top of page

నిబంధనల ఫీట్లు.. పెన్షనర్ల పాట్లు!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ఒక్కో ప్రభుత్వంలో ఒక్కో రకమైన మార్గదర్శకాలు

  • ఏడు నెలలుగా దరఖాస్తుకు అర్హుల నిరీక్షణ

  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఊసెత్తని సర్కారు

  • రేషన్‌కార్డు మంజూరుకు ఇక వివాహ పత్రం తప్పనిసరి

  • తెల్ల రేషన్‌కార్డు లేకపోతే పెన్షన్‌కు అనర్హులే

ఏ ప్రభుత్వం వచ్చినా సామాజిక పెన్షన్‌ లబ్ధిదారులకు టెన్షన్‌ తప్పడంలేదు. ఒక్కో ప్రభుత్వం ఒక్కోరకమైన నిబంధనలు పెడుతుండటం వారిని గందరగోళానికి గురిచేస్తోంది. గత వైకాపా ప్రభుత్వం ఠంచనుగా ప్రతినెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ మొత్తం అందించేది. అయితే కొత్తగా పెన్షన్‌ కావాలనుకునేవారు మాత్రం గరిష్టంగా ఆరు నెలలు ఎదురుచూడాల్సి వచ్చేది. 2019కి ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏ నెలకానెల కొత్త వారిని ఎంపిక చేసేది. ఇప్పుడు అదే సర్కారు మళ్లీ అధికారంలోకి వచ్చినా కొత్త పెన్షన్ల మంజూరుపై ఇంతవరకు స్పందించలేదు. పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా తెల్లరేషన్‌ కార్డు ఉండాలి. కానీ ఆ కార్డుల జారీ నిబంధనలను మార్చడంతో అదో సమస్యగా మారే ప్రమాదం ఉంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఉంటేనే రేషన్‌కార్డులు ఇవ్వాలని చంద్రబాబు సర్కారు స్థూలంగా ఒక నిర్ణయానికి రావడంతో ఆ ప్రభావం పెన్షన్‌ దరఖాస్తుదారులపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గతంలో టీడీపీ సర్కారు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలతో పరిశీలన జరిపించి గ్రామ కార్యదర్శుల ద్వారా కొత్త పెన్షన్లు మంజూరు చేసేది. ఆ ప్రభుత్వంలో ఒకటి రెండు నెలలు ఏవో కారణాలతో పింఛను తీసుకోని వారికి గరిష్టంగా మూడునెలల వరకు ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఉండేది. దాంతోపాటు కొత్త పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేది. అందిన దరఖాస్తులను వారానికోసారి పరిశీలించి నెలాఖరు నాటికి అర్హులైనవారి జాబితా ప్రకటించేది. ఆ మరుసటి నెల నుంచే వారు పింఛన్‌ అందుకునేవారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానానికి బ్రేక్‌ పడిరది. వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల వద్దకు వెళ్లి బయోమెట్రిక్‌, ఐరిష్‌ ద్వారా పింఛన్లు పంపిణీ చేసేవారు. అయితే ఒక నెల పింఛను అందుకోలేకపోతే అంతే సంగతులు.. వచ్చే నెల దాన్ని కలిపి కాకుండా ఆ నెల పింఛన్‌ మాత్రమే ఇవ్వడం ప్రారంభించారు. ఇలా వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోనివారికి మూడో నెల నుంచి పూర్తిగా కట్‌ చేసేసేవారు. మళ్లీ దాన్ని పునరుద్ధరించుకోవడానికి లబ్ధిదారులు సచివాలయంలో దరఖాస్తు చేస్తే వారితో ఈకేవైసీ చేయించి తర్వాత నెలలో పింఛను మంజూరు చేసేవారు. దీనివల్ల వలస వెళ్లిన లబ్ధిదారులు నష్టపోతున్నారు. ఈ నిబంధనను పునఃసమీక్షించాలని వలస లబ్ధిదారులు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు

ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు కూటమి ప్రభుత్వం జూలై నుంచి పింఛన్లు పెంచడంతోపాటు అంతకుముందు మూడు నెలల ఎరియర్స్‌ కూడా అందించింది. అయితే జూలైలో పింఛన్‌ అందుకోలేనివారికి ఎరియర్స్‌ ఇవ్వలేదు. ఇలా ప్రతినెలా పలువురు లబ్ధిదారులు పింఛన్లు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని సెర్ప్‌ అధికారులు చెబుతున్నారు. అలాగే లబ్ధిదారుల్లో సగటున ప్రతినెలా 1100 మంది మరణిస్తున్నారని అంచనా. పింఛన్ల మొత్తం పెంచారు బాగానే ఉంది. కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారోనని అర్హులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మార్చి నెల నుంచి కొత్త దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. మే నాటికి శ్రీకాకుళం జిల్లాలో 16 కేటగిరీలకు చెందిన 3,20,886 మంది లబ్ధిదారులకు రూ.93.67 కోట్లు విడుదల చేశారు. అదే జూన్‌ నెలలో 3,19,702 మంది లబ్ధిదారులకు రూ.93.30 కోట్లు ఇచ్చారు. పింఛన్‌ మొత్తాల పెంపు అమలు చేసిన జూలైలో 3,19,119 మందికి రూ.118.39 కోట్లు విడుదల చేశారు. ఈ నెలలో 3,18,017 మంది లబ్ధిదారులకు రూ.129.78 కోట్లు చెల్లించారు. ఇందులో 3,15,121 మందే పింఛన్లు అందుకున్నారు. మిగతా 2896 మందిలో 1139 మంది మృతిచెందగా 25 మంది ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించారు. 45 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 704 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా 987 మందిని తాత్కాలిక వలసదారులుగా అధికారులు గుర్తించారు. అదే మే నెలలో 3,20,886 మంది లబ్ధిదారుల్లో 3,15,121 మందే పింఛన్లు అందుకోగలిగారు. ఈ విధంగా మూడు నెలల్లో మొత్తం 5,765 మంది పింఛన్లు అందుకోలేదు. వీరిలో 3200 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వారిని వలసదారులుగా చూపిస్తున్నారు.

ఏడు నెలలుగా అభాగ్యుల ఎదురుచూపులు

గత వైకాపా ప్రభుత్వం నవశకం పేరుతో సచివాలయాల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించేది. ఏడాదికి రెండు పర్యాయాలే కొత్త పింఛన్లను మంజూరు చేసేది. జనవరి నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి జూలైెలో, జూలై తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తూవచ్చారు. ఈ ఏడాది జనవరిలో వివిధ కేటగిరీల్లో సుమారు ఏడువేల మంది కొత్తవారికి పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియకు పూర్తిగా బ్రేక్‌ పడిరది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి అయినా కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ వర్తింపజేస్తామన్ని ఎన్నికల హమీపై కూటమి పెద్దలు నోరు మెదపడం లేదు. జాతీయ ఆహార భద్రతా చట్టంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా గత వైకాపా ప్రభుత్వం పింఛన్ల మంజూరుకు కఠినమైన నిబంధనలు అమలు చేసింది. ఈ మార్గదర్శకాలను సులభతరం చేయాలని దరఖాస్తుల తిరస్కరణకు గురైన లబ్ధిదారులు కోరుతున్నారు. దీన్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం మరో కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చింది. కొత్త రేషన్‌కార్డు జారీ చేయాలంటే వివాహ నమోదు ధ్రువపత్రం తప్పనిసరి చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌కార్డులు లేని కొత్త జంటలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా సుమారు ఎనిమిది వేలమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోసం ఏడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. వీరిలో 60 ఏళ్లు దాటినవారే ఎక్కువ మంది ఉన్నారు. రాజకీయ కారణాలతో తిరస్కరణకు గురైనవారు కూడా చాలామందే ఉన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page