top of page

నిర్బంధ ఓటింగ్‌ తప్పనిసరి!

Writer: DV RAMANADV RAMANA
  • `ఓటు వేయడం బాధ్యతగా భావించని దుస్థితి

  • `పోలింగ్‌కు దూరంగా సుమారు 30 శాతం ఓటర్లు

  • `నిర్లక్షభావమే దీనికి ప్రధాన కారణం

  • `ఇతర దేశాల్లో ఓటు వేయకుంటే శిక్షలు

  • `కానీ మనదేశంలో ఓటు వేయకపోయినా ఏమీ కాదు

ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఏడు దశాబ్దాలకుపైగా నిరాఘాటంగా జరుగుతున్న ఎన్నికల క్రతువు ద్వారా సామాన్యులే తమ ఓటుహక్కుతో తమ పాలకులను ఎన్నుకుంటున్నారు. తమకు నచ్చనివారిని తర్వాత ఎన్నికల్లో తిరస్కరించి ఇంటికి పంపేస్తున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే.. ఇంత పవర్‌ఫుల్‌ ఆయుధాన్ని చాలామంది వినియోగించుకోవడంలేదు. ఎన్నికల్లో నమోదవుతున్న పోలింగ్‌ శాతాలే దీనికి నిదర్శనం. దేశంలోని ఏ ఎన్నికల్లోనూ గరిష్టంగా 90 శాతానికి మించి ఓట్లు పోల్‌ కావడంలేదు. అత్యధిక పోలింగ్‌ జరుగుతున్న సందర్భాల్లోనూ అది 80`90 మధ్యే ఉంటోంది. ఎక్కువ సందర్బాల్లో 60`70 శాతం ఓట్లే పోలవుతున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ముగిసిన మూడు దశలో పోలింగ్‌లో సగటున 65 శాతం ఓట్లే పోలయ్యాయి. అంటే ప్రతి వందమంది ఓటర్లలో 35 మంది ఓట్లు వేయలేదన్నమాట. దీనివల్ల తక్కువ ఓట్లు పొందినవారు కూడా మన పాలకులుగా ఎన్నికైపోతున్నారు. ఐదేళ్లూ అధికార హోదా అనుభవిస్తూ దర్జా ఒలకబోస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది అవాంఛనీయ పరిణామం. దీనికి కారణం.. ఓటర్లే! పాలకులను ఎనుకునే మహత్తర అవకాశాన్ని, ఓటు అనే వజ్రాయుధాన్ని రాజ్యాంగం మనకు ఇచ్చింది. కానీ నిర్లిప్తత, మరే కారణాలతోనో ఓటర్లు దాన్ని చేజేతులా జారవిడుచుకుంటున్నారు.

ఓటు వేయకపోతే ఏమవుతుందిలే..!

సరిగ్గా ఇదే ఆలోచన చాలామంది ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకుంటోంది. ఓటు వేయడం, వేయకపోవడం మన ఇష్టం.. ఎవరికీ అడిగే హక్కు లేదన్న భావన, నిర్లిప్తత పోలింగ్‌ శాతం పెరగకుండా చేస్తోంది. ప్రధానంగా పట్టణ ప్రాంత ఓటర్లలో ఈ నిర్లక్ష్యభావం అధికంగా కనిపిస్తోంది. దీన్ని గుర్తించిన ఎన్నికల సంఘం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సమయాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడంలేదు. దీనికి కారణం ఓటు హక్కు వినియోగించుకోవడం మనదేశంలో స్వచ్ఛందం కావడమే. 18 ఏళ్లు దాటిన వారందరూ ఓటర్లుగా నమోదు కావాలని చెబుతున్న ఎన్నికల సంఘం, దాన్ని తప్పనిసరి చేయడంలేదు. ఓటుహక్కు వినియోగించుకునే విషయంలో ఇదే పంథా అనుసరిస్తుండటం వల్ల పోలింగ్‌ శాతం పెరగడంలేదు. ప్రజలందరూ ఓట్లు వేసేందుకే పోలింగ్‌ రోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నారు. కానీ అప్పనంగా వచ్చిన సెలవును జాలీగా అనుభవించడానికే ఉద్యోగ, ఉన్నత వర్గాలు ప్రాధాన్యమిస్తున్నాయి. చాలామంది ఆ రోజు క్యాంపులకు వెళ్లిపోయి, ఓటు వేయాలన్న బాధ్యతను గాలికొదిలేస్తున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. మనరాష్ట్రంలో పోలింగ్‌రోజు సెలవు కాగా దానికి ముందు రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం కావడం వల్ల వరుస సెలవులు వచ్చాయి. ఈ పరిస్థితికి కారణం మనదేశంలో ఓట్లు వేయడం నిర్బంధం కాకపోవడమే. ప్రపంచంలోని చాలా దేశాల్లో నిర్బంధ ఓటింగ్‌ విధానం ఉంది. ఓట్లు వేయకపోతే శిక్షలు వేయడం, జరిమానాలు విధించడం, ప్రభుత్వ సౌకర్యాలు కట్‌ చేయడం వంటివి అమల్లో ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో మాత్రం అటువంటి విధానం లేదు. నిర్బంధ ఓటింగ్‌ విధానం తీసుకురావాలన్న డిమాండ్లు చాలాకాలం నుంచీ ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా ఇతరేతరా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఓటింగ్‌ శాతం ఆశించినంతగా పెరగడంలేదు. ఈ నేపథ్యంలో నిర్బంధ ఓటింగ్‌ కోసం ఏ దేశంలో ఎటువంటి విధానాలు అమలు చేస్తున్నారంటే..

