శాఖలవారీగా కేంద్రమంత్రి సమీక్షలు
సాగునీరు కాలువలు దగ్గరుండి మరమ్మతు చేయిస్తున్న అచ్చెన్నాయుడు
డబ్బులు పంచడం కాదు.. పని కల్పించాలని చూపించిన ప్రభుత్వం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్ర ప్రజానీకంలో 80 శాతానికి మించి లబ్ధి చేసినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదని వైకాపా నేతలు ఇప్పటికీ భావిస్తుంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి గమనిస్తే అర్థమవుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శతశాతం మందికి మేలు చేయడం ఏ దేశంలోనూ జరగదు. కానీ చిన్నచిన్న అంశాలను కూడా పట్టించుకోకుండా కేవలం బటన్ నొక్కుడు మీదే ఆశలు పెట్టుకోవడం, దాన్నే అభివృద్ధి అనే కొత్త నిర్వచనం ఇవ్వడం వల్ల ఎంత నష్టపోయారో ఇప్పుడు అర్థమవ్వాలి. కేంద్రమంత్రిగా రాము పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నెల 3 వరకు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారు. ఆ తర్వాత జిల్లాలో అడుగుపెట్టి నిత్యం సమీక్షలు ఓవైపు నిర్వహిస్తూనే, మరోవైపు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పని చేస్తున్నారు. భోగాపురం జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్న నిర్మాణ పనులను మంగళవారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఆయన పరిశీలించారు. అక్కడ పనులు జరుగుతున్న తీరును, ఇంకా జరగాల్సిన వాటిని అంచనా వేసి 2026 నాటికి ఈ అంతర్జాతీయ పోర్టును అందిస్తామని ప్రకటించారు. రాము పేర్కొన్నట్లు 2026కు ఈ పనులు పూర్తికాకపోయినా కనీసం 2029 ఎన్నికల్లోపైనా వీటిని పూర్తి చేసేందుకు ఆయన దిశానిర్దేశం చేశారు. విజయనగరంలో ఈ సమీక్ష ముగిసిన తర్వాత బుధవారం విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లి విశాఖ జోన్‌పై సుదీర్ఘ చర్చ జరిపారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ అయిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన పనులు వెంటనే చేపట్టాలని కోరారు. అలాగే ఉత్తరాంధ్రలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్‌తో సమీక్షించారు. ఇందులో భాగంగా విజయనగరంలో పెండిరగ్ ప్రాజెక్టుల కోసం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతోను, విశాఖపట్నంలో ఉన్న పెండిరగ్ పనులపై ఎంపీ భరత్‌తోను కూర్చుని డీఆర్‌ఎంకు ప్రాధాన్యతలను వివరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ స్విప్నిల్ దినకర్‌తో కూర్చుని జిల్లాలో సమగ్ర అభివృద్ధికి అవసరమైన రోడ్డు మ్యాప్‌ను రామ్మోహన్‌నాయుడు అందించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన మూడోసారి శంకుస్థాపనకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు హడావుడి చేసిన వైకాపా నేతలు ఆ తర్వాత ఎయిర్‌పోర్టు వైపే చూడలేదు. కానీ ఎప్పటికైనా ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు వస్తుందని తెలిసిన వీరు పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి వ్యాపారం మీద మాత్రం దృష్టి పెట్టారు. అలాగే విశాఖ రైల్వే డివిజన్‌కు సంబంధించి రాష్ట్రం తమకు భూమి కేటాయించలేదని అప్పటి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బహిరంగంగా చెప్పినా ఆయన మీద ఎదురుదాడి చేశారే తప్ప వైకాపా నాయకులు అందుకు సంబంధించిన పనులను చకచకా పూర్తిచేసేదానిపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు వీటిని కేంద్రమంత్రి హోదాలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రతీవారం సమీక్షించడానికి నిర్ణయించుకున్నారు. పనుల్లో పురోగతిని స్థానిక ఎంపీలు పరిశీలించి పనులు ముందుకు జరగడంలేదంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అంతెందుకు.. జిల్లాలో కొన్ని వేలు ఖర్చుపెడితే సాగునీరు అందే పరిస్థితిని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. రైతుల ఖాతాల్లోకి సొమ్ములేస్తున్నాం కాబట్టి వారికి ఏ సమస్యలూ లేవని అప్పటి ప్రభుత్వం భావించి నష్టపోయింది. నరసన్నపేట నియోజకవర్గంలో వంశధార కాలువల అభివృద్ధిపై మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించారు. గడిచిన ఐదేళ్లలో సాగునీటి కాలువల్లో పెద్ద ఎత్తున డొంకలు బలిశాయి. దీన్ని ఖరీఫ్/రబీ సీజన్లలో తొలగించివుంటే కొన్ని వేల రూపాయల ఖర్చు సరిపోయుండేది. కానీ ఐదేళ్ల పాటు ఈ కాలువల్లో మహావృక్షాలు మొలిసేయడంతో ప్రొక్లయినర్లు పెట్టి సాగునీటికి మార్గం సుగమం చేస్తున్నారు. రూ.90.78 లక్షలతో రెండు రోజులుగా ఈ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అత్యవసరంగా రూ.45 లక్షలు కావాలంటే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి అచ్చెన్నాయుడు తెప్పించారు. నరసన్నపేట, టెక్కలి డివిజన్ల పరిధిలో రూ.38 లక్షలతో 37 పనులు, ఎడమ కాలువ పరిధిలో రూ.45.78 లక్షలతో 60 పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కాలానికి నరసన్నపేట నియోజకవర్గంలో రైతులకు నీరందనుంది.
留言