top of page

నేరడి.. వీడిన చిక్కుముడి

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 11
  • 3 min read
  • అదిగో అమృతధార.. వస్తోంది వంశధార

  • బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి

  • ఆ వెంటనే కేంద్ర జలవనరుల శాఖ నోటిఫికేషన్

  • ఒడిశా కోల్పోయే 106 ఎకరాల ఖర్చు ఏపీదే

  • వంశ‘ధార’కు ఎట్టకేలకు తొలగిన అడ్డంకులు

  • నీటి లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలకు సమాన వాటా

  • నిరంతర పర్యవేక్షణకు నలుగురు సభ్యుల కమిటీ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

జిల్లాలో నదులున్నా రైతులు ఏడాదికి ఒక్క పంటను మించి పండించలేని దుస్థితి. రెండోపంట సాగుకు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు చూడాల్సిన దైన్యం. అమృతధారలు కురిపించి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న ఆశతో ఎప్పుడో ఏడున్నర దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన వంశధార సాగునీటి ప్రాజెక్టు ఒడిశా పితలాటకాల వల్ల ఇంతకాలం అసమగ్రంగా మిగిలిపోయింది. కేవలం 106 ఎకరాల ముంపు భూమి కోసం లక్షలాది ఎకరాలకు జీవం పోసే బహత్తర ప్రాజెక్టును ఒడిశా అడ్డుకుంది. సుప్రీంకోర్టు వరకు దాన్ని సాగదీసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. శ్రీకాకుళం జిల్లా రైతుల నిరీక్షణ ముగిసింది. వివాదానికి కారణమైన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. కేంద్ర జలవనరుల శాఖ ఆ మేరకు నాలుగు రోజుల క్రితమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివాదానికి ట్రిబ్యునల్ ఎలా ముగింపు పలికింది.. ఇరు రాష్ట్రాలకు విధించిన షరతులు, నీటివాటాలు ఏమిటి? అసలు ఈ వివాదానికి ఎప్పుడు ఎలా బీజం పడిందో చూద్దాం.

ఒడిశా అడ్డంకులతో తీవ్ర జాప్యం

ఒడిశాలోని కలాహండి జిల్లా కొండల్లో పుట్టిన వంశధార ఆ రాష్ట్రంలోని రాయగడ, గజపతి జిల్లాల మీదుగా మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోకి కాట్రగడ వద్ద ప్రవేశిస్తుంది. కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో Å£లుస్తుంది. దిగువ రాష్ట్రంగా మనకున్న హక్కులను ఉపయోగించుకుని శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వంశధారపై భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి 1961లో ప్రతిపాదించారు. ఆ మేరకు అంతర్ రాష్ట్ర వివాదాలు తలెత్తకుండా ఎగువ రాష్ట్రమైన ఒడిశాతో ఏపీ ప్రభుత్వం 1962లోనే ఒప్పందం కుదుర్చుకుంది. మొదట దీన్ని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. అయితే మొదట ఒప్పందం కుదుర్చుకున్న ఒడిశా తర్వాత ప్లేటు ఫిరాయించి నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలోని 106 ఎకరాలు ముంపునకు గురవుతాయంటూ అభ్యంతరం ప్రకటించింది. ఇది కాస్త ముదిరి వివాదం ట్రిబ్యునళ్లు, న్యాయస్థానాల వరకు వెళ్లడంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమైంది. దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం రెండు దశలను కాస్త మూడు దశల నిర్మాణంగా మార్చింది.

`మొదటి దశలో హిరమండలం సమీపంలోని గొట్టా వద్ద బ్యారేజ్, దానికి అనుసంధానంగా పలాస వరకు 104 కి.మీ. నిడివిన ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాలను 1977లోనే పూర్తి చేసి ప్రారంభించారు. దీనివల్ల 12 మండలాల్లో 398 గ్రామాలకు చెందిన 1,48,230 ఎకరాలకు సాగునీరు అందుతోంది.

  • ఇక రెండో దశను ఒడిశాతో వివాదం నేపథ్యంలో రెండుగా విడగొట్టారు. అందులో ఫేజ్`1 కింద 53 కి.మీ. పొడవైన కుడికాలువ నిర్మాణం, దాని వెంబడి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థల నిర్మాణాన్ని పూర్తి చేసి ఏడు మండలాల్లో 165 గ్రామాలకు చెందిన 63,276 ఎకరాలకు నీరందిస్తున్నారు.

  • ఇక కీలకమైన రెండో దశలోని ఫేజ్`2 కింద వంశధార కాలువను శివారులో ఉన్న ఇచ్ఛాపురం వరకు పొడిగించడంతోపాటు సింగిడి, పారాపురం వద్ద రెండు మినీ రిజర్వాయర్లు, హిరమండలం వద్ద ప్రధాన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. అయితే వీటికి వంశధార నుంచి నీరు సరఫరా చేసేందుకు నేరడి వద్ద బ్యారేజ్ నిర్మాణమే అతి కీలకం. కానీ 106 ఎకరాలు మునిగిపోతాయన్న ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో నేరడి బ్యారేజీకి తాత్కాలిక ప్రత్యామ్నాయంగా కాట్రగడ వద్ద సైడ్‌వియర్ (వరద కాలువ) నిర్మించి నీటిని రిజర్వాయర్లకు తరలించాలని 2005లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఒక ప్రణాళికను ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు నిర్మాణ పనులు జరుగుతుండగా.. మరోవైపు ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సూచన మేరకు వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటైంది.

