
అధికారమే పరమావధి కాదు.. కాకూడదు కూడా. అధికారంలోకి రావాలంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మెప్పుపొందాలి. పోరాట పటిమ కనబరిచి, కోల్పోయిన దానిని సాధించాలి. ఏపీ రాజకీయాలలో ప్రతిపక్ష వైకాపా తీరు గమనిస్తే ఇదేమీ కనిపిస్తున్నట్లు లేదు. నిజానికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత వైకాపా ప్రభుత్వంతో పోలిస్తే బటన్ నొక్కడం ఆలస్యమవుతోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సూపర్ సిక్స్ హామీల తక్షణ అమలుకు అనుకూలంగా లేదు. ఒకటి, రెండు హామీలను వెంటనే అమలులోకి తెచ్చినా, కీలకమైన మరికొన్ని ఉచిత హామీల అమలుకు సమయం కావాలంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రజలకు నేరుగా విన్నవించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షానికి కూటమి సర్కారు తొలి రోజుల్లోనే మంచి అస్త్రాన్నే అందించింది. అయినా ప్రజలలోకి వెళ్లే పరిస్థితిలో వైకాపా లేదు. కూటమి హామీలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాల్సిన వైకాపా చేతులు ముడుచుకొని కూచుంది. పక్కనే వున్న తోటి తెలుగు రాష్ట్రంలో విపక్షం బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న తీరునూ వైకాపా గమనించడం లేదు. ఏ ఒక్క సమస్యతోనూ ప్రజలలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. తల్లికి వందనం పథకాన్ని అటకెక్కించి కూటమి సర్కారు విద్యార్ధులను, తల్లిదండ్రులను రోడ్డున పడేసిందంటూ ఆరోపించిన వైకాపా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఫీజు పోరు దీక్షకు పిలుపునిచ్చినా, దానిని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మార్చి 12కు ఫీజు పోరు దీక్షను వాయిదా వేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయని, కోడ్ తమ దీక్షలకు అడ్డంకిగా మారుతుందన్న విషయాన్ని కూడా గుర్తించకుండా హడావుడిగా తేదీ ప్రకటించి, తిరిగి వాయిదా వేసుకొని అభాసు పాలయ్యారు. తెలుగుదేశం నేతలు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదని, వాళ్లను ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్న వైకాపా అధినేత జగన్ మాత్రం ప్రజలలోకి వెళ్లడంలేదు. నిజంగా కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు నమ్మకం కోల్పోతే.. అది వైకాపాకు మంచి అవకాశం కదా.. ప్రజాక్షేత్రంలో పార్టీపై నమ్మకాన్ని పెంచుకొనే పని చేయకుండా, విలువలు, విశ్వతనీయత అంటూ మీడియా ముందు ఎంత అరచి గీపెట్టినా చెవిటివాని ముందు శంఖం ఊదడమే అవుతుంది.
ప్రజలే వెతుక్కుంటూ వచ్చి అధికార పళ్లెం తమ చేతిలో పెడతారని, రాబోయే మూడు దశాబ్దాల అధికారం తమదేననే ధీమా మాత్రం వైకాపాలో కనిపిస్తోంది. కనిపించడమేంటి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని, అప్పుడు 2.0 జగన్‌ను చూస్తారంటూ ఆయనే చెప్పుకున్నారు. అయితే జగన్ ప్రకటనలు, జగన్ 2.0 వ్యాఖ్యలు జనాలకు రుచించడంలేదు. ప్రజలు మాత్రం విపక్ష పాత్రలో జగన్ 2.0ను చూడాలనుకుంటున్నారు. విపక్షం ఎప్పుడు తమ తరఫున పోరాటం ఎప్పుడు చేస్తుందా అని ఒక వర్గం ప్రజలు ఆశగానే ఎదురుచూస్తున్నారు. అధికారం వచ్చాక జగన్ మారడంకాదు, కూటమి ప్రభుత్వంపై పోరాట తీరులోనూ మార్పు రావాలి.
2014 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించలేకపోయినా ఏకంగా 67 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఆ సమయంలోనూ రాష్ట్ర సమస్యలు, విధానాల విషయంలో అధికార పక్షానికి విలువైన సూచనలు ఇచ్చిందీ లేదు. అసెంబ్లీలో వైకాపా సభ్యుల వ్యవహార శైలి కూడా విమర్శలకు తావిచ్చింది. తమ నాయకుడి తత్వం వంటపట్టించుకోని 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు ఆకర్షితులై చంద్రబాబుకు జైకొట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవడం లేదంటూ స్పీకర్‌పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసి, చివరి రెండేళ్లు సభాకార్యకలాపాలనే బహిష్కరించారు. సభా సంప్రదాయాలు పాటించకుండా వైకాపా ప్రజాస్వామ్యాన్నే అపహస్యం చేసిందన్న విమర్శలకు గురైంది.
రాజధాని అమరావతి విషయంలోనూ సభలో ఓమాట, బయట మరోమాటగా సాగింది. అయినా కూటమి విచ్ఛిన్నం కావడం, ప్రజాక్షేత్రంలోకి జగన్ వెళ్లడం 2019లో వైకాపా అధికారం కట్టబెట్టింది. మళ్లీ విపక్షపాత్ర పోషించడంలో శాసనసభకు వెళ్లడం వంటి విషయంలో జగన్ వైఖరి మారడంలేదు
జగన్ ఇక మారరా..