ఆస్ట్రేలియాలో..

ఆస్ట్రేలియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఎటువంటి చర్యలు ఉండవు గానీ.. జాతీయ ఎన్నికల్లో ఓటు వేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. ఓటు వేయని వారికి ఎందుకు ఓటు వేయలేదో వివరణ కోరుతూ ఎన్నికలు పూర్తయిన మూడు నెలల్లో ఈమెయిల్‌, పోస్ట్‌, ఫోన్‌ మెసేజ్‌ రూపంలో నోటీసులు పంపిస్తారు. నిర్ణీత గడువులోగా సమంజసమైన వివరణ ఇస్తే చర్యలు ఉండవు. వివరణ సక్రమంగా లేకపోయినా, వివరణ ఇవ్వకపోయినా మరో రెండుసార్లు నోటీసులు ఇస్తారు. అప్పటికీ పట్టించుకోకపోతే ఫైన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రిజిస్ట్రీకి పంపి నోటీసు ఇప్పిస్తారు. అప్పటికీ ఓటరు నుంచి స్పందన లేకపోతే అరెస్టు వారెంట్‌ ఇవ్వడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు, భారీ జరిమానా వంటి చర్యలు చేపడతారు.

బెల్జియంలో..

ఈ దేశంలో ఓటు వేయని వారికి జరిమానా విధించే చట్టాలు ఉన్నాయి. మొదటిసారి ఓటు వేయకుంటే రూ.4 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం లేకుండా చేస్తారు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి అందే ఇతర ప్రయోజనాలు సదరు ఓటరు కు అందకుండా ఆంక్షలు అమలు చేస్తారు.

గ్రీస్‌ దేశంలో..

గ్రీస్‌లో ఓటు వేయని వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ మంజూరు చేయరు. ఓటు వేయనందుకు బలమైన కారణాలు ఉన్నట్లు నిరూపిస్తేనే వాటిని కొనసాగిస్తారు. వీటితో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను కూడా నిలిపివేస్తారు. కారణం తెలుసుకున్న తర్వాత పునరుద్దరిస్తారు. అందువల్లే ఆ దేశంలో ప్రతి ఎన్నికల్లోనూ 94 శాతం ఆపైనే పోలింగ్‌ నమోదవుతుంది.

ఈ దేశాల్లో కూడా..

వీటితోపాటు అర్జెంటీనా, ఆస్ట్రియా, బొలీవియా, బ్రెజిల్‌, చిలీ, బల్గేరియా, ఈక్వెడార్‌, కోస్టారికా, ఈజిప్ట్‌, ఫిజి, ఫ్రాన్స్‌, ఇటలీ, లెబనాన్‌, మెక్సికో, లక్జెంబర్గ్‌, నెదర్లాండ్స్‌, పనామా, పరాగ్వే, పెరూ, ఫిలిప్పిన్స్‌, స్పెయిన్‌, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, థాయ్‌ల్యాండ్‌, టర్కీ, ఉరుగ్వే, వెనిజులా సహా పలు దేశాల్లో ఓటు వేయని వారికి పలు రకాలు శిక్షలు అమల్లో ఉన్నాయి. అంటే ఇది ఒకరకంగా నిర్బంధ ఓటింగ్‌ విధానం అమలు చేయడమే. కానీ మనదేశంలో మాత్రం ఈ విధానం లేకపోవడంతో సగటున 30 శాతం ఓటర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండిపోతున్నారు. పోలింగ్‌ శాతం పెరగాలంటే నిర్బంధ ఓటింగ్‌ విధానం అమలు చేయాల్సిన అవసరాన్ని మన పోలింగ్‌ సరళి నొక్కి చెబుతోంది.

 
 
 

留言


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page