నామినేటెడ్ భర్తీలో తర్కానికి అందని వాదనలు
ఇక్కడ వెలమలకు మరి పదవులు రావు
బాబ్జీకి డీసీసీబీ చైర్మన్ ఇచ్చే యోచన
కాపులకు మరో స్టేట్‌పోస్టు
ప్రోటోకాల్ ప్రాబ్లంతోనే మొదలవలసకు చేజారిన పదవి
నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించని మంత్రులు


సాధారణంగా పదవుల పందారం జరిగినప్పుడు అసంతృప్తిలు బయటపడతాయి. అందర్నీ సంతృప్తిపర్చడం ఏ ప్రభుత్వ తరం కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లాలో ఒక మేజర్ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. అసలు ఈ పుట్టలో వేలెడితే కుట్టకుండా బయటపడటం అసాధ్యం. కానీ జిల్లాలో జరిగిన భర్తీ ప్రక్రియలో మాత్రం ప్రభుత్వం ఒక నియమాన్ని పాటించినట్టు జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది.
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికి మంత్రి పదవి ఇవ్వకపోగా, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, జెడ్పీ మాజీ చైర్మన్ చౌదరి బాబ్జీకి కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చి అవమానించారనే ప్రచారం జరుగుతోంది. కానీ లెక్కలు, చరిత్ర తవ్వితీస్తే అసలు ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుందో అర్థమవుతుంది. జిల్లాలో మేజర్ సామాజికవర్గం కాళింగులే. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే కాపులు, వెలమలు కూడా ఏమాత్రం తీసిపోని సంఖ్యలోనే జిల్లాలో ఉన్నారు. బహుశా అందుకేనేమో బూరగాన కాళింగులు, కింతలి కాళింగులు అనే రెండు కేటగిరీలను ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మెయింటైన్ చేస్తూవస్తుంది. ఆ సామాజికవర్గ నేతలు కూడా తమకు పదవులు వచ్చినప్పుడు ఏదో ఒక కేటగిరీకి అన్యాయం జరిగిందన్న స్టేట్‌మెంట్లే సోషల్‌మీడియాలో ఇస్తుంటారు. ఒకవైపు కాళింగులంతా ఒకటేనని, విడదీసే ప్రయత్నం చేయొద్దని బయటివారికి చెబుతూనే, వారు మాత్రం పదవులు పొందడంలో ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినప్పుడు జిల్లాలో మొదటిసారిగా పలాసకు చెందిన వజ్జ బాబూరావుకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. ఈయన బూరగాన కాళింగ (బీకే). ఆ తర్వాత ప్రభుత్వ విప్ పదవి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు ఇచ్చారు. ఈయన కూడా బీకేనే. ఇంకా కళింగ కార్పొరేషన్ డైరెక్టర్లుగా జిల్లాకు చెందిన ఇద్దరు బీకేలకు అవకాశం కల్పించారు. దీంతో టీడీపీ ప్రభుత్వం బీకేలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తుందని కింతలి కాళింగులను (కేకే) పట్టించుకోవడంలేదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. కూన రవికి మంత్రి పదవి రానప్పుడు జిల్లాలో ఇద్దరు కాళింగ ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్కరిని కూడా గుర్తించలేదని వ్యాఖ్యానించినవారు ఇప్పుడు కేకేలను గుర్తించలేదని బాధపడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు జిల్లాలో రెండు వర్గాల మధ్య విభజన స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే జిల్లా టీడీపీలో కూడా వెలమ, కాళింగ, కాపు కాంబినేషన్‌లో ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు అర్థమవుతుంది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలు ఒక గ్రూపు కాగా, జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు మరో గ్రూపుగా పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన మొదలవలస రమేష్‌కు ఇవ్వాలని మొదట్లో భావించారు. అందుకు కారణం.. అదే నియోజకవర్గం నుంచి మంత్రి కావాల్సిన కూన రవికి ఆ పదవి దక్కకపోవడం. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఈ కార్పొరేషన్ చైర్మన్‌గా తన నియోజకవర్గానికి చెందిన బగాది శేషును కాని, జిల్లాలో సీనియర్ నాయకుడు చౌదరి బాబ్జీని కాని నియమిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన రోణంకి కృష్ణంనాయుడును తెర మీదకు తీసుకువచ్చారు. వాస్తవానికి కూన రవి గ్రీన్‌సిగ్నల్‌తోనే రోణంకి కృష్ణంనాయుడు కళింగ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే.. మొదలవలస రమేష్‌కు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇస్తే నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్య తలెత్తుతుంది. ఇక్కడ కూన రవి నియోజకవర్గ నేత కాగా, మొదలవలస రమేష్‌కు పదవి వస్తే రాష్ట్రస్థాయి ప్రోటోకాల్ వస్తుంది. అంతేకాకుండా నరసన్నపేట నియోజకవర్గంలో కేకేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా పక్క నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టాలన్న వ్యూహం కూడా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో కాళింగులే ఎక్కువగా ఉన్నా ఇక్కడ కింజరాపు కుటుంబం అప్రతిహతంగా విజయం సాధిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కుటుంబం నుంచి నరసన్నపేట వైపు కూడా భావితరాలు చూస్తాయని, అందుకే అక్కడే చెక్ పెట్టడం కోసం పోలాకికి చెందిన కృష్ణంనాయుడును కళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా బగ్గు రమణమూర్తి తెర మీదకు తెస్తే దానికి తెర వెనుక మంత్రాంగం కూన రవి నడిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ టెర్మ్ తర్వాత బహుశా బగ్గు లక్ష్మణరావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోవచ్చు. ఆయన కుమారుడు వ్యాపారాలు చూసుకుంటే, కుమార్తెను వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం ఆయన ఇప్పట్నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ అంశంలో మరో కోణం కూడా ఉంది. జిల్లాలో బూరగాన కాళింగుల్లో 80 శాతం మంది మొదట్నుంచి తెలుగుదేశంతోనే ఉన్నారన్న డేటా 2024కి ముందు జరిగిన ఎన్నికల సరళిని బూత్‌ల వారీ పరిశీలిస్తే అర్థమవుతుంది. అదే సమయంలో కింతలి కాళింగులు తెలుగుదేశమేతర పార్టీలు లేదా పార్టీ వేవ్‌ను బట్టి ఓటు వేసిన ఆధారాలు లభిస్తున్నాయి. రోణంకి కృష్ణంనాయుడు సొంతవూరు పోలాకి మండలం ఉర్జాం పోలింగ్‌బూత్‌లో ఎప్పుడూ టీడీపీకి తక్కువ ఓట్లే పోలవుతూవచ్చాయి. కొన్ని ఎన్నికల్లో ఆ సంఖ్య మరీ తక్కువగా ఉండటం గమనార్హం. 2024 ఎన్నికలు ఇందుకు మినహాయింపు. అందుకే కింతలి కాళింగుల ఓట్లు సాధించేందుకు రోణంకి కృష్ణంనాయుడుకు పదవిని అప్పగించారు. అయితే ఇప్పుడు చౌదరి బాబ్జీకి డైరెక్టర్ పోస్టు ఇవ్వడంపైనే జిల్లాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. జిల్లాపరిషత్ చైర్మన్‌గా ఆయన భార్య చౌదరి ధనలక్ష్మికే టీడీపీ అవకాశం ఇచ్చినప్పుడు, చౌదరి బాబ్జీకి ఇంకెంత పెద్ద పోస్టు ఇస్తుందోనని అంతా భావించారు. కానీ ఆయన్ను డైరెక్టర్‌గా నియమించడంతో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు కూడా ఖంగుతిన్నారు. వాస్తవానికి వివిధ నామినేటెడ్ బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమిస్తున్నవారి