top of page

నాయనా.. బాబూ‘రావా’!

Writer: ADMINADMIN
  • విధులకు డుమ్మా కొడుతున్న డీఎంహెచ్‌వో కార్యాలయ ఏవో

  • ఆయన గైర్హాజరీతో ఫైళ్లు, ఇతర పనులన్నీ పెండిరగ్‌

  • అక్రమ వ్యవహారాలకే ప్రాధాన్యం.. ముఖం చూపించి వెళ్లిపోతున్న వైనం

  • మంత్రి అచ్చెన్నాయుడు మందలించినా మారని తీరు


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘బాబూ.. నువ్వెక్కడున్నా తొందరగా రా నాయనా! నీ కోసం ఇక్కడ అందరూ బెంగ పెట్టుకున్నారు. నువ్వు లేకపోవడం వల్ల, నువ్వు రాకపోవడం వల్ల ఏం చేయాలో మాకు తోచడంలేదు. నువ్వెక్కడున్నా అర్జంటుగా రావాలని కోరుకుంటున్నాం.’

..ఇది తప్పిపోయిన చిన్నపిల్లాడి కోసం తల్లిదండ్రులు ఇచ్చిన ప్రకటన కాదు. స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏవోగా పని చేస్తున్న బాబూరావు కోసం సంబంధిత కార్యాలయ ఉద్యోగులు రోజూ ఫోన్లు చేసి బతిమాలి మరీ ఆఫీసుకు రప్పిస్తున్న కథ ఇది. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏవోగా పని చేస్తున్న బాబూరావు రెగ్యులర్‌గా కార్యాలయంలో ఉండరు. ఒకవేళ ఉండక తప్పని పరిస్థితి వస్తే కొద్ది గంటలు మాత్రం సీట్లో కూర్చుని వెళ్లిపోతారు. ఏవోయే అన్ని ఫైళ్లపై సంతకాలు చేయాల్సి ఉండటంతో ఆయన్ను వెతికి పట్టుకుని కార్యాలయానికి రప్పించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. ఆయన కార్యాలయంలో సక్రమంగా ఉండటం లేదని ‘సత్యం’కు ఉప్పందిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెళ్లి చూడగా.. డ్యూటీ అవర్స్‌లో ఆయనగారు కనిపించలేదు.

వసూలు, సెటిల్‌మెంట్లపైనే దృష్టి

రిమ్స్‌లో ఎస్టాబ్లిష్‌మెంట్‌ సూపరింటెండెంట్‌గా బాబూరావు పని చేసిన కాలంలో డయాలసిస్‌ యూనిట్‌కు సంబంధించి 12 అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేశారు. ఈ సమయంలో అభ్యర్థుల నుంచి సొమ్ము వసూలుచేసే బాధ్యతను బాబూరావు ఒక మధ్యవర్తికి అప్పజెప్పారట. ఆ మేరకు డయాలసిస్‌ అసిస్టెంట్ల నుంచి సొమ్ము దండేసిన సదరు మధ్యవర్తి దాన్ని బాబూరావుకు ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో ఆ కలెక్షన్‌ కోసం బాబూరావు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌సీ హాజరు వేసేసుకుని ఆయన వెళ్లిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. రిమ్స్‌లో ఉండిపోయిన సొమ్ముల కోసం డీఎంహెచ్‌వో కార్యాలయ విధులకు ఎగనామం పెడుతున్నారని ఆరోగ్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఆ మధ్య ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, స్వీపర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 114 మందికి రెండు నెలలుగా జీతాల బిల్లు పెట్టకపోవడంతో వారంతా రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో అచ్చెన్న తనదైన శైలిలో బాబూరావును పిలిచి క్లాస్‌ పీకి జీతాలు ఇప్పించారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేసి చనిపోయిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలివ్వాలని ఫైలు పెట్టారు. కానీ బాబూరావు రెండు నెలలు ఆ ఫైలుపై సంతకం చేయకుండా తాత్సారం చేశారనడానికి ఆధారాలున్నాయి. వీటిలో ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు చొప్పున బేరం పెట్టారని, అది కుదరకపోవడంతో రెండు నెలలుగా వారి నియామకాలను తొక్కిపెట్టేశారని తెలుస్తోంది. దీనిపై బాధితులు కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్‌ టైమ్‌లో ఖర్చు చేసిన రూ.4 కోట్లకు ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే ఈ ఏడాది మార్చితో బిల్స్‌ ల్యాప్స్‌ కావడంతో మళ్లీ కొత్తగా రీ వ్యాలిడేషన్‌ చేయాల్సి ఉంది. అలా చేయకుండా జూన్‌లో ప్రొసీడిరగ్స్‌ ఇవ్వడం వల్ల ట్రెజరీలో ఈ రూ.4 కోట్ల బిల్లులు ఆగిపోయాయి. వాస్తవానికి అకౌంటెంట్‌ శివ, ఏవో తాత్సారం చేయడంలో దిట్టలుగా పేరు పొందారు. డీఎంహెచ్‌వో కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అకౌంటెంట్‌ శివ ఇల్లు ఉండటంతో ఆయన అక్కడి నుంచే కార్యాకలాపాలు జరుపుతున్నారు. ఈయనకు ఏవో తోడవడంతో కారుణ్య నియామకాల దగ్గర్నుంచి జీతాల వరకు ఆయన సంతకం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.



Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page