నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు
- NVS PRASAD

- Apr 25
- 3 min read
ఆప్ బలహీనతలు తెలిసున్నవాడిని లాగేసుకున్న బీజేపీ
వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై ఇప్పట్నుంచే వ్యూహం
ఆప్ కొంప ముంచనున్న సందీప్ పాఠక్
రాఘవ్ చద్దాతో ‘సత్యం' ముఖాముఖి

అనుకున్నట్టుగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం వల్ల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? లేదూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను ఆ పదవి నుంచి ఆప్ తొలగించిందా? అనేది చూసే విధానం బట్టి మారిపోతుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్ప్పుడు చద్దాను ఇంటర్వ్యూ చేశాను. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు ‘సత్యం’తో పంచుకున్నారు. అయితే అవి అంతకు ముందు రాజ్యసభలో లేవనెత్తిన అంశాలు కావడంతో దాన్ని ఇంటర్వ్యూ రూపంలో కాకుండా రాఘవ్ చద్దా స్పీచ్‌లు “సామాన్యుడే ‘శర’మెత్తితే!” శీర్షికన ‘సత్యం’ కొద్ది రోజులు ధారావాహిక అందించింది. పార్లమెంట్ కారిడార్‌లో నేను చద్దాతో మాట్లాడుతుండగానే పార్లమెంట్ రెండు సభల నుంచి వస్తున్న కొందరు సాధుపుంగవులకు (బీజేపీ ఎంపీలకు) రాఘవ్ చద్దా పాదాభివందనం చేయడం చూశాను. బహుశా కామన్ మేన్ సమస్యలు మాత్రమే ప్రస్తావించి ప్రభుత్వాన్ని పెద్దగా ఇరుకున పడేటట్టు చేయకపోవడం వల్ల బీజేపీ ఎంపీలకు కూడా ఈయనపై సానుకూలత ఉందని భావించాను. అదే సమయంలో పార్లమెంట్ లోపలి నుంచి బయటకు వస్తున్న ఎంపీలు పార్టీలతో ప్రమేయం లేకుండా జోకులు వేసుకుంటూ కనిపించడంతో ఇక్కడ ఇదంతా షరా మామÖలేమో అనుకున్నాను. కానీ ఎక్కడో బీజేపీతో చద్దాకు సత్సంబంధాలు ఉన్నాయనిపించింది. ఎందుకంటే.. ఎన్డీయేకు సంబంధించి గాని, ఆప్‌లో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌పై గాని మాట్లాడటానికి చద్దా నిరాకరించారు. బహుశా అప్పటికే ఆయనకు పదవి పోతుందనే సమాచారం ఉండుంటుందేమోనని ఇప్ప్పుడు అర్థమవుతుంది. చద్దా కూడా నాతో మాట్లాడినప్ప్పుడు తన వీడియోలు సోషల్ మీడియాలో విరివిగా ఉన్నాయని, దాన్ని వీలైనంత వైరల్ చేయాలని కోరారు. సామాన్యుడు తరఫున గొంతెత్తే నేతగా ఎంత వేగంగా పేరు తెచ్చుకున్నారో అంతే వేగంగా ఆప్ నుంచి అవమానకరంగా నెట్టివేయబడ్డారు. అయితే చద్దా ఆప్‌కు రాజ్యసభలో బలం లేకుండా తనతో పాటు ఆరుగుర్ని బీజేపీలోకి తీసుకుపోయారు. ఇది ఊహించని పరిణామం. చద్దా మాటల్లో చెప్పాలంటే.. తన ఎదుగుదలను కేజ్రీవాల్ చూడలేకపోయారు. ఈ కోణంలో మాత్రమే ఈ కథనాన్ని అందిస్తున్నాం.

