top of page

పని గంటలు పెంచితే పేదరికం పోతుందా?

Writer: DV RAMANADV RAMANA

‘వారానికి డెబ్భై పని గంటలు’ దేశానికి అవసరమని ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి మరోసారి నొక్కి వక్కాణించారు. అన్ని పని గంటలు లేకపోవడం వల్లనే దేశం ఇలా దరిద్రంలో కొట్టుమిట్టాడుతోందని కూడా సెలవిచ్చారు ఆ సాఫ్ట్‌వేర్‌ టెకీ వణిక్‌ ప్రముఖుడు. అన్ని పని గంటలు లేకుంటే దేశం ఎలా పేదరికాన్ని జయిస్తుందని కూడా ఆయన అడిగారు. ఆయన వేతనాల గురించి మాట్లాడకుండా కేవ లం పని గంటల గురించి, ఉత్పాదకత గురించి మాత్రమే మాట్లాడటంలోనే అసలు వ్యాపార కిటుకు వుంది. ఆయన దృష్టిలో పని చేయడమంటే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, పట్టణ/నగర పరిశ్రమల్లో పని చేయడమే కావచ్చు. ఇప్పుడొచ్చే జీతానికే నగరాలలో వున్న కంపెనీలు, పరిశ్రమల్లోని ఉద్యోగులు, శ్రామికులు ఎక్కువ గంటలు పని చేయాలని ఆయన ఆశిస్తుండవచ్చు. దానివల్ల పేదరికం ఎలా తగ్గు తుంది? తక్కువ వేతనమిచ్చి ఎక్కువ పని చేయించుకోవడం వల్ల కలిగే లాభాలు ఆయా పెట్టుబడి దారులకే పోతుంది కదా! ఇది పేదలకే కాదు, సామాన్య జనానికి కూడా తీవ్రమైన నష్టం. మన దేశం లో పని చేయగలిగిన, చేద్దామనుకున్న, చేస్తామనే వారందరికీ పని దొరకడమే గగనం. ఈ ఎక్కువ గంటల పని విధానం వల్ల పని పూర్తిగా దొరకక పేదలు మరింత పేదరికంలోకే వెళతారు. పేదలకు నిజంగా మేలు జరిగి, పేదరికం నుంచి బైటపడాలంటే వారికి సుస్థిర ఉపాథి, న్యాయమైన వేతనం దొరకాలి కానీ ఎక్కువ గంటలు పని చేయడం కాదు. వారి పేదరికానికి ప్రధాన సవాలు అధిక ధరలు. మూర్తి సాబ్‌, మీకు చేతనైతే ఈ విషయంలో ప్రభుత్వాలతో పోరాడండి. మన మూర్తిగారికి పేదరికం గురించి, దాని కారణాల గురించి, పేదరిక నిర్మూలనా వ్యూహాల గురించి కనీసమైన అవ గాహన లేదని అర్ధమవుతుంది. పేదరికానికి మూల కారణం ప్రకృతి వనరుల, ఆదాయ వనరుల అసమ పంపిణి. వ్యవసాయ దేశమైన భారత్‌లో అత్యధిక శాతం భూమి తక్కువ శాతం వున్న పైకులాల వారి చేతిలో వున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పేదలు వారానికి ఆరు రోజుల చొప్పున డెబ్భై గంటలు (అంటే రోజుకి 12 గంటలు) ఎక్కడ పనిచేయాలి? రోజుకి పన్నెండు గంటలు చొప్పున పని చేసినా వారికి అధిక కూలీ వస్తుందా? లేకపోతే గ్రామీణ పేదలు అదే కూలీకి ఎక్కువ పని చేయాలని మూర్తి గారు ఆశిస్తున్నారా? అసలు పని అంటూ వుంటే గ్రామీణ పేదలు పట్టణాలకు వలస ఎందుకు పోతారు? హలో మూర్తిగారూ! ఉపాధి