
సీఎంగా చేసిన తర్వాత మూడు పార్టీలు మారి ఇప్పుడు ఎంపీ బరిలో
గతంలో కాసు, నేదురుమల్లిల పేరుతో ఈ రికార్డు
అయితే వారు ఒకే పార్టీలో క్రియాశీలంగా ఉండి సాధించారు
ఈ ఎన్నికల్లో నల్లారి గెలుస్తారా.. కొత్త చరిత్ర సృష్టిస్తారా?
(ఎన్నికల రచ్చబండ)
డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి
రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నన్నాళ్లే మనుగడ సాధ్యమవుతుంది. ఒకసారి తెరమరుగైపోతే మళ్లీ వెలుగులోకి రావడం ఒకపట్టాన సాధ్యం కాదు. కానీ ఒక నాయకుడు సుమారు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తుండటం.. ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండటం విశేషం. ఆ నేత మరెవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రి పని చేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి. తెరమరుగైన నాయకులు దశాబ్ద కాలం తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని దశాబ్దాల క్రితం సంభవించినా.. ఆ తర్వాత మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అటువంటి సంఘటనలు పునరావృతం కాలేదు. రాష్ట్రం విడిపోయిన ప్రస్తుతం తర్వాత జరుగుతున్న మూడో సార్వత్రిక ఎన్నికల్లోనే కిరణ్‌కుమార్‌రెడ్డి రూపంలో మళ్లీ ఆ ఘట్టం పునరావిస్కృతమవుతోంది. 1983కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మాత్రమే రాజకీయంగా ఆధిపత్యం చెలాయించింది. ఆ కాలంలో ఆ పార్టీ ఢల్లీి పెద్దల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారిపోయేవి. కాంగ్రెసే అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్న నేతపై అధిష్టానానికి నమ్మకం సన్నగిల్లితే చాలు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, అసమ్మతి పేరుతో వారిని దించేసి, ఆ స్థానంలో తమకు నమ్మకమైన నేతను ఢల్లీి నుంచే సీల్డ్ కవర్‌లో పంపించి, ముఖ్యమంత్రిగా నామినేట్ చేసేవారు. సీఎం పదవి కోల్పోయిన నేతను బుజ్జగించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించి లేదా రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించేవారు. అలా టీడీపీకి ముందు ఆ తర్వాత 1989`94 మధ్య మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టినప్పుడు ఆరుగురు సీఎంలను తొలగించి, కేంద్రంలో పునరావాసం కల్పించారు. వారి తర్వాత మళ్లీ ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా చేసిన పదేళ్ల తర్వాత ఎంపీ బరిలోకి దిగి పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
దశాబ్దం తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది. ఆ జిల్లాలోని కలికిరి మండలం నగిరిపల్లి ఆయన స్వగ్రామం. గతంలో వాల్మీకిపురం పేరుతో తర్వాత పీలేరు పేరుతో చెలామణీ అవుతున్న నియోజకవర్గంలో 70, 80 దశకాల్లో ఈయన కుటుంబమే రాజకీయ పెత్తనం సాగించింది. కిరణ్‌కుమార్ తండ్రి నల్లారి అమర్నాథ్‌రెడ్డి అదే నియోజకవర్గం నుంచి 1972 నుంచి 78 వరకు రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1983లో ఓడిపోయినా 1985లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మరణంతో 1988లో వాల్మీకిపురం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి భార్య సరోజమ్మ పోటీ చేసి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి 1989 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. 1994లో ఓడిపోయినా తిరిగి 1999 నుంచి 2009 వరకు వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ బాధ్యతలన్నీ సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చూసుకునేవారు. కిరణ్‌కు నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు తక్కువనే చెప్పాలి. 2004లో కాంగ్రెస్ గెలిచి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయనకు సన్నిహితుడిగా మెలిగిన కిరణ్‌కుమార్‌రెడ్డి వెలుగులోకి వచ్చారు. ఆయన అంతరంగీకుల్లో ఒకరిగా పేరొందిన కిరణ్ అసెంబ్లీ స్పీకర్ పదవి చేపట్టారు. 2009లో వైఎస్ అకాల మరణం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో పెనుమార్పుల సంభవించాయి. రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. కొన్నాళ్లకు ఆయన రాజీనామా చేయడంతో అనూహ్యంగా కిరణ్‌ను ముఖ్యమంత్రి పదవి వరించింది. సమైక్యాంధ్రప్రదేశ్‌కు ఆయనే చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీని విడగొట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసి ఆ ఏడాది జరిగిన నవ్యాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. తర్వాత 2018లో ఆ పార్టీని రద్దు చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కానీ అప్పటినుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్ గత ఏడాది ఏప్రిల్‌లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయినా రాజకీయాల్లో ఏమంత చురుగ్గా కనిపించలేదు.
