నోబెల్ బహుమతి విజేతల ముఖపత్రకారుడు
ప్రపంచంలోనే అరుదైన అవకాశం దక్కించుకున్న వైనం
ముచ్చటపడుతున్న నెటిజన్లు

ప్రతిఏటా నోబెల్ బహుమతుల ప్రకటన అక్టోబరు నెలలో జరుగుతుంటుంది. వివిధ విభాగాలలో విజేతల పేర్లను ప్రకటిస్తూనే నోబెల్ కమిటీ వారి అసలు ఛాయాచిత్రాలను (ఫోటోలు) కాకుండా బ్లాక్ అండ్ గోల్డ్ రేఖాచిత్రా (పోర్ట్రేయిట్)లను విడుదల చేస్తుండడం మీరు గమనించే ఉంటారు. ఆ బొమ్మలను వేసేది స్వీడన్‌కు చెందిన నిక్లస్ ఎల్మహద్. ఈయన ఒక విజువల్ ఆర్టిస్ట్. 2021లో ఆ ఆర్టిస్టు పేరును నోబెల్ కమిటీ ప్రకటించేవరకూ ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఇప్పటికీ ఆయన వేసిన ఛాయాచిత్రాలు సంపాదించిన పేరు ప్రఖ్యాతులను ఇంకా ఆయన సంపాదించలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆయన పేరు చాలామందికి తెలియదు కనుక. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే, నోబెల్ బహుమతి విజేతల వివరాలు ఈ ప్రపంచంలో ముందు తెలిసేది ఆయనకే. ఎందుకంటే వారి బొమ్మలు గీయాలి కనుక. నిజానికి నోబెల్ కమిటీ సభ్యుడుగాని, జ్యూరీతో ఎటువంటి సంబంధమూ లేని ఈ ఆర్టిస్టు గీసిన బంగారు తాపడపు చిత్రాలనే ప్రపంచంలోని అన్ని పత్రికలు, టీవీ చానెళ్లు వాడి విజేతల వివరాలను వెల్లడి చేస్తాయి. ఆ తర్వాత విజేతలను మీడియా సంస్థలు వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసి వారి ఫోటోలు ప్రచురిస్తాయి. 2012 నుంచి నోబెల్ విజేతల స్వర్ణమయ చిత్రాలను గీస్తున్నది ఈయనే కావడం మరో విశేషం.
సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశం
సాధారణంగా శాస్త్రవేత్తలు వారివారి ప్రపంచాలలో దాదాపుగా బందీలై ఉంటారు. సెలబ్రిటీల మాదిరిగా వారి వివరాలు, ప్రత్యేకంగా ఫోటోలు ఇంటర్‌నెట్లో దొరకవు. ఒకవేళ దొరికినా అవి చాలా తక్కువ రిజల్యూషన్‌లో ఉంటాయి. అవి ఆయా ప్రయోగశాలల వెబ్‌సైట్ స్టాఫ్ వివరాల పేజీలలో దొరుకుతాయి. లేదంటే వారి రెజ్యూమ్‌లలో దొరుకుతాయి. అందుచేత అవి పత్రికలలో ప్రచురించడానికి, టీవీలలో చూపించడానికి ఇబ్బందిగా ఉండేది. వారికి ఫోటోలు అడిగినట్లయితే విజేతల వివరాలు ఊహించడానికి ఆస్కారముంటుంది. దీనివల్ల నోబెల్ కమిటీ న్యాయమూర్తుల మీద అనవసర వత్తిడి పెరుగుతుంది. ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి విజేతల ఛాయాచిత్రాలను వేయించి అందించడమే పరిష్కారమని నోబెల్ కమిటీ భావించింది. ఒకసారి ‘‘పాపులర్ సైన్స్’’ మాసపత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు చిత్రకారుడు ఎల్మెహద్ ఈ విషయాలు పంచుకున్నాడు.
2012లో నోబెల్ మీడియా డైరక్టర్‌గా అతనికి ఉద్యోగం లభించింది. అప్పట్లో నలుపు తెలుపు చిత్రాలే వేసేవాడు. అయితే 2017లో నోబెల్ కమిటీ ఈ చిత్రాలలో మార్పులు తీసుకురావాలని తలచింది. దానికి బంగారపు పూత పూయాలన్నది నోబెల్ కమిటీ ఆలోచన. దానిని సాధించడానికి ఒక ఆరు నెలలు కృషి చేసాడు. చివరకు తెలుపు యవనిక మీద నలుపు గీతలకు స్వర్ణతావిని పూతగా పూయాలన్న ఎల్మెహద్ ఆలోచనకు నోబెల్ కమిటీ ఓకె చెప్పింది. మొదట్లో ఈ బంగారు తాపడపు చిత్రాలను పూర్తి చేయడానికి రోజుల తరబడి సమయం పట్టేది కాని, ఇప్పుడు మాత్రం కొన్ని గంటల వ్యవధిలో చిత్రాలను అందివ్వగలుగుతున్నానని ఆయన చెప్పాడు. ఆయన వేసిన పలువురు విజేతల ముఖచిత్రాలతో పాటు నోబెల్ బహుమతులకు సంబంధించిన అనేక ఇతర చిత్రాలను కూడా ఆయన వెబ్‌సైట్‌లో చూడవచ్చు. https://niklaselmehed.com/
-దుప్పల రవికుమార్
Comentarios