`భారంగా మారిన థియేటర్ల నిర్వహణ
`పెద్ద హీరోల రిలీజ్‌లు తగ్గిపోవడమే ప్రధాన కారణం
`గిట్టుబాటు కాని చిన్న సినిమాల ప్రదర్శన
`భారంగా మారిన మెయింటెనెన్స్ ఖర్చులు
`క్రమంగా మూతపడుతున్న సినిమా హాళ్లు

నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్‌లో కేవలం రోజుకు ఒకే ఒక్క ఆట ప్రదర్శించబడుతుంది.
సినిమా చూడండి.. బంపర్ ప్రైజులు గెలుచుకోండి. ఫస్ట్ ప్రైజ్ మలేషియా ట్రిప్, సెకండ్ ప్రైజ్ కశ్మీర్ టూర్, థర్డ్ ప్రైజ్ ఊటీ షికారు.
నగరంలోని ఓ ప్రముఖ థియేటర్ కాంప్లెక్స్ ఆవరణలో ఈ ఆఫర్లతో కూడిన పోస్టర్లు చూసి ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. అదేంటి.. ఇలా ఎక్కడా చూడలేదు. రోజుకు నాలుగైదు ఆటలు ఆడిరచిన సినిమా హాళ్లలో కేవలం ఒక్క ఆటే ప్రదర్శించడమేమిటి? సినిమా టికెట్లు డ్రా తీసి గెలిచిన వారికి వేలాది రూపాయలు ఖర్చయ్యే విహార యాత్రలకు తీసుకెళ్లడమేమిటి? ఇదంతా నిజమేనా? అన్న సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది నిజం. సినిమా హాళ్ల దుస్థితికి నిదర్శనం. ఒకప్పుడు సినిమా హాళ్లకు జనం పోటెత్తేవారు. కొత్త సినిమాలు రిలీజైతే టికెట్లు దొరకడమే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పుడో తప్ప జనం థియేటర్ల వైపు అస్సలు చూడటంలేదు. దాంతో సినిమా హాళ్ల నిర్వాహకులు ఈగలు, దోమలు తోలుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాని దుస్థితిలో ఏదో విధంగా ప్రేక్షకులను హళ్లకు రప్పించేందుకు కొందరు నిర్వాహకులు లక్కీ డ్రాలు వంటి చిట్కాలు పాటిస్తున్నారు. కొందరు యజమానులు థియేటర్లను నిర్వహించలేక లీజులకు ఇచ్చేస్తుంటే.. మరికొందరు మూసేసుకుంటున్నారు. ఇంకొందరు హాళ్లను పడగొట్టి వేరే నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకనాడు రద్దీతో కిటకిటలాడిన థియేటర్లు ఇప్పుడు ఆదరించేవారు లేక బోసిపోవడానికి కారణం ఏమిటి? ఒకనాడు వద్దంటే ఆదాయం అన్నట్లుండే పరిస్థితి ఇప్పుడు నిర్వహణ ఖర్చులు కూడా రాని దైన్యానికి ఎందుకు దిగజారిందో చూద్దాం.

(సత్యం ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం)
సినిమా.. ఒకనాడు సగటు ప్రేక్షకుడి ఏకైక వినోద సాధనం. ఖాళీ దొరికినా, కులాసా చేయాలన్నా, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలన్నా మొదటగా సినిమా చూడటానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. దాంతో సినిమా ఒక వ్యాపార, ప్రధాన వినోద సాధనంగా నిలిచింది. ప్రేక్షకులు పెద్దసంఖ్యలో థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవారు. దాంతో నిర్వహణ ఖర్చులు పోను యజమానులకు బాగానే ఆదాయం లభించేది. ఫలితంగా సినిమా హాళ్లు పెరిగాయి. ప్రేక్షకుల అభిరుచి, ఆధునిక సాంకేతికను కూడా అందిపుచ్చుకొని ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో మల్టీప్లెక్స్‌లో మూడు నాలుగు స్క్రీన్లు రన్ చేయడం కూడా మొదలైంది. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితి పూర్తిగా తిరగబడిరది. పాతకాలం సినిమాల్లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు ఉండేవి. పేద కుటుంబం వృద్ధులైన తల్లిదండ్రులు, పెళ్లీడుకొచ్చిన అక్క, చెల్లి, కుంటివాడైన తమ్ముడు. ఆ కుటుంబ భారాన్ని మోయడానికి హీరో పడే కష్టాలు, చేసే ఫీట్లు.. ఇటువంటి కథాంశాల చుట్టూనే సినిమాలు నడిచేవి. దాంతో నిజజీవితంలో మన ఇళ్లలోనూ ఇటువంటి కష్టాలు కనిపిస్తే సినిమా కష్టాలు పడుతున్నాడని వ్యాఖ్యానించడం అలవాటైంది. ఇప్పుడు ఆ సినిమాలే అటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. చుట్టుముట్టిన సమస్యలతో థియేటర్లు నడపలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి అనేక అంశాలు కారణం అవుతున్నాయి.