రాబర్ట్ గ్రీన్ రాసిన ప్రసిద్ధ గ్రంధం ‘48 లాస్ ఆఫ్ పవర’లో మొదటి సూత్రం ‘నెవ్వర్ ఔట్‌షైన్ ది మాస్టర్'. అంటే నీ యజమానికి కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు. ఇక్కడ రాఘవ్ చద్దాకు అదే జరిగింది. ఆమధ్య జరిగిన ఓ సర్వేలో ప్రధాని పదవి రేస్‌లో రాఘవ్ చద్దా పేరు వచ్చింది. అదే సమయంలో కేజ్రీవాల్ గ్రాఫ్ తగ్గింది. ఒక లీడర్ తన జూనియర్ని ప్రోత్సహించినంత కాలం అంతా బాగుంటుంది. ఎప్ప్పుడైతే ఆ జూనియర్ తన స్థాయిని దాటి స్వతంత్రమైన ఇమేజ్ బిల్ట్ చేసుకుంటాడో, అప్ప్పుడు లీడర్‌లోని త్రెట్ పర్సెప్షన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ పనితీరు కంటే భయం ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఉన్న వ్యక్తులు తరచుగా పవర్ యాంగ్జైటీకి లోనవుతుంటారు. అప్ప్పుడు లాజిక్ పని చేయదు. రాఘవ్ చద్దా పార్టీకి అస్సెట్టా? కాదా? అని పక్కన పెడితే, సైకలాజికల్‌గా ఆయన ఎదుగుదల కేజ్రీవాల్‌కు తన పట్టు సడలుతుందనే అభద్రతను కలిగిస్తుంది. అందుకే లీడర్లు టాలెంట్ ఉన్నవారి కంటే విధేయత ప్రదర్శించేవారికే ప్రాధాన్యత ఇస్తారు. టాలెంట్ ఉన్నవాడు ప్రశ్నిస్తాడు, లేదా అధిగమిస్తాడు. కానీ విధేయుడు అనుసరిస్తాడు. కార్పొరేట్ రంగంలో బాస్ కంటే స్మార్ట్‌గా ఉండే ఎంప్లాయ్‌కి ప్రమోషన్ కంటే సైడ్ లైన్ అయ్యే అవకాశాలే ఎక్కువ. తండ్రి ఆధిపత్యం ఉన్న కుటుంబాల్లో కొడుకు కెరీర్ పరంగా సక్సెస్ అయినా, ఇంటిలో నిర్ణయాల్లో అతనికి ప్రాధాన్యత దక్కకపోవచ్చు. దీనికి సైకాలజీలో సబ్టిల్ సప్రెసింగ్ అంటారు. అయితే ఈ కథకు ఇంకో కోణం నుంచి మాట్లాడితే అసలు ఆప్ బీజేపీకి బి`పార్టీ అనే ప్రచారం కూడా ఉంది. అన్నాహజారే దీక్ష ద్వారా తెర మీదకు వచ్చిన ఆప్ ఏమేరకు ఢిల్లీలో లబ్ధి పొందిందో అంతకు మించి కేంద్రంలో మేలు చేకూర్చింది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులెవరూ ఉండరు. ఢిల్లీ నుంచి పంజాబ్‌కు ఎప్ప్పుడైతే ఆప్ విస్తరించిందో.. బీజేపీ కన్ను ఆ పార్టీపై పడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. సరిగ్గా కేజ్రీవాల్‌కు మద్యం కుంభకోణం నుంచి విముక్తి లభించిన తర్వాత బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. అందుకు ఆప్ తురుపుముక్క రాఘవ్ చద్దాను వాడుకున్నట్టు కనిపిస్తుంది.
అసలు గేమ్ ఏమిటి..
7 మంది ఆప్ ఎంపీలు పార్టీ మారడం పెద్ద విషయం లాగా కనిపిస్తున్నా, ఈ కథలో అసలు కీలక వ్యక్తి సందీప్ పాఠక్. ఇది కేవలం నాయకుల మార్పు కాదు.. ఒక ఎలక్షన్ సిస్టమ్ మార్పు. పాఠక్ ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు.. డేటా ఆధారిత వ్యూహాలతో ఎన్నికల ఫలితాలను మార్చగల ఎలక్షన్ ఇంజినీర్. ఈయన్ని ప్రత్యేకంగా పంజాబ్ ఎన్నికలకు రెండేళ్ల ముందు పంజాబ్‌కి పట్టుకొచ్చారు.
