`చిచ్చు పెట్టిన టీడీపీ టికెట్ల వ్యవహారం
`గజపతినగరంలో కొండపల్లి, చీపురుపల్లిలో కిమిడి
`జమ్మలమడుగులో చదిపిరాళ్ల ఇంట రచ్చ
`తునిలో యనమల వారసత్వం కోసం పోరు
(ఎన్నికల రచ్చబండ) - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి
‘తమ్ముడు.. తమ్ముడే, పేకాట.. పేకాటే’ అన్నది పాతకాలపు నానుడి. అదే ప్రస్తుత ఎన్నికల కాలంలో ‘రాజకీయం.. రాజకీయమే, కుటుంబం.. కుటుంబమే’ అన్నట్లు మారిపోయింది. ఒకే కుటుంబానికి చెందివారు వేర్వేరు రాజకీయాల్లో కొనసాగడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నాతమ్ముడు, తండ్రీతనయుడు, అక్కాచెల్లి, అన్నాచెల్లి, వదినామరదళ్లు.. వేర్వేరు పార్టీల తరఫున ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగి పరస్పరం సవాల్ చేసుకోవడం కూడా కొత్త కాదు. అంతెందుకు ప్రస్తుత ఎన్నికలనే తీసుకుంటే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆయన సోదరి వైఎస్ షర్మిల ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కడప లోక్‌సభ స్థానంలో తన కజిన్(సోదరుడు) వైఎస్ అవినాష్‌రెడ్డిపై పోటీకి సైతం ఆమె సిద్ధమయ్యారు. ఇక మహారాష్ట్రలో సీనియర్ మోస్ట్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీకి స్వయంగా ఆమె వదిన సై అన్నారు. వేర్వేరు పార్టీల తరఫున ఒకే కుటుంబంవారు పోటీ పడటం జరుగుతున్నదే అయినా ఒకే కుటుంబానికి చెందినవారు ఒకే పార్టీ నుంచి ఒకే సీటు ఆశించడం, ఒకరికి అవకాశం లభించి మరొకరు భంగపడటం వల్ల కుటుంబాల్లో చిచ్చు రేగిన సందర్భాలు మాత్రం అరుదనే చెప్పాలి. కానీ ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ పోరు ఏకంగా నాలుగు కుటుంబాల్లో చిచ్చు రగిల్చింది. ఇప్పటికే ఆయా కుటుంబాల్లో ఉన్న విభేదాలకు రాజకీయ పోరాటం ఆజ్యం పోసింది. విజయనగరం జిల్లాలో కిమిడి, కొండపల్లి కుటుంబాలు, గోదావరి జిల్లాలో యనమల కుటుంబం, కడప జిల్లాలో చదిపిరాళ్ల కుటుంబాల్లో టికెట్ పోరు కలహాల కుంపటి రగిల్చింది. ఈ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవే కావడం విశేషం. అవేంటో ఒక లుక్కేద్దాం.
‘కొండపల్లి’ కుటుంబంలో చిచ్చు
విజయనగరం జిల్లా తెలుగుదేశంలో కొండపల్లి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కుటుంబానికి చెందిన కొండపల్లి పైడితల్లి నాయుడు మూడుసార్లు బొబ్బిలి ఎంపీగా గెలిచారు. తర్వాత ఆయన సోదరుడు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు(కేఏనాయుడు) రాజకీయ వారసత్వం తీసుకున్నారు. ఒకసారి బొబ్బిలి నుంచి మరోసారి విజయనగరం నుంచి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా 2019లో మాత్రం ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయనే కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ గజపతినగరం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. కానీ తానొకటి తలస్తే అధినేత మరొకటి తలచారన్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు కేఏనాయుడును కాదని ఆయన అన్న పైడితల్లినాయుడి కుమారుడు కొండపల్లి శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చి టికెట్ ఇచ్చారు. దీంతో కుటుంబంలో విభేదాలు రేగాయి. అభ్యర్థిత్వం ఆశించిన శ్రీనివాస్ బాబాయ్ కేఏనాయుడు అసమ్మతి జెండా ఎగురవేశారు. తన అన్న కొడుకే కదా అని సరిపెట్టుకోకుండా టికెట్ తనకే ఇవ్వాలని, లేనిపక్షంలో పార్టీని ఓడిస్తానని హెచ్చరిస్తూ తన అనుచరులతో అసమ్మతి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా కొండపల్లి కుటుంబం రోడ్డుకెక్కడమే కాకుండా పార్టీ కూడా ఇబ్బందుల్లో పడిరది.