చిన్న సినిమాలతో ఫలితం లేదు

ఒకప్పుడు దేశంలో తెలుగు సినిమాలే అత్యధికంగా నిర్మితమయ్యేవి. ఇప్పుడు కూడా ఆ విషయంలో టాలీవుడ్డే టాప్‌లో ఉన్నా.. వాటిలో చిన్న సినిమాలదే సింహభాగంగా కనిపిస్తోంది. కొత్త కొత్త నటులు రంగ ప్రవేశం చేసి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు నిర్మించేస్తున్నారు. అటువంటివే ప్రతివారం ఐదారు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటికి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. సినిమా బాగుందని టాక్ వచ్చి, దానికి విస్తృత ప్రచారం లభిస్తే తప్ప ఆ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. పెద్ద హీరోల సినిమాలు తగ్గిపోయాయి. ఇప్పుడున్న టాప్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నా వాటి నిర్మాణం, విడుదల చాలా ఆలస్యం అవుతున్నాయి. ఒక పెద్ద హీరో సినిమాలు ఏడాదికి ఒకటి విడుదల కావడం కూడా గగనం అవుతోంది. అంతవరకు చిన్న సినిమాలతోనే థియేటర్లు కాలక్షేపం చేయాల్సి వస్తోంది. అదే గతంలోకి చూస్తే అనాడు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు వంటి టాప్ హీరోలు పోటీ పడి నెలకు ఒకటి రెండు సినిమాలు తీసేవారు. దాంతో ప్రతివారం కచ్చితంగా ఒక పెద్ద హీరో సినిమా విడుదలయ్యే పరిస్థితి ఉండేది. వారికి ఉన్న రేంజ్ వల్ల ఆ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తడంతో థియేటర్లు కొన్ని రోజులపాటు కిటకిటలాడుతూ హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సి వచ్చేది. అవసరమైతే అదనపు షోలు కూడా వేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ మూడు నెలలకో ఒకసారి పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతోంది. మిగతావన్నీ చిన్న సినిమాలే. వాటితోనే రోజులు నెట్టుకురావాల్సి వస్తోంది.
ఓటీటీ, పైరసీలతో పెద్ద దెబ్బ
జనం సినిమా హాళ్లకు రాకపోవడానికి మరో ముఖ్యకారణం ఓటీటీ, పైరసీ బెడదలే. నిర్మాతలు సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నిర్మాణ ఖర్చులు తిరిగి రాబట్టుకునేందుకు ముందుగానే థియేటర్, డిస్ట్రిబ్యూషన్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఓటీటీ హక్కులను కూడా ముందే అమ్మేసుకోవడం ప్రారంభమైంది. సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత ఓటీటీలో ప్రదర్శించుకునేలా ఒప్పందాలు కుదుర్చుకుని హక్కులు అమ్మేస్తున్నారు. దీనివల్ల నిర్మాతకు వ్యాపారం జరుగుతున్నా థియేటర్లకు నష్టం వాటిల్లుతోంది. ప్రేక్షకులు ఖర్చులు భరించి థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం కంటే కాస్త ఆలస్యమైనా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే కూర్చుని తక్కువ ఖర్చుతోనే ఇంటిల్లిపాదీ సినిమా చూడటానికే ఇష్టపడుతున్నారు. దీనికి తోడు పైరసీ బెడద ఉండనే ఉంది. ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్‌లు ఇంకా థియేటర్లకు రాని సినిమాలను కూడా తమ సైట్లలో అందుబాటులో ఉంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఇవన్నీ థియేటర్లను మనుగడను దెబ్బతీస్తున్నాయి. గ్రాఫిక్స్, టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్న, చాలా బాగుందని టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్‌కు వెళ్లి చూస్తున్నారు. అది కూడా ఒక్కసారి మాత్రమే. గతంలో ఉన్నట్లు రిపీటెడ్ ఆడియెన్స్ ఉండటం లేదు.
