పట్టపగలే దొంగతనాలు, వ్యభిచారం
గంజాయిబాబులకు, తాగుబోతులకు అడ్డా
గ్రీవెన్స్‌లో చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేసిన సచివాలయం
కుటుంబంతో రోడ్డెక్కాలంటే హడలిపోతున్న జనం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం క్రైం)
రెండు రోజుల క్రితం నగరం నడిబొడ్డులోని న్యూకాలనీలో జరిగిన ఒక వివాహిత హత్య ఘటన ద్వారా ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన న్యూకాలనీ వాస్తవానికి గత కొన్నేళ్లుగా నగరంలో జరుగుతున్న క్రైమ్‌కు కేంద్రంగా మారిందన్న విషయం తెలిస్తే పోలీసులు కొట్టిపారేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న నేరాలు, ఘోరాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ కాలనీలో నివసిస్తున్న ప్రజలను అడిగిచూడాలి.
అఫీషియల్స్ ఉండే న్యూకాలనీ ఏమిటి? నేరాలకు అడ్డాగా మారడమేమిటి అన్న ప్రశ్న ఎవరికైనా తలెత్తితే కచ్చితంగా వారు ఇక్కడ క్రిమినల్ లాజిక్ మిస్సయినట్టే. ఎక్కడైతే తాము, తమ కుటుంబం, తమ ఉద్యోగం అనుకొని ప్రజలు బతుకుతారో అక్కడే నేరస్తులు అడ్డాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ విషయం పోలీసులకు తెలుసు. అలా అని వారేదో శోధించి, ఛేదించి కనిపెట్టింది కాదు. స్వయంగా తమ కాలనీలో పట్టపగలే భార్యాబిడ్డలతో ఇంటి గేటు బయట అడుగు పెట్టలేకపోతున్నాం మహాప్రభో అంటూ అప్పటి రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావును కలిసి న్యూకాలనీవాసుల సంఘం విన్నవించింది. ఆ తర్వాత 2023 చివరిలోనే కలెక్టర్ గ్రీవెన్స్‌కు వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. అప్పటికి ఆ ఫిర్యాదు ఆ గ్రీవెన్స్‌లో ఇవ్వడం నాలుగోసారి. కానీ దీని మీద అప్పటి పోలీసు గాని, మున్సిపాలిటీ గాని ఎటువంటి చర్యలూ తీసుకోలేదు సరికదా.. కలెక్టర్ గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదును నిర్ధిష్ట సమయంలో పరిష్కరించాలన్న నిబంధన ఉండటంతో స్వయంగా ఫిర్యాదు చేసినవారి వద్దకే వచ్చి తమ సమస్య పరిష్కారమైపోయిందంటూ ఒక డిక్లరేషన్ తీసుకున్నారు. న్యూకాలనీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రానప్పుడు సమస్య పరిష్కరించారని తామెలా అంగీకరిస్తామంటూ కాలనీ సంఘం పెద్దలు ప్రశ్నిస్తే వారి మీద రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు పరిష్కారమైనట్టు బలవంతంగా సంతకం చేయించారు. అంటే ఇక్కడ జరుగుతున్న క్రైమ్‌కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అప్పటి వార్డుస్థాయి నాయకుల ప్రమేయం ఉందని అర్థమవుతుంది.
ప్రస్తుతానికి వస్తే శనివారం రాత్రి మర్డర్ జరిగిన భవనానికి 15 అడుగుల దూరంలోనే గంజాయిబాబులు, తాగుబోతుల అడ్డా ఉంది. వార్డు రాజకీయంలో భాగంగా వ్యాపారం చేయకపోయినా రోడ్డుకు ఒక పక్కన డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు ఆసుపత్రి ఎదురుగా కొంతమంది బడ్డీలను నిలిపారు. ఇప్పుడు ఈ బడ్డీల వెనుక ప్రాంతమే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా. పక్కనే ఉన్న పాన్‌షాపు నుంచి సిగరెట్ కొనుక్కోవడం, అందులో పొగాకును తీసి గంజాయి దట్టించి ఆ రోడ్డు మీదే రాత్రీపగలూ తూగుతుండటం కాలనీవాసులందరికీ తెలుసు. ఇక ఇక్కడ బడ్డీల్లో మందు అమ్మకపోయినా ఏకంగా తాగడం కోసం సిమెంట్ దిమ్మను కూడా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న పాన్‌షాపులో సోడాలు, నీరు కొనుక్కుని రాత్రీపగలు ఇక్కడ తాగుతున్నారు. ఈ విషయం మీద గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఖాళీగా ఉన్న బడ్డీల వెనక్కు వెళ్లకుండా నాలుగు కర్రలు అడ్డు పెట్టారు. ఈమాత్రం దానికే గంజాయి, మందు తాగేవారు ఆగిపోతారని పోలీసులు ఎలా భావించారో అర్థం కావడంలేదు. న్యూకాలనీలో అందరూ అఫీషియల్స్ ఉంటారు కాబట్టి తామేం చేసినా ఓ మెట్టు దిగి అడిగే ధైర్యం చేయరనేదే వీరి బలం. ఎన్నిసార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా అక్కడ సంఘ విద్రోహ కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న బడ్డీలను తొలగించలేరనేది రాజకీయం. ఈ రెండూ వెరసి న్యూకాలనీని క్రైమ్ స్పాట్‌గా తయారుచేశాయి. స్వయంగా నగరంలో పేరుమోసిన ఓ ఆడిటర్ ప్రాక్టీస్ చేస్తున్న కార్యాలయం మీదే మర్డర్ జరిగిందంటే అక్కడికి 15 అడుగుల దూరంలోనే మందు, గంజాయి 24 గంటలూ అందుబాటులో ఉంటాయంటే న్యూకాలనీ పరిస్థితి ఎలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. 1965 నుంచి 69 మధ్య మొట్టమొదటిసారిగా హౌసింగ్‌బోర్డు వేసిన వెంచర్ ఇప్పుడు వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది. శిమ్మ జగదానందం హౌసింగ్‌బోర్డు చైర్మన్‌గా పనిచేసిన రోజుల్లో పురుషోత్తపురం సర్పంచ్ కిల్లి వెంకటప్పలనాయుడు లాంటి ప్రముఖులు పట్టుపట్టడంతో హౌసింగ్‌బోర్డు తరఫున ఒక ఎకరానికి 8 ప్లాట్లు చొప్పున సుడా, ఉడా వంటి సంస్థలు లేని రోజుల్లో విశాలమైన లేఅవుట్ ఇది. అటువంటిది ఇప్పుడు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందని, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యే నిర్వహించిన గ్రీవెన్స్‌లో కూడా ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు కారణం? వంటి అంశాలపై మరో కథనంలో తెలుసుకుందాం.
Comments