top of page

పతనం అంచున తృణమూల్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 9
  • 2 min read

ఓటమి ఎంత కఠినమైనదో.. ఇంకెంత భారమైనదో తృణమూల్ కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుత దుస్థితిని చూస్తే అర్థమవుతుంది. మూడు ఎన్నికల్లో అప్రతిహత విజయాలు, పదిహేనేళ్లపాటు రాజ్యాధికారం.. అన్నీ ఒక్క అపజయంతో కొట్టుకుపోయాయి. రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు జయాపజయాలు సర్వసాధారణం. వాటిని తట్టుకుని మళ్లీ విజయసాధనకు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుంటారు. కానీ తృణమÖల్ కాంగ్రెస్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా తయారైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఆ పార్టీని ఛిన్నాభిన్నం చేసేస్తున్నది. ఇన్నాళ్లూ అధికారం మాటన అణిగిమణిగి ఉన్న అసంతృప్తి, అసమ్మతి జ్వాలలు ఒక్కుమ్మడిగా విరుచుకుపడి మొత్తం పార్టీనే దహించే పరిస్థితి దాపురించింది. ఢిల్లీ వేదికగా సోమవారం జరిగిన పరిణామాలు దీనికి పరాకాష్టగా నిలిచాయి. ఒకవైపు ఇండియా కూటమి భేటీలో తృణమూల్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ, పార్టీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ పాల్గొని అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా మంతనాలు జరిపితే.. మరోవైపు అదే సమయంలో ఆమె పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు మొదట కేంద్రమంత్రిని కలిసి మంతనాలు జరిపారు. ఆ తర్వాత తమను ఎన్డీయే సర్కారుకు మద్దతు గ్రూపుగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ ఓంబిర్లాకు అందరి సంతకాలతో లేఖ అందజేశారు. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో 58 మంది టీఎంసీ ఎమ్మెల్యే పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి స్వతంత్ర గ్రూపుగా విడిపోయారు. బెంగాల్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మమత ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. పార్టీ అధినాయకత్వంతో విభేదించి 1998లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించి సొంత రాష్ట్రం కేంద్రంగా రాజకీయాలు చేయడం ప్రారంభించారు. కొన్నాళ్లు ఎన్డీయే కూటమిలోనూ చేరి కేంద్రమంత్రిగానూ పని చేశారు. ఆ తర్వాత ఎన్డీయే నుంచి విడిపోయి మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరి జాతీయ రాజకీయాల్లో పాల్గొంటున్నారు. 2011లో తొలిసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు సాధించడంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అక్కడినుంచి వరుసగా విజయాలు సాధిస్తూ మÖడుసార్లు సీఎం అయ్యి రికార్డు సృష్టించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అంతవరకు టీఎంసీలోనే ఉంటూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మమతకు రైట్‌హ్యాండ్‌గా కొనసాగిన సువేందు అధికారి బీజేపీలో చేరడం 2021 ఎన్నికల్లో మమత ఆధిపత్యానికి సవాల్‌గా మారింది. నందిగ్రామ్‌లో నేరుగా మమతనే సువేందు అధికారి ఓడించి సంచలనం రేపారు. అయితే ఆమె పార్టీ ని మాత్రం అధికారానికి దూరం చేయలేకపోయారు. ఐదేళ్ల తర్వాత ఈసారి మాత్రం మమత ఆయన్నుంచి తప్పించుకోలేకపోయారు. భవానీపూర్‌లో మమతను మరోసారి ఓడించడంతోపాటు ఆమె పార్టీని దారుణ పరాజయం పాల్జేశారు. నాలుగోసారి సీఎం పదవి చేపట్టి సరికొత్త చరిత్ర సృష్టించాలనుకున్న మమత ఆశలను పటాపంచలు చేస్తూ ఆమె నుంచి ఆ పదవిని లాక్కున్నారు. ఓటమి భారంతో కుంగిపోయిన పార్టీని, మమతను వరుస సంక్షోభాలు పతనం అంచున నిలబెట్టాయి. మమత నివాసంలో నిర్వహించిన అత్యవసర భేటీకి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిదిమంది మాత్రమే హాజరయ్యారు. అలాగే 28 మంది లోక్‌సభ సభ్యుల్లో నలుగురు, 13మంది రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటుదారులు శాసనసభాపక్షాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువగా 58 మంది మద్దతు పొందిన రితబ్రత బెనర్జీకి స్పీకర్ శాసనభలో ప్రతిపక్ష నేతగా గుర్తించడం మమతకు కోలుకోలేని దెబ్బే. టీఎంసీలో నెలకొన్ని ఈ గందరగోళాన్ని అనుకూలంగా మార్చుకుని తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దాని పర్యవసానమే ఢిల్లీ వేదికగా సోమవారం జరిగిన టీఎంసీ పార్లమెంటరీ పార్టీ తిరుగుబాటుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈ తిరుగుబాట్ల వెనుక అసలు కథ వేరే ఉందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి పార్టీ ఓటమి నేపథ్యంలో కొత్తగా తలెత్తినవి కావు. కొన్నేళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్నాయి. అయితే పార్టీ అధికారంలో ఉన్నందున బయటపడితే తిరిగి తామే ఇబ్బందుల పాలవుతామన్న ఉద్దేశంతో అసమ్మతి నేతలు ఇన్నాళ్లూ బయటపడలేదు. ఎన్నికల్లో తృణమూల్ ఓటమికి ఇది కూడా అంతర్లీనంగా దోహదం చేశాయని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. చివరికి అధికారం పోవడంతో ఇవన్నీ ఒక్కసారిగా ఎగిసిపడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక అంశం ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. అధినేత్రి మమతా బెనర్జీ కంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సర్వం తానే అన్నట్లు వ్యవహరిస్తున్న ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీపైనే పార్టీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. పార్టీ ప్రస్తుత దుస్థితికి ఆయన ఒంటెత్తు పోకడలు, విశృంఖల రాజకీయ పెత్తనమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పార్టీలోని సీనియర్ నేతలను పక్కనపెట్టి అభిషేక్ బెనర్జీ సర్వాధికారాలు చెలాయిస్తున్నారన్న తీవ్ర అసంతృప్తి పార్టీలో నిలువెల్లా పేరుకుపోయింది. ఎన్నికల ఓటమితో ఆ అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. తిరుగుబాటు క్యాంపులో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ మమతా బెనర్జీపై గౌరవం ప్రదర్శిస్తూ ప్రధాన సలహాదారు పాత్రకు పరిమితం కావాలని సూచిస్తుండటం దీనికి నిదర్శనం. బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలిగిన మమతా బెనర్జీ తన పార్టీపై మళ్లీ పట్టు సాధించగలరా? ఎన్నికల రాజకీయాల్లో మళ్లీ ఆధిపత్యాన్ని సాధించగలరా? లేక పార్టీ మనుగడ కోల్పోతుందా? అన్నవాటికి సమాధానానికి వేచి చూడాల్సిందే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page