వంశధార లెఫ్ట్ కెనాల్ ప్రారంభంలో పూడికే కారణం
అధిక వర్షపాతంతో గట్టెక్కిన రైతులు
జిల్లాలో తగ్గిన వరి విస్తీర్ణం
ఇంకా అంచనాల దశలోనే ఆధునికీకర
(సత్యం న్యూస్, శ్రీకాకుళం)

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార ఎడమ ప్రధాన కాలువ శివారు ప్రాంతాలకు నీరందించడానికి కాలువల్లో గుర్రపుడెక్కను తొలగిస్తే శివారు ప్రాంతాలకు నీరందించవచ్చన్న ఆలోచనతో కొవ్వాడ ఇంట్రస్ట్ ఫండ్ నుంచి జులైలో రూ.40లక్షలు మంజూరు చేయించి నామినేషన్ పద్ధతిలో పలాస, టెక్కలి నియోజకవర్గాల కాలువ శివారు ప్రాంతాల్లో గుర్రపు డెక్కలను తొలగించే పనులు చేపట్టారు. అయితే.. తల పని విడిచిపెట్టి తోక పని చేయడం వల్ల రూ.40 లక్షలు ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరలేదు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో 5,978 ఎకరాల్లో, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలు కలిపి 1193 ఎకరాల్లో వరిసాగు చేయలేకపోయారు. అక్టోబర్‌లో అల్పపీడనం ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు పొట్ట దశలో ఎండిపోతున్న వరి బతికి బట్టకట్టింది. వంశధార ఎడమ కాలువ ద్వారా ఆయకట్టుకు నీరందించే సాగునీటి కాలువ సామర్ధ్యం 20 ఏళ్ల క్రితం 2,460 క్యూసెక్కులు ఉండగా, ప్రస్తుతం అది 1800 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో గత కొన్నేళ్లుగా శివారు భూములకు నీరందడం లేదు.
తగ్గిన పంట విస్తీర్ణం
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,21,655 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, 3,80,615 ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఖరీఫ్‌లో అనుకున్న లక్ష్యంలో మొత్తం 41,040 ఎకరాల మేర తగ్గింది. వరి పంటను 3,87,323 ఎకరాల్లో వేస్తారని లక్ష్యంగా నిర్ణయించగా, 3,55,618 ఎకరాల్లో సాగవుతున్నట్లుగా నమోదైంది. అధికారుల లెక్కల ప్రకారం వరి సాగు 31,705 ఎకరాల మేర తగ్గింది. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కంటే అదనంగా 16 శాతం నమోదైంది. జిల్లాలో 17 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 11 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నా శివారు భూములకు మాత్రం ఈ ఏడాది నీరందలేదు. వేసవి సీజన్‌లో చేపట్టాల్సిన పనులు నీటిని విడిచిపెట్టిన తర్వాత జులైలో హడావుడిగా టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్, పూడిక తొలగింపు చేపట్టారు. కాలువ ప్రారంభంలో తొలగింపులు విడిచిపెట్టి శివారు ప్రాంతంలో చేపట్టడంతో నీరు చివరి వరకు చేరలేదు. పంట కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడిక తొలగింపు పనులు కొంతమేర చేపట్టినా పొట్ట, గింజ కట్టే దశకు చేరిన వరి పంటకు సాగునీరందలేదు. పలాస సబ్ డివిజన్ పరిధిలో పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలకు చెందిన రైతులు సుమారు 22 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. శివారు ప్రాంతాలైన వజ్రపుకొత్తూరు మండలం బెండి, నారాయణపురం, పెద్దబొడ్డపాడు, సీతాపురం, తాడివాడ, పలాస, నందిగాం మండలం కణితివూరు, మర్లపాడు, హరిదాసుపురం, నారాయణపురం తదితర ప్రాంతాలకు సాగునీరు అరకొరగానే చేరింది. పంట చివరి దశలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురవడంతో కొంతమేర వరిపంట చేతికి వచ్చింది. లేదంటే ఈ ఏడాది అన్నదాతకు కడగండ్లే మిగిలేవి.
కాలువ సామర్ధ్యం తగ్గింది
వంశధార ప్రధాన ఎడమకాలువ కెపాసిటీ 2,460 క్యూసెక్కుల నుంచి 1,800 క్యూసెక్కులకు పరిమితం కావడానికి ప్రధాన కారణం కాలువగట్లు బలహీనపడడం, పూడిక, గుర్రపుడెక్కలే. గొట్టాబ్యారేజీ వద్ద కాలువ సామర్ధ్యం మేరకు 1800 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నా టెక్కలి ప్రాంతానికి వచ్చేసరికి 500 క్యూసెక్కులకు తగ్గిపోతుంది. టెక్కలికి 900 క్యూసెక్కుల నీరు వస్తే తప్ప శివారు ఆయకట్టుకు నీరందే అవకాశం ఉండదు. అధికారులకు ఈ విషయం తెలుసు. శివారు ప్రాంతాలకు నీరు అందకపోవడానికి కారణం కాలువపై పరిమితికి మించి ఎత్తిపోతల పథకాలు ఉండటమేనన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి తోడు 2007 నుంచి షట్టర్లు లేకుండా ఇసుక బస్తాలతో నీటితీరువా చేయడం వల్ల నీటి వృథాను అదుపు చేయలేకపోవడం ఒక కారణం. నీటి తీరువా అమలుకు 29 మంది లష్కర్లు ఉండాలి. కానీ ఆ స్థాయిలో లేరు. శివారు ప్రాంతాలకు నీరందకపోవడానికి కాలువపై అనధికారికంగా ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాలనే కారణంతో వైకాపా హయాంలో ఎత్తిపోతలను ఆపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 20 ఎత్తిపోతల పథకాలను పునఃప్రారంభించారు.
బడ్జెట్ కేటాయింపులు లేవు
బడ్జెట్‌లో ఆఫ్‌షోర్ కోసం రూ.35 కోట్లు కేటాయించారు. రూ.800 కోట్లు అవసరం ఉన్నచోట కేవలం 0.5 శాతం కేటాయిస్తే, అది నిర్వహణకు కూడా సరిపోదు. వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణకు రూ.వెయ్యి కోట్ల అంచనాతో అధికారులు ప్రతిపాదన పంపారు. బడ్జెట్‌లో దీని ఊసే లేదు. ఆధునికీకరణకు ఒక్కసారి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు. ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయిస్తే ఐదేళ్లలో ఎడమ కాలువ ఆధునీకీకరణతో పాటు శివారు ప్రాంతాలకు పుష్కలంగా నీరందించడమే కాకుండా కాలువను ఇచ్ఛాపురం వరకు తీసుకెళ్లొచ్చు. అంతకు ముందు టీడీపీ హయాంలో 2015లో అధునికీకరణకు రూ.600 కోట్లు కేటాయిస్తామని ప్రకటించి మరిచిపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా హయాంలోనైనా నిధులు కేటాయించివుంటే రూ.800 కోట్లతో పూర్తయ్యేది. అంచనాల దశలోనే ఉంటే ఏటా బడ్జెట్ పెరుగుతుంది కానీ, పని జరిగే అవకాశం ఉండదు.
תגובות