నారాయణ మంత్రం
- DV RAMANA
- Feb 7
- 2 min read

కొన్ని దశాబ్దాల నుంచి, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటికీ, ఆఫీసుకీ మధ్య సరిహద్దులు చెరిగిపోయిన పరిస్థితుల నుంచీ.. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పనిగంటల ప్రస్తావనా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కానీ, గత ఏడాది ఇన్ఫోసిస్ వ్యవ స్థాపకులు నారాయణమూర్తి ఈ పనిగంటల గురించి కొన్ని కఠినమైన అభిప్రాయాలు చెప్పినప్పటి నుంచి వేడి రాజుకుంది. ఓ పాడ్‌కాస్టులో మాట్లాడుతూ మూర్తి ‘పేదరికాన్ని తప్పించుకోవాలి అంటే కష్టపడి పనిచేయాల్సిందే అని మా తల్లిదండ్రులు నేర్పారు. ఆ మాటను అనుసరిస్తూ నేను 70 గంటల పని వారాన్ని సూచిస్తాను. ఎన్నో ఏళ్లుగా నేను వారానికి 85-90 గంటలు పని చేస్తూనే వచ్చాను. పొద్దున 6.20 కల్లా ఆఫీసుకు వెళ్లి, రాత్రి 8:30 తర్వాతే బయటికి వచ్చేవాడిని’ అన్నారు. ఈ మాటలు తీవ్రమైన చర్చకు, ట్రోలింగ్‌కి దారితీశాయి. తన కెరీర్‌ను నిర్మించుకునే వ్యక్తికీ, ఇతరుల కోసం చాకిరీ చేసే వ్యక్తికీ మధ్య పనిలో ఉండే ఉత్సాహాన్ని, ఆ పని అందించే ఫలితాలను ఈ సూచన పట్టించుకోలేదన్నది అన్నిటికంటే ముఖ్యమైన విమర్శ. సంస్థల్లో తెలియకుండా పెరుగుతున్న పని ఒత్తిడికీ, యాజమాన్యాల అత్యాశకీ, కరిగిపోతున్న కుటుంబ సమయానికీ ఈ మాటలు ప్రతీక అని చాలామంది భావించారు. కానీ నారాయణమూర్తి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన మాటలకు ఎంతోమంది నుంచి అభినందనలు వెల్లువెత్తాయని మురిసిపోయారు. భర్తకు అండగా నిలిచే సుధామూర్తి ఈ వ్యాఖ్యల విషయంలోనూ భర్తను బలపరిచారు. వారానికి 70 గంటలు పనిచేసే అలవాటు తమ కుటుంబం అంతా ఉందని చెప్పారు. కానీ తమ వ్యాఖ్యల పట్ల మధ్యతరగతి కుటుంబాల్లో, సాధారణ ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని గ్రహించారో అప్పుడు మూర్తి స్వరం మారింది. అది తన వ్యక్తిగత అభిప్రాయం అనీ, ఎన్ని గంటలు పనిచేయాలీ అన్నది ఒకరి పరి స్థితులు, ఇష్టాయిష్టాలను బట్టి ఉంటాయని, వాటిని బలవంతంగా ఆపాదించలేమని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా ‘మీతో ఆదివారాలు కూడా పని చేయించుకునే అవకాశం లేకపోవడం దుర దృష్టం. అయినా ఇంటికి వెళ్లి ఏం చేస్తారు? ఎంతసేపని పెళ్లాం మొహం చూస్తూ కూర్చుంటారు? నేనైతే వారానికి 90 గంటలు పనిచేస్తాను’ దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ అన్నమాటలివి. ‘మన సంస్థను తప్ప నా కుటుంబాన్ని పట్టించుకోను. మీరు కూడా పట్టించు కోవడానికి వీల్లేదు. మీ కుటుంబం ఏమైపోయినా నాకు అనవసరం!’ ఓ జూమ్ మీటింగ్‌లో ఉన్నతా ధికారి ఇచ్చిన తాఖీదు ఇది. పైకి చెప్పకపోవచ్చు, చెప్పినా అవి బయటికి రాకపోవచ్చు. కానీ, చాలా సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయాలే యువతరంతో పని చేయిస్తున్నాయి. ‘యువర్ దోస్త్’ అనే సంస్థ 21-30 ఏళ్ల వయస్కుల్లో ఒత్తిడిని నమోదు చేసే ప్రయత్నం చేసింది. ఇందుకోసం 5వేల మందిని ప్రశ్నించగా వారిలో 64 శాతం మంది ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పుకొన్నారు. విచారించదగ్గ విషయం ఏమిటంటే మగవారితో పోలిస్తే, మహిళలు పని వాతావరణంలో మరింత ఒత్తిడికి లోనుకావడం. ఆఫీసుకు వెళ్లినా కూడా ఇల్లు, పిల్లల బాధ్యత కూడా తనదే అనే తీరు ఇందుకు కారణం కావచ్చు. ఉద్యోగపు ఒత్తిడితో ముందు పాడయ్యేది ఆరోగ్యం. రక్తపోటు పెరగడం, కుంగుబాటు, సంతానలేమి, కూర్చుని కూర్చుని మధుమేహం లాంటి సమస్యలు రావడంతో పాటు.. చిన్నపాటి వైరస్‌ను ఎదుర్కోలేనంతగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని తేలింది. హార్వర్డ్ విశ్వవిద్యా లయంలో జరిగిన ఓ పరిశోధనలో వారానికి 55 గంటలకు మించి పని చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం 13 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఒకప్పుడు దశాబ్దాల తరబడి ఒకే సంస్థలో ఉద్యోగాలు చేసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి అని పేర్కొంటున్నారు. ఈ విషయమై ‘క్రోనోస్’ అనే సంస్థ తలపెట్టిన అభిప్రాయ సేకరణలో 46 శాతం మంది మానవవనరుల అధికారులు.. ఉద్యోగులు మానేయడానికి ఒత్తిడే ముఖ్య కారణం గా పేర్కొన్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా అటు యాజమాన్యానికీ, ఇటు ఉద్యోగులకు కూడా నష్టమే కలిగిస్తుంది. ఎంతసేపు పని చేశాం అన్నది కాదు.. ఎంత నాణ్యంగా పని చేశామన్నదే ముఖ్యం. అయినా ఇంట్లో గడపకుండా, స్నేహితులతో మాట్లాడకుండా, పుస్తకాలు చదవకుండా, ఆలోచించడా నికే సమయం ఇవ్వకుండా.. ఎవరైనా సరైన నిర్ణయాలను ఎలా తీసుకోగలరు?
Comentários