పంజాబ్ విజయం వెనుక అసలు మోడల్
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో 92 సీట్ల భారీ విజయానికి కారణం ఈ డేటా మోడల్. ఈయన పంజాబ్‌లో మిస్డ్‌కాల్ చేయి, నీ సీఎం చాయిస్ చెప్పు అనే డిజిటల్ క్యాంపెయిన్ నడిపారు. సంప్రదాయ పార్టీలు స్థానిక నేతల ఫీడ్‌బ్యాక్‌పై ఆధారపడితే, ఈ మోడల్‌లో ప్రతి ఓటర్‌ను ఒక డేటా పాయింట్‌గా చూసారు. మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా లక్షల మొబైల్ నెంబర్లు సేకరించి, ఓటర్ల ఆసక్తి, భావోద్వేగాలను మ్యాప్ చేసి టార్గెట్ క్యాంపెయిన్లు చేశారు.
మైక్రో టార్గెటింగ్ ఎలా పని చేసింది?
ప్రతి నియోజకవర్గాన్ని చిన్న గ్రూపులుగా విభజించారు. మహిళలు, యువత, రైతులు, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ. ప్రతి వర్గానికి వేర్వేరు మెసేజ్, వేర్వేరు వాగ్దానాలు. అదే సమయంలో గ్రౌండ్ టీమ్స్ ద్వారా ఓటర్ల మూడ్, స్థానిక సమస్యలు, ప్రతిపక్ష బలహీనతలు నిరంతరం ట్రాక్ చేశారు. ఇది ఒక రాజకీయ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లా పని చేసింది.
స్వింగ్ సీట్లు ఎలా గెలిచారు?
ఒక సీటు గెలవడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందని డేటా చూపిస్తే, వెంటనే భారీ ర్యాలీలు, హైపర్-లోకల్ క్యాంపెయిన్లు, సోషల్ మీడియా బూస్ట్, ఇలా ఫోకస్ పెంచి ఆ సీట్లను గెలిచేలా చేశారు.
ఇప్పుడు గేమ్ ఎందుకు మారుతుంది?
ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. డేటా మాత్రమే కాదు.. ఆ డేటాను ఎలా ఉపయోగించాలో తెలిసిన వ్యక్తి కూడా కీలకం. సందీప్ పాఠక్ వంటి స్ట్రాటజిస్ట్ మారితే, అదే మోడల్ మరో పార్టీకి వెళ్తుంది. అంటే ఒక పార్టీ స్ట్రెంగ్త్, మరో పార్టీకి ఆయుధంగా మారే అవకాశం.
బీజేపీకి లాభం ఏమిటి?
భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పంజాబ్‌లో బలహీనంగా ఉన్నా, ఇప్పుడు డేటా ఆధారిత వ్యూహాలతో ముందుకు రావచ్చు. ఆప్ బలహీనతలు లోపల నుంచి అర్థం చేసుకోవచ్చు, స్వింగ్ ఓటర్లపై కచ్చితమైన టార్గెటింగ్ చేయవచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తిగా అయిపోకుండానే, ఫలితాలు రాకుండానే, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల మీద బీజేపీ దృష్టి పెట్టి, పని అప్పుడే మొదలు పెట్టింది.
బీజేపీ పెద్ద నాయకులంతా అక్కడ ఎన్నికల ప్రచారంలో హడావుడిగా, ఉంటే బీజేపీ అధ్యక్షుడు తన పార్టీ వ్యవహారాల్లో పండిపోయిన బీఎల్ సంతోష్, తరుణ్ చుగ్, ధర్మేంద్ర ప్రధాన్, వినోద్ తావ్డేలతో ఒక జట్టు ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో పని ఎప్పుడో మొదలు పెట్టారు. బీజేపీ ఇలా తవ ఎలక్షన్ మిషినరీని అలుపెరగకుండా వాడుతుంది కాబట్టే దానికి ఫలితాలు కూడా వస్తాయి. గెలుపు ఓటమిలతో పని లేకుండా క్షేత్ర స్థాయిలో కష్టపడతారు. ఏ రాష్ట్రంలో ఏ వ్యూహం పనికొస్తుందో దాన్ని వర్క్ ఔట్ చేస్తారు.
ఇది కేవలం పార్టీ మార్పు కాదు.. ఇది డేటా యుద్ధం. పాత రాజకీయాలు ‘నాయకుడు+కులం+డబ్బు’పై నడిస్తే, కొత్త రాజకీయాలు ‘డేటా+వ్యూహం+అమలు’పై నడుస్తున్నాయి. చివరికి గెలిచేది ఎవరు అంటే.. డేటా ఉన్నవాడు కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించినవాడు.






Very nice analasis anna