రైతుల పేరుతో నిషేధిత జాబితాలో మినహాయింపులు
ఆ భూములనే చెరబట్టిన వైకాపా నాయకులు
వాటిని రియల్టర్లకు అమ్మి రూ.కోట్లలో ఆర్జన
వైకాపా హయాంలో జరిగిన ఈ అక్రమాలపై కొత్త సర్కార్ దృష్టి
విచారణతోపాటు వాటి రిజిస్ట్రేషన్లు ఆపేయాలని ఆదేశాలు

రాష్ట్రంలో కొన్ని రకాల భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరు నాయకులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వ భూములు, వివాదాల్లో ఉన్న భూములపై లావాదేవీలు జరక్కుండా చూసేందుకు వాటిని నిషేధిత భూముల(22ఏ) జాబితాలో చేరుస్తుంటారు. అయితే గత ప్రభుత్వంలో ఆ జాబితాలో ఉన్న భూములను అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నా గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆసరా చేసుకుని చాలా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి, సొంతం చేసుకున్నారు. ఎన్నికల తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం ఒకవైపు ఈ వ్యవహారాలపై విచారణ జరుపుతునే.. మరోవైపు రిజిస్ట్రేషన్ కాని భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో గత ప్రభుత్వ పెద్దల ప్రాపకంతో కోట్ల విలువ చేసే భూములు కొట్టేసిన పెద్దల గుండెలు గుబగుబలాడుతున్నాయి.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నిషేధిత భూముల జాబితాలో తమ భూములను అన్యాయంగా చేర్చేశారని, దానివల్ల క్రయవిక్రయాలు చేసుకోలేకపోతున్నామని చాలామంది రైతులు, భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 22ఏ నుంచి మినహాయింపులకు గత వైకాపా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీన్ని ఆసరా చేసుకుని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే విలువైన భూములను చేజిక్కించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బ్రిటీష్ కాలంలో సర్వే జరిగిన తర్వాత మళ్లీ ఇంతవరకు నిర్దిష్టమైన సర్వేలు జరగలేదని, అందుకే సమగ్ర సర్వే చేయిస్తున్నామని చెప్పిన గత ప్రభుత్వం ఇటువంటి భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించే పని చేపట్టింది. ఇలా గుర్తించిన భూములను ఆ పార్టీ పెద్దలే పద్ధతి ప్రకారం సొంతం చేసుకున్నారని తెలిసింది. ఆ భూములు తమ పేరిట ఉంటే ప్రమాదమని గుర్తించిన సదరు పెద్దలు, వాటిని రియల్టర్లకు అమ్మేసి కోట్ల సొమ్ము జేబులో వేసుకున్నారు. కూటమి సర్కారు దృష్టి ఇలాంటి పలు వ్యవహారాలు రావడంతో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విచారణ ఎంతవరకు ముందుకు సాగుతుంది, కోర్టులో ఎంతమేరకు నిలుస్తుందనేది పక్కన పెడితే గత ప్రభుత్వ పెద్దలు కొట్టేసిన భూముల వివరాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అప్పట్లో మంత్రులు, వారి బినామీల కబ్జాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా.. పలువురు బాధితులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడు లేకపోయాడు. అధికారంలోకి వచ్చిన టీడీపీ వాటిని తవ్వితీస్తుండటంతో ఒక్కొక్కటిగా వివరాలు బయటకొస్తున్నాయి.
ఇదిగో అక్రమ ఉదంతాలు
టెక్కలి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న జగద్ధాత్రి స్వర్ణకారుల సొసైటీకి చెందిన రఘనాధపురం సర్వే నెంబర్ 520/1లో 34 సెంట్లు, 520/3లో ఉన్న 1.66 ఎకరాల భూమి 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసేశారు. న్యాయస్థానంలో తప్పుడు పత్రాలు సమర్పించి ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న రెండెకరాల భూమిని స్థానిక వైకాపా నాయకుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2015లో రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22`ఎ సబ్ సెక్షన్(1) క్లాజ్(ఇ) ఏపీ యాక్ట్ 19/2007 ప్రకారం అప్పటి కలెక్టర్ ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. కానీ వీటిని వైకాపా నేతల అండదండలతో కోర్టు బూచి చూపించి ఆ పార్టీ నాయకుడికే కట్టబెట్టేశారు. సుమారు రూ.30 కోట్లు విలువ చేసే ఈ భూదందాపై మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించారు.
పలాస నియోజకవర్గంలో ప్రభుత్వ, దేవదాయ, డీ పట్టా భూములు, కొండలు, చెరువులను నిషేధిత జాబితా నుంచి అడ్డగోలుగా తొలగించి విక్రయించేశారు. పక్కనే ఉన్న జిరాయితీ భూముల సర్వే నెంబర్లతో వీటికి రిజిస్ట్రేషన్లు చేయించేశారు.
ఆమదాలవలస, నరసన్నపేటల్లో చెరువులు ఆక్రమించి గిఫ్ట్‌డీడ్‌గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించారు.
శ్రీకాకుళం నగర పరిధిలో ఆదివారంపేట దాటిన తర్వాత శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డుకు ఆనుకుని కోణార్క్ స్వీట్‌షాపు నుంచి శాంతి కన్వెన్షన్‌కు పడమర వైపు నాగావళి వరదగట్టుకు తూర్పున బలగ రూరల్ సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న 1.11 ఎకరాల నాగావళి వరద గట్టును ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకున్నారు.
సింగుపురం గ్రామ సర్వే నెంబర్ 270/4లో 9.15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముసిలమ్మ గుండం, రాగోలు రెవెన్యూ పరిధిలో జాకవారితోటకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 179, 180లలో ఉన్న సావిత్రమ్మ లేఅవుట్‌లో కశింకోట కుటుంబీకులకు చెందిన భూమిని కలిపేశారు.
అరసవల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 475/1,2,3,4,5లలో కేవీఆర్ లే అవుట్, రాగోలు రెవెన్యూ వాకలవలస సర్వే నెంబరు 169లో ఉన్న అసైన్డ్ ల్యాండ్‌ను సబ్‌డివిజన్ చేసి 169/64లో 1.94 ఎకరాలు, 169/829లో 1.87 ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించేశారు.
నైర రెవెన్యూ పరిధి సర్వే నెం.290/1లో ఉన్న 54 సెంట్లు, 290/3లో ఉన్న 31 సెంట్లు, సర్వే నెంబర్ 290/2లో 1.24 ఎకరాల నిషేధిత జాబితా నుంచి తప్పించి జిరాయితీగా మార్చేశారు.
గుజరాతీపేటలోని నారాయణ తిరుమల దేవాలయానికి తూర్పున ఉన్న సర్వే నెంబర్ 120లోని వక్ఫ్ భూమిని జిరాయితీగా మార్చేశారు.
చాపురం పంచాయతీ (బలగ రెవెన్యూ)లో సర్వే నెంబర్ 149, 150, 151లలో ఉన్న 8.54 ఎకరాల ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చేశారు.
బలగ రెవెన్యూ సర్వే నెంబర్ 242/6లో 1.82 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బట్టువాని చెరువును నిషేధిత జాబితా నుంచి తొలగించి లేఅవుట్‌గా మార్చేశారు.
..ఇలా జిల్లాలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిపై గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదులు చేశారు. వీటిపై విచారణ జరిపే బాధ్యతను మండల రెవెన్యూ అధికారులకే అప్పగిస్తున్నారు. దీంతో ఈ ప్రక్రియ ఎంత మేరకు పారదర్శకంగా సాగుతుందో చూడాలి.
Comments