top of page

‘నిప్పు’ తెచ్చిన ముప్పు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • 15 భవంతులకు విజిలెన్స్‌ నోటీసులు

  • ఫైర్‌ ఎన్‌వోసీ ప్లాన్‌ అనుమతులు అప్‌లోడ్‌ చేయాలన్న ఎస్పీ

  • రెండో విడతలో మరిన్ని కట్టడాలపై గురి

  • వణికిపోతున్న ఉద్యోగులు, వ్యాపారులు



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నగరంలోని సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌లో సంభవించిన అగ్నిప్రమాదం మిగిలిన వ్యాపారుల చావుకొచ్చింది. ఇంతవరకు కార్పొరేషన్‌ అధికారులను, ఫైర్‌ అధికారులను మేపి గుట్టుచప్పుడు కాకుండా భవనాలను నిర్మించుకొని, వచ్చిన సొమ్ముతో ప్రతీ ఏడాది ఎకరాలకు ఎకరాలు, కిలోల కొద్దీ బంగారాన్ని కూడేసుకుంటున్న వ్యాపారస్తులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదేదో అగ్నిప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆలోచించడం వల్ల పుట్టిన భయం కాదు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు నగరంలో 15 బహుళ అంతస్తుల భవనాలకు కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అసలు కార్పొరేషన్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి భవన నిర్మాణం కోసం పెట్టుకున్న ప్లాన్‌ ఏమిటి? అనుమతులు వచ్చిన ప్లాన్‌ ఏమిటి? నిర్మాణాలు చేపట్టిన ప్రాంతమెంత? ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన ఎన్‌వోసీ వివరాలు వంటివి పట్టుకొని బహుళ అంతస్తుల భవన యజమానులు రావాలని ఆ నోటీసుల సారాంశం. మొదటి విడతగా విజిలెన్స్‌ శాఖ గుర్తించిన 15 షాపింగ్‌మాల్స్‌కు ఎటువంటి సెట్‌బ్యాక్స్‌ లేవు. అలా అని ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండాపోలేదు. దీంతో మొత్తం కూలదోసి మళ్లీ సెట్‌బ్యాక్స్‌ విడిచిపెట్టి కట్టమంటారేమోనన్న భయంతో గడగడలాడిపోతున్నారు. ఎందుకంటే ఫైర్‌ ఎన్‌వోసీ రావాలంటే చుట్టూ ఫైరింజన్‌ తిరగడానికి స్థలం విడిచిపెట్టాలి. ఎన్ని అంతస్తులున్నా నాలుగువైపులా ఓపెన్‌ స్పేస్‌ ఇవ్వాలి. అవేవీ లేకుండానే ఈ భవనాలన్నీ ఉన్నాయి. భవిష్యత్తులో రోడ్డు వెడల్పయితే, అప్పటికే ఉన్న భవనానికి డబ్బులు చెల్లించి స్థలాన్ని కొనుగోలు చేసే వీలు లేనందున రోడ్డుకు ముందు భాగంలో 10 అడుగుల స్థలం విడిచిపెట్టే నిబంధన ఒక్కటే పట్టించుకున్న కార్పొరేషన్‌ తన కళ్ల ముందే భారీ భవనాలు డీవియేషన్‌తో నిర్మిస్తున్నా సొమ్ములకు ఆశడి చోద్యం చూసింది. దాని ఫలితమే నగరమంతా పేకమేడల్లాంటి భవనాలు వెలిశాయి. ఇప్పుడు ఈ భవనాలు నిర్మిస్తున్నప్పుడు ఉన్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, ఫైర్‌ అధికారులు విజిలెన్స్‌కు సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడిరది.

నగరంలో నోటీసులు జారీ చేసిన 15 మాల్స్‌, హోటల్స్‌ నిర్వహిస్తున్న భవనాలు అక్రమ నిర్మాణాలుగా తేల్చారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. నోటీసులు జారీచేసిన 15 భవనాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినా పట్టించుకోని కార్పొరేషన్‌ అధికారులు, వీటిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి ఎన్‌వోసీ జారీచేసిన అగ్నిమాపక శాఖ అధికారుల వివరణ కోరడానికి విజిలెన్స్‌ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. 15 మాల్స్‌కు నోటీసులు జారీచేసిన విజిలెన్స్‌ అధికారులు నోటీసులు అందుకున్న 5 రోజుల్లో భవన నిర్మాణానికి సంబంధించి మున్సిపల్‌ శాఖ అధికారులు జారీ చేసిన ప్లానింగ్‌ అనుమతులు, అగ్నిమాపకశాఖ అధికారులు జారీ చేసిన ఎన్‌వోసీలు జోడిరచి హార్డ్‌కాపీలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించారు. భవనంలో ఎటువంటి వ్యాపార, వాణిజ్య కార్యలాపాలు నిర్వహిస్తున్నారు, ఎన్ని చదరపు అడుగుల్లో భవన నిర్మాణం చేశారు. ఎన్ని ఫ్లోర్లు, ఎన్ని చదరపు అడుగులు, అగ్నిమాపకశాఖ జారీ చేసిన ప్రాథమిక ఎన్‌వోసీ, ఫైనల్‌ ఎన్‌వోసీలను, మున్సిపల్‌ అధికారులు జారీ చేసిన పత్రాలను సమర్పించాలని 15 యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.

