నేపాల్‌లో రాజకీయ అస్థిరత
విప్లవ పార్టీగా వేలమందిని చంపిన ప్రచండ
వ్యాపారమే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టని పార్టీలు
(దుప్పల రవికుమార్)
నేపాల్ రాజకీయాల గురించి తెలిసిన వారికి పుష్పకుమార్ దహాల్ అంటే తెలియకపోవచ్చు. కానీ అతని మారుపేరు ప్రచండ అంటే అందరికీ తెలుస్తుంది. నేపాల్ ప్రధానిగా ప్రచండ తప్పుకున్నాడు. గత శుక్రవారం నేపాల్ పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ అలియాస్ ప్రచండ ఓడిపోయాడు. ఆయన నేతృత్వంలో నడుస్తోన్న సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. గత 19 నెలలుగా అధికారం చెలాయిస్తున్న ప్రచండ తప్పనిసరిగా తప్పుకోవలసి వచ్చింది. తనకు ఇన్ని నెలలుగా మద్దతిస్తోన్న నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఉమ్మడి మార్క్సిస్టు లెనినిస్టు) ప్రచండకు మద్దతు ఉపసంహరించుకుని, గత ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపాలీ కాంగ్రెస్‌తో చేతులు కలపనుంది. నేపాల్‌లో కొత్త సంకీర్ణ జంటతో పరిపాలన ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నేపాలీ కమ్యూనిస్టు పార్టీ అధినేత ఖడ్గ ప్రాసద్ ఓలి ప్రధాని కానున్నారు. 2022 డిసెంబరు నుంచి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప్రభుత్వాన్నే ప్రచండ నడుపుతున్నారు. నిజానికి అప్పటి ఎన్నికల్లో మూడవ పెద్ద పార్టీగా అవతరించిన ప్రచండ అధికారం చేపట్టడమే పెద్ద సాహసమని చెప్పాలి. భాగస్వామ్య పక్షాలతో తరచు ఏర్పడుతోన్న విభేదాల వల్ల ఈ 19 నెలల్లో ఐదుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
నిజానికి ప్రచండ జీవితమే గొప్ప సాహస యాత్ర అని చెప్పాలి. 1996లో నేపాలీ మావోయిస్టుగా తన రాజకీయ జీవితం మొదలైంది. విప్లవ పార్టీగా అంతులేని హింసను కొనసాగించాడు. 2006లో హింసకు స్వస్తి పలికాడు. ఈ దశాబ్ద కాలంలో సుమారుగా 17 వేలమందిని వర్గపోరాటంలో చంపేశాడు. ఇవి శవాలుగా తేలిన వారి లెక్కలు. ఇప్పటికీ శరీరాలు దొరకకుండా గల్లంతైన వారి లెక్కలు నేపాల్ ప్రభుత్వం తేల్చలేకపోయింది. అపరిమితమైన హింసను సాగించిన ఫలితంగా అటువైపు ప్రజలతో పాటు ఇటువైపు తన విప్లవ సైన్యం కూడా పెద్దఎత్తున ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. మరింక ఎంతమాత్రమూ సాయుధ పోరాటం కొనసాగించలేని పరిస్థితికి తన విప్లవ గ్రూపు చేరుకుంది. దీంతో ఐక్యరాజ్య సమితి సహకారం తీసుకుని మధ్యవర్తిత్వం నెరపడానికి ఒప్పించాడు. ఇలాంటి అనేక కారణాల వల్ల 2006లో సాయుధ పోరాటానికి స్వస్తి పలికాడు. ఐక్యరాజ్య సమితి సహాయంతో ఏర్పరుచుకున్న శాంతి ఒడంబడిక ద్వారా విప్లవ బాట విడిచిపెట్టి, ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చాడు. బుల్లెట్ వదిలి బ్యాలెట్ నమ్మే పరిస్థితి. 2008లో జరిగిన నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో కొంతవరకు ప్రజాభిమానాన్ని చూరగొని ప్రధాని కాగలిగాడు. అయినప్పటికీ రాష్ట్రపతితో ఏర్పడిన విభేదాల వలన ఏడాదికే అధికారం నుంచి తప్పుకున్నాడు. కాని రాజకీయాలలో తన మార్కును ఇప్పటికీ చూపించగలగడం విశేషం.
