top of page

నేను అనుకున్నది నాకొడుకు సాధించాడు

Writer: ADMINADMIN

1964 సంవత్సరం అనుకుంటాను. ఆదుర్తి సుబ్బారావు ‘కన్నెమనసులు’ చిత్రం నిర్మించే ప్రయత్నంలో నటించడానికి కొంతమంది నటీనటులను ఎంపిక చేసుకోవాలను కున్నారు.

ఆయన ఒకసారి ‘పొన్నూరు’కు వచ్చి హోటల్లో వున్నారని తెలిసి వెళ్లాను. నన్ను లోపలకు ఆహ్వానించి వచ్చిన విషయం కనుక్కొని- ‘మీరు పనికొస్తారు వెంకటరావుగారు’ అన్నారు. ఆ మాట నాకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.

స్క్రీన్‌ టెస్ట్‌ చేస్తాను, పలానా తేదీల్లో మద్రాసుకు రమ్మని చెప్పారు..

నేను తప్పకుండా వస్తానని ఆయనతో చెప్పి వచ్చేశాను. అయితే ఈ నిష యం మా నాన్నగారికి చెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. ‘సినిమా అంటే ఎంతలేదన్నా ఐదారునెలలు పడు తుంది- ఒకవేళ ఆ చిత్రం అటూ ఇటూ పోతే పరిస్థితి ఏమిటి? నువ్వు కుటుంబాన్ని పోషించాలి- ఆ విషయం మర్చిపోకు’ అని హెచ్చరిం చారు. అంతే ఆదుర్తిగారు చెప్పిన తేదీల్లో స్క్రీన్‌ టెస్ట్‌ హాజరుకాలేకపోయాను.

అయితే ఆ తర్వాత ‘సుడిగుండాలు’ చిత్రం షూటింగ్‌ టైమ్లో కలిసిన ప్పుడు- వెంకటరావు నువ్వు వస్తే ‘కన్నెమనసులు’ చిత్రంలో గుమ్మడిగారు వేసిన విలన్‌ పాత్ర ఇద్దామని అనుకున్నాను. నువ్వురాలేదు అన్నారు. ‘సుడిగుండాలు’ చిత్రంలో ఏమైనా అవకాశం వుంటే ఇవ్వమని అడిగాను. ప్రాధాన్యత వున్న పాత్రలన్నీ అయి పోయాయి అని చెప్పారు. ఆ తర్వాత 1968లో కె.రాఘవ నిర్మించిన జగత్కలాడీలు,’ ‘ జగత్‌ జట్టీలు’ చిత్రాలలో చిన్నపాత్రలలోనటించాను.

అంతే- ఆ తర్వాత మళ్లీ ఏ చిత్రంలో నటించలేదు. నేను 7వ తర గతి చదివే వయసునుంచి డ్రామాలు అంటే మహాపిచ్చి-చదువు ప్రక్కన పెట్టి నాటకాలు ఆడుతూ వుండేవా డిని, మాకు పెనుగొండ ఫ్యాన్స్‌ డ్రమెటిక్‌ అసోసియేషన్‌ అన్న సంస్థ వుండేది. దీనిద్వారా అనేక నాట కాలు ఆడేవాళ్లం. నా ఆసక్తిని మా నాన్నగారు నిరు త్సాహపరిచినా మా బావగారు మాత్రం ప్రోత్సహించేవారు. అయితే ఆయన కాలం చేయడంతో సినిమా నటుడ్ని కావాలన్న నా కోర్కె అలా రెండు చిన్నపాత్రలు వేసి తీర్చుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్పాల్సిన వచ్చిందంటే మా నాన్న నన్ను సిని మారంగానికి వెళ్లవద్దని ఎలా చెప్పారో సరిగ్గా నేను మా పెద్దబ్బాయి చిరంజీవిని వద్దన్నాను.