కాసు, నేదురుమల్లి తర్వాత కిరణే
పేరుకు కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్నా దశాబ్దకాలంగా రాజకీయంగా ఏమాత్రం చురుగ్గా లేని కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ ప్రస్తుత ఎన్నికలతో క్రియాశీలమయ్యారు. ఎన్డీయే కూటమి పొత్తుల్లో భాగంగా రాజంపేట ఎంపీ స్థానం పొందిన బీజేపీ అక్కడ పార్టీ అభ్యర్థిగా కిరణ్‌ను ప్రకటించింది. వాస్తవానికి పొత్తులో బీజేపీకి కేటాయించిన ఎంపీ సీట్లలో మొదట రాజంపేట లేదు. కానీ తర్వాత విజయనగరం బదులు రాజంపేట కేటాయించడం, కిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగిపోయాయి. పదేళ్లు రాజకీయంగా తెరమరగైన ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్లీ తెరపైకి వచ్చి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లే జరిగింది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి అప్పట్లో ఇలాగే పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ కోవలో కిరణ్‌రెడ్డి మూడో మాజీముఖ్యమంత్రిగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కేంద్రంలోకి వెళ్లి మంత్రులుగా వెలిగిన కాంగ్రెస్ నేతలు ఏడుగురు ఉన్నారు. నీలం సంజీవరెడ్డి ఏపీ సీఎంగా పని చేసిన తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి లోక్‌సభ స్పీకర్‌గా, తర్వాత రాష్ట్రపతిగా ఎదిగారు. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి 1964`71 మధ్య ఏపీ సీఎంగా చేశారు. సుమారు 13 ఏళ్ల విరామం తర్వాత 1974లో కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. 1990`92 మధ్య ముఖ్యమంత్రిగా చేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి సుమారు 12 ఏళ్ల విరామం తర్వాత 2004లో విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ వెంటనే 2009 రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వీరి తర్వాత టి.అంజయ్య 1980`82 మధ్య సీఎంగా చేసి.. ఆ తర్వాత 1984లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. భారత ప్రధానిగా చేసిన తొలి తెలుగు నేత పీవీ నరసింహారావు 1971`73 మధ్య ఆంధ్ర సీఎంగా చేశారు. తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి సుదీర్ఘకాలం కేంద్రంలో పలు శాఖల మంత్రిగా చేశారు. 1973`78 మధ్య సీఎంగా పని చేసిన జలగం వెంగళరావు 1986లో కేంద్ర మంత్రి అయ్యారు. 1982`83 మధ్య, 1992`94 మధ్య రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆ రెండుసార్లు కూడా సీఎం పదవి చేపట్టడానికి ముందు, దిగిపోయిన తర్వాత కూడా కర్నూలు నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పని చేశారు. అయితే వీరంతా ఒకే పార్టీలో కొనసాగి ఈ ప్రత్యేకత సాధిస్తే.. నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మూడు పార్టీలు మార్చి, ఇప్పుడు బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవడం విశేషం. ఈ ప్రయత్నంలోనూ ఆయన విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెడతారా? చూడాలి.
Comments