క్షత్రియులు, బ్రాహ్మణులదే ఆధిపత్యం
2008 నుంచి నేపాల్ రాజకీయాలను పరిశీలిస్తే, ఇప్పటికి 16 సంవత్సరాల్లో పన్నెండు మంది ప్రధానులు మారారు. దీనివల్ల నేపాల్ రాజకీయాలంటే తీవ్రమైన రాజకీయ అస్థిరత అని పేరు పొందింది. ఇలాంటి ఒడిదొడుకులతో కూడిన రాజకీయ అస్థిర పరిస్థితుల వల్ల దేశ ఆర్థిక ప్రగతి స్తంభించిపోయింది. అక్కడున్న రాజకీయ పార్టీల్లో మోనోపలీ ఏర్పడడం, కేంద్రీకృత రాజకీయ నాయకులు రాజకీయ చదరంగం ఆడడం వల్ల తరచుగా నేపాల్‌లో ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు మారడానికి కారణంగా కనిపిస్తోంది. నేపాల్‌లో మొత్తం అధికారం అంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అది చాలా చిన్న ఎలైట్ గ్రూపు. ఈ చిన్న గ్రూపులో కేవలం ముగ్గురు నుంచి ఐదుగురు మాత్రమే ఉంటారు. వీరంతా ఉన్నత కులాలకు, ఉన్నత వర్గాలకు చెందినవారే కావడం మరొక ముఖ్య విషయం. ఈ చిన్న గ్రూపును ‘ఖాస్`ఆర్య’ గ్రూపని పిలుస్తారు. వీరంతా ప్రధానంగా క్షత్రియులు, బ్రాహ్మణులు. కాబట్టి, ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వ అధినేతలు మారినా పాలనలో పెద్దగా తేడా ఉండదు. వారంతా ఒకరు మరొకరి వ్యాపార ప్రయోజనాలను దెబ్బ తీయడానికి సాహసించరు. అందరి పనులూ యధావిధిగా జరగడానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. పార్టీల పేర్లు మారితే మారొచ్చు గాక, ఎవరి మ్యానిఫెస్టోలు వారికి ప్రత్యేకంగా ఉంటే ఉండొచ్చు గాక. క్షేత్ర కార్యకలాపాల్లో వారెవ్వరికీ పెద్ద విభేదాలు ఉండవు. ఎక్కడైనా కమ్యూనిస్టు పార్టీలు వారి భావజాల పరమైన కారణాలతో వివిధ రాజకీయ పార్టీలతో పొత్తులు కుదర్చుకుంటాయి. ఇక్కడ అలాంటివేమీ ఉండవు. కేవలం వ్యక్తిగత ఇష్టనిష్టాలతో అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఇతరులతో పొత్తులకు దిగిపోతాయి. వ్యక్తిగత విభేదాలు వచ్చినపుడు పొత్తు నుంచి విడిపోతాయి. అంటే వ్యాపార ప్రయోజనాలు తప్ప మరేమీ వీరికి పట్టవు.
