సొమ్ములు తీసుకో.. కళ్లు మూసుకో
అక్రమాలను పట్టించుకోని సుడా
కక్షసాధింపు చర్యలకైతే రెడీ
పొందూరులో పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో అక్రమకట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సుడా అనుమతులు లేకుండా లే`అవుట్‌లు, నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఉడా నుంచి విడగొట్టి సుడాగా మార్పుచేసిన తర్వాత అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టే విషయంలో ఎటువంటి మార్పు లేదు. సుడా పరిధిలోకి పొందూరు మేజర్ పంచాయతీని 2021 డిసెంబర్ 20న తీసుకువచ్చారు. ఈ నాలుగేళ్లలో వందల సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి. ఇందులో కేవలం 12 మంది మాత్రమే సుడా అనుమతి పొందారు. మరో 10 మందికి నోటీసులు ఇచ్చారు. ఇంకా 373 మంది అనధికారికంగా కమర్షియల్, రెసిడెన్సియల్ నిర్మాణాలు పూర్తిచేశారు. అనధికారికంగా నిర్మించిన భవంతులన్నింటికి విద్యుత్ శాఖ విద్యుత్ మీటర్లు మంజూరుచేసింది. అనధికారిక నిర్మాణాల్లో అత్యధికంగా కమర్షియల్ భవనాలే ఉండడం గమనార్హం. వైకాపా హయాంలో స్థానిక నాయకులు డబ్బులు తీసుకొని భవన నిర్మాణానికి సాయం చేశారు. సుడా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయకూడదని తెలిసినా పంచాయతీ అధికారిని మేనేజ్‌చేశారు. వైకాపా నాయకులకు డబ్బులు ఇవ్వనివారితో పాటు, ప్రత్యర్థుల భవనాలను సుడా అనుమతులు లేవని కూల్చిన ఘటనలు ఉన్నాయి. పంచాయతీ అధికారులకు భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసినా, నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చేసిన కథ ఇది.
అప్పటికి సుడా పరిధిలో పొందూరు పంచాయతీ లేదు. అయినా సుడా అనుమతి లేదని 2021 డిసెంబర్ 14న అర్థరాత్రి సమయంలో కట్టడాన్ని కూల్చేశారు. దీనిపై బాధితులు అధికారులను ప్రశ్నిస్తే దేవాలయ భూమిని ఆక్రమించి నిర్మాణం చేశారని మాటమార్చారు. ఆ తర్వాత దేవదాయ శాఖ భూమి కాదని తేలడంతో పంచాయతీ అధికారి సుడా అనుమతి లేనందున కూల్చేశామని నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై వివాదం నడుస్తుంది. వాస్తవంగా అనుమతి లేని భవనం కూల్చివేయడానికి ముందు నోటీసులు ఇవ్వాలి. అలా కాకుండా రాజకీయ ఒత్తిడితో జిరాయితీ స్థలంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చేశారు. అప్పటికే పొందూరు మండల కేంద్రంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ భవనాలకు సుడా అనుమతులు లేవు.
అనధికారిక నిర్మాణాలు

పొందూరు పంచాయతీ సర్పంచ్ నిర్మించిన ఇల్లు దేవదాయ శాఖకు చెందిన ప్రభుత్వం భూమిలోనే ఉంది. దీనికి సుడా అనుమతులు లేవు. అయినా రాజకీయ నాయకుల జోక్యంతో దాన్ని ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న వైకాపా మండల నాయకుడు అనధికారికంగా నిర్మించినా పంచాయతీ అధికారులు ఇప్పటికీ నోటీసులు ఇవ్వలేదు. పొందూరు మండల కేంద్రంలో కేవలం మూడంతస్థుల భవన నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంది. పొందూరులో నాలుగు ఫ్లోర్లు కలిగిన భవనాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఒక జ్యూయలరీ షాపు భవనానికి సుడా అనుమతి కేవలం మూడంతస్థులకు మాత్రమే ఇచ్చింది. అయితే అనధికారికంగా నాలుగో ఫ్లోర్ వేసి దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. రాంభజన వీధిలోనూ ఒక ఉపాధ్యాయుడు అనుమతులు లేకుండా భారీ బహుళ అంతస్థు భవనాన్ని నిర్మించినా అధికారులెవరూ తొంగిచూడలేదు. పంచాయతీ అన్ని మండల కేంద్రాల మాదిరిగానే కమర్షియల్‌గా అభివృద్ధి పథంలో నడుస్తుంది. మండల కేంద్రం పట్టణీకరణలో దూసుకుపోతుంది. దీంతో అక్రమంగా కమర్షియల్ భవనాలు వెలుస్తున్నాయి. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. అనుమతుల పేరుతో అధికారులు స్థానిక నాయకులతో కలిసి డబ్బులు తీసుకొని నిర్మాణాలకు అవకాశం ఇస్తున్నారు. సుడాకు రావాల్సిన ఆదాయాన్ని ఆయా పార్టీ నాయకులతో కలిసి పంచాయతీ అధికారులు పంచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు.
నాలుగేళ్లలో 373 కట్టడాలు
సుడా పరిధిలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకు కేవలం 12 భవనాలకే సుడా అధికారులు అనుమతులు మంజూరు చేశారంటే ఏ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సహ చట్టం ద్వారా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు నాలుగేళ్లలో పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో 373 వివిధ రకాల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో జగనన్న కాలనీకి సంబంధించిన ఇళ్లు ఉన్నాయి. వీటిని మినహాయిస్తే మిగతా నిర్మాణాలకు సుడా నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ వీటికి విద్యుత్ మీటర్లు మంజూరు చేశారు. వీరంతా గత మూడేళ్లుగా బిల్లులు చెల్లిస్తున్నారు. అనధికారికం నిర్మించిన 182 షాపులు, హోటల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ భవనాలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. మిగతా 191 రెసిడెన్షియల్ భవనాలు కాగా, కొన్ని బహుళ అంతస్థులు ఉన్నాయి. వీటికి సుడా అనుమతి లేకున్నా నిర్మాణాలు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. అధికారులు అనధికారిక నిర్మాణాలకు నోటీసులు జారీ చేసే ధైర్యం చేయడం లేదు. 373 నిర్మాణాల్లో కేవలం 10 నిర్మాణాలకు మాత్రమే నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ 10 భవనాలకు నోటీసులు జారీ చేసి నెలల గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
Comments