top of page

పథకాలకు, తెల్లకార్డుకు లింక్‌ తెగ్గొట్టాలి

Writer: DV RAMANADV RAMANA

రాష్ట్రంలో పీడీఎస్‌ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతుందని ‘సీజ్‌ ద షిప్‌’ అంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. నిజంగా పేదల బియ్యమే స్మగ్లింగ్‌ జరుగుతుందా? అంటే సమాధానం దొరకని ప్రశ్నలు కోకొల్లలు. కోవిడ్‌కి ముందు రేషన్‌ బియ్యం ధర కేజీ రూపాయి ఉండగా, కరోనా నుంచి ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. పైగా గత కొద్దికాలంగా సార్టెక్స్‌ మెషీన్లు వచ్చిన తర్వాత నూక, మట్టి, చిన్నచిన్న రాళ్లను తొలగించి పోర్టిఫైడ్‌ బియ్యం కలిపి ఇస్తున్నారు. దీంతో చాలామంది పేదలు, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు, కార్మికులు ఇదే బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణరకం బియ్యం పంపిణీ చేస్తున్నారు. నాణ్యత ఫర్వాలేదు. కేజీకి 43 రూపాయలకి పైగా ఖర్చు చేస్తున్న పాలకులు మరింత నాణ్యమైన బియ్యం పంపిణీ చేయొచ్చు. బియ్యం కోసం కాకుండా కేవలం ప్రభుత్వ పథకాల కోసమే తెల్లరేషన్‌ కార్డులు పొందుతున్నవారు మాత్రం ఆ బియ్యాన్ని అమ్మేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇప్పటికీ తెల్లరేషన్‌ కార్డే ప్రామాణికం. తెల్లకార్డు లేదంటే ఆరోగ్యశ్రీ రద్దయిపోతుందనే ఆందోళన చాలామంది లబ్ధిదారుల్లో ఉంది. చాలా పథకాలకు రేషన్‌కార్డుతో సంబంధం లేదని అధికారులు చెబుతున్నా అంతిమంగా ఆ కార్డునే లెక్కలోకి తీసుకుంటున్నారు. బియ్యం తీసుకోపోతే కార్డు రద్దవుతుందనే భయంతోనే చాలామంది లబ్ధిదారులు తెల్లరేషన్‌ కార్డులు పొందుతున్నారు. ఇది అంతిమంగా బియ్యం బ్లాక్‌మార్కెట్‌కి తరలిపోవడానికి కారణమవుతోంది. రేషన్‌ బియ్యంతోనే అన్నం వండుకునే వాళ్లతో పాటు వాటిని అన్నానికి కాకుండా ఇతరత్రా (దోశల్లో వాడేందుకు, బియ్యపు పిండి చేసేందుకు, కోళ్లకి దాణా వేసేందుకు) వినియోగించే వాళ్లు బియ్యాన్ని అమ్ముకోవడం లేదు. రేషన్‌ బియ్యం తీసుకునే వాళ్లలో సుమారు సగం మంది వాటిని అమ్ముకుంటున్నారని అంచనా. హోటళ్లకు కిలో రూ.15 నుంచి రూ.18 మధ్య అమ్మేస్తుంటారు. కొంత మంది వీధి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. వీరు కేజీకి 18 నుంచి 20 రూపాయల వరకు ఇస్తారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని వాళ్లు దళారులకు 25 రూపాయలకు అమ్ముతారు. ఆ దళారులు పెద్దమొత్తంలో బియ్యాన్ని పోగు చేసి క్వింటాళ్ల లెక్కన తిరిగి రైస్‌మిల్లులో రీసైక్లింగ్‌ (పాలిష్‌ పట్టి సన్నబియ్యంగా మార్పించడం) చేయిస్తారు. లేదంటే నేరుగా కాకినాడ పోర్టుకే తరలించేస్తారు. రేషన్‌ బియ్యం సిండికేట్లు ఎంతబలంగా ఉంటాయంటే.. ఆ సిండికేట్‌ నేతలు ఎవరినైనా ప్రభావితం చేయ గలరు. అందరికీ అందాల్సిన వాటాలు అందుతాయి. రేషన్‌ డీలర్‌ పాత్ర చాలా చిన్నది. పైగా ఎండీయూ ఆపరేటర్లు వచ్చిన తర్వాత డీలర్లు నామమాత్రమైపోయారు. పైకి కనిపించని వందల కోట్ల సామ్రాజ్యమిది. ఇటీవల చాలామంది లబ్ధిదారులు మొబైల్‌ డిస్పెన్సరీ యూనిట్‌(ఎండీయూ) ఆపరేటర్‌ వద్దనే అమ్మేస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి బియ్యం పంపిణీ విధానంలో మార్పులొచ్చాయి. రేషన్‌ డీలర్‌ స్టాకిస్ట్‌గా వ్యవహరిస్తారు. ఎండీయూ ఆపరేటర్ల నుంచి రేషన్‌ విడిపించుకునే క్రమంలో పంచదార, కందిపప్పు తీసుకుంటున్న లబ్ధిదారుల్లో చాలామంది బియ్యం మాత్రం తిరిగి ఆపరేటర్‌కే ఇచ్చేస్తున్నారు. కేజీకి 15 రూపాయల చొప్పున అతనికే విక్రయించేస్తున్నారు. సదరు ఆపరేటర్‌ తిరిగి ఆ బియ్యాన్ని దళారులకు అమ్ముకోవడం, అక్కడి నుంచి రైస్‌మిల్లులకో లేదా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకో తరలిపోతోంది. బియ్యం స్మగ్లింగ్‌ అనే పదం సరికాదు. 1246, ఎస్‌ఎల్‌టి ధాన్యం రకా లను రైతులు పండిరచినా ఎఫ్‌సీఐ, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్లు కొనుగోలు చేయడం లేదు. అవి తక్కువ కాలంలో దిగుబడి వచ్చే పంటలు. వాటిని ప్రభుత్వ సంస్థలు కొనకపోవడంతో రైతులు మిల్లర్లకి అమ్ము కుంటే మిల్లర్లు వాటిని ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నారు. వాటిని విదేశాల్లో బాగానే తింటారు. 80 శాతం ఆ బియ్యమే ఎగుమతి చేస్తారు. దాని మాటున 20 శాతం రేషన్‌ బియ్యం కూడా కొంత వెళ్లొచ్చు. అది కూడా దళారులు కొనుక్కున్న బియ్యమే. రేషన్‌ బియ్యం దందా ఏపీలో కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం లబ్ధిదారులు రేషన్‌ బియ్యాన్ని వినియోగించడం లేదు. ఇది అందరికీ తెలిసిన నిజం. అయితే, ప్రభుత్వాలు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించాలి. ఆరోగ్యశ్రీ, బియ్యం - ఈ రెండు పథకాలకు డబ్బులు చెల్లించేది ప్రభుత్వమే. అన్నింటికీ రేషన్‌ కార్డు తప్పనిసరనే నిబంధన తొలగిస్తే, ఆ ఉచిత బియ్యం మిగులు ద్వారా రాష్ట్రంలో మరికొన్ని కుటుంబాలకు ప్రయోజనం కలిగించవచ్చు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page