top of page

నీ పాపం పండెను నేడు!

Writer: ADMINADMIN
  • ఎస్పీ గ్రీవెన్స్‌కు తరలివచ్చిన ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ బాధితులు

  • మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఉద్యోగాల పేరుతో వసూలు

  • అమ్మాయిలని చూడకుండా ఒళ్లు చీరేసిన ఘటనలు

  • బ్లాక్‌మెయిలింగ్‌తో తల్లిదండ్రులను కాళ్లబేరానికి దించిన ఘనుడు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ పేరుతో బీవీ రమణ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతంలో యువతకు ఆర్మీకి వెళ్లడానికి శిక్షణ ఇప్పిస్తానని మొదలుపెట్టిన సంస్థను తన అవసరాలకు ఎలా వాడుకున్నాడో బయటకు వస్తున్నాయి. ఇంతకు ముందే బీవీ రమణ మీద ఫిర్యాదులు వచ్చినా అప్పటి పోలీస్‌ బాస్‌లు పట్టించుకోపోవడంతో మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు ఎస్పీ స్పీడ్‌ను చూసి ముందుకొస్తున్నారు. ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ హాస్టల్‌లో ఉన్న అబ్బాయిల్నే కాదు.. అమ్మాయిల్ని కూడా ఆ సంస్థ వ్యవస్థాపకుడు బీవీ రమణ ఒళ్లు చీరేసేవాడని, ఆ మాటకొస్తే ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌లో శిక్షణకు వచ్చిన ప్రతిఒక్కరు బీవీ రమణ చేతిలో చావుదెబ్బలు తిన్నవారేనని తేలింది. ఇది చాలదన్నట్టు అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా వేధించి ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ గుట్టు బయటపడకుండా భయపెడుతూవచ్చాడని కూడా బయటపడిరది. నలుగురు అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలు ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు బీవీ రమణ మీద ఫిర్యాదు చేయడానికి సోవారం ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చారు. ఎస్పీ మహేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేయడానికి ముందు వారంతా మీడియాతో మాట్లాడారు. రమణ దాష్టీకాలు ఒక్కొక్కటీ చెప్పుకొచ్చారు. ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ హాస్టల్‌కు దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తే, ఆ సమయంలో ఇంటికి వెళ్తున్న కొందరు అమ్మాయిలు దగ్గర్లో ఉన్న బీచ్‌కు వెళ్లి ఫొటోలు తీసుకొని, ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బీవీ రమణ తన సంస్థకు చెడ్డపేరు తెచ్చారని వీరిని చితక్కొట్టేశాడు. అసలు వీరు బీచ్‌కు వెళ్లినట్టు రమణకు ఎలా తెలిసిందనే ప్రశ్న తలెత్తితే.. ఇందుకు బాధితులు చెప్పిన మరో స్టోరీ చదవండి.