బి.కాం. తరువాత ఐ.ఏ.ఎస్‌ కాని, ఐ.పి.ఎస్‌ కాని చదవమని చెప్పాను. గతంలో పాండీబజారుకు ఎప్పుడైనా వెడితే సినిమాలలో వేషాలు లేక తిరిగేవాళ్లను అనేకమందిని చూసేవాడిని. మా వాడు అలా కాకూడదు. మంచి ఆఫీసరుగా దర్జాగా వుండాలి అని ఆశపడ్డాను. అయితే చిరంజీవికి పట్టుదల ఎక్కువ. ‘పునాదిరాళ్లు’ చిత్రంలో సినిమారంగప్రవేశం చేశాడు. ప్రారంభంలో అతను నటించిన చిత్రాలు చూసి- ఇదేం నటన అనుకొనేవాడిని. నటుడుగా రాణిస్తాడా? అన్న అపనమ్మకం కూడా నాలో అధికంగా వుండేది. అయితే ‘ఐ లవ్‌ యు’ చిత్రం చూసిన తరువాత నా ఆలోచనావిధానంలో మార్పు వచ్చింది. చిరంజీవి నటుడుగా నిలదొక్కుకోగలడు అన్న నమ్మకం కలిగింది. అచేతనంగా మంచంపై పడివున్న హీరోను హీరోయిస్‌ అగౌరవపరిచే సన్నివేశంలో హీరో ముఖంలో చూపించే హావభావాలు చూసి ఒక మెచూరిటి కళాకారుడు చిరంజీవిలో నాకు కన్పించాడు.

ఆనాటినుంచి చిరంజీవిని ప్రోత్సహించటం ప్రారంభించాను. అయితే ప్రారంభంలో విలన్‌ పాత్రలు వేస్తుంటే వద్దని చెప్పాను హీరో వేషాలు కాకపోయినా క్యారెక్టర్‌ ఆర్టిస్టు వేషాలు చెయ్యమని సలహా ఇచ్చాను. పోతే, చిరంజీవి తెలుగు సినిమారంగంలో సంబర్‌ వన్‌ స్థాయికి చేరుకుంటాడని నేను ఎప్పుడూ ఊహించలేదు.

నాలో అణగారిపోయిన తృష్ణ-నా కొడుకు సాధించిన విజయాలలో చూసుకోసాగాను. మొదటినుంచి నేను ఆశావాదిని, క్రమబద్ధమైన జీవితం గడిపేవాడిని. ఉన్నదాంట్లో తృప్తిపడటం తప్ప, లేని దానికోసమో, రానిదానికోసం ఎదురు తెన్నులు చూసేవాడిని కాదు. ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌ చేసినా, పోలీసు అధికారిగా ఉన్నా, నీతి, నిజాయితీకే ప్రాధాన్యత నిచ్చేవాడిని. ఎప్పుడూ మనిషి శ్రమపడితే,

సిన్సియర్‌గా ఉంటే జీవితంలో నష్టపోవడం ఉండదనే నమ్మకం ఉన్నవాడిని. అలా ఉన్నవాడు విజయకేతనం ఎగురవేస్తాడని చెప్పడానికి నిదర్శనమే చిరంజీవి. చిరంజీవికి ఓర్పు ఎక్కువ. కోపం అరుదుగా తప్ప రాదు. అలాగే ఇతరులను గౌరవించడం అతనికి బాగా తెలుసు. సంస్కారం అతనికి భూషణం. అలాగే టైమ్‌ అంటే టైమ్‌. తను చేస్తున్న పనిపట్ల శ్రద్ధ. ఏకాగ్రత, సమయపాలన అతని విజయానికి కారణం అనుకుంటాను.

ఒక మామూలు మధ్యతరగతి తండ్రిగా చిరంజీవి సాధించిన విజయాలు గొప్ప స్ఫూర్తినిస్తాయి. చిరంజీవి తల్లిదండ్రులుగా మాకు. సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చి పెట్టాడు. అంత కంటే ఏం కోరుకోమంటారు? ఇంతకంటే ఏం చెప్పమంటారు?

మెగాస్టార్‌ చిరంజీవి తండ్రి వెంకట్రావు 22 ఆగస్టు 1999 ఆంధ్రప్రభ ఆదివారంకు ఇచ్చిన ఇంటర్వ్యూ

ความคิดเห็น


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page