నిర్వాహణే కనాకష్టం
థియేటర్లలో సాధారణంగా రోజుకు నాలుగు షోలు ప్రదర్శిస్తుంటారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో అదనపు షోలు కూడా వేస్తుంటారు. అందుకు తగినట్లు థియేటర్లను నిర్వహించాల్సి ఉంటుంది. పారిశుధ్య కార్మికులు, టికెట్ల అమ్మకాలు, గేట్ కీపర్, ఇతర ఉద్యోగులను జీతాలు ఇచ్చి పోషించాల్సి ఉంటుంది. అలాగే విద్యుత్ ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం థియేటర్ నిర్వహణకు రోజుకు రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చవుతుంది. కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ అంటే ప్రతి షోకు సగం హాలు నిండితేనే నిర్వహణ ఖర్చులు గట్టెక్కుతాయి. పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటే లేదా హిట్ సినిమాలు ఆడుతుంటేనే హాలు సగానికి మించి నిండి ఆదాయం వస్తుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎప్పుడో గానీ హాళ్లు నిండుగా కనిపించడంలేదు. ఫలితంగా థియేటర్ల నిర్వహణ ఖర్చులు కూడా రాబట్టుకోలేక సినిమాలు ప్రదర్శించడమే మానుకుంటున్నారు.
లాక్‌డౌన్ హామీలు నిలబెట్టుకోని సర్కారు
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాల మాదిరిగానే థియేటర్ల రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు నెలల తరబడి లాక్‌డౌన్ అమలు చేశాయి. ఆ కాలంలో సినిమా హాళ్లు పూర్తిగా మూతపడ్డాయి. తర్వాత కొన్ని నెలలు సగం సామర్థ్యంతో అంటే ఒక సీటు విడిచి మరో సీటుకు టికెట్లు అమ్మేలా పాక్షికంగా నడపాల్సి వచ్చింది. మొత్తాన్ని ఏడాదికి పైగా సినిమాలు మూతపడ్డాయి. దాంతో నిర్వహణ లేక దెబ్బతిన్న హాళ్లను లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తిరిగి తెరిచినా.. పూర్తిగా బూజు పట్టేసి, విద్యుత్ వైరింగ్ దెబ్బతిని ఉన్న ఫళంగా షోలు ప్రదర్శించలేని స్థితిలో ఉన్న హాళ్లను తిరిగి ప్రదర్శనలకు సిద్ధం చేసేందుకు నిర్వాహకులు పెద్దమొత్తాల్లో ఖర్చు చేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్ వల్ల నష్టపోయిన థియేటర్ల యజమానుల విజ్ఞప్తి మేరకు థియేటర్లు చెల్లించాల్సిన విద్యుత్ ఫిక్స్‌డ్ ఛార్జీలు రద్దు చేస్తామని, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సాధారణంగా సినిమా హాళ్ల నిర్వహణలో విద్యుత్ ఛార్జీలే ఎక్కువగా ఉంటాయి. ఒక కిలోవాట్‌కు రూ.450 చొప్పున ఫిక్స్‌డ్ ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రతి థియేటర్ సగటున 70 కిలోవాట్లకు ఫిక్స్‌డ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్సైజ్ డ్యూటీ యూనిట్ వినియోగ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో లాక్‌డౌన్ కాలానికి ఫిక్స్‌డ్ ఛార్జీలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. అలాగే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే అంశాన్నీ విస్మరించడంతో థియేటర్ల యజమానులు కుదేలయ్యారు. దానికితోడు ఎప్పుడోగానీ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వని పరిస్థితుల్లో చిన్న సినిమాలను నమ్ముకుని థియేటర్లను నడపలేకపోతున్నారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న థియేటర్లలో సీతారామ, రామకృష్ట మూతపడ్డాయి. మరికొన్ని థియేటర్లు లీజు పేరుతో చేతులు మారిపోయాయి. ఎస్వీసీ రామలక్ష్మణ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు, కిన్నెర కాంప్లెక్స్ రామానాయుడు కుటుంబం చేతుల్లోకి, సన్‌మ్యాక్స్ అల్లు అరవింద్ నిర్వహణలోకి వెళ్లిపోయాయి. ఒక సరస్వతి థియేటర్ మాత్రమే అసలు యాజమాన్యం చేతుల్లో ఉంది. లీజుకు తీసుకున్నవారు కూడా వాటిని నడపడానికి నానాపాట్లు పడుతున్నారు.
Comments