వివరాలు సంబంధిత జిల్లాకు చెందిన మంత్రులకు ముందుగా తెలియపర్చడంలేదు. ఎన్నికలకు ముందు రాబిన్‌శర్మ టీమ్ సర్వే చేపట్టినప్పుడు, ఇప్పుడు సభ్యత్వ నమోదు సందర్భంగా వివిధ నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు పర్యటిస్తున్న సందర్భంగా లోకేష్ టీమ్‌కు ఇచ్చిన నివేదికల మేరకు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో భాగంగానే చౌదరి బాబ్జీని డైరెక్టర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో అలెర్టయిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇప్పటికే ముఖ్యమత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడారు. డీసీసీబీ చైర్మన్ పదవిని ఇంకా భర్తీ చేయలేదు కాబట్టి బహుశా ఆ సీటులో ఆయన్ను కూర్చోబెట్టి వివాదానికి తెర దించే ప్రయత్నాలు చేస్తారేమో?! మరోవైపు జిల్లాలో వెలమలకు ప్రధానమైన పోస్టులేవీ రాకపోవచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రమంత్రిగా అచ్చెన్నాయుడు, రాష్ట్ర హైకోర్టు పీపీగా సంతబొమ్మాళి మండలానికి చెందిన మెండ లక్ష్మీనారాయణను ప్రభుత్వం నియమించింది. హైకోర్టు పీపీ కూడా చిన్న పోస్టేమీ కాదు. ఇది కూడా కేబినెట్‌కు ఏమాత్రం తీసిపోని హోదా ఉన్నదే. అందుకే మరి కొత్తగా బీసీ వెలమలు జిల్లా నుంచి పోస్టులు ఆశించకూడదనే సంకేతాలే పార్టీ నుంచి వస్తున్నట్టు భోగట్టా. ఈ లెక్క ప్రకారం వెలమ కార్పొరేషన్ ఉంటుందో, ఉండదో కూడా తెలియడంలేదు. ఒకవేళ ఉన్నా ఈ జిల్లాకు చెందిన నేతలెవరూ ఈ పోస్టును ఆశించనక్కర్లేదు. ఇక కాపులకు కూడా కూటమి ప్రభుత్వం మంచి ప్రాధాన్యతే ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే జనసేన ఖాతాలో సుడా చైర్మన్, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పదవులు రెండు ఈ జిల్లాలో కాపులకే వచ్చాయి. మరో పోస్టు కూడా కాపుల కోసం అట్టేపెట్టినట్లు రాజధానివర్గాలు చెబుతున్నాయి. రెండు కీలకమైన పోస్టులు జనసేన ఎగరేసుకుపోవడం చూస్తుంటే నామినేటెడ్ పోస్టుల భర్తీపై జిల్లాకు చెందిన మంత్రులు దృష్టి పెట్టినట్టు కనిపించడంలేదు. సుడా చైర్మన్ వంటి కీలకమైన పోస్టును జనసేనకు ఇచ్చారని టీవీలో చూసేవరకు ఇక్కడి మంత్రులకు తెలియదు. అలాగే చౌదరి బాబ్జీకి డైరెక్టర్‌గా నియమించారని కూడా బాబ్జీ చెబితే గానీ అచ్చెన్నాయుడుకు తెలియలేదు. తన కోడలుకు చెందిన పెండిరగ్ బిల్లులు మంజూరు కోసం విజయవాడ వెళ్లిన బాబ్జీ తనను డైరెక్టర్‌గా నియమించారని పక్క ఛాంబర్‌లో ఉన్న అచ్చెన్నాయుడుకు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. జిల్లాలో ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా గాని, అసంతృప్తితో గాని ఎవరున్నా ప్రత్యామ్నాయం తయారు చేస్తామన్న సంకేతాలు లోకేష్ పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతోంది. మంత్రి పదవి కాకుండా మరే పోస్టూ తనకు వద్దనే రీతిలో కూన రవి వ్యవహరిస్తుండటాన్ని లోకేష్ సీరియస్‌గా తీసుకున్నట్టు భోగట్టా. మంత్రి పదవి మిస్సయిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఆయన తరఫున వెల్లువెత్తిన సానుభూతిలో పార్టీని బద్నాం చేయడంపై ఇంతకు క్రితమే ఫిర్యాదులు వెళ్లాయి. ఆ తర్వాత టీటీడీ బోర్డు మెంబరుతో పాటు మరికొన్ని కీలకమైన పోస్టుల కోసం కూన రవి పేరు పరిశీలనలోకి వచ్చినా, ఆయన అందుకు నిరాకరించడంతో పార్టీ ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.
Comments