కేవలం బటన్ నొక్కుడుతోనే అధికారం వస్తుందా? శాశ్వతంగా ఉండిపోతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి గట్టిగా 9 నెలలు కావస్తోంది. ఇంతలోనే భూగోళం బద్దలైపోతున్నట్లు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నట్లు జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు బటన్ నొక్కడంలో విఫలమయ్యారని, మోసాలకు గ్యారెంటీగా మారారని జగన్ విమర్శిస్తున్నారు. అదికూడా జనంలోకి వెళ్లికాదు. అసెంబ్లీ వేదికగా అంతకంటే కాదు. మీడియా ముందు కూర్చుని తన మాట, బాట ఇదేనంటున్నారు.
అసలు వైకాపా ఘోరంగా ఓడిపోవడానికి, కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి కారణమేంటి? ఇదేంటిరా ఇంత ఠంఛన్‌గా బటన్ నొక్కతున్నాడని ఓడిరచారా? అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి, బటన్ నొక్కితే చాలనుకుంటే ఓడిరచారా? 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలే.. కేవలం ఐదు సంవత్సరాలకే విసిగిపోయారంటే, ఏమనుకోవాలి? జగన్‌కు సరిjైున ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఘోర ఓటమిని అందించారంటే అర్థం ఏమిటి? జగన్ పాలనలో చేయరాని తప్పులు జరిగాయనేగా.. మరి ఆ తప్పులను సరిదిద్దుకుంటానని అనడానికే జగన్ ఇష్టపడటం లేదు.
మూడు రాజధానుల రగడ నుంచి, ఇసుక, మద్యం విధానాలలో అవినీతి దాకా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిరదని, క్షేత్రస్థాయిలో అరాచకాలు పెరిగిపోయాయని భావించారు. అయినా ‘ప్రజలకిచ్చిన ఉచిత హామీలకు కట్టుబడ్డాను, నెలవారీ పథకాల డబ్బులు బటన్ నొక్కి మీ ఖాతాలో వేశాను. ఇంకేంకావాలి’ అని ప్రశ్నిస్తున్న జగన్ తీరు ఇప్పటికీ అలాగే ఉంది. చంద్రబాబు మాటలకు ఆశపడి మాత్రమే ప్రజలు వైకాపాను ఓడిరచారు. వైకాపా ప్రభుత్వంలో అసలు తప్పే జరగలేదు. రాష్ట్రం దివాళా తీయనేలేదు అనుకుంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటే, ప్రజలే కోరివచ్చి తిరిగి దగ్గరికి తీస్తారా? నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గంటూ వైకాపా అధినేత వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నార్ధకం అవుతోంది.
బటన్ నొక్కడమే విశ్వసనీయతా..
ఉచిత హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి చెప్పినట్లుగా బటన్ నొక్కాం. ఇదే అసలైన విశ్వతనీయత అనుకుంటూ ప్రజల సమస్యలను, రాష్ట్రంలో అభివృద్ధినీ పట్టించుకోకుంటే ప్రజలు విశ్వసిస్తారా? జగన్ 2.0లో అది చూస్తారు, ఇది చూస్తారు అనడం కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా ప్రజాక్షేత్రంలో నిలబడాలి. గతంలో తాను, తన ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించి, భవిష్యత్లో అలాంటివి జరగవంటూ ప్రజలకు నమ్మకం కలిగించాలి. ప్రజలతో మమేకం కాగలగాలి. రైతు చట్టాల విషయంలో ప్రధాని నరేంద్రమోదీ ఎలా ప్రజలకు క్షమాపణ చెప్పి దూసుకురాగలిగారో అలాంటి రాజకీయం ప్రజల మెప్పు పొందుతుంది.
ముందుగా జగన్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. కేసుల భయంతో పార్టీ నేతలంతా పార్టీని వీడుతున్నారని చెప్పడం కాదు. అలాంటి పరిస్థితులు వారికి ఎందుకు వచ్చాయో గుర్తించి, భవిష్యత్ మార్గ నిర్థేశం చేసుకోవాలి. వైకాపాలో ఉన్న రాజ్యసభ సభ్యులందరూ జారుకుంటున్నారు. భవిష్యత్లో లోక్‌సభ సభ్యులూ, ఎమ్మెల్యేలు అదే దారిలో నడిచే ప్రమాదమూ ఉంది. అందుకే జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం తాపత్రయ పడకుండా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలూ, కూటమి హామీల అమలు వైఫల్యాలనూ సభావేదికగా నిలదీయాలి. తనకూ ముఖ్యమంత్రితో సమానంగా మైక్ ఇస్తేనే సభకు వస్తా అనడం, ఇంకా తానూ ముఖ్యమంత్రినే అనే భ్రమలో ఉన్నట్లుంది.
ముందుగా జగన్ 2.0 ప్రతిపక్ష నేతగా మారాలి. కూటమి వైఫల్యాలను అందిపుచ్చుకొని, నిత్యం ప్రజల ముందుకు వెళ్లాలి. ప్రజలు తిరిగి ఆశీర్వదిస్తే తాను భావిస్తున్నట్లు 30 ఏళ్లేం ఖర్మ.. యాభై సంవత్సరాలు పాలిస్తానన్నా కాదనేదెవరు? అపోజిషన్‌లోనూ పొజిషన్ చూసుకోకుండా జగన్ ఇకనైనా అసలుసిసలైన 2.0గా మారతారేమో చూడాలి.
బాలకృష్ణ.ఎం., ది వైర్ కోసం..
Kommentare