పరిష్కారం ఇలా..

కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన వంశధార నదీజలాల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) ఇరు రాష్ట్రాల వాదనలను పరిశీలించి అందరికీ అంగీకారయోగ్యమైన పరిష్కారం సూచించింది. ట్రిబ్యునల్ తీర్పు మేరకు భామిని మండలంలోని నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అనుమతినిస్తూ కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ నోటఫికేషన్ జారీ చేసింది. వంశధార జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాలకు వాడుకోదగ్గ వాటా, పాటించాల్సిన షరతులను ఈ నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం..

  • నదిపై ఏపీ సరిహద్దులోని నేరడి వద్ద ఏపీ ప్రభుత్వం బ్యారేజీ నిర్మించుకోవచ్చు.

  • దీనికి రెండు హెడ్ స్లూయిస్‌లు నిర్మించాలి. ఎనిమిది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించే కుడి స్లూయిస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు నీటిని తరలిస్తారు.

  • అలాగే ఒడిశా అవసరాల కోసం బ్యారేజీకి దిగువన ఎడమవైపు మరో హెడ్ స్లూయిస్ నిర్మిస్తారు. దీన్ని ఖర్చులను ఒడిశా ప్రభుత్వామే భరించాల్సి ఉంటుంది. దీన్ని ఎంత సామర్థ్యంతో నిర్మించాలన్నది ఆరు నెలల్లోగా ఒడిశా ప్రభుత్వం ఏపీకి తెలియజేయాల్సి ఉంటుంది.

  • బ్యారేజీలో అంచనా వేసిన నీటి లభ్యత 115 టీఎంసీలు కాగా.. రెండు రాష్ట్రాలు చెరిసగం.. అంటే 57.50 టీఎంసీలు చొప్పున వాడుకునే హక్కు కలిగి ఉంటాయి. ఒకవేళ నీటి కొరత ఏర్పడితే దాన్ని కూడా రెండు రాష్ట్రాలు సమానంగా భరిస్తూ నీటి వాటాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. నీటి లభ్యత పెరిగినప్పుడు కూడా అదే నిష్పత్తిలో పెంచుకోవాల్సి ఉంటుంది.

  • ఆంధ్రప్రదేశ్ తన వాటా నీటిని ప్రతి ఏటా జూన్ ఒకటి నుంచి నవంబర్ 30 వరకు తీసుకునేందుకు అనుమతిస్తారు.

  • బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాలను ఒడిశా ప్రభుత్వమే సేకరించి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాలి. భూసేకరణ ఖర్చులను ఏపీయే ఒడిశాకు చెల్లించాలి.

  • ఈ నిర్ణయాలను, నీటి లభ్యత, విడుదల వంటి వాటిని పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్నర్ల్యీసీ) నుంచి ఇద్దరు.. ఏపీ, ఒడిశాల నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పనిచేసేందుకు అవసరమైన కార్యాలయం, ఇతర ఏర్పాట్ల ఖర్చులను ఏపీ భరించాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కమిటీ నిర్ణయాలపై అప్పీలు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దానికోసం సింగిల్ మెంబర్ రివ్యూ అథారిటీగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు.

  • నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యే వరకు సైడ్ వియర్ ద్వారా ఎనిమిది టీఎంసీల నీటి వినియోగానికి ఏపీకి అనుమతి ఇచ్చారు. ఆ నీటి తరలింపు పూర్తి అయిన తర్వాత లేదా డిసెంబరు ఒకటో తేదీన గేట్లు మూసేయాలని సూచించారు. బ్యారేజీ నిర్మాణం పూర్తి అయిన తర్వాత సైడ్‌వియర్‌ను మూసివేయాల్సి ఉంటుంది.

రెండు పంటలకు పుష్కలంగా నీరు

సుదీర్ఘ పోరాటం తర్వాత నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగడంతో ఇక దీని నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదిన పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. దీంతోపాటు చివరి దశలో ఉన్న వంశధార ప్రాజెక్ట్ రెండో దశలోని రెండో స్టేజి పనులను కూడా సత్వరమే పూర్తి చేస్తే జిల్లా చివరన ఉన్న ఇచ్ఛాపురం వరకు సాగు నీరు అందుతుంది. ఖరీఫ్‌లో 2.56 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగలగడంతోపాటు రబీ సీజనులో సుమారు రెండు లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటల సాగుకు నీరు అందించడం, అలాగే ఉద్దానంలో 807 కిడ్నీ వ్యాధి పీడిత గ్రామాలకు ఇప్పటికే అందిస్తున్న తాగునీటి సరఫరాలో ఎటువంటి అవాంతరాలు, ఇబ్బందులు లేకుండా చూడవచ్చు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page