గత వారం వరకు ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకున్నట్లయితే, పుష్ప కుమార్ ప్రచండ నడుపుతోన్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీ, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ఉమ్మడి మార్క్సిస్టు లెనినిస్టు పార్టీతో 19 నెలల పాటు పొత్తులో ఉంది. అకస్మాత్తుగా పొత్తు నుంచి ఖడ్గ ప్రసాద్ విడిపోవడానికి కారణం ఒక నియామక స్కాం జరగడమే. రాజ్యాంగాన్ని మార్చడానికి పూనుకొన్న పార్టీలు కొన్ని రాయబార నియామకాల్లో విభేదాలు ఏర్పడ్డాయి. ఇవి రానురాను వ్యక్తిగత వైషమ్యానికి దారితీసాయి. అంతే రాజకీయ కమ్యూనిస్టు భావజాలాలను, ఆదర్శాలను, ప్రజాసంక్షేమాలను గాలికి వదిలేసారు. చైనాపట్ల సానుకూలంగా ఉండే ఓలి, చైనాతో సానుకూలంగా ఉండే ప్రచండను విడిచిపెట్టేసారు. భారత్‌తో సానుకూలంగా ఉండే షేర్ బహదూర్ దువేబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు. దీనవల్ల అక్కడి భౌగోళిక సంబంధాలలో, ఇరుగు పొరుగు దేశాల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాల ఆర్థిక సంబంధాలలో ఎంత తికమక కల్పించనుందన్నది వారు పట్టించుకోరు. శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో సభ మద్దతు సంపాదించలేకపోయిన ప్రచండను పక్కకు తప్పుకోమని నేపాల్ రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ ఆదేశించారు. ప్రచండకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయమని మిగిలిన పార్టీలకు అవకాశమిచ్చారు.
అందరి లక్ష్యం రాజ్యాంగాన్ని మార్చడమే!
ఆ రోజు రాత్రి 165 మంది ఎంపీల సంతకాలతో కూడిన పత్రాలను రాష్ట్రపతికి సమర్పించారు. నేపాల్ ఉమ్మడి కమ్యూనిస్టు (మా.లె.) పార్టీ అధికారం చేపట్టడానికి తమకు అభ్యంతరం లేదని, తమ మద్దతు ఉంటుందని నేపాల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 275 మంది ప్రతినిధులున్న నేపాల్ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 138 మంది సభ్యుల బలం ఉంటే చాలు. నేపాల్ కాంగ్రెస్ పార్టీకి 89 మంది, నేపాల్ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి 77 సంఖ్యా బలముంది. ఇందులో రెండు ఓట్లు (ఒకటి స్పీకరు ఓటు కాగా, మరొక ఎంపీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు) ఓటింగుకు దూరం. ఇక మిగిలిన చిన్నచిన్న పార్టీలైన జనతా సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌తాంత్రిక్ సమాజ్‌వాదీ పార్టీ, జనమత్ పార్టీ, నాగరిక్ ఉన్ముక్తి పార్టీ లాంటివన్నీ ఓలికి తమ మద్దతును ప్రకటించాయి. 2027లో సాధారణ ఎన్నికలు జరిగేంత వరకూ నేపాల్ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, నేపాల్ కాంగ్రెస్ పార్టీలు ఒకటి తర్వాత మరొకటిగా పాలన చేయడానికి అంతర్గతంగా పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. ప్రస్తుతం నేపాల్ పార్లమెంటు స్థానాలలో 165 మంది సభ్యులు ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ పద్ధతి ద్వారా ఎన్నుకోబడతారు. మరో 110 మంది అనుపాత ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోబడతారు. (అంటే ఓటర్లు పార్టీలకు ఓట్లు వేస్తారు. ఒక్కో పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి). దీనిని మార్చడం కోసమే రాజ్యాంగ సంస్కరణలకు ప్రస్తుతం నేపాల్‌లో రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాని రాజ్యాంగ సవరణ చేయడానికి తప్పనిసరిగా మూడిరట రెండు వంతుల మెజారిటీ దానికి అంగీకరించాలి. కాని ఇప్పుడున్న పరిస్థితులలో ఇది కష్టసాధ్యంగా కనిపిస్తోంది. మొత్తానికి 2027 ఎన్నికలు జరిగేలోపు నేపాల్ రాజకీయ పరిస్థితులలో ఎలాంటి మార్పు చేర్పులు చోటుచేసుకుంటాయో చూడాలి. మన పొరుగు దేశంగా మనకు ఆ మాత్రం ఆసక్తి ఉండడంలో తప్పులేదు.
Comments