీట్లు పెంచడంతో ఒక్క క్లాసులో 200 మంది విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సి వస్తుంది. దీనికోసం తరగతి గదిలో ఏర్పాటుచేసిన ఆడియో, వీడియో సిస్టమ్స్ పాడైపోయాయి. అయినా వాటినే వినియోగిస్తున్నారు. వీటిని మార్చాలని ప్రిన్సిపల్‌కు విన్నవిస్తే కనెక్టెడ్ ల్యాప్‌టాప్ పాడైందని, దీన్ని మీరే కొనుగోలు చేసుకోవాలని విద్యార్ధులకు సూచించినట్టు తెలిసింది. దీంతో తలా రూ.300 జమ చేసి ఒక ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసుకున్నారు. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసినా స్క్రీన్ బాగులేకపోవడంతో విద్యార్ధులు ఇప్పటికీ తరగతి గదుల్లో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసుకున్న మాదిరిగా ఆడియో సిస్టం, స్క్రీన్ కొనుక్కోవాలని అధికారులు విద్యార్ధులకు చెబుతున్నారని విశ్వసనీయ సమాచారం. తరగతి గదుల్లో అవసరమైన మెటీరియల్స్ కోసం రిమ్స్‌లో నిధులు ఉన్నా వాటిని ఖర్చు చేయడం లేదని తెలిసింది. రిమ్స్‌లో వైద్య విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి రాకుండా అధికారులు గట్టి చర్యలే తీసుకున్నారని తెలిసింది. విద్యార్ధుల తల్లిదండ్రులు బాయ్స్ హాస్టల్‌లో వారి పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదని మండిపడుతున్నారు. అయితే వారు ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వారి పిల్లలు ఇబ్బంది పడతారని భయం వారిని వెంటాడుతుంది. రిమ్స్‌లో వైద్య విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలపై జిల్లాకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. రిమ్స్ జనరల్ ఆసుపత్రి పనితీరుపై సమీక్షించే ప్రజాప్రతినిధులు రిమ్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి హాస్టల్, మెస్‌పై కూడా సమీక్షించాలని చాలామంది కోరుతున్నారు.
Comments