ఇక్కడ చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు, ఎవరివైనా మొబైల్‌లు రమణ అన్‌లాక్‌ చేసి తీసుకుంటారు. అలా ఎవరైనా అన్‌లాక్‌ చేసి ఇవ్వకపోతే వారి మొబైల్‌ను నేలకేసి కొట్టి ముక్కలు చేసేవాడు. దీంతో అందరూ మొబైల్‌లు ఇచ్చి తప్పుకునేవారు. ఇందులో ఉన్న డేటాను ఆయన వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తాడు. ఇందులో ఉన్న ఫొటోలు, ఛాటింగ్‌, కాల్‌ లిస్ట్‌ ప్రకారం అమ్మాయిలను బ్లాక్‌మెయిల్‌ చేయడం, లొంగకపోతే చితక్కొట్టడం చేసేవాడు. తన సంస్థకు సంబంధించిన డేటా ఎవరైనా బయటి వ్యక్తులకు పంపారా? అనే అనుమానంతో నిత్యం వారి ఫోన్లు తీసుకొని, వారి ఫొటోలు, పర్సనల్‌ డేటాను తీసుకొని వేధించేవాడు. అలాగే అమ్మాయిలు బీచ్‌కు వెళ్లిన ఫొటోలు తీసుకొని వారిని చావచితక్కొట్టాడు. అప్పటికీ శాడిజం చల్లారక స్థానిక డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ వద్ద ఉన్న న్యూ శ్రీకాకుళం బ్లడ్‌ బ్యాంక్‌కు తీసుకువెళ్లి అక్కడి ఇన్‌ఛార్జి తొత్తిడి మణికంఠ కేబిన్‌కు తీసుకువెళ్లి ఇదే అమ్మాయిలను అక్కడ కూడా చితక్కొట్టినట్టు బాధితులు మీడియాకు తెలిపారు. బీవీ రమణ ఆర్మీకు వెళ్లడానికి కోచింగ్‌ ఇచ్చేవాడో, మిలిటెంట్‌ గ్రూపులకు సహకరించేవాడో తెలీదు గానీ తన వద్ద చదువుతున్న విద్యార్థులకు మాత్రం నరకం చూపించేవాడు. 25 నుంచి 30 మంది విద్యార్థులను ఒక యూనిట్‌గా ఏర్పాటుచేసి, ఆ యూనిట్‌లో ఏ ఒక్కరు రమణ మాట వినకపోయినా మొత్తం 30 మందిని చావచితక్కొట్టేవాడు. అలా అన్ని యూనిట్లలో అందరూ ఆడ, మగ తేడా లేకుండా రమణ చేతిలో నిత్యం దెబ్బలు తిన్నవారే. ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానని విద్యార్థుల నుంచి నేరుగా లక్షల రూపాయలు ఇంటి నుంచి తెప్పించి తన ఛాంబర్‌లో తీసుకునేవాడు. ఈ సమయంలో కేబిన్‌లో ఉన్న సీసీ కెమెరాలను ఆపేయడంతో పాటు విద్యార్థుల వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్లను కూడా వేరేచోట పెట్టి కేవలం కరెన్సీని మాత్రమే పట్టుకు రమ్మని చెప్పేవాడు. ఎవరైనా ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకురాకపోతే బండబూతులు తిడుతూ వారిని చిత్రహింసలు పెట్టి వేధించేవాడు. విద్యార్థుల నుంచి నేరుగా సొమ్ములు తీసుకున్న కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులను పిలిపించి మీ అబ్బాయి క్రమశిక్షణగా లేడని, ఆర్మీకి పనికిరాడని అధికారులు తేల్చేశారని, అయినా తాను ప్రయత్నిస్తున్నానంటూ మభ్యపెట్టేవాడు. ఇక అమ్మాయిలకైతే వారి కేరెక్టర్‌ మీద నిందలు వేసి పోయిన డబ్బు పోయింది, తమ కుమార్తెకు వ్యతిరేకంగా ఎక్కడా ప్రచారం చేయొద్దని రమణతో కాళ్లబేరానికి వచ్చేటట్టు చేసుకునేవాడు. ఇక కొంతమంది విద్యార్థినులను లొంగదీసుకోడానికి రమణ నేరుగా బ్యాడ్‌ ప్రోపగండా చేసి బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని స్వయంగా విద్యార్థినులే కొందరు మీడియా ముందు మొరపెట్టుకున్నారు. అమ్మాయిలతో రమణ అండర్‌వేర్‌తో సహా అన్ని బట్టలు ఉతికించడం, తన కేబిన్‌ క్లీన్‌ చేయించడం వంటివి చేసేవాడు. ఈ సమయంలో సీసీ కెమెరాలు ఆన్‌ చేసి, ఆ వీడియోను మార్ఫింగ్‌ చేసి బయటకు వదుల్తానని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని బాధితులు తెలిపారు. రమణ పర్సనల్‌ ల్యాప్‌టాప్‌, ఆయన కారు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. ఈ రెండూ శ్రీకాకుళం మండలంలోనే ఉంటున్న రమణ సోదరి వద్ద ఉన్నట్టు తెలుస్తుంది.


 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page