సంక్రాంతికి ముందు జీటీ రోడ్డులో ప్రారంభించిన సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ఒక్కటే ఐదు అంతస్థులు భవనంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌తో పాటు, ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌, ఆర్‌ఎస్‌ఎం షాపింగ్‌మాల్‌, ఆర్‌కే స్టోర్‌, ఆర్‌ఎస్‌ దేవీ కాంప్లెక్స్‌, జీషాన్‌ హోటల్‌ నాలుగు అంతస్థుల భవనాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మూడు అంతస్థుల భవనాల్లో జీఎన్‌ జ్యూవెలరీ, వందనా షాపింగ్‌ మాల్‌, హ్యాపీ షాపింగ్‌ మాల్‌, మాలిక్‌ డ్రెసెస్‌, రైమాండ్స్‌ షోరూం, డే అండ్‌ నైట్‌, రామలక్ష్మణ జంక్షన్‌లో ఉన్న ట్రెండ్స్‌, హీరావత్‌ షోరూమ్‌, రామ్‌రాజ్‌ కాటన్స్‌, మాక్స్‌ షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. వీటన్నింటికీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే వీటితో పాటు నగరంలో అనేక బహుళ అంతస్థుల భవనాల్లో లెక్కలేనన్ని ఆసుపత్రులు, హోటల్స్‌, లాడ్జీలు, బంగారం షాపులు ఉన్నాయి. వీటికి రెండో విడతలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వందేళ్ల క్రితం పట్టణంగా రూపుదిద్దుకున్న శ్రీకాకుళంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించినా అందుకు అనువైన రోడ్లు, పార్కింగ్‌ స్థలాలు లేవు. ప్రతి 20 ఏళ్లకు మున్సిపల్‌ శాఖ రూపొందించే మాస్టర్‌ ప్లాన్‌ నగర రూపురేఖలు మార్చడానికి ఏమాత్రం అనువుగా లేదని విమర్శలు గత 30 ఏళ్లుగా వినిపిస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌కు అనువుగా రోడ్లు విస్తరించడానికి నగరపాలక సంస్థ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను రాజకీయంగా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నగరంలో పెరిగిన జనాభా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనువుగా రోడ్లు విస్తరణ చేయడం లేదు. దీంతో పాటు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి అనువుగా నిర్మాణం చేస్తున్న భవనాల యజమానులు నిబంధనలు పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రమాదాలు సంభవించినప్పుడు వ్యాపారులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లి, అందులో పని చేస్తున్న కార్మికులు రోడ్డున పడుతున్నారు.

‘సౌత్‌ ఇండియా’ కార్మికులకు భరోసా

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా, అందులో వివిధ హోదాల్లో పని చేస్తున్న 250 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆ మాల్‌ పునర్నిర్మాణం పూర్తి చేసుకొని వ్యాపారం ప్రారంభించాలంటే కనీసం ఏడాది పడుతుందని యాజమాన్య ప్రతినిధులే చెబుతున్నారు. దీంతో ఇందులో పని చేస్తున్న 250 మంది కార్మికులు వేరే ఉపాధి అవకాశాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులంతా మాల్‌ వద్దకు చేరుకొని ఉపాధి కల్పిస్తున్న మాల్‌ అగ్నికి దగ్ధమైపోవడాన్ని జీర్ణించుకోలేక బోరున విలపించారు. మాల్‌లో కార్మికులకు సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి 16 గంటలు పనిచేస్తూ వచ్చారు. దీనికి మాల్‌ యాజమాన్యం కార్మికులందరికీ సంక్రాంతి రోజును ఒక నెల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చింది. జనవరి నెలకు సంబంధించిన వేతనాలు ఫిబ్రవరి నెలలో చెల్లించాలి. అయితే ఈ నెల 25న మాల్‌ అగ్నిప్రమాదం జరగడంతో జనవరి నెల వేతనం ఫిబ్రవరిలో చెల్లించే పరిస్థితి లేదని భావించిన కార్మికులకు యాజమాన్యం వేతనాలు చెల్లిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలిసింది.

3 Comments


Ramu Metta
Ramu Metta
Jan 30

Good news

Like

Ramu Metta
Ramu Metta
Jan 30

Good news

Like
Prasad Satyam
Prasad Satyam
Feb 17
Replying to

thanq

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page