కోసం, పిల్లలకు నాణ్యమైన విద్య కోసం, కుటుంబానికి ఆరోగ్య వసతుల కోసం పట్టణాలకు వలస వచ్చిన పేదలు రోజుకి కేవలం ఆరేడు గంటలు మాత్రమే పని చేస్తున్నారని అనుకుంటున్నారా? మాల్స్‌లో ఎన్ని గంటలు డ్యూటీ వుంటుందో మీకు తెలుసా? పెట్రోల్‌ పంపుల్లో, హోటళ్లల్లో, థియేటర్లలో పని చేసేవాళ్లు ఎన్ని గంటలు పని చేస్తారో, వారికొచ్చేదెంతో ఎరుకేనా మీకు? మీకేమీ తెలియదని చెప్పటానికి కేవలం ఉదాహరణ కోసమే ఈ రెండు ప్రశ్నలు. ఈ దేశ వర్క్‌ ఫోర్స్‌ ఎన్నో వందల వేల వృత్తుల్లో, ఎన్నో లెక్క లేనన్ని గంటలు పని చేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తూనే వున్నది. ఇప్పుడు టెకీలు కూడా రోజుకి పది నుంచి పన్నెండు గంటల వరకు పని చేస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోం అంటే అది అనంతం ఇంక! ఇంత కంటే ఎక్కువ చేస్తే మాత్రం పనిలో నాణ్యత వుంటుందా? మూర్తిగారూ మీకు ఎవరైనా బలవంతంగా అయినా చార్లీ చాప్లిన్‌ సినిమా ‘మోడర్న్‌ టైమ్స్‌’ చూపిస్తే బాగుండు! అందులో మీబోటి కేరక్టర్‌ ఒకటి వుంటుందిలెండి ఆ సినిమాలో. మీరు తప్పక చూడాల్సిన సినిమా అది. రోజుకి వుండేదే ఇరవై నాలుగ్గంటలు. అందులో పన్నెండు గంటలు పని చేసి, ఏడు గంటలు నిద్రపోతే ఇంక మిగిలిన కొద్ది గంటలు కుటుంబంతో గడుపుతూ పిల్లల బాగోగులు, వారి చదువులు, ఆరోగ్యం వంటి ఇతర సమస్య లు అడ్రెస్‌ చేయడానికి పరిమితం చేయాలా? మూర్తిగారూ ఈ దేశపు వర్క్‌ ఫోర్స్‌ అంతా మీ వంటి పెట్టుబడి బాబుల కోసం పుట్టిందనుకుంటున్నారు కామోసు! పన్నెండు గంటలు పని చేసొచ్చిన స్త్రీలు కనీసం తమ ఆరోగ్యం గురించైనా పట్టించుకోగలుగుతారా? మీకు అంటే మీ బంగళాల్లో గిన్నెలు తోమేవారి దగ్గర నుంచి తోటమాలుల వరకు నౌకర్లు, చాకర్లు వుంటారు. మామూలు జనంకి ఒక్క పూట ఇంటి పని తప్పడమే మహా విలాసం మూర్తి బాబూ! ఈ దేశ జాతీయ సంపదలో 42.5 శాతం కేవలం ఒక్క శాతం ధనిక ప్రజల చేతిలో వుండగా దేశ జనాభాలో 50 శాతం మంది దగ్గర కేవలం 2.8శాతం సంపద వుంది మూర్తిగారూ! పైన వున్న 1 శాతం మంది సంపద గత సంవత్సరంలో 46 శాతం పెరిగింది. పేదరికానికి ముఖ్య కారణం మీ వారానికి డెబ్భై గంటలు అమలు చేయక పోవడమా లేక అసమసంపద, వనరుల పంపిణీనా? పేదరికం పోవాలని నిజాయితీగా సంకల్పిస్తే జనాల్ని ఆడిపోసుకోవడం కాకుండా ప్రభుత్వాలతో కొట్లాడాలని, రాజకీయ/ఆర్ధిక విధానాల్ని ప్రశ్నిం చాలని ఆయనకు ఎవరైనా చెబితే బాగుండును కదా!

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page