కిమిడి కుటుంబంలో కలకలం
ఇదే జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశానికి పెద్ద దిక్కుగా ఉన్న కిమిడి కుటుంబంలో అదే పార్టీ వల్ల కలతలు రేగాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కమిడి కళా వెంకట్రావు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే గణపతిరావు సతీమణి కిమిడి మృణాళిని 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఢీకొట్టి జయకేతనం ఎగురవేశారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా చేశారు. ఆమె గతంలో శ్రీకాకుళం జిల్లాపరిషత్ ఛైర్‌పర్సన్‌గా కూడా పని చేశారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి గణపతి, మృణాళిన దంపతుల కుమారుడు కిమిడి నాగార్జున రంగప్రవేశం చేశారు. ఉన్నతోద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అదే బొత్సపై పోటీ చేసి ఓడిపోయారు. అయినా నిరాశ పడకుండా టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా, చీపురుపల్లి ఇన్‌ఛార్జిగా గత ఐదేళ్లు కష్టపడి పని చేసి పార్టీ పటిష్టానికి కృషి చేశారు. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. అయితే అక్కడ బొత్సను ఢీకొట్టేందుకు నాగార్జున సరిపోరని చంద్రబాబు భావించినట్లున్నారు. అందుకే విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావుతోపాటు స్వయం నాగార్జున పెదనాన్న అయిన కిమిడి కళావెంకట్రావుల్లో ఒకరిని చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని సూచించారు. కానీ వారిద్దరూ అంగీకరించలేదు. మరోవైపు కళా వెంకట్రావు ఆశిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో కలిశెట్టి అప్పలనాయుడు కూడా పోటీ పడటంతో నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారింది. అదే సమయంలో పొత్తులో భాగంగా ఎచ్చెర్లను బీజేపీకి ఇచ్చేశారు. ఆ సాకుతో కళా వెంకట్రావుకు బలవంతంగా చీపురుపల్లి అసెంబ్లీ సీటు కట్టబెట్టారు. ఈ పరిణామాలతో కమిడి కుటుంబం కలవరపాటుకు గురైంది. తీవ్ర అసంతృప్తికి గురైన కిమిడి నాగార్జున పార్టీ పదవులకు గుడ్‌బై చెప్పేశారు. ఎన్నికల్లో తన పెదనాన్నకు సహకరించేది లేదని భీష్మించుక్కూర్చున్నారు.
జమ్మలమడుగు ‘ఆది’ రాజకీయం
కడప జిల్లా జమ్మలమడుగులో మరో రకం రాజకీయం నడుస్తోంది. ఈ నియోజకవర్గ రాజకీయాల్లో దేవగుడి(చదిపిరాళ్ల) నారాయణరెడ్డి కుటుంబానిదే హవా. ఆ తర్వాత ఆయన తమ్ముడు ఆదినారాయణరెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. మొదట కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2014లో వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తర్వాత టీడీపీలోకి జంప్ చేశారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడి టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుంచి జమ్మలమడుగులో నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి తెలుగుదేశానికి పెద్దదిక్కుగా నిలిచి, పటిష్టపరిచారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకున్న భూపేష్‌రెడ్డికి చిన్నాన్న ఆదినారాయణరెడ్డి దెబ్బకొట్టారు. టీడీపీ, జనసేనలతో కుదిరిన పొత్తును అవకాశంగా తీసుకుని ఢల్లీిలో మకాం వేసి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ తీసుకునేలా మంత్రాంగం నెరిపారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఏమాత్రం బలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి నియోజకవర్గాన్ని బీజేపీ కోటాలో వేయించుకుని, అభ్యర్థిగా తన పేరును ఓకే చేయించుకున్నారు. ఈ పరిణామంతో అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి పరిస్థితి గందరగోళంలో పడిరది. దాంతో దేవగుడి నారాయణరెడ్డి వర్గంలో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. దాంతో అప్రమత్తమైన టీడీపీ అధినేత చంద్రబాబు భూపేష్‌రెడ్డికి కడప ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అయితే ఎంపీ బరిలో భూపేష్‌రెడ్డి తేలిపోతారని.. అటు ఆదినారాయణరెడ్డి, ఇటు చంద్రబాబు తమ నాయకుడిని ముంచేశారని ఆ వర్గం నాయకులు ఆరోపిస్తూ నిరసన బాట పట్టారు. ఈ పరిణామాలతో ఆందోళనకు గురైన టీడీపీ అధిష్టానం కడప పార్లమెంటు సీటును బీజేపీకి ఇచ్చి ఆదినారాయణరెడ్డిని పోటీ చేయించడం, అలాగే బీజేపీకి ఇచ్చిన జమ్మలమడుగు అసెంబ్లీ సీటును టీడీపీ తీసుకుని భూపేష్‌రెడ్డిని పోటీ చేయించే విధంగా రెండు పార్టీల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.
యనమల కుటుంబంలో ఒంటరైన కృష్ణుడు
ఇక కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం అగ్రనేత యనమల రామకృష్ణుడు కుటుంబంలో టికెట్ మంటలు రేగాయి. కుటుంబం విడిపోయే పరిస్థితి ఏర్పడిరది. ప్రస్తుత టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న యనమల రామకృష్ణుడు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో కొనసాగి అసెంబ్లీ స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. రామకృష్ణుడు ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకొన్న తర్వాత ఆయన సోదరుడు యనమల కృష్ణుడు రంగప్రవేశం చేశారు. తుని నుంచి 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ప్రస్తుత ఎన్నికల్లోనూ పోటీ సిద్ధమవుతున్నారు. అయితే యనమల రామకృష్ణుడు తన వారసురాలిగా కుమార్తె దివ్యను రంగప్రవేశం చేయించడంతో ఆ కుటుంబలు కలహాలు మొదలయ్యాయి. పార్టీ కూడా కృష్ణుడి కంటే దివ్యకు ఇస్తేనే అనుకూలంగా ఉంటుందని సర్వేల ద్వారా నిర్ధారించుకుని ఆమెకే టికెట్ ఖరారు చేసింది. దాంతో అసంతృప్తితో రగిలిపోయిన యనమల కృష్ణుడు కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. తన అన్న రామకృష్ణుడితోపాటు పార్టీపైనా పగ సాధించేందుకు వైకాపాలో చేరాలని ప్రయత్నించారు. ప్రత్తిపాడు సీటు ఇస్తే పార్టీలోకి వస్తానని వైకాపా నేతలకు సంకేతాలు పంపారు. కానీ ఎందుకో అవి వర్కౌట్ కాలేదు. దాంతో తునిలో తన వర్గంతో కలిసి తన అన్న కుమార్తె దివ్యకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
Comments